venkateswrluవై. వెంకటేశ్వర్లు

ఒకవైపు అతివృష్టి, అనావృష్టి.. వడగండ్ల వానలు.. అకాల వర్షాలు.. అన్ని పరిస్థితులను తట్టుకుని ఆరు గాలం కష్టపడి పెట్టుబడులు పెట్టి పంటలు సమృద్ధిగా పండిస్తే.. స్థానిక వ్యాపారుల సిండికేట్‌తో సరైన ధరలు రాక, అయిన కాడికి అమ్ముకోవల్సిన పరిస్థితే.. ఇది మన రైతులకు నిత్యనూతనం.

మరోవైపు ఆహార ఉత్పత్తులు సమృద్ధిగా ఉన్నప్పటికి.. సరైన మార్కెటింగ్‌ వ్యవస్థ లేనందున, అవసరమైన ప్రాంతాలకు అవి చేరక, అర్థాకలితో అలమటిస్తున్న కోట్లాది మంది ప్రజలు.

ఆహార పదార్థాల ఉత్పత్తి డిమాండ్‌ సరఫరాల మధ్య నెలకొన్న అంతరాలను అధిగమించేందుకు రూపొందించిన జాతీయ వ్యవసాయ మార్కెట్‌ (నామ్) వ్యవస్థకు ఏప్రిల్‌ 14న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ 125వ జయంతిని పురస్కరించుకొని మధ్యప్రదేశ్‌లోని మౌపు నుండి జాతీయ వ్యవసాయ మార్కెట్ (నామ్) ఈ-పోర్టల్ ద్వారా ఎనిమిది రాషాల్ట్రకు చెందిన 21 మార్కెట్లను ఈ-ట్రేడింగ్‌కు అనుసంధానం చేశారు. ఈ-ట్రేడింగ్‌ సిస్టంతో దేశంలో ఎక్కడి నుంచైనా దేశంలోని ఏ మార్కెట్‌లో వున్న సరుకునైనా ఈ బిడ్డింగ్‌ ద్వారా కొనుగోలు చేసే వెసులుబాటు వ్యాపారులకు కలుగుతుంది. రైతులు తమకు నచ్చిన ధరకు దేశంలోని ఏ మార్కెట్‌లోనైనా వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించవచ్చు. వ్యాపారుల మధ్య పోటీ పెరిగి రైతులకు లబ్ధి చేూరుతుంది. క్రయ విక్రయాలలో అంచెలు తగ్గుటవలన అటు వ్యాపారులకు, ఇటు రైతులకు లాభం కలుగుతుంది.

ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా రైతుల ఖాతాలలో సొమ్ము జమ అవుతుంది. దీనితో మధ్య దళారీల ప్రమేయం తొలగి, రైతులు భరించే అనవసర వ్యయాలు కూడా తగ్గుతాయి. పంటలు ఎక్కువగా పండిన ప్రాంతాల మార్కెట్ల నుండి దేశంలో డిమాండ్‌ వున్న ఇతర రాష్ట్రాలకు ఈ-ట్రేడింగ్‌లో గిట్టుబాటు ధరకు రైతులు నేరుగా అమ్ముకునే వెసులుబాటు లభిస్తుంది. జాతీయ వ్యవసాయ మార్కెట్‌ (నామ్) ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, వ్యవసాయం రంగ అభివృద్ధికి ఈ-ట్రేడింగ్‌ ఒక మైలురాయని పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగమును ప్రభుత్వం ప్రోత్స హిస్తుందని, ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు వ్యర్థం కాకుండా నిరోధించేందుకు ప్యాకేజింగ్, అదనపు విలువను చేకూర్చే ఉత్పత్తుల తయారికి ఇది దోహదపడుతుందన్నారు.

ఆహారఉత్పత్తుల వినియోగాన్ని పెంచడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. దశల వారిగా 2018 మార్చి నాటికి దేశంలోని 585 మార్కెట్లను ఈ-ట్రేడింగ్‌ పరిధిలోని తేనున్నట్లు చెప్పారు. ఆహార ఉత్పత్తులు డిమాండ్‌ సరఫరాల మధ్య సమతుల్యతను సాధించి రైతుకు వినియోగదారుకు న్యాయం చేసేందుకు ఈ-ట్రేడింగ్‌లో జరిగే క్రయవిక్రయాలను ఈ- పోర్టర్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్‌ చేస్తుందని ప్రధానమంత్రి తెలిపారు.

వ్యవసాయ మార్కెట్‌ రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరతీసిన ఈ-ట్రేడింగ్‌ ప్రక్రియను రాష్ట్ర నీటి పారుదల, మార్కెటింగ్‌ శాఖా మంత్రి టి.హరీశ్‌రావు నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు వచ్చి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ చైర్మెన్ డి.రాజు, పార్లమెంటు సభ్యులు కవిత, బీబీ పాటిల్‌, శాసన మండలి సభ్యులు పి.జి.గౌడ్‌, డా|| భూపతి రెడ్డి, శాసనసభ్యులు బి.గణేష్‌ గుప్తా, వి.ప్రశాంత్‌రెడ్డి, ఎ.జీవన్‌ రెడ్డి, రాష్ట్ర మార్కెటింగ్‌, వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డా|| ఎ.శరత్‌, జిల్లా కలెక్టర్‌ డా|| యోగితా రాణాలతో కలిసి భారీ స్క్రీన్‌ల ద్వారా ఆన్‌లైన్‌ ప్రసారమైన ఈ-ట్రేడింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వీక్షించారు.

రాష్ట్రం నుంచి 44 మార్కెట్లు 
ఈ సందర్భంగా మంత్రి టి.హరీష్‌ రావు రైతులనుద్దేశించి మాట్లాడుతూ, మొదటి దశలో దేశ వ్యాప్తంగా (244) మార్కెట్లను అనుసంధానం చేస్తుంటే, అందులో తెలంగాణ నుండి 44 మార్కెట్లు ఉన్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి 21 మార్కెట్లను ఈ-ట్రేడింగ్‌ పరిధిలోకి తెస్తే, అందులో 5 తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని తెలిపారు. మన రాష్ట్రంలో 1. నిజామాబాద్‌ పసుపు, 2. తిరుమలగిరి (నల్లగొండ)- వరి, 3. వరంగల్‌ మొక్కజొన్న, 4. మలక్‌పేట (హైదరాబాద్‌)-మిర్చి, 5. బాగేపల్లి, (మహబూబ్‌నగర్‌)- వరి పంటలను జాతీయ మార్కెట్లలో ఈ-ట్రేడింగ్‌ చేసినట్లు మంత్రి తెలిపారు. సెప్టెంబరులోపు 44 మార్కెట్లను అనుసంధానం చేసేందుకు పనులు చేపట్టినట్లు మంత్రి హరీష్‌ రావు తెలిపారు.

ఈ-ట్రేడింగ్‌తో పోటీ పెరిగి పంటలకు మంచి ధరలు లభిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో 60 ఏళ్ల ఆంధ్రపాలకుల కాలంలో నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంగల గోడౌన్లు నిర్మిస్తే, తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లలోపే రూ.1024 కోట్లతో 16 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోడౌన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్‌ మార్కెట్‌లో మహిళా రైతుల విశ్రాంతి గృహం నిర్మించామని, మార్కెట్‌ యార్డుల ఛైర్మన్‌ పోస్టులలో ఎస్సీ, ఎస్టీ, బిసిలతో పాటు మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమదేనని చెప్పారు. రూ.285 కోట్లతో మార్కెట్‌ యార్డుల ఆధునీకరణ పనులు చేపట్టామని, మార్కెట్లలో కోల్డ్‌ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతులకు మెరుగైన ధరలు కల్పించడమే ప్రభుత్వ సంకల్పమని, రైతుబంధు పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ రైతుల పంటలకు కనీస మద్దతు ధర, రైతుల వారిగా పంట నష్ట పరిహారం చెల్లించేందుకు స్వామినాథన్‌ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినప్పుడే అప్పుల బాధ నుండి రైతులకు విముక్తి కలుగుతుందన్నారు.

Other Updates