cm-kcrమాజీ సైనికులు, వారి కుటుంబ సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, దేశంలో ఇతర రాష్ట్రాలకన్నా మెరుగ్గా ఇక్కడి మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి సంబంధించి డిసెంబర్‌ 24న ‘ప్రగతి భవన్‌’లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్‌శర్మ, ఎంపీలు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, బి. వినోద్‌కుమార్‌, ముఖ్య కార్యదర్శులు రాజీవ్‌త్రివేది, ఎస్‌. నర్సింగ్‌రావు, హోంశాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, దక్షిణ భారత సైనిక కమాండెంట్‌ జనరల్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌ ఆర్‌.కె. ఆనంద్‌, తెలంగాణ ఏరియా కమాండెంట్‌ జనరల్‌, మేజర్‌ జనరల్‌ ఎస్‌. పచౌరి, సికింద్రాబాద్‌ స్టేషన్‌ బ్రిగేడియర్‌ అజయ్‌సింగ్‌ నేగి, కల్నల్‌ తరుణ్‌కుమార్‌, కల్నల్‌ రాజ్‌పుట్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ జస్విందర్‌సింగ్‌, కెప్టెన్‌ నవనీత్‌ సింగ్‌, సైనిక సంక్షేమ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మాజీ సైనికోద్యోగులు, సైనికాధికారులతో కలిసి భోజనం చేసిన సీఎం తర్వాత వారి సమస్యలు, ఇబ్బందులు సావధానంగా విన్నారు. దాదాపు మూడు గంటలపాటు వారితో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మాజీ సైనికులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తే వారికి డబుల్‌ పెన్షన్‌ ఇచ్చే విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. సదరు పెన్షన్‌ పొందుతున్న మాజీ సైనికోద్యోగి మరణిస్తే పెన్షన్‌ను అతడి భార్యకు కూడా వర్తింపజేయాలని సీఎం ఆదేశించారు. ఈ పెన్షన్‌ కూడా ప్రతీ నెలా ఇతర ఉద్యోగులతోపాటు చెల్లించాలని చెప్పారు.

యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాలకు అందుతున్న సదుపాయాలు, పరిహారం సర్వీసులో ఉండి అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలలాంటి కారణాలవల్ల మరణించిన సైనిక కుటుంబలకు కూడా వర్తింపజేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ విషయంలో వ్యత్యాసం చూపవద్దని కోరారు.స్పెషల్‌ పోలీసు ఆఫీసర్లుగా పనిచేస్తున్న మాజీ సైనికోద్యోగుల వేతనం చెల్లించడంతోపాటు, ఆ వేతనాలను కూడా ప్రతీ నెలా ఇతర ఉద్యోగులతో పాటు విధిగా చెల్లించాలని సీఎం చెప్పారు.

రాష్ట్ర, జిల్లా స్థాయిలో సైనిక సంక్షేమ బోర్డులను బలోపేతం చేయాలి. ప్రస్తుతం పది జిల్లాల్లో ఉన్న బోర్డులను రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాల్లో ఏర్పాటు చేయాలి. మెదక్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో సైనిక సంక్షేమ కార్యాలయ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి.

యుద్ధంలో మరణించిన సైనికులకిచ్చే గ్యాలంరీ అవార్డుల ద్వారా ఇచ్చే పరిహారాన్ని మిగతా రాష్ట్రాలకన్నింటికంటే తెలం గాణలో ఎక్కువ ఉండేలా విధానం రూపొందించాలి.

సైనికులు, మాజీ జైనికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి రిజర్వేషన్‌ కల్పించాలి. మిలటరీ నిర్వహించే స్కూళ్లకు రాష్ట్ర గుర్తింపునివ్వాలి. విద్యా సంస్థల్లో స్కౌట్స్‌, గైడ్స్‌, ఎన్‌.సి.సి. శిక్షణ తీసుకునే విధంగా విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టాలి. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమిలో చేరిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించాలి.

వరంగల్‌లో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినందున దీనికి సంబంధించిన వెంటనే ఎంవోయు చేసుకోవాలి.

ఉద్యోగరీత్యా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సైనికులు తిరుగుతుంటారు. రాష్ట్రం మారిన ప్రతీసారి వారి సొంత వాహనాలకు తిరిగి లైఫ్‌ ట్యాక్సులు చెల్లించాల్సి వస్తున్నది. దేశంలో ఇప్పటికే ఎక్కడ పన్ను చెల్లించినప్పటికీ తిరిగి తెలంగాణ రాష్ట్రంలో చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉత్తర్వులు జారీ చేయాలి.

సైనికులు నిర్మించుకునే ఇండ్లకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని, డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకంలో మాజీ సైనికులకు రెండు శాతం కేటాయించాలని, డబుల్‌ పెన్షన్‌ విధానం అమలు చేయాలని, వీర సైనికుల భార్యలకిచ్చే పెన్షన్‌ను రూ. 6వేలకు పెంచినందుకు ముఖ్యమంత్రికి మాజీ సైనికోద్యోగులు అభినందనలు తెలిపారు.

Other Updates