ఇదిరా తెలంగాణ
యుగయుగాల చరిత్ర
రవళించు ఘనవీణ
జనుల స్వేచ్ఛాగీతి
పరిమళించిన నేల
అణచివేతల దుెరు
నిలిచిపోరిన భూమి
జాతీయ సంస్కృతులు
కలిసిపోయిన చోట
వేదనాదాలతో
వెల్లివిరిసిన పృథ్వి
గోదావరీ కృష్ణ
మంజీర మానేరు
పరవశించడి ధరా
తమురా ఈ ధరణి
కాకతీయుల కదన
కాహళమ్ములు వినగ
నాగినీ శిల్పాల
రామప్పగుడి కనగ
భరతమాతకు ముద్దు
బిడ్డరా ఇది అనగ
వెల్లివిరిసిన పుడమి
స్వాతంత్య్ర సమరాన
సాగిపోయిన ఘనుల
ప్రసవించె ఈ క్షోణి
జనజీవనోద్యమ
స్ఫూర్తి వెలిగెడి వసుధ
సుప్రసిద్ధ క్షేత్ర
దైవతాలకు నెలవు
ధాన్యాల రత్నాలు
ధవళించు ఈ నేల
సంపదల సిరులొలుకు
లక్ష్మీనివాసమిది
అతిథిపూజల విడిది
ఆదరణకిది మేటి
భిన్న సంస్కృతులతో
వెలుగొందు జీవికలు
పరిఢవిల్లిన చోటు
భాగ్యనగరాల సౌ
భాగ్యాలకిది కొలువు
జానపద గీతాలు
జాతరలుమేళాలు
పురివిప్పునీ చోట
శాంతి సౌభాగ్యాలు
జాలువారెడి అవని
సకల జనులకు భువన
స్వర్గ సామ్యత నిలిచి
కుశల మిచ్చెడి క్షోణి
రాష్ట్ర సాధన హర్ష
రాజిత విశాలవని
చంద్రశేఖర కీర్తి
చాటిచెప్పెడి భూమి
అభ్యుదయ మార్గాన
స్వస్థ శమదుర్గాన
విజయసోపానాల
ప్రగతి గాంచిన నేల
అమరవీరుల త్యాగ
ఫల విశేషాలతో
రాజిల్లు ఈ నేల
రాజితామృతశాల
ఇదిరా తెలంగాణ!
ఇదిరా తెలంగాణ!!
జనమనస్సరసిలో
విరబూయు శతపత్ర
సామ్యమీ తెలగాణ!
వర్ధిల్లు తెలగాణ!
వర్ధిల్లు తెలగాణ!!