తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ‘మిషన్ కాకతీయ’ అద్భుత పథకమని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, ‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధిగాంచిన రాజేంద్ర సింగ్ కొనియాడారు. జలసౌధలో రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి టి.హరీశ్‌రావును ఆగస్టు 5న రాజేంద్రసింగ్ కలుసుకున్నారు. ఈ కార్యక్రమం పూర్తి సత్ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
‘‘దశాబ్దాల పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇక్కడి ప్రజలు నిత్య స్ఫూర్తివంతులుగా చరిత్రలో నిలుస్తారు. ఆ నిరంతర స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్‌ను అంచనావేసి, అందుకు అనుగుణమైన ప్రణాళికలు రూపొందించి, ఆచరణలో పెట్టడం అభినందనీయం’ అని రాజేంద్రసింగ్ పేర్కొన్నారు.
‘‘చెరువుల పునరుద్ధరణ అనే మహాకార్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దీంతో చెరువులు మళ్లీ పుడుతున్నాయి.’’ అని ఆయన ప్రశంసించారు. దేశంలో వర్షపాత రుతుచక్రం మారుతోందని, దానికి అనుగుణంగా పంటలు వేయాలని, ఆ దిశగా రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాయాల ద్వారా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. రాజేంద్రసింగ్ ఆగస్టు 6న వరంగల్ జిల్లాలో పర్యటించి నల్లబెల్లి, చెన్నారావుపేట, నెక్కొండ మండలాలలో ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమం కింద చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులను పరిశీలించారు. ఈ పనుల వల్ల కలిగిన మేలును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నెక్కొండ మండలం పత్తిపాక చెరువు వద్ద రాజేంద్రసింగ్ తన పుట్టిన రోజు వేడుక జరుపుకోవడం విశేషం.
హోం
»