గటిక విజయ్ కుమార్
తెలంగాణ వ్యాప్తంగా భూమి రికార్డుల ప్రక్షాళన
10,733 రెవెన్యూ గ్రామాల్లో 1,389 బృందాల పర్యటన
వంద రోజుల కార్యక్రమం..రైతులే కథానాయకులు
కొత్త సంవత్సరంలో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు
కోర్ బ్యాంకింగ్ తరహాలో ఇక భూ రికార్డుల నిర్వహణ
మండలానికో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయం
వివాదాలు, ఘర్షణలకు తావులేని పారదర్శక విధానమే లక్ష్యం
ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా, భారతదేశ చరిత్రలో మొదటి సారిగా భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం పూనుకున్నది. భూమి రికార్డులు అస్తవ్యస్తంగా ఉండడం అస్పష్టతకు, వివాదాలకు, ఘర్షణలకు కారణమవుతుందని భావించిన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణలో పారదర్శకమైన భూ రికార్డుల నిర్వహణకు రూపకల్పన చేశారు. ప్రస్తుత రికార్డులను సరిచేయడంతో పాటు భవిష్యత్తులో భూముల అమ్మకం, కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్, వారసత్వ హక్కులు, పేరు మార్పిడి(మ్యుటేషన్) తదితర ప్రక్రియలన్నీ పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను అమలు చేస్తున్నది. రైతులను సంఘటిత శక్తిగా మార్చే పనికి కూడా ప్రభుత్వమే పూనుకున్నది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నది.
1932-36 మధ్య నిజాం రాజ్యంలో భూ సర్వే జరిగింది. తిరిగి మళ్లీ భూ సర్వే జరగలేదు. ఈ ఎనిమిది దశాబ్దాల కాలంలో అనేక మార్పలు సంభవించా యి. కానీ అవన్నీ సరిగ్గా నమోదు కాలేదు. అందుకే భూ రికార్డుల నిర్వహణలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. వివాదాలకు కూడా కారణమవుతుంది. వ్యవసాయ శాఖ వద్ద వివరాలకు, రెవెన్యూ శాఖ వద్ద ఉన్న వివరాలకు పొంతన లేదు. దీంతో ప్రభుత్వం అందించాలనుకునే పెట్టుబడి ఏ ప్రాతిపదికన అందించాలో తెలియని పరిస్థితి నెలకొంది. పొరపాట్లు జరిగితే వేల కోట్ల రూపాయల కుంభకోణం అయ్యే అవకాశం ఉంది. మంచి చేయబోతే చెడు అవుతుంది. అందుకే ఏ భూమి ఎవరి ఆధీనంలో ఉందో, పెట్టుబడి ఎవరికి అందాలో ఖచ్చితంగా తెలియాలి. అందుకే భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నది.
”రిజిస్ట్రేషన్లు కూడా పారదర్శకంగా జరగాలి. క్రయ విక్రయాలు జరిపే రైతులిద్దరూ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాలి. రిజిస్ట్రార్ వద్ద ఇద్దరి పాసు పుస్తకాలు ఇవ్వాలి. రిజిస్ట్రార్ రెండు పాస్ పుస్తకాలను తీసుకుని అమ్మే వారి పాస్ పుస్తకం నుంచి భూమిని తొలగించాలి. కొన్నవారి పాస్ పుస్తకంలో ఎంటర్ చేయాలి. రిజిస్ట్రారే ఈ రెండు పాస్ పుస్తకాలను కొరియర్ ద్వారా ఎమ్మార్వోకు పంపాలి. నాలుగు పనిదినాల్లో ఎమ్మార్వో క్రయ విక్రయాలకు సంబంధించిన వివరాలను తన కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. పాస్ పుస్తకాలపై అటెస్ట్ చేయాలి. పేరు మార్పిడి చేయాలి. తిరిగి రిజిస్ట్రార్‌కు పంపాలి. రిజిస్ట్రార్ తన రికార్డుల్లో నమోదు చేసుకుని కొరియర్ ద్వారా రైతులకు పంపాలి. అమ్మే వారు, కొనే వారు కేవలం ఒక్కసారి మాత్రమే రిజిస్ట్రార్ ఆఫీసుకు రావాలి. మళ్లీ మళ్లీ తిరగడం, పైరవీలు చేయడం ఇక ముందు ఉండకూడదు. పాస్ పుస్తకాలు, పహాణీల నిర్వహణనకు కూడా మరింత సరళం చేయాలి. అవసరం లేని కాలమ్స్ తీసేయాలి. పాస్ పుస్తకాలు కూడా కొత్తవి ఇవ్వాలి. ప్రత్యేకమైన పెన్నులు మాత్రమే వాడే విధంగా పాస్ పుస్తకాలు తయారు కావాలి. నీటిలో పడినా తడవకుండా, పాడవకుండా ఉండే విధంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. పాస్ పుస్తకాల సైజు కూడా తగ్గించాలి. స్టాంపుల చట్టాలను, రిజిస్ట్రేషన్ చట్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అసవరమైన మార్పులు చేయాలి. భవిష్యత్తులో ప్రతీ మండలానికి ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలి. వీలైతే ఎమ్మార్వోకే రిజిస్ట్రేషన్ కూడా చేసే అధికారం ఇచ్చే అవకాశాలు పరిశీలించాలి.
ఎందుకీ సమగ్ర ప్రక్షాళన?
ఎకరాకు రెండు పంటల పెట్టుబడికి గాను ఏడాదికి రూ.8 వేల పెట్టుబడి రైతుల బ్యాంక్ అకౌంట్లో వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2018 ఖరీఫ్ నుంచి ఈ పథకం అమలు కానున్నది. అయితే భూములున్న రైతులెవరు అని లెక్కలు తీస్తే రెవెన్యూ రికార్డుల్లో ఒకలా, వ్యవసాయ శాఖ రికార్డుల్లో మరోలా వివరాలున్నాయి. భూ రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం వల్లే ఈ సమస్య తలెత్తింది. కాబట్టి ఇప్పుడు ఏ భూమి ఎవరి ఆధీనంలో ఉందో తేల్చి, భూమి హక్కులపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. రైతుల వద్ద నుంచి వివిధ పనుల కోసం లక్షలాది ఎకరాలు సేకరించింది. రైల్వే లైన్లు, ప్రాజెక్టులు, రహదారులు, కార్యాలయాలు, స్కూళ్లు, హాస్పిటళ్లు, కాలువలు నిర్మించడానికి వ్యవసాయ భూములు ప్రభుత్వం తీసుకున్నది. కాని ఈ వివరాలు రికార్డుల్లో నమోదు కాలేదు. ఇంకా ఆ భూములు రైతుల వద్ద ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. దీని వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భూముల విషయంలో స్పష్టత రావాలి. మొదటి దశలో వివాదం లేని భూముల విషయంలో స్పష్టత రావాలి. ప్రతి గ్రామంలో 80-95 శాతం వివాదాలు లేని భూములే ఉన్నాయి. వాటిని రైతులు, గ్రామస్తుల సహకారంతో స్పష్టత ఇవ్వాలని నిర్ణయించారు. రెండో దశలో కోర్టు వివాదంలోని భూములను గుర్తించాలి. కోర్టు కేసు తీర్పుకు లోబడి వీటిపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రభుత్వ భూములు, ఫారెస్ట్, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ తదితర భూముల వివరాలు కూడా సమగ్ర భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా నమోదు చేస్తారు.
భూమి ప్రక్షాళన జరిగే విధానం ఇదీ..
రాష్ట్రవ్యాప్తంగా 10,733 రెవెన్యూ గ్రామాల్లో 1,389 బృందాలు ఏర్పాటయ్యాయి.
బృందంలో తహసిల్దార్, డిప్యూటీ తహసిల్దార్ తదితరులుంటారు.
2017 సెప్టెంబర్ 15న ప్రారంభమయిన భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన నుంచి డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది.
ఈ కార్యక్రమ నిర్వహణ కోసం హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించింది.
అధికారుల బృందాలు గ్రామాలలో పర్యటిస్తున్నారు. 10 రోజుల పాటు గ్రామంలోనే ఉండి, గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. రైతుల సమక్షంలోనే భూ రికార్డులన్నీ పరిశీలిస్తున్నారు.
తొలి దశలో వివాదాలు లేని భూములకు సంబం ధించిన యాజమాన్య హక్కులపై స్పష్టత ఇస్తారు. ఏ భూమి ఎవరిది అనే విషయాన్ని నిర్ధారించి గ్రామ రైతులందరి సంతకాలు తీసుకుంటున్నారు. రైతులకు భూమి వివరాలకు సంబంధించిన పత్రాలు ఇస్తున్నారు. భూములు-యజమానుల వివరాలను గ్రామపంచాయి తీ లేదా ప్రభుత్వ పాఠశాల గోడలకు అతికిస్తారు.
ప్రస్తుతం ఉన్న పహాణీలు, రైత్వారీ భూ వివరాలు (1 బి రికార్డులు) రైతులకు అందచేస్తున్నారు. అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. భూమి క్రయ విక్రయాలు, వారసత్వ హక్కులు, ఇతర రికార్డులు, సంబంధిత పత్రాలు పరిశీలించి పహాణీ రికార్డులను, 1 బి రికార్డులను సరిచేస్తున్నారు. వాటిపై రైతుల సంతకాలు తీసుకుంటున్నారు. రైతుల సమ్మతితో భూమి యాజమాన్య హక్కులు నిర్ణయిస్తారు.
అసైన్డ్ భూముల్లో ఎవరు సాగుచేసుకుంటున్నారో వివరాలు సేకరించి, అసలు లబ్దిదారులే సాగు చేసుకుంటుంటే వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తారు.
సవరించిన పహాణీ రికార్డులను, 1 బి రికార్డులను గ్రామ పంచాయితీ/ ప్రభుత్వ పాఠశాల/గ్రామ కూడలిలో ప్రదర్శిస్తారు. రైతులకు కూడా వాటి కాపీలు అందచేస్తారు.
పాస్ పుస్తకాల్లో, పహాణీల్లో సరళమైన తెలుగు బాషను వాడాలి.
సవరించిన రికార్డుల ఆధారంగానే ఏడాదికి ఎకరాకు రూ.8వేల పెట్టుబడి అందించే కార్యక్రమం అమలు అవుతుంది.
వ్యవసాయ భూములతో పాటు అటవీ భూములు, చెరువులు, కుంటలు, కాల్వల కింద ఉన్న భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ఉన్న భూములు, ఇతర భూముల వివరాలన్నీ సేకరించి. రెవెన్యూ గ్రామ పరిధిలో ఏ భూమికి ఎవరు హక్కు దారో తేలుస్తారు. గ్రామ కంఠాన్ని కూడా ఖరారు చేస్తారు.
భూమి హక్కులపై యాజమాన్య హక్కులకు సంబధించిన వివరాలను డిజిటలైజ్ చేస్తారు. ఆన్ లైన్ లో అన్ని వివరాలు పెడతారు. కోర్ బ్యాంకింగ్ తరహాలో ఇకపై భూముల రికార్డుల నిర్వహణ పూర్తి పారదర్శకంగా ఉంటుంది.
ప్రక్షాళన పూర్తయిన తర్వాత ప్రతీ రైతుకూ ‘ఎలక్ట్రానిక్ భూమి యాజమాన్యపు హక్కు పత్రం మరియు పట్టేదార్ పాస్ పుస్తకం’ (ELECTRONIC TITLE DEED CUM PATTADAR PASS BOOK) అందచేస్తారు. ఈ పుస్తకం నీటిలో పడినా తడవకుండా, ఎవరు పడితే వారు మార్చలేని విధంగా(టాంపరింగ్ కు అవకాశం లేని విధంగా) ఉంటుంది.
రాష్ట్ర స్థాయిలో ఏర్పాటయిన ‘మిషన్ ఫర్ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్’ భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నది.
రికార్డుల ప్రక్షాళన తర్వాత కోర్ బ్యాంకింగ్ తరహాలో భూరికార్డుల నిర్వహణ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఎటిఎంలో డబ్బులు తీసుకున్నా, వేసినా వెంటనే ఆన్ లైన్ లో అప్ డేట్ అయి, వెంటనే సమాచారం వస్తుంది. కోట్ల ఖాతాలు నిర్వహించే బ్యాంకులలో సాధ్యమైన ఈ పద్ధతినే, 55 లక్షల రైతులకు సంబంధించిన రికార్డుల నిర్వహణలో అనుసరించాలి.
భూ రికార్డులను సరిచేయడానికి, ఆ తర్వాత వాటిని నిర్వహించడానికి, కోర్ బ్యాంకింగ్ లాంటి వ్యవస్థను నడపడానికి ప్రతీ రెవెన్యూ కార్యాలయంలో ఒక ఐటి అధికారిని నియమిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రెవెన్యూ శాఖలో వెయ్యి మందిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కువ సామర్థ్యం కలిగిన కంప్యూటర్లు, ఎక్కువ బ్యాండ్ విడ్త్ కలిగిన నెట్ కనెక్షన్ కల్పిస్తున్నారు. రెవెన్యూ కార్యాలయాలన్ని ఒకదానికొకటి అనుసంధానం అవుతున్నాయి.
పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు
భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం భావిస్తున్నది. క్రయ విక్రయాలు జరిపే రైతులిద్దరూ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాలి. రిజిస్ట్రార్ వద్ద ఇద్దరి పాసు పుస్తకాలు ఇవ్వాలి. రిజిస్ట్రార్ రెండు పాస్ పుస్తకాలను తీసుకుని అమ్మే వారి పాస్ పుస్తకం నుంచి భూమిని తొలగించాలి. కొన్నవారి పాస్ పుస్తకంలో ఎంటర్ చేయాలి. రిజిస్ట్రారే ఈ రెండు పాస్ పుస్తకాలను కొరియర్ ద్వారా ఎమ్మార్వోకు పంపాలి. నాలుగు పనిదినాల్లో ఎమ్మార్వో క్రయ విక్రయాలకు సంబంధించిన వివరాలను తన కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. పాస్ పుస్తకాలపై అటెస్ట్ చేయాలి. పేరు మార్పిడి చేయాలి. తిరిగి రిజిస్ట్రార్ కు పంపాలి. రిజిస్ట్రార్ తన రికార్డుల్లో నమోదు చేసుకుని కొరియర్ ద్వారా రైతులకు పంపాలి. అమ్మే వారు, కొనే వారు కేవలం ఒక్కసారి మాత్రమే రిజిస్ట్రార్ ఆఫీసుకు రావాలి. మళ్లీ మళ్లీ తిరగడం, పైరవీలు చేయడం ఇక ముందు ఉండకూడదు. పాస్ పుస్తకాలు, పహాణీల నిర్వహణకు కూడా మరింత సరళం చేస్తున్నారు. అవసరం లేని కాలమ్స్ తీసేస్తారు. పాస్ పుస్తకాలు కూడా కొత్తవి ఇస్తారు. ప్రత్యేకమైన పెన్నులు మాత్రమే వాడే విధంగా పాస్ పుస్తకాలు తయారు చేశారు. నీటిలో పడినా తడవకుండా, పాడవకుండా ఉండే విధంగా నాణ్యతా ప్రమాణాలు పాటించారు. పాస్ పుస్తకాల సైజు కూడా తగ్గించారు.
సంఘటిత శక్తిగా రైతన్నలు
ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ దారులు సంక్షోభంలోనే ఉన్నారు. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక నష్టపోతున్నారు. అందరూ ఒకే రకం పంటలు వేసి రైతుకు రైతే శత్రువు అతువున్నారు. అందరూ ఒకేసారి పంటను మార్కెట్ కు తీసుకురావడం వల్ల గిట్టుబాటు ధర రావడం లేదు. రైతులంతా సంఘటితంగా లేకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తున్నాయని భావించిన ప్రభుత్వం రైతులను సంఘటితం చేసే బృహత్ కార్యక్రమానికి పూనుకున్నది. గ్రామంలో భూమి కలిగున్న రైతులందరూ సభ్యులుగా గ్రామ రైతు సంఘం ఏర్పడింది. ఆ రైతుల్లోంచి 15 మంది సభ్యులతో గ్రామ రైతు సమన్వయ సమితిలు ఏర్పాటయ్యా యి. గ్రామ రైతు సమన్వయ సమితుల సమాహారంగా 24 మందితో మండల రైతు సమన్వయ సమితులు ఏర్పాటయ్యాయి. మండల రైతుల సమన్వయ సమితుల సమాహారంగా 24 మందితో జిల్లా రైతు సమన్వయ సమితులు ఏర్పాటయ్యాయి. చివరగా 42 మందితో రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఏర్పాటవుతుంది. రైతు సమన్వయ సభ్యులు లక్షా 75 వేల మంది. అదొక సైన్యం. మార్కెట్లలో గిట్టుబాటు ధర కల్పించే విషయంలోనూ, క్రాప్ కాలనీల విధానం అమలు చేయడంలోనూ రైతు సమన్వయ సమితులు కృషి చేస్తాయి. ప్రభుత్వ అధికారులకు, రైతులకు మధ్య వారధిగా ఈ సమన్వయ సమితులు పనిచేస్తాయి.
రైతులు తరచూ సమావేశాలు నిర్వహించుకోవడానికి 2,600 క్లస్టర్లలో రైతు సమావేశ మందిరాలను నిర్మించను న్నారు. రైతులు పరస్పరం చర్చించుకొని మార్కెట్ ధరలు, పంటల పరిస్థితి, మార్కెట్ డిమాండ్, ఆధునిక పద్ధతులు, శాస్త్రీయ విధానాలు, యాంత్రీకరణపై అభిప్రాయాలు పంచుకుంటారు.