కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు
కొత్త పోలీస్ కమీషనరేట్లు, సబ్ డివిజన్లు, సర్కిళ్లు, పోలీస్ స్టేషన్లు
ప్రభుత్వ శాఖల పునర్వ్యవస్థీకరణ
ప్రతీ జిల్లాలో 40 ప్రభుత్వ కార్యాలయాలు
జోనల్ వ్యవస్థ రద్దు – జిల్లా, స్టేట్ పోస్టులే
స్థానిక వనరుల గుర్తింపు, సమర్థ వినియోగం
పోలీస్ స్టేషన్లు, తహసీల్ కార్యాలయాల్లో తెలంగాణ రికార్డు
పేదరిక నిర్మూలనే అంతిమ ఆశయం
గటిక విజయ్ కుమార్
కేసీఆర్ ఆలోచిస్తున్న తీరు కూడా 1930 ప్రాంతంలో అంబేద్కర్ లాగానే ఉన్నది. 1930లో లండన్ వేదికగా జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలోనే అంబేద్కర్ తన వాదన వినిపిస్తూ భారతదేశానికి స్వాతంత్య్రం రావాలని పట్టుపడుతూనే, అది రాజకీయ అధికారం మార్పుగా కాకుండా, దేశంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ అవకాశాలు ఇచ్చేదిగా ఉండాలని డిమాండ్ పెట్టారు. ప్రపంచంలోని మిగతా దేశాలు వేరు, భారతదేశం వేరు అని ప్రకటించారు. ఈ దేశ సామాజిక పరిస్థితులను బట్టే ఈ దేశం గురించి ఆలోచించాలని అన్నారు. అందుకే అంబేద్కర్ ఏం చెప్పినా, ఏం చేసినా ఈ దేశ అవసరాలకు అతికినట్లున్నది. కాబట్టే నేటికీ అంబేద్కర్ భారత సమాజానికి ఓ మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు.
కేసీఆర్ కూడా ఉద్యమ సమయం నుంచి తెలంగాణ పట్ల సంపూర్ణ, సమగ్ర అవగాహన కలిగి ఉన్నారు. తెలంగాణ కోసం పోరాడుకుంటూనే, వచ్చే రాష్ట్రాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలనే విషయంలో స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. తన ఆలోచనలకు ప్రతిరూపమే 2014 ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మానిఫెస్టో. ఆ ఎన్నికల ప్రణాళికలో వెలువరించిన ఆలోచనలనే అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్నారు. కేవలం ఆరు దశాబ్దాల సమైక్య పాలనలోనే కాదు, దాదాపు వందేళ్ల పాటు గోసపడ్డ తెలంగాణను దరికి చేర్చే క్రతువు ప్రారంభించారు. ఇక్కడ సామాజిక, ఆర్థిక, భౌగోళిక, రాజకీయ స్థితిగతులను పూర్తిగా అవగతం చేసుకుని ఒక్కో అడుగు వేస్తున్నారు. ఒక్కో పథకాన్ని తెస్తున్నారు. వీటి వల్ల వర్తమానంలో ఉపయోగంతోపాటు బంగారు భవిష్యత్తుకు బాటలు పడుతున్నాయి. తాను వేసిన పునాది మీద అద్భుతమైన తెలంగాణ నిర్మాణం జరుగుతుందని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు.
ఇప్పుడు తెలంగాణలో పరిపాలనా విభాగాల పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నది. కొత్త జిల్లాల ఏర్పాటు అని మామూలుగా చెప్పే ప్రయత్నం కాదిది. అతిపెద్ద పరిపాలనా సంస్కరణ. కొత్త జిల్లాలు ఏర్పడడమే కాదు. పాలనను ప్రజల ముందటికి తేవడానికి కొత్త డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పడుతున్నాయి. పాలన ప్రజల ముంగిట ఉండడం వల్ల, చిన్న పాలనా విభాగాల వల్ల అవినీతిని తగ్గించవచ్చని, పనుల అమలు, పర్యవేక్షణ సులువవుతుందని కూడా కేసీఆర్ నమ్ముతున్నారు.
కెజి టు పిజి విద్యా విధానమైనా, మిషన్ కాకతీయ అయినా, మిషన్ భగీరథ అయినా, ప్రాజెక్టుల నిర్మాణమైనా, హరితహారం అయినా, పాలనా సంస్కరణ అయినా … ఇవన్నీ ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చే అవసరాల మేరకు మాత్రమే జరగడం లేదు. రాబోయే 40 ఏండ్ల వరకు తెలంగాణ అవసరాలకు తగినట్లుగా జరుగుతున్నది. వచ్చే 30-40 ఏండ్ల వరకు పెరిగే జనాభాను అంచనా వేసి తీర్చిదిద్దుతున్నవి. శాశ్వత ప్రాతిపదికన జరుగుతున్న పనులివి. కాబట్టి కేసీఆర్ తలపెట్టిన ఈ క్రతువు రేపటి తెలంగాణ భవిష్యత్ కోసం.
ప్రతీ కుటుంబాన్నీ పట్టించుకునేందుకే…
జిల్లాల పునర్విభజన ఆషామాషీగా, తమాషాగా చేసిన పని కాదు. తెలంగాణ సామాజిక, ఆర్థిక, భౌగోళిక స్థితిగతులను పూర్తిగా అవగతం చేసుకున్న తర్వాత అత్యవసరం అని భావించి చేసిన క్రతువు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పేదల అభ్యున్నతి కోసమని, దేశ ప్రగతికోసమని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. కానీ దేశంలో ఇంకా పేదరికం పోలేదు. ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా అసలు లబ్ధిదారుల దరిచేరకముందే బ్రోకర్లు అందుకుంటున్నారు. నిజమైన పేదలకు న్యాయం జరగడం లేదు. ఇంత పెద్ద దేశంలో, పెద్ద పెద్ద పరిపాలనా విభాగాలు ఉండడం వల్ల పథకాల పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో ఎలా జరగుతున్నదో తెలుసుకోవడం కష్టమవుతున్నది. తెలంగాణలో మొన్నటి వరకు మూడున్నర కోట్ల మంది జనాభాకు పది జిల్లాలున్నాయి. అంటే ఒక్కో జిల్లాకు సగటున 35లక్షల మందికి పైగానే జనాభా ఉంది. ఒక్కో కలెక్టర్ పరిధిలో పది లక్షల కుటుంబాలన్నమాట. అదే ఇప్పుడు తెలంగాణలో 31 జిల్లాలయ్యాయి. అంటే సగటును ఒక్కో కలెక్టర్ పరిధిలో మూడు లక్షల కుటుంబాలు మాత్రమే ఉంటాయి. దీంతో ప్రతీ కుటుంబాన్ని కలెక్టర్ స్వయంగా పట్టించుకునే వెసులుబాటుంటుంది. ప్రతీ జిల్లాలో సగటున పధ్నాలుగు మండలాలున్నాయి. అంటే కలెక్టర్ మండలాల వారీగా ప్రతీ రోజు పరిస్థితిని రివ్యూ చేసే వెసులుబాటుంటుంది. అభివద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా? లేదా? అనే విషయాన్ని అధికార యంత్రాంగం నేరుగా పర్యవేక్షించవచ్చు. ప్రజలు కూడా తమ సాధకబాధకాలు నేరుగా కలెక్టర్ స్థాయి అధికారికి చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024 నాటికి 5లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. అప్పటికి నీటి పారుదల రంగంతో పాటు ఇతర మేజర్ పెట్టుబడులు కూడా పూర్తవుతాయి. తెలంగాణకు వచ్చిన సంపద అంతా పేదరికంపై యుద్ధం చేయడానికి వినియోగించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు. పేదరిక నిర్మూలన కోసం పెట్టే ఖర్చు మధ్య దళారులు మింగేయ కుండా సమర్థంగా అమలు కావాలంటే చిన్న పాలనా విభాగాలుండాలని కేసీఆర్ భావిస్తున్నారు.
అభివృ ద్ధి కేంద్రాల విస్తరణ..
ఓ పట్టణం జిల్లా కేంద్రంగా మారడం వల్ల అది మరో అభివృద్ధి కేంద్రంగా మారుతుంది. ప్రజలకు జిల్లా రాజధాని పెద్దపీట వేశారు. ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి లాంటి పథకాలు ఈ కోవలోకే వస్తాయి. ఇక నిమ్న వర్గాల భవిష్యత్ చదువుతోనే ముడి పడి ఉందని గ్రహించిన కేసీఆర్ కెజి టు పిజి విద్యావిధానాన్ని ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల కోసం దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తున్నారు. ఈ వర్గాల ప్రజలు బాగా చదువుకుని బాగుపడితే వచ్చే సామాజిక మార్పు, మరే సంక్షేమ పథకం వల్ల రాదు. డాక్టర్ అంబేద్కర్ కూడా అణగారిన వర్గాలు బాగా చదువుకుని పైకి వస్తేనే సమాజం వారిని చూసే చూపులో తేడా వస్తుందని భావించారు. కింది స్థాయిలో ఎన్నికలతో సంబంధం లేకుండా జరిగే మార్కెట్ కమిటీ నియామకాల్లో కూడా రిజర్వేషన్లు పెట్టడం వల్ల కింది కులాల నుంచి కొత్త నాయకులను పుట్టిస్తున్నారు. ఓ పది పదిహేనేళ్ల తర్వాత ఈ గురుకుల పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఎదిగి వస్తారు. ఇప్పుడు మార్కెట్ పదవులు పొందిన వారు భవిష్యత్తులో నాయకులవుతారు. అప్పుడు తెలుస్తుంది కేసీఆర్ ఎందుకు ఈ ఆలోచన చేశారో. వ్యవసాయం మీద ఆధారపడే రైతులకు సాగునీరు అందివ్వడమే ప్రధానమని గ్రహించిన కేసీఆర్ తెలంగాణలో కోటి ఎకరాలకు నీరివ్వడానికి ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరిస్తున్నారు. వీటి ఫలితాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయి. మరో నాలుగేళ్లకు సంపూర్ణంగా అందుతాయి. అప్పుడు తెలంగాణ సిరులు పండించే బంగారు భూమి అవుతుంది. రైతుల జీవితాల్లో మార్పు వస్తుంది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందడం వల్ల ఆరోగ్యవంతమైన తెలంగాణ ఆవిష్కరణ జరుగుతుంది.
అంబేడ్కర్ మన మధ్య లేకుండా పోయి ఆరు దశాబ్దాలు గడిచినా ఇంకా ఆయనతో భారతసమాజం అనుబంధం విడిపోలేదు. భవిష్యత్తులో మరింత బలపడుతుందే తప్ప విడిపోయే అవకాశం కూడా లేదు. తెలంగాణ విషయంలో కూడా కేసీఆర్ అంతే. తెలంగాణను తెచ్చిన నాయకుడిగానే కాదు. బంగారు తెలంగాణకు బలమైన పునాదులు వేసిన దార్శనికుడిగా మిగిలిపోతారు. భావి తరాల గురించి ఆలోచించిన మహనీయుడిగా రేపటి పౌరులు కీర్తిస్తారు. అంబేడ్కర్ చూపిన మార్గాన్ని ఆనాడు గాంధీ, నెహ్రూ లాంటి వారు కూడా వ్యతిరేకించారు. కానీ చివరికి అంబేద్కర్ మార్గమే అందరికీ అనుసరణీయమైంది. ఇప్పుడు కేసీఆర్ పై రాజకీయ విమర్శలు చేసిన వారు కూడా చివరికి ఆయనే కరెక్టు అనుకునే పరిస్థితులు వచ్చాయి. వస్తాయి.