ఈ దేశ గ్రామాలు ఆయా రాష్ట్ర భాషల్లోని
రాశికెక్కిన మాటలకు తెరిచిన కోటగుమ్మాలు. ఆ గుమ్మాలనుండి లోనికి వెళితే అమ్మభాషల్లో వున్న గుమ్మపాల కమ్మదనం తెలిసివస్తుంది. అమ్మభాషల్లోకి ఎన్నెన్ని అన్యభాషల పదాలు ప్రవహించినా మాతృ భాషల మాధుర్యమే వేరు. ఇతర భాషలనుంచి కొన్ని పదాలు మన భాషావసరాల పరిపూర్తి కొరకు వచ్చి చేరుతాయి. మరికొన్ని పదాలు ఆధిపత్య ధోరణితో అమ్మభాషలోకి చేరిపోతాయి. సంస్కృతము, ఉర్దూ, పార్శీ మొదలైన భాషలు ఆయా కాలఘట్టాల్లో అధికార భాషలుగా, రాజభాషలుగా ఈ దేశంలోని స్థానిక భాషలపై పెత్తనం చలాయించాయి. అయినా సామాన్య ప్రజల భాషా వ్యవహారాల్లో ఈ పొరుగుభాషల ప్రమేయం తక్కువే! పల్లె ప్రజలు తమ దైనందిన సంభాషణల్లో అత్యధిక భాగం మాతృభాషా పదాలనే వాడుతారు. అట్లాంటి వ్యవహారం ఆ పల్లీయులు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అనే విషయం మనకు తెలియదు. సాధారణంగా పరంపరాగతంగా వాళ్ళకు సంక్రమించిన మాతృభాషా పదజాలమే వాళ్ళ భాషావసరాలను దాదాపు తీర్చుతుంది.
తెలుగు భాషలో చేరిపోయిన సంస్కృతపదాలు లెక్కకుమిక్కిలి. అట్లాగే ప్రాకృతము, ఆంగ్లము, ఉర్దూ, ఫారసీ, తమిళం, కన్నడము మొదలైన భాషాపదాలు తెలుగులో కలిసిపోయాయి. అయినప్పటికీ తెలుగుతనం తొణికిసలాడుతున్న పదాలకు కొదువలేదు. ఆ అమ్మతనమంతా దేశిశబ్దాల్లో గోచరిస్తుంది. తెలంగాణ తెలుగులో ఎంతో తెలుగుతనం వుంది. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లాలో ”వాడె దీసుడు” అనే మాట వుంది. అక్కడ చెరకు పంట అధికం. ఆ చెరకునుండి బెల్లం వండేటప్పుడూ లేదా చక్కెర ఫ్యాక్టరీకి పంపేటప్పుడూ చెరకుగడ లకున్న ఆకులు తీసివేయాలి. చెరుకుకట్టెల మీద వుండే పువ్వును కూడా కోసివేయాలి. కూలీలు కొడ వళ్ళు పట్టుకొని చెరుకుతోటలో చేరి ఆ గడలమీద వున్న పత్రాదుల్ని కొట్టే స్తారు. ఇదే ”వాడెదీసుడు”. మరి ”వాడె” అంటే ఏమిటి? చెరుకు చివర అని అర్థం. చెరకుగడల చివరల్లో వున్న పూతనీ దాంతోపాటు ఆకును తీసివేయడం వాడెదీసుడు. అప్పటికే చాలా ఆకులు ఎండిపోయి రాలిపో తాయి. ఒకటీ అరా మిగిలితే ఇక్ష్వాగ్రంతోపాటు తీసిపారేస్తారు కూలీలు.
”వామనగాయ” అనే పదానికి ”ఊరగాయకు ఉపయుక్తమైన ఒక దినుసుకాయ అని శబ్దరత్నాకరం. గుంటూరు పరిసర ప్రాంతాల్లో లేత చింతకాయల్ని వానగాయలు అని అంటారు. బహుశ: ఇవే వామనగాయలు అయివుంటాయి వర్ణలోపంతో. ఎందుకంటె పిల్లలు ఆడుకునే వామనగుంతల్లో చింతగింజల్నే ఆటకు ఉపయోగిస్తారు. తెలంగాణలో ఈ వానగాయల్ని ఓనగాయలుగా వ్యవహరిస్తారు. వినాయకచవితి రోజున చాలామంది ఓనగాయ తొక్కు చేసుకొని తింటారు. అంతేగాక ఆ విఘ్నేశ్వరుడి ముందు పెట్టే పెసర, బబ్బెర మొదలైన కాయలతోపాటు ఓనగాయల్నీ చేరుస్తారు.
”అరేయ్! నిన్ను వారుకట్టె తోని చంపుత. నోరు ముయ్యి”వంటి దబాయింపు వాక్యాల్లోని ”వారు” యింపైన తెలుగు పదం. ఇక్కడ చంపడం అంటే కొట్టడం. మరి ”వారు” అనగానేమి? అది శకటరేఫంతో నిఘంటువుల్లో కలదు. దానికి అర్థం ”సన్నగా కోసిన తోలు”. చర్మాన్ని సన్నగా కోసి దాన్ని కర్ర చివర కడతారు. కొట్టేటప్పుడు కర్ర చివర వారు విచ్చుకొని ఎదుటివారికీ లేదా పశువులకీ దెబ్బల్ని కల్గిస్తాయి. ఇది ఒక రకం కొరడావంటిది.
తెలంగాణలో ”గాలి వీస్తున్నది” వంటి ”వీచు” క్రియను దాదాపుగా వాడరు. ఉదాహరణకు వేసవి అనుకోండి! అది వేడి చవి చూపిస్తుంది మనకు. ”అబ్బా! ఈ ఎండలు పాడుగాను-గాలి అసలే యిసురత లేదు” అంటారు ఈ సందర్భంలో ఇసరడం విసరడం. గాలి వీచడం తెలంగాణలో గాలి ఇసురుడు”. అందుకే శబ్దరత్నాకరం ”విసరు” అర్థాన్ని ”వీచు” అనే క్రియకు చూపించింది.
ఇక తెలుగు భాషలోని ”వెండ్రుకలు” తెలంగాణ సామాన్య ప్రజల వ్యవహారంలో ”ఎంటికెలు” అయినై. పదాది మారలోపం సహజమే! వెంకి ”ఎంకి”గా మారలేదా? ఇక ”డ్రు”లోని రకారం తెలంగాణలో లోపించింది. ఇదీ భాషలో సహజ పరిణామమే! ఇప్పుడు ”ఎండుకలు”గా మిగలాలి. మరి ”ఎంటికెలు”గా ఎందుకు మారినై. ట, డలు పరస్పరం మారడానికి అవకాశం వున్న హల్లులు. అవును.. అప్పటికీ ”ఎంటుకలు” అని కనిపించాలి కదా! ”ఎంటుకలు” పదంలోని ”ఎ”కారం ”టు”లోని ఉకారాన్ని ఇకారంగా మార్చుకుంది. ఉచ్ఛారణకు పదాది ఎకారమూ తదనంతర ఇకారమూ అనుకూలంగా వుంటాయి. ఎందుకంటే ఎకార ఇకారాలు సన్నిహితమైనవి. అందుకే పద్యాల్లో యతిమైత్రీవేస్తారు. ”ఎంటుకలు”లోని ”క”సైతం తత్పూర్వ ఇకారంతో ఎకారంగా మారిపోయింది. తెలుగులోని వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పింది అనే వాక్యం తెలంగాణలో ”ఎంటికెమందంల అపాయం తప్పింది”గా మారుతుంది. వెండ్రుకకూ, ఎంటికెకూ ఎంటికెమందమే తేడా!
కొలతల్లో పొడవు, వెడల్పు మొదలైనవి మనకు తెలుసు. తెలంగాణలో ”వెడల్పు” అనే మాట బాగా వెడల్పుగా వుందనుకున్నారేమో పండితులు లోనుంచి డి తీసి పంతులు అని పిలిచినట్లు వెడల్పునుండి డ లోపింపచేసి వెల్పు అన్నారు. అంతటితో ఊరుకున్నారా? పదాది వకారం తీసి ”ఎల్పు” అన్నారు. ఇంకా పైపెచ్చు ఆ ఎల్పును ఎల్ము అని కూడా పేర్కొన్నారు. నిఘంటువుల్లో వెడలుపు, వెడల్పు, వెలుపు అనే పదాలున్నాయి. ఎల్పు, ఎల్ము పదాలు లేవు.
”ఇంటినడికొప్పుమ్రాను”ను శబ్దరత్నాకరం వెన్నుగాడి అన్నది. బహుశ: ఇది తెలంగాణలో ”ఎనగర్ర” కావచ్చును. వెన్నుముక తెలం గాణలో ఎన్నుబొక్క.
”వెలితి” ఎటువంటి వెలితిలేని తెలుగుపదం. దీనికి అర్థం తక్కువ, తఱచుదనము లేమి అని. వెలితి అంటే ఏమీ లేకపోవడం కూడాను. తెలంగాణాలో ”ఎల్తకట్టెలు” అన్న మాట వుంది. ఏమిటీ ఎల్త? లోపల వెలితి కల్గిన కట్టెలివి. వెదురు కర్రలు రెండు రకాలు. ఒకరకం లోపల చోటు కల్గి వుంటాయి. వీటిని బొంగు కర్రలు అనికూడా పిలుస్తారు. ఈ బోలూ, బొంగూ, వెలితీ, డొల్లా కల్గినవే తెలంగాణ ”ఎల్లకట్టెలు”.
మరోరకం ఏ విధమైన బొంగులేని వెదురుకర్రలు.
తెలంగాణాలో వరంగల్ ప్రాంతాల్లో ”ఎలోల్లు” వుంటారు. ఎవరు వీరు? ”వెలి” వేయబడినట్లుగా వుండేవాళ్లు. ”ఎట్టోల్లు” సైతం వుంటారు. వీరు ”వెట్టి” చేయడానికి పుట్టారన్నమాట. సుంకరులు, ముస్కురోల్లు, తలార్లు, షేక్‌సిందీలుగా పిలువబడే మనుషుల్నే కొన్ని ప్రదేశాల్లో ఎల్లోల్లు, ఎట్టోలుగా పిలుస్తున్నారు. వెలి, వెట్టిలు తెలుగుపదాలే మరి!
”ఎసులల నీల్లు లెవ్వా?” అనే ప్రశ్నల్లోని ”ఎసుల” నిజానికి ”వెసల”. దీనికి అర్థం వంటకుండ. ”వెసల” పదమే పదాదివకారాదిలోపాలతో ఎసుల అయ్యే వెసులుబాటు భాషలో వుంది మరి!
”వాడు బాగా వైపులు తెలిసినోడు. వైపు తీరు మాట్లాడుతడు” అనే రెండు వాక్యాల్లోని రెండువైపుల వైపు చూస్తే ఒకవైపు అర్థం ”ఉపాయం” అయితే, మరొకవైపు అర్థం వాటం-ఆనుకూల్యం అని. ”ఆ బావ వాడు వైపులమారి మనిషి” అంటే ఉపాయశాలి-ఉషారుమంతుడు అనే అనేక అర్థస్ఫురణలు
ఉన్నాయి.
పోతే ”వైళము” ఒక చక్కని దేశ్యపదం. దీనికి అర్థం శీఘ్రముగా వెంటనే అని ”ఏమో! ఎల్లెమే వస్తివేందిరా?”లోని ఎల్లెం ఈ వైళమే! ఇంకా కొందరు ”మాయెల్లెమే వచ్చినవేందిరా?” అంటుంటారు. మహావైళం మాయెల్లెం అయ్యింది. ఎంత తొందరో! మహా, వైళం అనే మాటలకు. అవి రెండూ ఎటువంటి శషభిషలు లేకుండా సమానంగా మారిపోయినై. ”మహా” సంస్కృతం. ”వైళం” దేశ్యం. అయితేనేం అవి చక్కగా సోపతి చేశాయి.
”ఇంట్ల ఈ యాల్లాటలు ఏందిరా?” అంటుంటారు. దానికి జవాబుగా ”ఏం జెయ్యిమంటవ్? వాన వస్తుందని బట్టలన్ని ఇంట్ల ఎండేసిన” అంటారు. యాల్లాటలు అంటే వ్రేలాడుటలు. రైతులు తెల్లారి లేచే వరకు చెట్టుకు యాల్లాడుతూ కనిపించడం దుర్భరం.
”వాడు సందెడు సందెడు గడ్డి పట్టుకుపోయిండు”లోని సందెడు పదం ”సందిలి”నుండి వచ్చింది. సందిలి అంటే దండచేయి. దండరెక్క. దండరెట్ట. రెండు దండరెక్కల మధ్య ఎంత గడ్డి పడుతుందో అది సందెడు. ”ఎడు” మానార్థకం. ”వాడు కంకెడు కంకెడు ముద్దలు పెడుతుండు నోట్లె” అంటే ”కమికిలి” పరిమాణంలో కబళాలు చేసుకొని తింటున్నాడని అర్థం. కమికిలి అంటే దాదాపు పిడికిలికి ఎక్కువా, దోసిలికి తక్కువా.
”నేను పొద్దుగాల్ల లేచిందగ్గరనుంచి పనిచేసిచేసి సత్తున్న. సర్కస్ చేసినట్లయితుంది నాకు. సడుగులు యిరుగుతున్నై” వాక్యాల్లోని ”సడు గులు” ఏమిటి? అని కటి ప్రదేశంలోని కీళ్ళు. ఈ మాట పూర్తిగా తెలుగు.
పూర్వం చాలామంది సత్తుపల్లేల్లో తినేవాళ్ళు. అప్పటికింకా స్టీలు కంచాలు రాలేదు. ”సత్తు” మాటకు అనేకార్థాలున్నా ఈ సందర్భానికి అది ”తగరం” అయి వుండాలి. నిఘంటువుల్లో సీసము అర్థంగా యిచ్చారు. ఈ సత్తు లోహమే ”శీమెండి” కూడా కావాలి. నిజానికిది సీమ వెండి.
”అబ్బో! వీడు సన్నపోడా?” అన్న ప్రశ్నలోని ”సన్నపోడు” నిజానికి సన్నపువాడు. వాడు కాస్త సన్నమై సన్నపోడు అయ్యాడు. సన్నపువాడు అంటే అల్పుడు. తెలంగాణలో మాత్రం సన్నపోడు మాటను ”వాడు సన్నపోడు కాదు సుమా” వంటి నకారాత్మక వాక్యాల్లోనూ వాడుతుంటారు. వాడు సన్నపోడావంటి ప్రశ్నార్థక వాక్యానికి సమాధానం కాదుకాదు వాడు గొప్పోడు అనే అర్థం స్ఫురించినా నిందార్థంలోనే దీనికి ప్రయోగం ఎక్కువ.
”సబ్బండజాతులు”, ”సబ్బండ కులాలు” అనే మాటలు తెలంగాణలో ఎక్కువగా వినబడుతుంటాయి. ఏమిటి ఈ ”సబ్బండ”? ఇది నిఘంటువుల్లో ”సబ్బండు”గా వుంది. అంటే అనేక భేదములు కలది అని అర్థం. ఇప్పుడు తెలిసి వస్తుంది కదా సబ్బండ కులాలు అంటే? అనేకజాతులు, కులాలు, మతాదులు అన్నీ కలిసిపోయిన సకలజనుల సమాహారమే ఈ ”సబ్బండ”. బహుశః ఇది ‘సబ్‌వర్ణ’ అనే రెండు పదాలనుంచి వచ్చిందా? ”వర్ణ” పదం బర్ణగా మారి క్రమంగా బండ్ అయి వుంటుందా? రామాయణం తెలంగాణ అట్టడుగు జనాల్లో రామాండెం అయ్యింది. అట్లాగే సామాన్యం సామాండెంగా మారిపోయింది. అటువంటి సందర్భంలో సబ్‌వర్ణ్ సబ్బండుగా అవతరించే అవకాశం లేదా?
”అరేయ్.. సడిలేదు సప్పుడు లేదేందిరా? నోరే యిప్పుతలెవ్వు” వాక్యంలోని సడీసప్పుడు పరిశీలనకు తగింది. చప్పుడు అంటే శబ్దం అని చప్పున తెలుస్తున్నది. మరి ”సడి”? దీనికి నిఘంటువులు ”సందడి” అని అర్థం చూపాయి. హడావుడి లేకుండా, ఉలుకూపలుకూ లేకుండా వుండటమే సడీసప్పుడూ లేకపోవడం. అందుకే ఉత్తర హరివంశంలో నాచనసోముడు ఓ చోట ”సడీచప్పుడు లేకమ్మెయిన్ తొలగిన సైన్యంబు” అన్నాడు మరి!
వెనుకటికి ఎవడో ”సంచిల సస్కాని లేకున్నా లం-కు బులావ్ అన్నడట”. ఇదో సామెత తెలంగాణాలో. ఇందులోని సస్కాని ఏమిటి?. రెండు డబ్బుల నాణెం. మళ్ళీ డబ్బు అంటే ఏమిటి? రెండు దుగ్గానుల నాణెం? మొత్తమ్మీద సస్కాని అంటే పైసలు. వాడెవడో తన దగ్గర డబ్బుల్లేకున్నా వేశ్యను పిలవండి అన్నాడట! సస్కాని చక్కని తెలుగు నుడి.
తెలంగాణలో శివసత్తులకు కొదువలేదు. ముఖ్యంగా వేములవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ వీళ్ళు. శివశక్తులు క్రమంగా శివసత్తులుగా మారారు. వీళ్ళకి శిగం వస్తుంది. శిగం అంటే సిగం. ఇదే సివం. శివుడూ, దేవుడూ వీళ్ళని ఆవహిస్తాడు కనుక వీళ్ళు ఊగిపోతారు. ఇదే శిగం. దేవుడు పూనినందువల్ల దీన్నే పూనకం అంటారు. అయితే పూనకం తెలుగు మాటే కాని తెలంగాణ పదం కాదు.
”సిబ్బి”కి ఇత్తడిమూకుడు అనే అర్థం శబ్దరత్నాకరం చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఆ అర్థంలో ఆ పదం వ్యవహారంలో వుండవచ్చు. తెలంగాణలో మాత్రం మేదరుడు వెదురు సన్నని పేడులతో దాదాపు రెండు అరచేతుల పరిమాణంలో అల్లుతారు. అది శిబ్బి. అన్నం వండేటప్పుడు కుండ మూతనుండి శిబ్బిని జొనిపి గంజిని వార్చుతారు. బతుకమ్మల్ని ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడుకునే బతుకమ్మల్ని శిబ్బుల్లో పేర్చుతారు.
”సుంకు” అంటే జొన్నలోనాగువాని కంకిమీద పూత అని శబ్దరత్నాకరకారుడు అన్నాడు. ఇది ”సుంచు” అని తాలవ్యాకరణం చెందిన రూపంతో తెలంగాణాలో ప్రయుక్తమవుతున్నది. చూడుండ్రి! మక్కపెరడు తలసుంచు ఏసింది” అంటూ వుంటారు. తలసుంచు అంటే తలమీద పూతే!
తెలుగు భాషలో సహితము, సైతము అనే రెండు రూపాలూ ”కూడ” అనే దానికి సమానార్థకంగా వాడబడుతున్నాయి. సహితాదులు సంస్కృతాలు. కూడ తెలుగే! అయితే తెలంగాణలో సహితము, సైతములు వ్యవహారంలో లేవుకానీ సహితంనుండి పుట్టిన సుత, సుతం, సుతికె వంటి పదాలు వాడుకలో వున్నాయి. ఇందులో సుత నిఘంటువుల్లో వుంది. ఇది సహితభవం అయినందువల్ల కావచ్చును బహుజనవల్లి సీతారామాచార్యులు తన నిఘంటువు శబ్దరత్నాకరంలో ”ఉభయము” అని పేర్కొన్నారు. ఉభయము అంటే కొన్ని అర్థాల్లో అచ్చతెనుగూ, మరికొన్ని అర్థాల్లో సంస్కృతమూ అయిన పదం. అందుకే ఉభయ పదంతోపాటు ఈ ”సుత”ను దేశ్యంగా సూచించాడు.
”ఎండకు అందరు సొడసొడలు పోతున్నరు” అంటే కృశించి పోవడం-వాడిపోవడం-మ్లానమవడం. అయితే నిఘంటువుల్లో యిది ”సొటసొటపోవు” రూపంలో చోటుచేసుకుంది. ”వాడు సొలుగుకుంట పోతున్నడు”లోని ”సొలుగు”కు మూలం తెలుగులోని ”సోలు” క్రియ. అర్థం వివశత్వంనొంది వ్రాలు. అంటే తూలుతూ వెళ్ళు అని. తాగడం వల్లనైతేనేమి, చేతకాకపోవడం వల్లనైతేనేమి సొల్గుడు తప్పదు.
”ఇప్పుడు నీకు ఆయిమన్నదా?”లోని ”ఆయి” ”హాయి”నుండి వచ్చింది. హాయి అంటే సుఖము కదా!
”వాడు అన్ని ఒల్లెక్కాలు మాట్లాడుతడు. ఏ… నేను ఒల్లెక్యాలకు చెప్పిన”లోని ”ఒల్లెక్యాలు” నిజానికి హుళక్కులు. హుళక్కి అంటే ఏమీ లేకపోవడం. అంటే వాడు ఉత్తుత్త మాటలు మాట్లాడుతాడని భావన. హుళక్కి తెలుగు దేశ్య పదం.
ఈ రకంగా తెలుగుభాషలోనే అనేకాకనేక దేశి శబ్దాల రాశులు తెలంగాణాలో దోసిళ్ళకొద్దీ ప్రజల మాటల్లో వున్నాయి. ఆ మాటల స్వారస్యాన్నీ, సారాంశాన్నీ ఆస్వాదించినప్పుడే మాతృభాషలోని ఆస్వాదురుచులు మనం ఆసాంతం సొంతం చేసుకోగలం.
నలిమెల భాస్కర్