-ములుగు రాజేశ్వర్ రావు

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రం(ఇవిఎం) అంటే ఏమిటి ? అంతకుముందు పాతపద్ధతిలో వేసే ఓటింగ్‌ పద్ధతికంటే ఇది ఎలా వేరుగా ఉంటుంది ?

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రంలో రెండు యూనిట్లు ఉంటాయి. ఒకటి కంట్రోల్‌ యూనిట్‌ కాగా రెండవది బాలటింగ్‌ యూనిట్‌. ఈ రెండింటిని ఒక 5-మీటర్ల కేబుల్‌ కలుపుతుంది. కంట్రోల్‌ యూనిట్‌ పోలింగ్‌ కేంద్రంలోని ప్రిసైడింగ్‌ అధికారి లేదా పోలింగ్‌ అధికారి వద్ద ఉంటుంది. బాలటింగ్‌ యూనిట్‌ ఓటరు ఓటు వేయడానికి నిర్దేశించిన ప్రాంతంలో ఉంటుంది. బాలట్‌ పేపర్‌ ఇవ్వడానికి బదులుగా పోలింగ్‌ అధికారి కంట్రోల్‌ యూనిట్‌ లోని బాలట్‌ బటన్‌ నొక్కుతాడు.దీనితో ఓటరు ఓటు వేయడానికి మార్గం సుగమమవుతుంది. అప్పుడు ఓటరు తను వేయదలుచుకున్న అభ్యర్థి, ఎన్నికల చిహ్నం చూసుకుని అక్కడ ఉన్న బ్లూ బటన్‌(నీలంరంగు బటన్‌) నొక్కుతాడు. దానితో అతను/ఆమె వేయదలుచుకున్న అభ్యర్థికి ఓటు పడిపోతుంది.

ఎన్నికలలో ఇ.వి.ఎంను మొదటిసారిగా
ఎప్పుడు ప్రవేశపెట్టారు ?

1989-90లలో తయారు చేసిన ఇ.వి.ఎంలను నవంబరు, 1998లో జరిగిన సాధారణ ఎన్నికలలో మధ్యప్రదేశ్‌(5), రాజస్థాన్‌(5), ఢిల్లీఎన్‌.సి.టి(6)లలోని 16 శాసనసభా స్థానాలలో ప్రయోగాత్మక పద్ధతిపై ఉపయోగించారు.

విద్యుచ్ఛక్తి లేని ప్రాంతాలలో
ఇ.వి.ఎంలను ఎలా ఉపయోగిస్తారు ?

సాధారణ 7.5 ఓల్టుల ఆల్కలైన్‌ బ్యాటరీలతో ఇ.వి.ఎంలు పనిచేస్తాయి. కాబట్టి విద్యుచ్ఛక్తి లేని ప్రాంతాలలో కూడా ఇ.వి.ఎంలను వాడవచ్చు.

ఇ.వి.ఎంలలో గరిష్టంగా ఎన్ని ఓట్లు వేయవచ్చు ?

సాధారణంగా ఒక పోలింగ్‌ స్టేషన్‌ లో ఓటర్లసంఖ్య 1500 కు మించదు. ఇ.వి.ఎంలలో గరిష్టంగా 2వేల వరకు ఓట్లు వేయవచ్చు. అందువల్ల వాటి సామర్థ్యం అవసరానికి మించే ఉంది.

ఇ.వి.ఎంలను గరిష్టంగా ఎంతమంది
అభ్యర్థులకు కేటాయించవచ్చు ?

గరిష్టంగా 64 మంది అభ్యర్థులవరకు (63మంది అభ్యర్థులు ఎవరికీ ఓటు వేయడం లేదనితెలిపే నోటా బటన్‌) కేటాయించవచ్చు. అయితే మీరు ఓటువేసే బ్యాలట్‌ యూనిట్‌లో 16మందికే అవకాశముంటుంది. ఒకవేళ పోటీపడే అభ్యర్థులు అంతకు మించితే రెండో యూనిట్‌ తెచ్చి మొదటి దానికి అనుసంధానిస్తారు.అలాగే 32కు మించితే మూడో యూనిట్‌, 48కి మించితేనాలుగో యూనిట్‌.. అలా 4 యూనిట్లవరకు అనుసంధానించవచ్చు. అంటే మొత్తం 64 మంది అభ్యర్థుల వరకు ఈ ఏర్పాటు సరిపోతుంది.

ఒకవేళ 64కు మించి ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తే..?

ఒకవేళ 64కు దాటితే ఇ.వి.ఎంలను ఆ నియోజకవర్గంలో ఉపయోగించడానికి వీలుపడదు. అప్పుడు పాత పద్ధతి ప్రకారం బ్యాలట్‌ పేపర్‌ను ముద్రిస్తారు. ఓటు ముద్రవేసిన తరువాత వాటిని భద్రపరచడానికి బ్యాలట్‌ పెట్టెలను

ఉంచుతారు.

ఒక నిర్దిష్ట పోలింగ్‌ స్టేషన్‌లో ఇ.వి.ఎం యంత్రం పనిచే యకుండా మొరాయించింది. అప్పుడేమిటి పరిస్థితి ?

పోలింగ్‌ జరిగే రోజున ప్రతి 10పోలింగ్‌ స్టేషన్ల పర్యవేక్షణకు ఒక అధికారిని విధుల్లో ఉంచుతారు. ఆయన/ఆమెదగ్గర అదనపు యంత్రాలుంటాయి. ఎక్కడయినా ఒక ఇ.వి.ఎం యంత్రం మొరాయిస్తే దాని స్థానంలో కొత్తది అమరుస్తారు. అప్పటిదాకా అంటే అంతకుముందున్న యంత్రం పాడయిపోయేవరకు పోలయిన ఓట్లు ప్రిసైడింగ్‌ అధికారి వద్ద ఉండే కంట్రోల్‌ యూనిట్‌ లోని మెమొరీలో భద్రంగా ఉంటాయి. కాబట్టి పోలింగ్‌ మళ్ళీ మొదటినుంచి నిర్వహించాల్సిన అవసరం లేకుండా ఎక్కడ ఆగిందో అక్కడినుంచి తిరిగి మామూలుగా కొనసాగించవచ్చు.

ఈ యంత్రాల ధర ఎంత ? ఇ.వి.ఎంలవాడకం
బాగాఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదా ?

1989-90 లో ఈ యంత్రాలను కొనుగోలు చేసినప్పుడు- ఒక ఇ.వి.ఎం యంత్రం (ఒక కంట్రోల్‌ యూనిట్‌, ఒక బ్యాలటింగ్‌ యూనిట్‌, ఒక బ్యాటరీ)రు.5,500లు ఉండేది. మొదటిసారి పెట్టుబడి ఒకవిధంగా భారీగానే ఉన్నప్పటికీ, లక్షల్లో బ్యాలట్‌ పత్రాల ముద్రణ, వాటి రవాణా, నిల్వవంటివి, ఓట్లలెక్కింపు సిబ్బంది తగ్గింపు, వారికి చెల్లించే పరిహారాలు..వీటన్నింటిపైన చేసిన పొదుపు – భారీ ఖర్చు ప్రభావాన్ని బాగా తగ్గించి వేసింది

చెప్పుకోదగిన జనాభా నిరక్షరాస్యులుగా ఉన్న దేశంలో నిరక్షరాస్యులైన ఓటర్లకు దీనితో సమస్యలు ఏర్పడవా ?

నిజానికి బ్యాలట్‌ పేపర్‌ ఉపయోగించే సంప్రదాయ పద్దతితో పోలిస్తే ఇ.వి.ఎంల వాడకం సులభం. పాత పద్ధతిలో అయితే ఓటరు ముందుగా ఓటు ముద్రను తను ఓటు వేయదలుచుకున్న అభ్యర్థి, ఎన్నికల చిహ్నం ఎక్కడుందో చూసుకుని దానిమీదకానీ పక్కనకానీ వేసి, ఆ తర్వాత దానిని నిలువుగా ఒక మడత, తరువాత అడ్డంగా ఒక మడత పెట్టి బ్యాలట్‌ పెట్టెలో వేయాల్సి వచ్చేది. ఇ.వి.ఎంలలో అయితే ఓటరు నేరుగా యంత్రం దగ్గరకు వెళ్ళి తను ఓటు వేయదలుచుకున్న అభ్యర్థి, చిహ్నం చూసుకుని నీలంరంగు బటన్‌ నొక్కితే చాలు. ఓటు రికార్డయిపోతుంది. ఈ యంత్రాలతో ఓట్లు వేయడంలో గ్రామీణులకు కానీ, నిరక్షరాస్యులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. నిజానికి వారు వీటి వాడకానికే మొగ్గు చూపుతున్నారు.

ఎన్నికల కేంద్రాలపై దాడిచేసి వాటిని అక్రమంగా స్వాధీనం చేసుకునేటటువంటి సంఘటనలను ఇ.వి.ఎంల వాడకం ద్వారా నివారించవచ్చా ?

ఎన్నికల కేంద్రాలపై దాడి, అక్రమ స్వాధీనం అన్నది….బ్యాలట్‌ పెట్టెలు, బ్యాలట్‌ పేపర్లు ఎత్తుకెళ్ళడం లేదా వాటిని ధ్వంసం చేయడం అనే అర్థంలో అయితే ఇ.వి.ఎంల వాడకంతో అటువంటి సంఘటనలను నివారించలేం. కారణం ఈ యంత్రాలనుకూడా అలాగే దుండగులు బలవంతంగా ఎత్తుకెళ్ళవచ్చు, ధ్వంసంకూడా చేయవచ్చు. అయితే దుండగులు ఎన్నికల కేంద్రాల్లో ప్రవేశించి అక్కడి విధుల్లో ఉన్న ఎన్నికల సిబ్బందిని బెదిరించడం బ్యాలట్‌ పత్రాలపై వారనుకున్నచోట ముద్ర వేసి తక్కువ సమయంలోనే పారిపోవడం వంటి చర్యలను మాత్రం ఇ.వి.ఎంల వాడకంతోఅడ్డుకోవచ్చు. ఎలాగంటే – ఒక నిమిషంలో కేవలం ఐదు ఓట్లు మాత్రమే రికార్డుచేసేలాగా ఈ యంత్రాలను రూపొందిస్తారు. ఓట్ల రికార్డింగ్‌ అంతా బ్యాలటింగ్‌ యూనిట్‌, కంట్రోలింగ్‌ యూనిట్లద్వారా జరిగితీరాలి కనుక ఎంతమంది దుండగులు లోనికి ప్రవేశించినా వారు ఒక నిమిషంలో 5 ఓట్లుమాత్రమే వేసుకోగలుగుతారు. అదే పాతపద్ధతిలో అయితే లోపలికి ప్రవేశించిన దుండగులు బ్యాలట్‌ పత్రాలను వారిలో వారు తలాకొన్ని పంచుకుని అతి తక్కువ సమయంలో వీలయినన్నిటిపై ముద్రలు వేసుకుని బ్యాలట్‌ పెట్టెల్లో కుక్కేసి పోలీసులు రంగప్రవేశం చేసే లోపు పారిపోగలు గుతారు. అదే ఈ యంత్రాల్లో అయితే అరగంట సమయంలో కేవలం 150 ఓట్లు మాత్రమే వేసుకోగలుగుతారు. పోలీసు లు సంఘటన స్థలానికి చేరుకో గలగడానికి సరిపడా సమయం ఇది. అదీగాక పోలింగ్‌ కేంద్రంలోకి దుండగులు ప్రవేశించినట్లు పసిగట్టగానే అక్కడ విధుల్లో ఉన్న ప్రిసైడింగ్‌ అధికారి లేదా పోలింగ్‌ అధికారులలో ఎవరయినా, ఎప్పుడయినా ‘క్లోజ్‌’ బటన్‌ నొక్కే అవకాశం ఎలాగూ

ఉంటుంది. ఒకసారి అది నొక్కేస్తే తరువాత ఏ ఒక్క ఓటుకూడా రికార్డ్‌ కాదు. దీనితో ఓటింగ్‌ ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకుందామని వచ్చే దుండగుల ఆగడాలకు కళ్ళెం పడుతుంది.

పార్లమెంటుకు, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు ఈ ఇ.వి.ఎం యంత్రాలను
ఉపయోగించుకోవచ్చా
?

ఔను. ఉపయోగించుకోవచ్చు. ఈ అవసరానికి తగ్గట్టుగానే వాటిని రూపొందించడం జరిగింది.

ఇ.వి.ఎం యంత్రాల వాడకంవల్ల ప్రయోజనాలు ఏమిటి ?

అన్నిటికంటే పెద్ద ప్రయోజనం బ్యాలట్‌ పేపర్లు లక్షల్లో ముద్రించే యాతన తప్పిపోవడం. ప్రతిపోలింగ్‌ స్టేషన్‌లో ప్రతి ఓటరుకు ఒక బ్యాలట్‌ పేపర్‌ ఇచ్చే బదులు, బ్యాలటింగ్‌ యంత్రంమీద ఒక్క పేపర్‌ అంటిస్తే చాలు. కాగితం, ముద్రణ, రవాణా, నిల్వ, పంపిణీ ఖర్చులన్నీ పొదుపయినట్లే. తరువాత కౌంటింగ్‌ చాలా త్వరగా ముగుస్తుంది. ఫలితాలు ప్రకటిం చడానికి పాతపద్ధతిలో సగటున 30-40 గంటలు పట్టేది. ఇప్పుడది కేవలం 2-3గంటల్లో ముగుస్తుంది. మూడవది- ఇ.వి.ఎం పద్థతిలో ఓటింగ్‌ జరిగితే చెల్లని ఓట్లంటూ ఉండవు. దీని ప్రాముఖ్యత మీకు అర్థంకావాలంటే ఒక్కసారి గత సాధారణ ఎన్నికల అనుభవాలు గుర్తుచేసుకోవాలి. అప్పట్లో ప్రతి సార్వత్రిక ఎన్నికలోకూడా చాలా నియోజక వర్గాల్లో -గెలిచిన అభ్యర్థికి, అతని సమీప అభ్యర్థికి మధ్య ఓట్ల తేడా ఎంత ఉందో అంతకంటే ఎక్కువగా చెల్లని ఓట్లుండేవి. ఈ కోణంలో చూసినప్పుడు ఇ.వి.ఎం యంత్రాలవల్ల ఓటర్ల నిర్ణయం మరింత కచ్చితంగా ప్రతిబింబిస్తుంది.

ఇ.వి.ఎంల వాడకం వల్ల ఎన్నికల ప్రక్రియ మందకొడిగా సాగుతుందా ?

కాదు. నిజానికి వేగంగా సాగుతుంది. పాత పద్ధతిలో లాగా ఇక్కడ బ్యాలట్‌ పేపర్‌ ముందు మడతలు విప్పడం ముద్ర వేసిన తరువాత దానిని లెక్క ప్రకారం మడతలు పెట్టడం, తీసుకెళ్ళి బ్యాలట్‌ పెట్టెలో వేయడం…ఇంత శ్రమ ఉండదు. ఇ.వి.ఎం యంత్రం దగ్గరకు వెళ్ళి అక్కడ తనకు నచ్చిన అభ్యర్థి, చిహ్నం దగ్గర ఉన్న బటన్‌ నొక్కేసి వచ్చేయడమే. సమయం చాలా కలిసివస్తుంది.

బ్యాలట్‌ పెట్టెలను తీసుకెళ్ళి ఓట్లను లెక్కించే సందర్భాల్లో మొదట పెట్టెలన్నీ కుమ్మరించి ఓట్లన్నీ కలిపి లెక్కించేవారుగదా! ఈ పద్ధతిని ఇ.వి.ఎం యంత్రాల విషయంలో కూడా పాటించవచ్చా?

సాధారణ నియమం ఏమిటంటే-పోలింగ్‌ స్టేషన్‌లవారీగా లెక్కించాలి. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ లోని యంత్రాల విషయంలో ప్రస్తుతం అలాగే లెక్కిస్తున్నాం. అయితే ఎన్నికల కమీషన్‌ కొన్ని నిర్దిష్ట నియోజకవర్గాల్లో ఓట్లన్నీ కలిపి లెక్కించమని ఆదేశిస్తుంది. అటువంటి సందర్భాల్లో ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ లోని ఇ.వి.ఎం యంత్రాలు రికార్డుచేసిన ఓట్లు వాటిలో కాక మాస్టర్‌ కౌంటింగ్‌ యంత్రంలో రికార్డవుతాయి. అప్పడు మొత్తం శాసనసభ నియోజక వర్గంలో పడిన మొత్తం ఓట్లెన్నో తెలుస్తాయి తప్ప విడిగా ఏ పోలింగ్‌ స్టేషన్‌ లో ఎన్ని ఓట్లు పడ్డాయో తెలియదు.

కంట్రోల్‌ యూనిట్‌ అందుకున్న సమాచారం ఎంతకాలంపాటు దాని మెమొరీలో నిల్వ ఉంచుకోగలదు ?

పదేళ్ళు, అంతకంటే పైగానే.

ఎన్నికల పిటీషన్లు దాఖలయిన సందర్భంలో కోర్టు తీర్పునుబట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది. అవసరమని భావించిన కొన్ని కేసుల్లో ఓట్లను తిరిగి లెక్కించమని ఆదేశించవచ్చు. మరి అంతకాలం ఇ.వి.ఎంలను అంత సుదీర్ఘకాలం భద్రపరిచి ఉంచవచ్చా ? కోర్టులు నియమించిన అధికారుల సమక్షంలో ఓట్ల ఫలితం బహిర్గతం చేయడం సాధ్యపడుతుందా ? ఇ.వి.ఎం యంత్రాల బ్యాటరీలీక్‌ కావడం ఇతర్రతా పాడయిపోవడం వంటివి జరగవా ?

పోలింగ్‌ సమయంలో, లెక్కింపు సమయంలో ఇ.వి.ఎం యంత్రాలను యాక్టివేట్‌ చేయడానికి బ్యాటరీ అవసరమ వుతుంది. పోలింగ్‌ ముగిసిన వెంటనే బ్యాటరీని ఆఫ్‌ చేయవచ్చు. మళ్ళీ దీని అవసరం ఓట్ల లెక్కింపు సమయం లోనే ఉంటుంది. అప్పుడు ఆన్‌ చేయాల్సి ఉంటుంది. అందువల్ల బ్యాటరీ లీక్‌ అవుతుందనో మరో విధంగా పాడయి పోతుందనో ప్రశ్నే తలెత్తదు. బ్యాటరీ తీసేసిన తరువాత కూడా మైక్రోచిప్‌ లోని మెమొరీ యథాతథంగా ఉంటుంది. ఒకవేళ కోర్టు ఓట్లనుమళ్ళీ లెక్కించమని ఆదేశిస్తే, బ్యాటరీపెట్టి కంట్రోల్‌ యూనిట్‌ ను పనిచేయిస్తే అది దాని మెమొరీలో భద్రంగా ఉన్న ఫలితాలను ప్రదర్శిస్తుంది.

ఇ.వి.ఎం సరిగా పనిచేస్తున్నదనీ, తన ఓటు సక్రమంగానే రికార్డయిందని ఓటరు ఎలా తెలుసుకోగలుగుతాడు?

ఒకసారి ఓటరు తను ఓటు వేయదలుచుకున్న అభ్యర్థి పేరుకు దగ్గరగా ఉన్న బ్లూ బటన్‌ నొక్కగానే ఎడమవైపు ఎన్నికల చిహ్నం దగ్గరున్న చిన్న ఎర్రదీపం వెలుగుతుంది. అదే సమయంలోనే బీప్‌ శబ్దం సుదీర్ఘంగా వినిపిస్తుంది. అలా ఓటరుకు తన ఓటు రికార్డయినట్లు దశ్య, శ్రవణ సూచనలు అందుతాయి.

ఓటు వేసే సమయంలో బ్లూ బటన్‌ నొక్కేటప్పుడు ఓటరుకు కొన్నిసార్లు షార్ట్‌ సర్క్యూట్‌ వల్లకానీ, మరే ఇతర కారణంవల్లకానీ షాక్‌ కొట్టే అవకాశం ఉందంటారు, నిజమేనా?

నిజం కాదు. ఇ.వి.ఎం యంత్రాలుకేవల 7.5 ఓల్టుల బ్యాటరీతో పనిచేస్తాయి. అందువల్ల బ్లూ బటన్‌ నొక్కే సమయంలో కానీ లేదా బ్యాలటింగ్‌ యూనిట్‌ వల్ల మరే ఇతర కారణంవల్లకానీ ఓటరుకు ఎలక్ట్రిక్‌ షాక్‌ కొట్టే అవకాశం అసలు ఏ మాత్రం లేదు.

బ్లూ బటన్‌ను నొక్కితే ఓట్లు ఎలా రికార్డు కావాలో అలానే తొలి 100 ఓట్లవరకు రికార్డయి తరువాత ఏ అభ్యర్థిపేరు దగ్గరి బటన్‌ను నొక్కినా వారికి పడకుండా నిర్దిష్టంగా మనం కోరుకున్న ఫలానా అభ్యర్థికే ఓటు రికార్డయ్యేటట్లుగా ముందుగానే ప్రోగ్రామ్‌ చేసిపెట్టుకునే అవకాశం ఉందా ?

ఇ.వి.ఎంలను దిగుమతి చేసుకునేటప్పుడే దానిలో ఉండే మైక్రోచిప్‌ సీల్‌ అయి వస్తుంది. ఆ సీల్‌ ను తొలగించకుండా, చిప్‌ను ధ్వంసంచేయకుండా దానిని తెరవలేరు, దానిలో ప్రోగ్రామ్‌ తిరగ రాయలేరు. అందువల్ల ఒక నిర్దిష్టమైన అభ్యర్థిని లేదా ఒక నిర్దిష్టమైన రాజకీయపార్టీని ఎన్నుకునేటట్లుగా ఇ.వి.ఎంలను ప్రోగ్రామ్‌ చేసే అవకాశమే లేదు.

ఇ.వి.ఎం యంత్రాలను పోలింగ్‌ స్టేషన్‌లకు తరలించడం కష్టం కాదా ?

కానే కాదు. పాత పద్ధతిలోని బ్యాలట్‌ పెట్టెలతో పోలిస్తే ఇ.వి.ఎంలు చాలా తేలికయినవి, సులభంగా తరలించగలిగినవి, పైగా పాలీప్రొపిలీన్‌ కేసుల్లో(సంచుల్లో) ఉంటాయి.

దేశంలోని చాలా ప్రాంతాల్లో విద్యుచ్ఛక్తి సౌకర్యం లేదు. ఒకవేళ ఉన్నా సరఫరా సక్రమంగా ఉండదు. మరి అటువంటి పరిస్థితులలో ఎయిర్‌ కండీషనింగ్‌ లేకుండా వాటిని భద్రపరిస్తే సమస్యలు తలెత్తవా ?

ఇ.వి.ఎంలు భద్రపరిచిన గదికి కానీ హాల్‌కు కానీ ఎయిర్‌కండీషనింగ్‌ అవసరం లేదు. బ్యాలట్‌ పెట్టెలకు లాగానే అవి భద్రపరిచిన ప్రదేశాల్లో ఎలుకలు, పందికొక్కుల వంటివి లేకుండా, దుమ్ము, తేమ లేకుండా ఉంటే చాలు.

పాత బ్యాలెట్‌ పెట్టెల పద్ధతిలో పోలింగ్‌ రోజున అప్పటివరకు ఎన్ని ఓట్లు పోలయింది ఎప్పుడు కావాలంటే అప్పుడు తెలుసుకునే వీలుండేది. కానీ ఇ.వి.ఎంల విషయంలో ఫలితాల భాగం సీల్‌ చేసి ఉండడంతో దాన్ని లెక్కింపు సమయంలోనే తెరుస్తారు కనుక పోలింగ్‌ జరిగే రోజున మొత్తం ఎన్ని ఓట్లు పోలయిందీ ఎప్పటికప్పుడు ఎలా తెలుసుకోవడం?

ఫలితాల బటన్‌ కు అదనంగా ఇ.వి.ఎంలలో ‘టోటల్‌’ అనే మరొక బటన్‌ ఉంటుంది. దాన్ని నొక్కితే అప్పటివరకు ఎన్ని ఓట్లు పోలయిందీ చూపుతుంది. కానీ ఏ అభ్యర్థికి ఎన్ని పోలయింది మాత్రం చూపదు.

బ్యాలటింగ్‌ యూనిట్‌లో 16మంది అభ్యర్ధులకు అవకాశం ఉంది కదా. ఒక నియోజకవర్గంలో పదిమందే అభ్యర్థులున్నారు.మరి అటువంటప్పుడు ఓటర్లు 11 నుంచి 16 వరకున్న ఏ బటన్‌ అయినా నొక్కవచ్చు. మరి ఆ ఓట్లు వథా కావా?

ఆ అవకాశమే లేదు. వాడకానికి ముందే 11నుంచి16వరకున్న బటన్లను కనబడకుండా మాస్కింగ్‌ చేయడం జరుగుతుంది.అదీగాక అభ్యర్థుల స్విచ్‌లను పదితోనే ముగిసేలాగా ఆ తరువాతవి (11-16) రికార్డింగ్‌ జరగకుండా ఉండేవిధంగా ఎలక్ట్రానికల్‌గా బ్లాంక్‌ చేయడం జరుగుతుంది. అందువల్ల ఏ ఓటరుకూడా 11నుండి 16 వరకు బటన్‌ నొక్కే ప్రశ్నే తలెత్తదు. అలాగే వాటితాలూకు ఓట్లు ఇ.వి.ఎంలలో రికార్డయ్యే ప్రసక్తే ఉండదు.

ఎటువంటి ఫిర్యాదులకు అవకాశాలు లేని విధంగా, బాక్స్‌ లను మార్చే అవకాశంలేనివిధంగా బ్యాలట్‌ బాక్స్‌ లను రూపొందించారు. ఇ.వి.ఎంలకు నంబరుండే పద్ధతి ఏదయినా పెట్టారా?

ఔను. ప్రతి కంట్రోల్‌ యూనిట్‌కు ఒక విశిష్ఠమైన ఐడి సంఖ్య ఉంటుంది. అది ప్రతిదానిమీద చెరిగిపోనివిధంగా పెయింట్‌ చేయబడి ఉంటుంది. ఈ నంబరును నోట్‌ చేసుకోవడానికి పోలింగ్‌ ఏజంట్లను అనుమతిస్తారు. రిటర్నింగ్‌ అధికారి నిర్వహించే రిజిస్టర్‌ లో కూడా దీనిని నమోదు చేస్తారు. కంట్రోల్‌ యూనిట్‌ కు తగిలించి ఉండే చిరునామా బిళ్ళమీద కూడా ఈ నంబరుంటుంది. అందువల్ల ఏ ఇ.వి.ఎం యంత్రాన్నికూడా మార్చే (ఒకదానిని తీసి మరొకటి పెట్టడం) ప్రశ్నే ఉత్పన్నం కాదు.

ఎన్నికల నిర్వహణ పాతపద్ధతిలో జరిగేటప్పుడు పోలింగ్‌ కుముందుబ్యాలట్‌ పెట్టె ఖాళీగా ఉందని నిర్ధారించడానికి పోలింగ్‌ స్టేషన్‌లో ఉన్న పోలింగ్‌ ఏజంట్లందరినీ పిలిచి ప్రిసైడింగ్‌ అధికారి పెట్టె తెరిచి చూపుతాడు. అలాగే ఇ.వి.ఎం యంత్రాల విషయంలో ముందుగా ఏ ఓటూ రికార్డు కాలేదని పోలింగ్‌ ఏజంట్లను తప్తి పరచడానికి అటువంటి ఏర్పాటేమేయినా చేసే అవకాశం ఉందా ?

ఔను. ఉంది. ఇ.వి.ఎం యంత్రంలో రహస్యంగా ఓట్లేవీ ముందుగా వేసి లేవని చూపడానికి ప్రిసైడింగ్‌ అధికారి ‘రిజల్ట్‌ బటన్‌’ నొక్కుతాడు. ఆ తరువాత కూడా

ఉత్తుత్తి ఓటింగ్‌ ఒకటి నిర్వహిస్తాడు. అంటే పోలింగ్‌ ఏజంట్ల చేత ఓటు వేయిస్తాడు. అవి సరిగా రికార్డు అవుతున్నాయో లేదో ‘రిజల్ట్‌’ బటన్‌ నొక్కి చూపుతాడు. వారు ఓటు వేసిన అభ్యర్థికే అది కచ్చితంగా రికార్డవుతున్నదని నిర్ధారించిన తరువాత ‘క్లియర్‌’ బటన్‌ నొక్కి అవన్నీ తొలగించి అసలు పోలింగ్‌ ప్రారంభిస్తాడు.

పోలింగ్‌ ముగిసింది. ఓట్ల లెక్కింపు తరువాత ఎప్పుడో జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఎప్పుడయినా స్వార్థపరశక్తులు వారి అభ్యర్థులకు ఓట్లు వేయించుకునే అవకాశాలు లేవని ఎలా చెప్పగలరు ?

చివరి ఓటు పడిన తరువాత కంట్రోల్‌ యూనిట్‌ ఇంచార్జి అయిన ప్రిసైడింగ్‌ అధికారి ‘క్లోజ్‌’ బటన్‌ నొక్కుతాడు. ఆ తరువాత ఇ.వి.ఎం. ఏ ఒక్క ఓటునూ రికార్డు చేయడానికి అనుమతించదు. అదీగాక ఓటింగ్‌కు ఉపయోగించిన బ్యాలటింగ్‌ యూనిట్‌ను పోలింగ్‌ ముగిసిన వెంటనే కంట్రోల్‌ యూనిట్‌ నుంచి వేరు చేసి విడిగా భద్రపరుస్తారు. ఓట్లు నమోదు కావాలంటే కేవలం బ్యాలటింగ్‌ యూనిట్‌ ద్వారానే సాధ్యం. అంతేకాదు, పోలింగ్‌ ముగిసిన తరువాత మొత్తం ఎన్ని ఓట్లు పడిందీ ఆ లెక్కను ప్రిసైడింగ్‌ అధికారి పోలింగ్‌ ఏజంట్లకు అందిస్తాడు. మళ్ళీ ఓట్ల లెక్కింపు సమయంలో దానిలో రికార్డయ ఉన్న మొత్తం ఓట్లను ఈ లెక్కతో పోల్చి చూపుతాడు. ఒకవేళ తేడా ఉంటే కౌంటింగ్‌ ఏజంట్లు దానిని లెక్కింపు అధికారుల దష్టికి తీసుకువస్తారు.

ఇ.వి.ఎం- అడ్వాన్డ్స్‌

ఇ.వి.ఎంలను టాంపరింగ్‌ చేశారని అంటుంటారు కదా, అంటే ఏమిటి ?

టాపంరింగ్‌ అంటే ఓటింగ్‌లో ఉపయోగించే కంట్రోల్‌ యూనిట్‌లోని మైక్రోచిప్‌లో రాసి ఉన్న సాఫ్ట్‌ వేర్‌ ప్రోగ్రాంను మార్చడాన్ని లేదా కంట్రోలింగ్‌ యూనిట్‌లో కొత్త హానికరమైన సాఫ్ట్‌ వేర్‌ ప్రోగ్రాం రాసి ఉన్న మైక్రోచిప్‌ను చొప్పించి తద్వారా బ్యాలటింగ్‌ యూనిట్‌లోని బటన్‌లను నొక్కినప్పుడు అవి వాటికి నిర్దేశించిన పనిని కాక మరోవిధంగా పనిచేయించడాన్ని టాంపరింగ్‌ అంటారు.

ఇసిఐ-ఇ.వి.ఎం లను హ్యాక్‌ చేయవచ్చా? (హాకింగ్‌ అంటే అనధికారికంగా కంప్యూటర్‌ లలోకి, ఇతరుల వ్యక్తిగత సమాచార వ్యవస్థలలోకి చొరబడి తమ అధీనం లోకి తీసుకోవడం)

వీలుపడదు. 2006 వరకు తయారయిన ఇ.వి.ఎంలకు చెందిన మొదటి నమూనా ఎం-1 యంత్రాలలో కొందరు ఆరోపిస్తున్నట్లుగా హ్యాకింగ్‌కు వీలుపడని విధంగా అవసరమయిన అన్ని సాంకేతిక అంశాలతో రూపొందిం చారు. 2006లో సాంకేతిక వ్యవహారాల కమిటీ సిఫార్సులమేరకు 2006 నుండి 2012 వరకు తయారుచేసిన నమూనా ఎం-2లో ‘కీ’ కోడింగ్‌ను డైనమిక్‌ కోడింగ్‌ పద్ధతిలో చేసారు. దీనివల్ల బ్యాలట్‌ యూనిట్‌(బియు)నుంచి కంట్రోల్‌ యూనిట్‌ (సియు)కు – నొక్కిన బటన్‌ తాలూకు ‘సందేశాల బదిలీ’ కి అదనపు భద్రత కల్పించే ఎన్‌క్రిప్డెడ్‌ ఫాంలో ఉంచడానికి వీలయింది. అంతేకాదు, బటన్‌ను నొక్కిన సమయం సెట్టింగ్‌ను రియల్‌టైంలో ఉంచడం జరిగింది. దీనివల్ల హాకింగ్‌ ప్రభావంతో బటన్‌ నొక్కడాలను అన్వేషించి వాటిని నిలిపేయవచ్చు. అదీగాక ఇసిఐ-ఇ.వి.ఎంలు కంప్యూటర్‌ నియంత్రణలో పనిచేయవు. అవి స్వతంత్రంగా పనిచేస్తాయి. ఏ సమయంలో కూడా ఇవి ఇంటర్నెట్‌కు కానీ మరే ఇతర నెట్‌వర్క్‌కు కానీ అనుసంధానం కావు. దానివల్ల రిమోట్‌పరికరాలతో హాకింగ్‌చేయడానికి అవకాశమే ఉండదు. ఇసిఐ-ఇ.వి.ఎంలకు ఫ్రీక్వెన్సీ రిసీవర్‌ ఉండదు లేదా వైర్‌లెస్‌ సంబంధమైన డేటా డీకోడర్‌ కూడా ఉండదు. లేదా మరో నాన్‌-ఇ.వి.ఎం పరికరానికి / విడిభాగానికి జోడించే అవకాశం ఉండే బయటి హార్డ్‌ వేర్‌ పోర్ట్‌ కూడా ఉండదు. కంట్రోల్‌ యూనిట్‌ అనేది బ్యాలట్‌ యూనిట్‌ నుంచి – ఎన్‌క్రిప్ట్‌ అయిన డైనమికల్‌ గా కోడింగ్‌ చేయబడిన డేటానే అనుమతిస్తుంది కాబట్టి హార్డ్‌ వేర్‌ పోర్ట్‌ ద్వారాకానీ లేదా వైర్‌లెస్‌ ద్వారాకానీ, వై-ఫై లేదా బ్లూ టూత్‌ పరికరం ద్వారాకానీ టాంపరింగ్‌ అసాధ్యం. మరే ఇతర రకాలయిన డేటానుకూడా సియు అనుమతించదు

ఇ.వి.ఎంలలో తయారీదారులు అక్రమంగా ఏవయినా మార్పులు చేయగలరా ?

అసాధ్యం. తయారీదారు స్థాయిలో సాఫ్ట్‌ వేర్‌కు సంబంధించి చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. 2006నుండి వేర్వేరు సంవత్సరాల్లో ఈ యంత్రాలు తయారయ్యాయి. తయారీ తరువాత వాటిని రాష్ట్రాలకు, ఒక రాష్ట్రంలోకూడా పలు జిల్లాలకు పంపుతారు. ఏ అభ్యర్థి నిర్దిష్టంగా ఏ నియోజకవర్గం నుండీ పోటీ చేస్తున్నాడు. బ్యాలటింగ్‌ యూనిట్‌ జాబితాలో ఈ అభ్యర్థి వరుస సంఖ్య ఎంత అనేది తయారీ దారులు అన్ని సంవత్సరాలు ముందుగా ఊహించలేరు. అదీగాక ఇసిఐ-ఇ.వి.ఎంలకు ప్రతిదానికీ ఒక సీరియల్‌ నంబరు ఉంటుంది. ఏ ఇ.వి.ఎం ఎక్కడ

ఉందనే విషయాన్ని ఎన్నికల సంఘం తన దగ్గరున్న డేటాతో ఇ.వి.ఎం ట్రాకింగ్‌ సాఫ్ట్‌ వేర్‌ సహాయంతో తెలుసుకోగలుగుతుంది. అందువల్ల తయారీ సమయంలో అక్రమంగా మార్పులు చేసే ప్రసక్తే ఉండదు.

ఇ.వి.ఎం పాత నమూనాలు
ఇంకా వాడుకలో ఉన్నాయా ?

2006 వరకు తయారు చేసిన ఎం-1 నమూనా ఇ.వి.ఎంలను చివరిసారిగా 2014 సార్వత్రిక ఎన్నికలలో ఉపయోగించడం జరిగింది. 2014లో ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకున్నది-వివిపిఎటిని ప్రవేశపెట్టిన తరువాత ఎం-1 నమూనాతో ఇవి అనుసంధానం కాలేవు. అదీగాక ఇ.వి.ఎం యంత్రాలు ఆర్థికంగా 15 ఏళ్ళు పూర్తిచేసుకున్నాయి. దానితో 2006వరకు తయారయిన అన్ని ఇ.వి.ఎం యంత్రాలను వాడరాదనేది ఆ నిర్ణయం.అయితే వీటిని ధ్వంసం చేయడానికి కూడా ఎన్నికల సంఘం ఒక ప్రామాణిక కార్యాచరణ ప్రక్రియను రూపొందించింది. చిప్‌తో సహా ఈ యంత్రాలను తయారీదారుల కర్మాగారంలోపల రాష్ట్ర ఎన్నికల అధికారి లేదా ఆయన ప్రతినిథి సమక్షంలో ధ్వంసం చేస్తారు.

ఇ.సి.ఐ-ఇ.వి.ఎం యంత్రాలలో పరికరాలను ఎవరూ గుర్తించకుండా మార్చవచ్చా? లేదా యంత్రాలను టాంపరింగ్‌ చేయవచ్చా ?

ఇ.సి.ఐ-ఇ.వి.ఎంలకుసంబంధించిన మునుపటి ఎం-1, ఎం-2 నమూనాల్లో ప్రస్తుతం పొందుపరిచి ఉన్న భద్రతా ఏర్పాట్లకు అదనంగా, 2013 తరువాత రూపొందించిన ఎం-3 ఇ.వి.ఎం లో టాంపర్‌ను పసిగట్టడం, దానికదే తనిఖీ చేసుకోవడం వంటి అదనపుభద్రతా ఏర్పాట్లున్నాయి. టాంపర్‌ను కనుగొనే ఏర్పాటువల్ల ఎవరయినా ఆ యంత్రాన్ని తెరవడానికి ప్రయత్నిస్తే అది పనిచే యకుండా ఆగిపోతుంది. స్వీయ తనిఖీ ఏర్పాటు వల్ల యంత్రాన్ని ప్రారంభించిన ప్రతిసారీ దానికదే మొత్తం తనిఖీ చేసుకుంటుంది. హార్డ్‌ వేర్‌ లోకానీ, సాఫ్ట్‌ వేర్‌లోకానీ ఎవరయినా ఏదయినా మార్పులు చేసి ఉంటే వెంటనే పట్టేస్తుంది. ఈ ఎం-3 నమూనాపరీక్షలు ప్రస్తుతం తుదిదశలో ఉన్నాయి. సాంకేతిక నిపుణుల కమిటీ పరీక్షించిన తరువాత తయారీ ప్రారంభ మవుతుంది. పైన చెప్పిన అదనపు భద్రతా ఏర్పాట్లతో, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో
ఉండే ఈ ఎం-3 యంత్రాల సేకరణకు ప్రభుత్వం రు.2వేలకోట్లు విడుదల చేసింది.

ఇ.సి.ఐ-ఇ.వి.ఎంలను టాంపరింగ్‌ చేయకుండా ఉండడానికి ఉపయోగిస్తున్న అధునాతన సాంకేతిక అంశాలేమిటి ?

ఓ.టి.పి(ఒన్‌ టైం ప్రోగ్రామబుల్‌) మైక్రోకంట్రోలర్లు, ‘కీ'(బటన్లు)ల కోడ్‌కు సంబంధించి డైనమిక్‌ కోడింగ్‌ ఉపయోగించడం, ఏ ‘కీ’ ని నొక్కినా తేదీ, సమయం ముద్రింపబడడం, అధునాతన ఎన్కిప్రిప్షన్‌ సాంకేతికత, ఇ.వి.ఎం సామాగ్రిని నిర్వహించడానికి ట్రాకింగ్‌ సాఫ్ట్‌ వేర్‌ వంటి అంశాలు 100శాతం టాంపరింగ్‌ జరగకుండా భద్రత కల్పిస్తాయి. ఇవిగాకుండా ఎం-3 ఇ.వి.ఎంలలో టాం పరింగ్‌ను పసిగట్టగల, స్వయం తనిఖీ నిర్వహించుకోగల అదనపు అంశాలుకూడా ఉన్నాయి.ఓటిపి ఆధారిత సాఫ్ట్‌ వేర్‌ ఉపయోగిస్తున్న కారణంగా వీటిలో ప్రోగ్రామ్‌ను మార్చడానికి కానీ, తిరగరాయడానికి కానీ లేదా మళ్ళీ చదవడానికి కానీ వీలుపడదు. అలా ఇ.సి.ఐ-ఇ.వి.ఎం యంత్రాలు టాంపరింగ్‌ కాకుండా కట్టడి చేయడానికి వీలవుతున్నది. ఒకవేళ ఎవరయినా టాంపరింగ్‌కు ప్రయత్నిస్తే, యంత్రం ఏ పనీచేయకుండా ఆగిపోతుంది.

ఇ.సి.ఐ-ఇ.వి.ఎంలు విదేశీ సాంకేతికను ఉపయోగిస్తున్నాయా ?

ఈ విషయంలో తప్పుదోవ పట్టేటట్లుగానూ, కొందరు ఆరోపిస్తున్నట్లుగానూ భారత దేశంలో ఉపయోగించే ఇ.వి.ఎంలలో ఏ ఒక్కటీ కూడా మరో దేశంలో తయారు కాదు. మన దేశంలోనే రెండు ప్రభుత్వరంగ సంస్థల్లో – బెంగళూరులోని భారత ఎలక్ట్రానిక్స్‌ సంస్థ, హైదరాబాద్‌ లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలో ఇవి తయారవుతాయి. దీనికి అవసరమయిన సాఫ్ట్‌ వేర్‌ ప్రోగ్రాం కూడా ఈ రెండు సంస్థల్లో అంతర్గతంగానే, ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వకుండా వాటి ప్రాంగణంలోనే పటిష్టమైన భద్రతా ఏర్పాట్లమధ్య రాయడం జరుగుతుంది. ఇదంతా అత్యంత ఉన్నతమైన విలువలను కాపాడడానికే. దీనిని మెషీన్‌కోడ్‌ లోకి మార్చి, అప్పుడు మాత్రమే విదేశంలోని చిప్‌ తయారీదారుకు ఇవ్వడం జరుగుతుంది. కారణం-సెమీకండక్టర్‌ మైక్రో చిప్‌లను తయారుచేసే సామర్ధ్యం అంతర్గతంగా మనదేశంలో లేదు కనుక. ప్రతి మైక్రోచిప్‌కీ దాని మెమొరీలో ఒక ఐడి(గుర్తింపు)నంబరు, తయారీదారు డిజిటల్‌ సంతకం తప్పనిసరిగా ఉంటాయి. దానిలోని సాఫ్ట్‌ వేర్‌కు సంబంధించినంతవరకు దాని పనితీరు విశ్లేషించే పరీక్షలు జరుగుతాయి. అందువల్ల వీటి స్థానంలో మరొకటి పెట్టవచ్చన్న ప్రశ్నే తలెత్తదు. మైక్రోచిప్‌ స్థానంలో మరొకటి పెట్టే ప్రయత్నం చేసినా, దాన్ని పసిగట్టగల వ్యవస్థ ఉంది. అది వెంటనే ఇ.వి.ఎం యంత్రాన్ని పనిచేయకుండా నిలిపేస్తుంది. అందువల్ల అంతర్గతం ఉన్న ప్రోగ్రాంను మార్చే ప్రయత్నం చేసినా లేదా మరో కొత్తదానిని ప్రవేశపెట్టే ప్రయత్నం చేసినా ఇ.వి.ఎంలు పనిచేయవు.

వీటిని భద్రపరిచే ప్రదేశాల్లో వీటిని దుర్వినియోగపరిచే అవకాశాలు ఏమేమి ఉంటాయి ?

జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ఇ.వి.ఎంలను తగిన భద్రతా ఏర్పాట్లమధ్య డబుల్‌ లాక్‌ పద్ధతిలో ఉంచుతారు. వీటి భద్రతను మధ్యమధ్యలో తనిఖీ చేస్తుంటారు. అధికారులు తనిఖీ సందర్భాల్లో స్ట్రాంగ్‌రూమ్‌ తలుపులు తెరవరు. దాని భద్రతకు చేసిన ఏర్పాట్లలో ఏవయనా లోపం జరిగిందా, పూర్తి భద్రతలోనే ఉన్నాయా, వేసిన తాళాలు వేసినప్పుడు ఎలా

ఉన్నాయో అలానే ఉన్నాయా… వంటి అంశాలను పరిశీలించి తగుచర్యలు తీసుకుంటారు. ఎటువంటి సందర్భంలో, ఏ సమయంలో కూడా అనధికార వ్యక్తులెవరికీ అవి అందుబాటులో ఉండవు. ఎన్నికలు జరగకుండా ఉన్న సమయాల్లో అన్ని ఇ.వి.ఎంలను సంవత్సరానికొకసారి జిల్లా ఎన్నికల అధికారులు(డిఇఓలు) ప్రతి యంత్రాన్ని పరీక్షించి రూపొందించిన నివేదికలను భారత ఎన్నికల సంఘానికి పంపుతారు. పరిశీలన, తనిఖీలు ఈ మధ్యనే

పూర్తయ్యాయి.

స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికలలో ఇ.వి.ఎంల టాంపరింగ్‌పై వచ్చే ఆరోపణల్లో వాస్తవం ఎంత ?

ఎన్నికల నిర్వహణ పరిధి విషయంలో తగిన సమాచారం లేకపోవడంతో ఇక్కడ ఒక దురవగాహన ఏర్పడుతున్నది. పురపాలకసంస్థలకు, గ్రామీణ సంస్థలకు పంచాయత్‌ ఎన్నికల వంటి వాటి విషయంలోఉపయోగించే ఇ.వి.ఎంలు భారత ఎన్నికల సంఘానికి చెందినవి కావు. స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌.ఇ.సి) పరిధిలోకి వస్తాయి. ఆ సంఘం దాని యంత్రాలను అదే సేకరించుకుంటుంది, వాటి నిర్వహణకు కూడా దాని యంత్రాంగం దానికుంటుంది. ఈ ఎన్నికలలో రాష్ట్ర ఎన్నికల అధికారులు ఉపయోగించే ఇ.వి.ఎం. యంత్రాల పనితీరుకు భారతఎన్నికల సంఘం (ఇ.సి.ఐ) బాధ్యత వహించదు.

ఇసిఐ-ఇ.వి.ఎం యంత్రాలలో హస్తలాఘవానికి గురయిన వాటిని మూడో కంటికి తెలియకుండా తిరిగి పోలింగ్‌ ప్రక్రియలో ప్రవేశపెట్టవచ్చా ?

అసలు ఆ ప్రశ్నే తలెత్తదు. ఇ.వి.ఎంలలో ఎటువంటి అక్రమాలుజరగకుండా ఇసిఐ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో పైన వివరించాం కదా. దాన్నిబట్టి తెలిసేదేమిటంటే..ఈ యంత్రాలమీద హస్తలాఘవం ప్రదర్శించడం సాధ్యంకాదు, అలాగే లోపభూయిష్టమైన వాటిని తిరిగి పోలింగ్‌ ప్రక్రియలో ఏ దశలో కూడా ప్రవేశపెట్టడం కూడా సాధ్యపడే పనికాదు. కారణం-ఇసిఐ-ఇవిఎం యంత్రాలలో లోపాలను పైన చెప్పిన పద్ధతుల్లో ముందుగానే పసిగట్టడం జరుగుతుంది కనుక. అదీగాక బియు కు, సియు కు లంకె కుదరదు కనుక. అందువల్ల అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్లు, రక్షణ చర్యల మధ్య ఇసిఐ-ఇవిఎం యంత్రాలు ఇసిఐను వదిలిపోలేవు. అలాగే ఇసిఐ-ఇవిఎం కాని యంత్రాలు ఇ.సి.ఐ వ్యవస్థలో ఇమడలేవు.

అమెరికా, ఐరోపా యూనియన్‌ వంటి అభివద్ధి చెందిన దేశాలు ఇ.వి.ఎంల పద్ధతులను ఎందుకు పాటించడంలేదు? మరి కొన్ని దేశాలు కూడా మధ్యలో వాటికి ఎందుకు స్వస్తి చెప్పాయి?

గతంలో కొన్ని దేశాలు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌తో ప్రయోగాలు చేశాయి. ఈ దేశాల్లోని యంత్రాలతో వచ్చిన సమస్య ఏమిటంటే- వాటిని కంప్యూటర్లతో నియంత్రించి నెట్‌వర్క్‌ తో అనుసంధానం చేసారు. దానితో హ్యాకింగ్‌కు అవకాశం ఏర్పడి అసలు ప్రయోజనమే ప్రమాదంలో పడింది. అదీగాక భద్రత, రక్షణకు సంబంధించిన చట్టాల్లోకూడా తగినన్ని భద్రతా చర్యలు తీసుకోవడానికి అవకాశం కల్పించలేదు. కొన్ని దేశాల్లోనయితే చట్టపరమైన ఈ కారణాలవల్ల ఇ.వి.ఎంల వాడకాన్ని న్యాయస్థానాలు తిరస్కరించాయి. కానీ భారతదేశంలో వాడుకలో ఉన్న ఇ.వి.ఎం వ్యవస్థ విలక్షణమైనది. అమెరికా, నెదర్లాండ్స్‌, ఐర్లాండ్‌, జర్మనీలలో నేరుగా రికార్డింగ్‌ చేసే యంత్రాలున్నాయి. పాక్షికంగానయినా భారతదేశం తనిఖీలకు కాగితం ఉపయోగించి ప్రయోగించి చూడడం ప్రారంభించింది. ఇతర దేశాలలో ఈ తనిఖీ ప్రయంత్నం లేదు. పైన చెప్పిన దేశాలన్నింటిలో పోలింగ్‌ సందర్భంగా సోర్స్‌ కోడ్‌ను క్లోజ్‌ చేస్తారు

ఇసిఐ, ఇ.వి.ఎంల విషయంలో ఇవి ఏ నెట్‌వర్క్‌ తోనూ అనుసంధానమయి ఉండవు. స్వతంత్రంగా ఉంటాయి. అందువల్ల భారత్‌లోని 14 లక్షలకు పైగా ఉన్న యంత్రాలలో ఏ ఒక్కదానినీ కూడా ఎవరూ టాంపర్‌ చేయలేరు. మనదేశంలో ఎన్నికల సందర్భంగా గతంలోజరిగిన హింసాత్మక సంఘటనల దష్ట్యాకానీ, రిగ్గింగ్‌, బూత్‌ల ఆక్రమణవంటి అక్రమాల దష్ట్యాకానీ ఇ.వి.ఎంలు మనదేశానికి సరిగ్గా సరిపోతాయి. జర్మనీ, నెదర్లాండ్స్‌, ఐర్లాండ్‌లవంటి దేశాలకు భిన్నంగా భారత చట్టాలు, ఎన్నికల సంఘం నియమ నిబంధనల్లో ఇ.వి.ఎంల భద్రత, రక్షణ అంతర్గతంగా పకడ్బందీగా ఉన్నాయి. భద్రత విషయంలో భారత ఇ.వి.ఎంలు సాంకేతికంగా సర్వోత్తమమైనవి. అదీగాక మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా ఓటర్లకు పారదర్శకంగా ఉండేటట్లు చేయడానికి ఈ ఇ.వి.ఎంలతోపాటూ వివిపిఏటిలను దశలవారీగా ప్రవేశపెట్ట బోతున్నాం. అప్పుడు దీని విశిష్ఠత మరింత పెరుగుతుంది. నెదర్లాండ్స్‌ విషయంలో యంత్రాల నిల్వ, రవాణా, భద్రతల విషయంలో నిబంధనలు స్పష్టంగాలేవు. నెదర్లాండ్స్‌ లో తయారయిన యంత్రాలనే ఐర్లాండ్‌, జర్మనీల్లో వాడుతున్నారు. ఓటింగ్‌ యంత్రం తాలూకు ఆర్డినెన్స్‌ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని 2005లో జర్మన్‌ కోర్టు అభిప్రాయపడింది.మౌలిక చట్టం, ఎన్నికల నిర్వహణతాలూకు విశేషాధికారాలను అది ధిక్కరించేటట్లు ఉందన్న కారణంతో ఆ అభిప్రాయానికొచ్చింది. అందువల్ల నెదర్లాండ్స్‌ లో తయారయిన యంత్రాల వాడకాన్ని ఈ దేశాలు నిలిపేసాయి. ఈరోజుకి కూడా అమెరికా తో సహా చాలా దేశాలు ఓటింగ్‌ కు యంత్రాలను వాడుతున్నాయి. అయితే విదేశాల్లో వాడే ఓటింగ్‌ యంత్రాలకు, దాని తాలూకు ప్రక్రియకు అలాగే మనం వాడే ఇసిఐ-ఇ.వి.ఎంలకు మౌలికంగా చాలా తేడా ఉంది. ఎక్కడయినా సరే, కంప్యూటర్‌ నియంత్రణలో, ఓఎస్‌(ఆపరేటింగ్‌ సిస్టమ్‌) ఆధారిత యంత్రాల్లో తప్పులు దొర్లుతూనే ఉంటాయి. వాటిని మన ఇసిఐ-ఇ.వి.ఎంలతో పోల్చలేం.

Other Updates