pathakamరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్‌ కాకతీయ’ పై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు గుప్పించింది. తెలంగాణ ప్రజల జీవనాడి చెరువుల వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రజా ఉద్యమంలా సాగిస్తున్న మిషన్‌ కాకతీయ పనుల తీరుతెన్నులు కేంద్ర బృందాన్ని ఆశ్యర్యంలో ముంచెత్తాయి. ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకోవాలంటూ అన్ని రాష్ట్రాల సీఎంలకు సూచించినట్లు ఢిల్లీ నుంచి వచ్చిన నీతి ఆయోగ్‌ ప్రతినిధుల బృందం తెలిపింది. మిషన్‌ కాకతీయ పథకానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రం సానుూలంగా ఉన్నట్లు నీతి ఆయోగ్‌ బృందం తెలిపింది. ఏప్రిల్‌ 4న సచివాలయంలో మిషన్‌ కాకతీయపై మూడు గంటలకు పైగా నీతి ఆయోగ్‌ అధికారులు తెలంగాణ అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ ఎంతో దూర దృష్టితో ఇలాంటి పథకాలు చేపట్టడం సాహసోపేతమని వారన్నారు. గత పాలకులు తెలంగాణ ప్రయోజనాలను పూర్తిగా తుంగలో తొక్కి, కోస్తా ప్రయోజనాలు కోసమే కార్యక్రమాలు అమలు చేశారని ప్రభుత్వ ప్రణాళికా విభాగం సలహాదారు ఎ. గోయల్‌ వివరించారు. గోయల్‌తో పాటు ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఎస్‌.జోషి తెలంగాణ భౌగోళిక, వాతావరణ పరిస్థితులు వెనుకబాటుతనాన్ని వివరించారు. తెలంగాణ అభివృద్ధి కోసం నూతన పంథాలో విప్లవాత్మక కార్యక్రమలు చేపట్టినట్లు తెలిపారు. మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ జరిగిన తర్వాత వాటి నిర్వహణ గురించి నీతి ఆయోగ్‌ అధికారులు వివరాలు అడిగారు. చెరువు పరిరక్షణ కమిటీ పేరుతో ఆయా చెరువులపై ఆధారపడిన వివిధ సామాజిక తరగతుల వారితో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జోషి చెప్పారు. మిషన్‌ కాకతీయకు తెలంగాణ ప్రభుత్వం 11,500 కోట్లు ఖర్చు చేస్తుండగా, నాబార్డు నుంచి 2 వేల కోట్లు, కేంద్ర ప్రభుత్వం ఆర్‌.ఆర్‌.ఆర్‌ కింద 1500 కోట్లు ఇస్తోందని జోషి చెప్పారు. 5వేల కోట్లు కేంద్రం నుంచి సాయం అందించాలని జోషీ గోయల్‌ నీతి ఆయోగ్ బృందానికి విజ్ఞప్తి చేశారు. తమ వంతుగా ఈ విషయం కేంద్రం దృష్టికి తీసుకెళతామని తప్పనిసరిగా, సాయమందేలా ప్రయత్నిస్తామని కేంద్ర ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ఉద్యమం నీళ్ళు – నిధులు – నియామకాలు కోసమే జరిగిందని తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత వాటినే ప్రాధాన్యత రంగాలుగా తీసుకొని, ప్రభుత్వం రేయింబవళ్ళు పనిచేస్తున్నట్లు తెలంగాణ అధికారులు కేంద్ర ప్రతినిధులకు చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌, ఇరిగేషన్‌ మంత్రి టి.హరీష్‌ రావుల కృషిని ప్రస్తావించారు. మంత్రి హరీష్ రావు ప్రతి నిత్యం మిషన్ కాకతీయ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, వీడియో కాన్ఫరెన్సు, సమావేశాల ద్వారా పనులు వేగంగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా జరిగేలా శ్రద్ధ చూపుతున్నారని ఇరిగేషన్‌ ఇంజనీర్లు నీతి ఆ యోగ్‌ అధికారులకు వివరించారు.

మిషన్‌ కాకతీయపై ఇంతవరకు అవినీతి ఆరోపణలు రాకపోవడం వెనుక ప్రజల భాగస్వామ్యమే కారణమని నీతి ఆయోగ్‌ బృందం అభిప్రాయపడింది. 3 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో మిషన్‌ కాకతీయ పనుల పురోగతి, విజయగాథలపై మైనర్‌ ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ నాగేందర్‌ రావు, ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్‌రావు ఓ, ఎస్‌.డి. శ్రీధర్‌రావు దేశపాండే పవర్ పాయింట్‌ ప్రజంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ఎందుకు వివక్షకు గురైందో, తెలంగాణ అభివృద్దికి కేంద్రం ఎందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలో ప్రభుత్వ సలహాదారు గోయల్‌ వాదించిన తీరు కేంద్ర బృందాన్ని ఆకట్టుకున్నది.

Other Updates