tsmagazine

భారతదేశానికివన్నె తెచ్చిన పుణ్యభూమి తెలంగాణ రాష్ట్రం. అపారమైన ప్రకృతి వనరులూ, అమూల్య వారసత్వ సంపదలూ, అపురూప పవిత్ర స్థలాలూ, ఆకర్షణీయ మైన జనపదాలూ ఇలా ఎన్నో ఎన్నెన్నో తెలంగాణ ధరణిని దీప్తిమంతంగా ప్రపంచ చిత్రపటానికి అందిస్తున్నాయి. అటువంటి విశిష్టతగల తెలంగాణ గొప్ప సంస్కృతికీ, సంప్రదాయాలకూ, ఆచార వ్యవహారాలకూ కొలువు.

తెలంగాణ సంస్కృతిని సంప్రదాయకాలానుగుణంగా దర్శించినప్పుడు ప్రతి ఏడాదికి తొలిమాసంలోని తొలిరోజు ఉగాది. దీనినే సంవత్సరాది అని అంటారు. చైత్రమాసంతో సంప్రదాయ కాలమానం ప్రారంభ మౌతుంది. ఫాల్గుణమాసంతో ముగుస్తుంది. అధికంగా జనజీవన స్రవంతిలో ఈ కాలగణనమే ఆరాధ్యం. తొలి పండుగ అయిన ఉగాదిని తెలంగాణలో విశేషోత్సవంగా జరుపుకొంటారు. ప్రకృతి పులకించి, కొత్త చిగుళ్లు వేసే ఈ దినాన సుప్రభాతవేళలో మంగళస్నానాలను ఆచరించడం, ఇష్ట దేవతలను ఆరాధించడం, దేవాలయాలనూ, పుణ్యక్షేత్రాలనూ సందర్శించడం, వేపపూతతో కూడిన ఆరురుచుల పచ్చడిని ప్రసాదంగా ఆరగించడం ఈ పండుగ ప్రత్యేకత. సాయం సంధ్యావేళ పంచాంగశ్రవణం చేయడం ఆనవాయితీ. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయానికి ఉపయోగపడే పశుసంపదను, పాడిసంపదను, వ్యవసాయోపయుక్త సామగ్రినీ పూజించడం, ఎడ్లబండ్లను చక్కగా రంగులతో అలంకరించి ఊరేగించడం కనబడుతుంది.

చైత్రమాసంలోనే వసంత నవరాత్రోత్సవాలను ఆనందోత్సాహాలతో జరుపుకొంటారు. శ్రీరామనవమి పర్వదినాన్ని ఇటూ, అటూ తొమ్మిది రోజులపాటు ఉత్సవాలుగా నిర్వహించడం, పూజలేకాక, పురాణ హరికథాది ధార్మిక కార్యక్రమాలూ, ఒగ్గుకథల వంటి జానపదుల కళావిశేషాలనూ ప్రదర్శిం చడం కనబడుతుంది. వైశాఖ మాసంలో వైశాఖపూజలపేరిట హనుమదా లయాలలోనూ, శివాలయాలలోనూ తమలపాకులను మూలవిగ్రహాలకు అలంకరించి పూజలు చేస్తారు. శనగలతో వండిన పదార్థాలను దేవతలకు నివేదిస్తారు. బెల్లం కలిపిన పానకాలను నివేదించి, శనగలనూ, పానకాలనూ తీర్థప్రసాదాలుగా వితరణ చేస్తారు. ఈ ఆకుపూజలన్నీ రాత్రివేళలో ఆలయాలలో జరుగుతాయి.

వైశాఖమాసం శివునికీ, శివపుత్రుడైన కుమారస్వామికీ ఎంతో ప్రీతిపాత్రం. కనుక ఈ ఇరువురినీ ఈ మాసమంతా పూజిస్తారు. విశేషించి సోమవారాలలో శివారాధన ఎక్కువగా ఉంటుంది. వైశాఖ పూర్ణిమ ఎంతో పుణ్యప్రదమైనదని లోకులు భావిస్తారు. ఉపాసనలతో, జపాలతో, వ్రతాలతో ఈ పుణ్యదినాలను గడుపుతారు. జ్యేష్ఠమాసం కుటుంబాలలోని జ్యేష్ఠులకు (పెద్దవారికి) ఎంతో విశేషమైనది. వయోవృద్ధులూ, పూజ్యస్థానాలలో ఉన్నవారు ధార్మిక కార్యక్రమాల నిర్వహణ చేస్తూ ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆషాఢమాసంలో పెద్ద పండుగ ఏకాదశి. దీనినే శయనైకాదశి అంటారు. మహావిష్ణువు యోగనిద్రలోకి జారుకునే పుణ్యదినం అయిన పెద్ద ఏకాదశి దినాన తెలంగాణాలో పిండివంటలు చేసుకొని ఆరగించడం సాధారణం. చేగోళ్లు, సకినాలు వంటివి ప్రధాన భోజ్య పదార్థాలుగా కనబడుతాయి. తొలి ఏకాదశిగా పేరుగాంచిన ఈ పండుగ తెలంగాణ జనపదాలలో విశేష ప్రభావాన్ని కలిగి ఉన్నది. ఈ మాసంలోనే ఉపాసకులు, నియవ్రతులు చాతుర్మాస్యదీక్షలను ప్రారంభిస్తారు. అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని, కార్తికశుద్ధ ఏకాదశి వరకుగల నాలుగు నెలలు ఆధ్యాత్మికతకూ, నియమవంతమైన ఉపాసనలకూ యోగ్యకాలంగా అందరూ భావిస్తారు.
tsmagazine

శ్రావణమాసంలో అనేక విశేషాలున్నాయి. ఈ నెలలో శుద్ధ పంచమినాడు ‘నాగపంచమి’ పండుగను జరుపుకొంటారు. నాగదేవతను పూజించడం ద్వారా పంటలను ఎలుకలనుండి రక్షించుకోవడం ఈ పండుగలోని పరమార్థంగా కనబడుతుంది. పాముల పుట్టల దగ్గర పూజలు చేయడం సర్పాలను ఆరాధ్యదైవాలుగా కొలవడం పరిపాటి. శ్రావణపూర్ణిమనాడు రక్షాబంధనం ప్రధానం. అక్కలూ, చెల్లెళ్లూ, అన్న లకూ, తమ్ముళ్లకూ రక్షా సూత్రాలను చేతికి బంధించడం ద్వారా ఒకరినొకరు రక్షించుకోవాలనే సందేశాన్నిస్తారు. ఇదేమాసంలో వచ్చే కృష్ణుని జన్మదినాన్ని గ్రామీణ ప్రాంతాలలో వైభవంగా జరుపుకొంటారు. కృష్ణుడు గోసంపదనూ, గ్రామాలనూ రక్షించిన దేవుడు కనుక వ్యవ సాయానికి అవసరమైన పశువులనూ, పాడి సంపదనూ పూజించడం సంప్రదాయం. భాద్రపదమాసంలో వినాయకచతుర్ధిని తెలంగాణలో విశే షంగా జరుపుకొంటారు. వినాయక విగ్రహాలను మండపాలలో స్థాపించి, తొమ్మిది దినాలూ

పూజలు జరిపి పదవ దినాన ఆ విగ్రహాల ను జలనిమజ్జనం చేయడం ఆచారం.

అమావాస్య ‘పెతరమాస’ (పితృ అమావాస్య)గా సుప్రసిద్ధం. ఈ దినాన పితృదేవతల ప్రీతికొరకు ఆహార పదార్థాలను దానం చేస్తారు. బియ్యం, ఉప్పు, పప్పు దినుసులూ, చింతపండూ, బెల్లం, వంటనూనెలూ, చక్కెర, పిండి మొదలైనవి దానాలు చేస్తూ పితృదేవతలకు ఆహారం లభిస్తుందని విశ్వసిస్తారు. భోజన పదార్థాలేకాకుండా ఇతర ద్రవ్యాలనూ దానాలు చేయడం కనబడుతుంది. ఆశ్వయుజమాసం శక్తి పూజలకు నెలవు. ఈ నెలలో సంభవించే దసరా పండుగ, దీపావళి పండుగలు తెలంగాణా జనపదాలపై విశేష ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. శుద్ధపాడ్యమినుంచి ప్రారంభమయే శరన్నవరాత్రోత్సవాలు విజయ దశమితో ముగుస్తాయి. శక్తిని రోజుకొక్క రూపంలో ఆరాధించడం ఈ నవరాత్రుల ప్రత్యేకత. ఈ తొమ్మిది రోజులలో ఒక దినాన కూరగా యలతో శక్తి విగ్రహాన్ని అలంకరించి, ‘శాకంభరి’గా ఆరాధించడంలోని పరమార్థం వ్యవసాయం చక్కగా ఫలించాలని దేవతను ప్రార్థించడమే. కూరగాయలనూ, ధాన్యాలనూ శక్తిరూపంగా కొలవడం ఈ సంప్ర దాయంలోని విశేషం.

విజయదశమినాడు చేసే శమీపూజ (జమ్మిచెట్టుపూజ) తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. జమ్మి చెట్టును పూజించి, ఆకులను ‘జంబి’ అనే పేరుతో ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొని, దాన్ని బంగారంతో సమానంగా భావించడం ఈ పర్వదినాన కనబడుతుంది. సాయంకాలవేళ ఊరి పొలిమేరలు దాటి వెళ్లడం, పాలపిట్టను శుభశకునంగా భావించి దర్శించడం ఈ పుణ్యదిన ప్రత్యేకత. తెలంగాణలోని పల్లెలలో ఈ దినాన ‘తారీకులు’ అనే పేరుతో వర్తక, వాణిజ్య రంగాలవారు వ్యాపార సంబంధ ఖాతా పుస్తకాలను పూజించడం, వైదికాశీర్వచనాలను తీసుకోవడం విశేషంగా కనబడుతుంది.

దీపావళి పండుగను తెలంగాణవాసులు ‘దివిలె పండుగ’ అని పిలుస్తారు. ‘దీపావళి’ శబ్దమే ‘దివిలె’గా మార్పు చెందిందని గ్రహించవచ్చు. దీపావళినాడు లక్ష్మీపూజలు సర్వత్రా జరుగుతాయి. దీపావళికి ముందురోజైన ‘నరకచతుర్దశి’నాడు ప్రభాత వేళలోనే పుణ్య స్నానాలను ఆచరించి, హారతులు (దేవతలను అర్చించిన తరువాత దేవతల ఆశీస్సులకు సూచనగా వెలిగించిన దీపావళి మంగళహారతులు) కుటుంబంలోని అందరూ నమస్కార పూర్వకంగా స్వీకరిస్తారు. కట్న కానుకలు సమర్పించుకుంటారు. దీపావళి మరుసటి దినమైన బలిపాడ్యమినాడు పితృదేవతలను అర్చించేందుకు దీపాలను వెలిగిస్తారు. బహిరంగ ప్రదేశాలలో పితృదేవతలకు కనబడేవిధంగా వెలిగించి, వారికి పుణ్యలోకాలకు దారులు చూపడమనే లక్ష్యంతో చేసే ఈ వేడుకను ‘పెంటమీద దీపాలు’ అని కూడా వ్యవహరిస్తారు.

ఆ మరుసటి రోజున యమద్వితీయనాడు అక్కచెల్లెళ్లు అన్నదమ్ములకు ప్రీతి భోజనాలను వండిపెట్టి, వారి నమస్సులనూ, ఆశీస్సులను గ్రహిస్తారు. అక్కలకూ, చెల్లెళ్లకూ, అన్నదమ్ములు కాన్కలు సమర్పించుకొంటారు. బలిపాడ్యమి, యమద్వితీయలతో కార్తీకమాసం ప్రారంభమౌతుంది. ఈ మాసంలో తులసీవ్రతం శుద్ధద్వాదశినాడు అంతటా విశేషంగా జరుగుతుంది. మహిళలు ప్రధానంగా ఆచరించే ఈ వ్రతం స్త్రీల సౌభాగ్య సంపదలనూ, సంతానరక్షణనూ కోరేవిగా భావిస్తారు. తులసీ దామోదరుల వివాహం జరపడంద్వారా ఈ పండుగకు కల్యాణశోభ అలరారుతుంది. దీనినే క్షీరాభ్ధి ద్వాదశి, చిలుకు ద్వాదశిగా కూడా జరుపుకొంటారు. క్షీరాభ్ధిలో దేవదానవులు అమృతమథనం చేసిన సందర్భాన్ని గుర్తు చేసే ఈ పండుగ లక్ష్మీకళతో విరాజిల్లుతుంది.

కార్తీకమాసంలో శివ, విష్ణు ఆలయాలలో విశేషపూజలూ, వ్రతాలే కాకుండా నిత్యం సాయం సంధ్యా సమయంలో దీపోత్సవాలను మహిళలు జరుపుకోవడం కనబడుతుంది. అసంఖ్యాకంగా దీపాలను వెలిగించి, చేసే పూజలు అందరినీ ఆకర్షిస్తాయి. కార్తీకమాసంలో పొలాలలో కేదారేశ్వరవ్రతాలు చేస్తారు. కేదారం అంటే పంటపొలం. దానిని దైవంగా ఆరాధించడమే కేదారేశ్వర వ్రతం.

మార్గశీర్షమాసంలో ‘ధనుర్మాసం’ వస్తుంది. ఇది వైష్ణవాలయాలలో కొనసాగే విశేషోత్సవాలకు నిలయం. పూర్వం గోదాదేవి విష్ణువును ఆరా ధించిన వృత్తాంతాన్ని రోజుకొక్క ‘పాశురం’ (విష్ణుకీర్తన)తో పూజించడం సంప్రదాయం. మధురభక్తిని ప్రకటించే ఈ ధనుర్మాసోత్సవాలు మకర సంక్రాంతి దాకా కొనసాగుతాయి. పుష్యమాసంలో సంభవించే మకర సంక్రాంతి తెలంగాణ జనపదాలలో విశేష శోభలతో అలరారుతుంది. సంక్రాంతినాడు ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలపై బంతిపూలను అలంకరించి, ఇళ్ల వాకిళ్లలో పెట్టడం, రంగురంగుల రంగవల్లులతో గృహప్రాంగణాలను అలంకరించడం ఆనవాయితీ. ఈ పుణ్యదినాన నువ్వులు, చక్కెర, బెల్లంతో కూడిన మధుర భక్ష్య పదార్థాలను తినడం ప్రత్యేకత. పంటలుపండి, ధాన్యం ఇంటికి వచ్చే వేళలో వచ్చే ఈ పండుగ కొత్త బియ్యంతో ‘పులగం’ (నెయ్యితో వండిన అన్న పదార్థం) అందరికీ సేవ్యంగా ఉంటుంది. సంక్రాంతినాడు, ఆ మరుసటిదినమైన కనుమనాడు పశువుల పూజలు, వ్యవసాయ సామగ్రి పూజలు గ్రామాలలో కనబడుతాయి. మాఘ మాసంలోని అమావాస్యనాడు నదులలో పుణ్యస్నానాలను ఆచరించి, దేవాలయాలను సందర్శించడం కనబడుతుంది.
tsmagazine

ఈ మాసంలోని విశేష పర్వదినం మహాశివరాత్రి. ఈ దినాన శివాలయాలలో రుద్రాభిషేకాలు నిర్వహించడం, రోజంతా ఉపవాసం చేయడం, రాత్రివేళ శివలింగానికి అభిషేకాలు చేస్తూ జాగరణ చేయడం సంప్రదాయం. ఫాల్గుణమాసంలో వచ్చే ‘హోలీ’ పండుగ విశేషమైంది. ‘కామ దహనం’ పేరుతో ప్రసిద్ధిగాంచిన ఫాల్గుణ పూర్ణిమదినాన పెద్దపెద్ద కర్రదుంగలను రహదారుల కూడళ్లలో కాల్చి, కాముడు (మన్మథుడు) దహనమైనట్లుగా భావించి, ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందిస్తారు. తీపిపదార్థాలను సేవిస్తారు. ఇలా ఏడాది పొడుగునా సంప్రదాయ కాలమానాన్ని అనుసరించి తెలంగాణ సంస్కృతి పల్లెలనుంచి పట్టణాలదాకా అద్భుతంగా కనబడుతుంది.

సాంప్రదాయకోత్సవాలతోపాటు తెలంగాణలో అలయ్‌ బలయ్‌ (పరస్పరం మైత్రీభావాన్ని చాటే ఆలింగనాలు), గంగాజమున (అన్యోన్య మత సహిష్ణుత) అంతటా తాండవిస్తుంది. పీర్ల పండుగ, తీజ్‌పండుగ, వంటివి సర్వసౌభ్రాతృతకు సంకేతాలుగా కనబడుతాయి. వస్త్రా లంకరణలోసైతం ‘తెలంగాణాతనం’ అంతటా కనబడుతుంది. ముఖ్యంగా గ్రామాలలో ధోవతి, రుమాలు, గొంగడి, కమీజు, సంప్రదాయ వస్త్రధారణ అయిన చీరలు అందరినీ ఆకర్షిస్తాయి. మక్కరొట్టెలు, జొన్నరొట్టెలూ, జొన్న సంకటి, అంబలి, మక్కకంకులు, జొన్నకంకులు నిత్యం ఆహార శైలిని ప్రతిబింబిస్తాయి. ఆయా కులవృత్తులు, కులాచారాలు, మతాచా రాలు, కుటుంబాచారాలు విలక్షణంగా ప్రతిఫలిస్తాయి.

అందరినీ ఆదరించడం, అందరికీ స్నేహాన్నీ, ప్రేమనూ పంచడం, ఆశ్రయించిన వారికి ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణ జనావళి శ్లాఘ్యగుణం. మాయలూ, మర్మాలూ తెలియని అమాయకత, కక్షలూ, కార్పణ్యాలను ఇష్టపడని మానసిక ప్రవృత్తి, కష్టించి పనిచేసే స్వభావం మూర్తీభవించిన తెలంగాణ సంస్కృతి ప్రపంచానికే ఆదర్శం. సాంస్కృతికంగా దర్శించి నప్పుడు తెలంగాణ నిజంగా రత్నగర్భయే!

తిగుళ్ళ అరుణకుమారి

Other Updates