tsmagazine
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, విభజన తప్పనిసరి అన్నప్పుడు,ప్రధాన సమస్య హైదరాబాద్‌ అయ్యింది. కారణం, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం సమకూరేది రాజధాని హైదరాబాద్‌ నగరం నుండే కాబట్టి. మొత్తానికి ఆ చిక్కు సమస్య వీడిపోయి చివరకు రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడక ముందు ఎందరెందరో వెళ్ళగక్కిన దురభిప్రాయాలన్నింటిని, పటాపంచలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం ముందుకు దూసుకుపోతున్నది.

ఉమ్మడి రాష్ట్రం వున్నప్పుడు తెలంగాణ ప్రాంత నిధులను కూడా ఇతర ప్రాంతాల అభివృద్ధికి ఉపోయోగించేవారు. అయితే స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత వున్న నిధులన్నింటిని స్వరాష్ట్ర అభివృద్ధికే వినియోగించాడంతోపాటు,రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయ వనరులను పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించింది ప్రభుత్వం. కేవలం పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని మాత్రమే పెంచుకోవడం కాకుండా,పన్నేతర ఆదాయాలను పెంపొందించు కోవడంపై దృష్టి పెట్టింది.ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను నిర్దేశించుకొని, భవిష్యత్తులో కూడా అది నిర్వీర్యం కాకుండా వుండే విధంగా, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు పర్యవేక్షణలో ఒక పకడ్భందీ వ్యవస్థను రూపొందించింది ప్రభుత్వం. అలా రూపొందించిన అనేక అంశాల్లో ఇసుక తరలింపు అనేది అత్యంత ప్రధానమైన అంశంగా పరిగణించింది.

‘ఇసుక’ ఇది అందరికీ అవసరమైన ప్రధాన వనరు.ఈ రోజుల్లో స్వచ్ఛ భారత్‌లో భాగంగా నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణం నుంచి మహా మహోన్నత ప్రాజెక్టైన కాళేశ్వరం నిర్మాణానికి కావలసిన అసలు సిసలు వనరు ఇసుక. ఇంతటి ఉపయోగకరమైన ఇసుక రవాణా లావాదేవీలలో అన్యాయం,అవినీతి అనేది ప్రతి ఇసుక రేణువుకూ అంటుకున్నది. ఫలితంగా ఇసుక మాఫియా విచ్చలవిడిగా విస్తరించింది. ప్రభుత్వాదాయానికి గండి కొట్టడమే కాకుండా,వినియోగదారుడి నోట్లో మట్టికొట్టే స్థాయికి చేరుకున్నది. ఈ విధంగా వేల్లూనుకొనిపోయిన వ్యవస్థ దురవస్థకు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిపూర్ణంగా, పకడ్భందీగా వినియోగించుకొని కాయకల్ప చికిత్స చేసి సరిదిద్దడంలో సఫలమయ్యింది ప్రభుత్వం.

ఉమ్మడి రాష్ట్రం వున్నప్పుడు 2007 – 14 వరకు ఏడేండ్ల కాలంలో, ఇసుక పంపిణీ ద్వారా ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం ఇంచుమించుగా కేవలం 40 కోట్ల రూపాయలు మాత్రమే. అధికంగా ఆదాయం సమకూరవలసిన ఇసుక పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి అందరికీ అందుబాటు ధరల్లో ఇసుక అందేవిధంగా వుండాలనే లక్ష్యంతో గనుల శాఖా మంత్రి కే.టి. రామారావు దిశానిర్దేశం చేసి,టి.ఎస్‌.యం.డి.సి. ఛైర్మన్‌ సేరి సుభాష్‌ రెడ్డి, యం.డి. డా.జి.మల్సూర్‌ ల సహకారంతో ఎస్‌.ఎస్‌.యం.యం.ఎస్‌ (సాండ్‌ సేల్స్‌ మానిటరింగ్‌ అండ్‌ మేనేజ్మెంట్‌ సిస్టం) అనే పోర్టల్‌ ను రూపొందించారు. దీనితో ఇసుక పంపిణీ సరళతరం అవడంతోపాటు,ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం సమకూరుతున్నది.

ఈ పోర్టల్‌ ద్వారా ఇసుక వనరుల అన్వేషణ దగ్గరి నుండి అందులో జరుగుతున్న దోపిడిని అరికట్టడం వరకు అన్ని స్థాయిలలో పకడ్భందీగా పారదర్శకంగా వుండే విధంగా ఎస్‌.ఎస్‌.యం.యం.ఎస్‌ పోర్టల్‌ ను తీర్చిదిద్దారు. ఈ పోర్టల్‌ తో పాటు రెవిన్యూ, అర్‌.టి.వో, పోలీస్‌, చెక్‌పోస్ట్‌లను అనుసంధానపరుస్తూ, పూర్తి పారదర్శకంగా వుండే విధంగా ఇసుక పంపిణీ విధానాన్ని రూపొందించడం జరిగింది.

పటిష్టమైన చర్యలు చేపట్టడం మూలంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా, ఇసుక కొరత గానీ,ఇసుక పేరుతో దోపిడీ గానీ జరగడం లేదు. గతంలో ఒక క్యూబిక్‌ మీటర్‌ ఇసుక ధరను ఇసుకను సేకరించేవారు,రవాణా చేసే ప్రైవేటు పార్టీలే నిర్ధారించేవి. కానీ సంస్కరణల తర్వాత, రూపొందించిన ఎస్‌.ఎస్‌.యం.యం.ఎస్‌ పోర్టల్‌ ద్వారా ప్రభుత్వమే ఒక క్యూబిక్‌ మీటర్‌ (ఒక లారీ లోడ్‌ లో 13.5 క్యూబిక్‌ మీటర్ల ఇసుక వుంటుంది) ఇసుకకు గరిష్టంగా 600 రూపాయలుగా నిర్ధారించింది.

గతంలో కూడా లారీల యజమానులకు వే బిల్‌ బుక్కులను జారీ చేసేవారు. అయితే వాళ్లకిచ్చిన ఒక బుక్కు నంబర్లతో మరో 4,5 పుస్తకాలను ముద్రించుకొని ఇసుక రవాణాను కొనసాగించే అవకాశం వుండేది.కానీ ఇపుడు వే బిల్‌ నంబర్లను కూడా ఆన్‌ లైన్‌ లోనే జారీ చేస్తున్నారు. తద్వారా ఎటువంటి అవకతవకలు జరగడానికి ఆస్కారం లేకుండా చేశారు. ఫలితంగా ఒకసారి ఒక వే బిల్‌ నంబర్‌ ఆన్‌ లైన్‌ లో నమోదయ్యిందంటే ఆ నంబర్‌ వే బిల్‌ తో మరో లారీని తీసుకుపోయే వీలు లేదు.

ఇపుడు ఇసుక అవసరం వున్న వారెవరైనా తమ పేరు, స్టాక్‌ యార్డ్‌ పేరు, ఏ ప్రదేశానికి, ఏ రోజు ఇసుక తీసుకునిపోవాలో ఆ ప్రదేశం, ఇసుకను తీసుకోనిపోయే లారీ నంబర్‌,ఛాసిస్‌ నంబర్‌ తో సహా, ఆ లారీ ఏ ఏ మార్గాల ద్వారా వెళ్తుందో అనే వివరాలు పేర్కొంటూ ముందుగా రిజిస్టర్‌ చేసుకోవాలి. ఇలా నమోదు చేసుకున్న తరువాత, స్టాక్‌ యార్డ్‌ దగ్గరి నుండి ఇసుక తీసుకుని బయలుదేరిన లారీ, ఇసుకను అన్‌ లోడ్‌ చేసేవరకు అంతా కూడా రెవిన్యూ, అర్‌.టి.వో, పోలీస్‌, చెక్‌ పోస్ట్‌, గనులశాఖ విజిలెన్స్‌ ల పర్యవేక్షణలో సాగుతుంది. ఒకవేళ ఏదైనా వాహనం లోపాయికారిగా వ్యవహరించినా, అది కచ్చితంగా బయట పడుతుంది. కారణం,లారీ వెళ్ళే ప్రతి మజిలీ దగ్గర ఆన్‌ లైన్‌ లో వివరాలు నమోదవుతాయి. తప్పుడు పనిచేసి పట్టుబడిన లారీ యజమానికి యాభై నుండి లక్ష రూపాయల దాకా జరిమానా విధిస్తారు. ఆ వ్యవహారం కూడా ఒకటి రెండు సార్ల కంటే మించితే లారీని శాశ్వతంగా సీజ్‌ చేస్తారు.
tsmagazine

ఇలా ప్రతి చోటా పకడ్భందీ చర్యలు చేపట్టడం మూలంగా, ఇపుడు ఇసుక పంపిణీ ద్వారా, కేవలం ఒకరోజు ఆదాయం రెండు కోట్ల రూపాయలు దాటుతున్నది. ఇక 2014 – 15 ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటివరకు (2018) ఇసుక ద్వారానే 1500 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూ రింది.అంతేకాకుండా ఎక్కడా పర్యావరణ సమస్యలు తలెత్తకుండా, ప్రజలకు అవసరమైనంత ఇసుక అందుబాటు ధరల్లోనే లభిస్తుంది. ఇది ఒక విజయమయితే, మరోవైపు ఐ.టి.డి.ఎ ఆధ్వర్యంలో ూజుూూ యాక్ట్‌ను అనుసరించి స్థానిక గిరిజనులకు కూడా భాగస్వామ్యం కల్పించారు. వీరందరూ ప్రస్తుతం 30-31 సొసైటీలుగా ఏర్పడ్డారు.ఈ సొసైటీలకు ఒక క్యూబిక్‌ మీటర్‌ ఇసుకకు 220 రూపాయల చొప్పున చెల్లించడం జరుగుతున్నది. ఇప్పటివరకు దాదాపు 40 కోట్ల రూపాయలు సొసైటీలకు చెల్లించడం జరిగింది. ఫలితంగా దాదాపు 7000 కు పై చిలుకు గిరిజన కుటుంబాలకు ఆదాయం సమకూరుతున్నది.

ఇసుక సేకరణ దగ్గరి నుండి సరఫరా వరకు అంతటా కూడా పారదర్శకంగా ఎస్‌.ఎస్‌.యం.యం.ఎస్‌ పోర్టల్‌ ను నిర్వహిస్తున్న టి.ఎస్‌.యం.డి.సి.అధికార యంత్రాంగం పనితీరుకు సర్వత్రా హర్షామోదాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మనదేశం లోని ఏడెనిమిది రాష్ట్రాల అధికారగణాలు వచ్చి తెలంగాణ ప్రభుత్వ ఇసుక పాలసీని క్షుణ్ణంగా అధ్యయనం చేసి తమ రాష్ట్రంలో అమలు చేయడానికి ఉద్యుక్తులవుతున్నారు.

ఇసుక ఆదాయాన్ని ఇనుమడింపజేసిన ఖనిజాభివృద్ధి శాఖ,ఇపుడు మరిన్ని వనరుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నంలో వున్నది. అందులో ప్రధానంగా లైం స్టోన్‌, రోడ్‌ మెటల్‌, బ్లాక్‌ గ్రానైట్‌,వూటుకూరు మార్బల్‌ లాంటి వాటిపై అధ్యయనం చేస్తున్నది. రాబోయే రోజుల్లో ఖనిజాభివృద్ధి శాఖ, ధనాభివృద్ధి శాఖగా మార్పు చెందే దిశగా అడుగులు వేయబోతున్నది అని అనడంలో అతిశ యోక్తి లేదేమో అనిపిస్తున్నది.

Other Updates