పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం, పాలనా వికేంద్రీకరణ లక్ష్యాలుగా ఏర్పడిన కొత్త జిల్లాల ద్వారా ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు కావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. ప్రతీ కుటుంబ జీవన స్థితిగతులను అధ్యయనం చేసి, పేదరికంలోవున్న కుటుంబాలను గుర్తించాలని, వారికోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని సీఎం కోరారు. ప్రగతిభవన్‌లో ఫిబ్రవరి 5న జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు.
‘కొత్త జిల్లాలు బాగా స్థిరపడాలి, కలెక్టర్లు బాగా పని చేస్తున్నారు. హాస్పిటల్స్, హాస్టల్స్ సందర్శిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ఉత్సాహంగా కృషి చేస్తున్నారు. నాకు మీ పనితీరు సంతోషాన్నిస్తోంది. ఇదే ఉత్సాహంతో పనిచేస్తే మనం అనుకున్న లక్ష్యాలను చాలా తొందరగానే అందుకుంటామనే నమ్మకం నాకున్నది. మీరు జిల్లాకు నాయకత్వం వహిస్తున్నారు. అధికార యంత్రాంగానికి అవసరమైన నాయకత్వ ప్రేరణ మీరు, మీ సారథ్యంలో అధికారులు బాగా పనిచేసేలా చూసుకోవాలి’ అని కేసీఆర్ తన ప్రారంభ ఉపన్యాసంలో చెప్పారు.
‘తెలంగాణ రాష్ట్రం 19.5 శాతం వృద్ధి రేటుతో దేశంలో మొదటి స్థానం పొందింది. టీఎస్‌ఐపాస్ చట్టం, నిరంతర విద్యుత్ సరఫరా తదితర కారణాలవల్ల ఇది సాధ్యమైంది. భవిష్యత్‌లో కూడా మన రాష్ట్రం ఇదే రకమైన వృద్ధిరేటు కొనసాగిస్తుంది. కాబట్టి సమకూరుతున్న ఆర్థిక వనరులను – మానవ వనరులను అభివృద్ధి చేయడానికి ఉపయోగించాలి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులను అవగతం చేసుకుని పేదరిక నిర్మూలనకు కృషి చేయాలి’ అని సీఎం వివరించారు.
‘మన తెలంగాణలో గ్రామీణ ప్రాంతం ఎక్కువ. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టానికి మనం ప్రత్యేక దృష్టి పెట్టాలి. రిసోర్స్ మ్యాపింగ్‌లో మానవ వనరులను గుర్తించాలి. రాష్ట్రంలో 25 లక్షల మంది యాదవులున్నారు. గొర్రెల పెంపకంలో అనుభవం, నైపుణ్యం వుంది. వారికి ప్రత్యేక వృత్తి నైపుణ్య శిక్షణ అవసరం లేదు. అందుకే గొర్రెల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించాం. రాష్ట్రంలో 25 లక్షలమంది గొర్రెల పెంపకందారులను కలిగివుండి, ప్రతీరోజూ 500 లారీల గొర్రెలు రాష్ట్రానికి దిగువమతి కావడం బాధాకరమన్నారు. మన రాష్ట్రమే గొర్రెలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థితికి రావాలి.మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పెంపకంకోసం ప్రత్యేక కార్యక్రమం అమలు చేయాలి. దీనికోసం అధికారులు సిద్ధం కావాలి అని ముఖ్యమంత్రి కోరారు.
నవ్వులు పూయించిన కేసీఆర్
‘గొర్రెలన్నీ ఒకే తీరుగ కనిపిస్తాయి. కానీ ప్రతి గొర్రెను ప్రత్యేకంగా గుర్తించే నైపుణ్యం యాదవులకుంటుంది. ఏదైనా గొర్రె అనారోగ్యంతో బాధపడితే కూడా గుర్తించి వైద్యం చేయిస్తడు. గ్రామాల్లో ఇతరులు కూడా గొర్రె పిల్లలను మేపడానికి యాదవులకు ఇస్తారు. ఈ గొర్రె పిల్లలు పెద్దయి గొర్రెలు అయినంక, అది ఎవరిదో గుర్తించి వారికి అందజేస్తారు యాదవులు. అనుభవమే వారికి చదువు, అలాంటి నైపుణ్యం ఐఏఎస్ చదివిన వారికి కూడా ఉండదు’ అని కేసీఆర్ సరదాగా చెప్పడంతో సభలో నవ్వులు పూశాయి.
‘చేపల పెంపకం పెద్ద ఎత్తున జరగాలి. మిషన్ కాకతీయ ద్వారా బాగయిన చెరువుల్లో జలకళ వుట్టిపడుతున్నది. ఆ చెరువులు చేపల పెంపకానికి బాగా ఉపయోగపడతాయి. గోదావరి, కృష్ణా బేసిన్లలో భారీ మధ్యతరహా నీటి ప్రాజెక్టులెన్నో వున్నాయి. కొత్తగా అనేక బ్యారేజీలు, రిజర్వాయర్లు కడుతున్నాము. వాటన్నింటినీ
చేపల పెంపకానికి అనువైన కార్యాచరణ రూపొందించాలి. అనేక ఆధునిక పద్ధతు లొచ్చాయి. వాటిని అందిపుచ్చుకోవాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
‘గ్రామాల్లో సెలూన్ల పరిస్థితి మారాలి. గ్రామాల్లో హైజనిక్ సెలూన్లు రావాలి. ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. సెలూన్లు నడిపే వారిని గుర్తించాలి. మంచి సెలూన్లతో గ్రామాల్లో కూడా రూపురేఖలు మారతాయి. చెట్ల కింద, బండలమీద కూర్చోబెట్టి కటింగ్, గడ్డాలు చేసే పరిస్థితి పోవాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
‘తెలంగాణ జనాభాలో 16-17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు, 50 శాతం మహిళలు ఉన్నారు. ఎస్సీలను ఊరికి దూరంగా వుంచారు. ఎస్టీలను తండాలు, గూడాలకు పరిమితం చేశారు. మహిళలను వంటింటికి పరిమితం చేశారు. 75శాతం మందిని ఉపయోగించుకోవట్లేదు. ఇంత పెద్దమొత్తంలో మానవ వనరులను ఉపయోగించుకోని దేశం ప్రపంచంలో భారతదేశం మాత్రమే వుంది. ఈ రుగ్మతను పోగొట్టాలి. ఎస్సీలు, ఎస్టీలు, మహిళలను ప్రోత్సహించాలి. మానవ వనరులను వృధాగా వుంచొద్దు. దళితులు, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తాం. ఆ నిధులను క్యారీ ఫార్వార్డ్ చేసే అవకాశం కల్పిస్తాం. ఎస్సీ, ఎస్టీ శాఖలకే కేటాయించి, ఖర్చు చేస్తాం. అర్బన్, రూరల్, సెమీ అర్బన్ దళితుల కోసం కార్యక్రమాలు రూపొందించి, అమలు చేయాలి. దళితులకు ఏం కావాలనే విషయంలో మీరే ప్రణాళిక రూపొందించండి. జిల్లాలవారీగా ఎస్సీ, ఎస్టీ ప్లాన్ సిద్ధం చేయాలి. బడ్జెట్ ప్రవేశ పెట్టేలోగా జిల్లాలనుంచి ప్రతిపాదనలు రావాలి. వ్యవసాయం, స్వయం ఉపాధి, పరిశ్రమలు ఇలా ఏ రంగంలో ఆసక్తివున్నా వారిని ప్రోత్సహించి, చేయూతనందించి కార్యక్రమాలు రూపొందించాలి’ అని ముఖ్యమంత్రి కలెక్టర్లను కోరారు.
‘రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్స్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. వాటి నిర్మాణం కోసం స్థలాలు గుర్తించాలి. భావితరాలను గొప్పగా తీర్చిది ద్దడానికి రెసిడెన్షియల్ స్కూల్స్ బాగా నడిచేలా చొరవ తీసుకోవాలి’ అని సీఎం చెప్పారు.
‘సమాజంలో బీసీలు పెద్ద సంఖ్యలో వున్నారు. గొర్రెలు, చేపల పెంపకంలో ఆయా కులవృత్తులకు అవసరమైన చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా వుంది. సెలూన్ల ఏర్పాటు, హైజనిక్ లాండ్రీల ఏర్పాటు, ఇంకా ఇతర కుల వృత్తులకు సంబంధించి కార్యక్రమాల రూపకల్పన జరుగు తుంది. బీసీల అభివృద్ధి, కులవృత్తులకు ప్రోత్సాహం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వుంది. వీరికోసం చేపట్టే కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సీఎంవోలోనే ప్రత్యేక అధికారులను నియమిస్తాం’ అని సీఎం చెప్పారు.
ముఖ్యమంత్రి చెప్పిన మరిన్ని విషయాలు:
ప్రతీ కలెక్టర్ వద్ద రూ. 5 కోట్ల చొప్పున పెడతాం. వారి దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణ పరిష్కారం చూపేందుకు ఈ డబ్బులు వినియోగించాలి.
ఏడాదిలోగా అన్ని జిల్లాల కార్యాలయాలు, పోలీస్ కార్యాలయాల నిర్మాణం పూర్తి కావాలి
అనాధ పిల్లల సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వమే స్వీకరించాలి. వారికి మంచి విద్య, వసతి కల్పించాలి. వారికోసం ప్రత్యేక స్కూళ్లు ఏర్పాటు చేయాలి.
జిల్లాల్లో ఒంటరి మహిళలను గుర్తించి, వారికి భృతి అందించాలి.
‘మన ఊరు – మన ప్రణాళిక’ కార్యక్రమం మరోసారి నిర్వహించాలి. గ్రామాల్లో ఎవరెవరి పరిస్థితి ఎలా వుంది? వారికి ఏ అవసరం వుంది? అనే విషయాలపై వివరాలు సేకరించాలి. దశలవారీగా అందరి అవసరాలు తీర్చేలా ప్రణాళికలు తయారు చేయాలి. లబ్దిదారులను ఎంపిక చేయడానికి లాటరీ పద్ధతిని అనుసరించాలి.
వెటర్నరీ సైన్స్ చదివిన గ్రాడ్యుయేట్లకు వెంటనే ఉద్యోగ అవకాశం కల్పించి పశు సంవర్థక శాఖను బలోపేతం చేయాలి.
ఆయా జిల్లాల సరిహద్దులు కలిగిన రాష్ట్రాలనుంచి గొర్రె పిల్లలను కొనుగోలు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో గొర్రె పిల్లలను కొనవద్దు. ఖచ్చితంగా ఇతర రాష్ట్రాలనుంచే కొనాలి.
అసైన్డ్ ల్యాండ్స్ వివరాలు సేకరించాలి. అవి ఏ స్థితిలో వున్నాయి? ఎవరి వద్ద వున్నాయి? అనే వివరాలు సేకరించాలి.
గ్రామాలకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా దళితవాడలు, ఎస్టీ తండాలను సందర్శించాలి. వారి స్థితిగతులు, సమస్యలు స్వయంగా తెలుసుకోవాలి.
గ్రామాల్లో కమతాల ఏకీకరణ జరగాలి. అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైతే వాటిని స్వాధీనం చేసుకుని, నిరుపేదలకు అందించాలి. అసైన్డ్ ల్యాండ్స్‌లో వ్యవసాయం సాగేలా చూడాలి.
సాదా బైనామాల ద్వారా పట్టాలిచ్చే కార్యక్రమం త్వరగా ముగించాలి.
ప్రతీ గ్రామంలో స్మశాన వాటికలు నిర్మించాలి. అవసరమైన చోట ప్రాధాన్యతతో ఏర్పాటు చేయాలి.
కరీంనగర్ ఎల్‌ఎండీ వద్ద ఫిషరీస్ కాలేజీ ఏర్పాటు కోసం స్థలం గుర్తించాలి.
సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్‌ను బాగా ఉపయోగించుకోవాలి. యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ వెంటవెంటనే పంపి, ఇంకా నిధులు రాబట్టుకోవాలి.
కారుణ్య నియామకాలు పది రోజుల్లో చేపట్టాలి, భార్యా భర్తలు ఒకే చోట పని చేసేలా బదిలీలు చేయాలి. రిటైరైన రోజు ఉద్యోగులను ప్రభుత్వ వాహనంలో ఇంటి దగ్గర దించిరావాలి.
స్కూళ్ల యూనిఫారాలు స్థానిక దర్జీలే కుట్టేలా చూడాలి.
వరంగల్ నగరం బాగా అభివృద్ధి కావాలి, దీనికోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. ప్రత్యేక నిధులతో అవసరాలమేర పనులు చేయాలి.
జనగామలో ఆత్మరక్షణకోసం మహిళలకు సామూహిక శిక్షణ ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. జనగామ ప్రజలకు అభినందనలు.
ప్రతీ గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటు కోసం అవసరమైన స్థలం గుర్తించాలి. మంచి డిజైన్ రూపొందిస్తాం. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
గ్రామాల్లో ‘క్లీన్ ద విలేజ్’ అనే కార్యక్రమం చేపట్టాలి. కూలిపోయిన ఇండ్ల శిథిలాలు ముళ్లపొదలు, చెత్తా చెదారం తొలగించాలి. ప్రజలను, ప్రజా ప్రతినిధులను, అధికారులు, ఉద్యోగులను భాగస్వామ్యం చేయాలి. పాడుపడ్డ బావులను, బోరు గుంతలను పూడ్చేయాలి.
‘క్లీన్ ద విలేజ్’ కార్యక్రమం ద్వారా గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చుకున్న గ్రామాలకు ‘కలెక్టర్ అవార్డు’ పేరిట నగదు బహుమతి అందించాలి. దళిత కాలనీలు, గిరిజన తండాలకూ అవార్డు ఇవ్వాలి.
గ్రామాల్లో పవర్ డే నిర్వహించాలి. వంగిన స్థంభాలు సరిచేయాలి. వేలాడే తీగలను సరిచేయాలి. ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర శుభ్రం చేయాలి.
గుడుంబా అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. గుడుంబా తయారీదారులు, అమ్మకం దారులకు ఉపాధి కల్పించాలి. వారి ఉపాధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి
ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేసే విషయంలో బాగా పని చేసిన అధికారులను గుర్తించి తగిన బహుమానం ఇవ్వాలి.
కుటుంబంలో మరొకరికి ఆసరా పెన్షన్ వచ్చినప్పటికీ.. అదే కుటుంబంలోని బీడీ కార్మికులకూ భృతి ఇవ్వాలి.
గ్రామాల్లో నిర్మించే శ్మశాన వాటికలకు ‘వైకుంఠధామం’ అనే పేరు పెట్టాలి
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో నిబంధనలు మరింత సరళం చేశాము. స్థానికంగా ఇండ్లు కట్టి వారితో ఇండ్ల నిర్మాణం చేయించండి. ఇండ్ల నిర్మాణంలో వేగం పెరగాలి.
బీడీ కార్మికులు, నేత కార్మికులకు ఇండ్లు కట్టించే పథకం కింద కేంద్రంనుంచి నిధులు తేవడానికి ప్రతిపాదనలు పంపాలి.
రోడ్డుమీద ఎట్టి పరిస్థితుల్లో గుంతలు వుండకుండా చర్యలు తీసుకోవాలి. గుంతలు పూడ్చకుంటే సంబంధిత అధికారిపై చర్య తీసుకోవాలి.
హరితహారం కార్యక్రమం కింద నాటిన మొక్కలను రక్షించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నర్సరీలు సందర్శించాలి.
ప్రభుత్వ శాఖల్లో సర్‌ప్లస్ స్టాఫ్‌ను గుర్తించి, పని భారం ఉన్నచోట నియమించాలి.
హాస్పిటళ్లు, హాస్టళ్లు సందర్శించి అవి బాగా ఉండేటట్లు చూడాలి. కనీస వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలి.
‘అంకితభావంతో పని చేస్తే అసాధ్యమేమీ కాదు. తెలంగాణ సాధనే అందుకు నిదర్శనం. మిషన్ భగీరథ మరో ఉదాహరణ. కలెక్టర్లు మనం అనుకున్న పనులన్నీ విజయవంతం చేసేలా కృషి చేయాలి. ‘ప్రొవైడింగ్ లీడర్‌షిప్, కౌన్సిలింగ్ ద పీపుల్, మ్యాప్ ద లోకల్ రిసోర్స్, ట్యాప్ ద వెల్త్’ అనే ప్రాతిపదికలపై కలెక్టర్లు పని చేయాలి. ప్రజలను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాలను విజయవంతం చేయాలి. చిన్న జిల్లాల ఏర్పాటు ఫలితం ప్రజలకు అందాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడమే లక్ష్యం కావాలి. ఎస్సీ, ఎస్టీలలో గుణాత్మక మార్పు రావాలి, బీసీవర్గాల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలను చిత్తశుద్ధితో అమలు చేయాలి. కలెక్టర్లుగా మీకు వచ్చిన అవకాశం, ప్రజలు ఓట్ల ద్వారా మాకిచ్చిన అధికారం అంతిమంగా ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలి. ఈ అవకాశం అందరికీ రాదు, కొందరికే వస్తుంది. మనం కూడా వెయ్యేళ్లు బతకం, కాబట్టి వచ్చిన అవకాశంతో కలకాలం నిలిచే విధంగా, ఉపయోగపడే పనులు చేయాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్భోధించారు.
‘మీ జిల్లా కొరకు మీరు ప్రణాళిక తయారు చేయండి. వివిధ రంగాలకు సంబంధించి పదేళ్ల ప్రణాళిక రూపొందించాలి. ఇప్పుడు మీ జిల్లా ఎలా వుంది? పదేళ్ల తర్వాత ఎలా ఉండాలో మ్యాప్ రూపొందించండి. దాని ప్రకారం మనం పని చేద్దాం’ అని సీఎం చెప్పారు.
ఈ సమావేశానికి ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కనకయ్య, వెంకటేశ్వర్లు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.