పార్లమెంటులో ఒకసారి సంస్థానాల విలీనంపై చర్చ జరుగుతున్నది. పండిత హృదయనాథ్ కుంజ్రూ లేచి హైదరాబాద్‌పై తుది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారని ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్‌ను ప్రశ్నించాడు.
‘త్వరలోనే’ అని సర్దార్ సమాధానమిచ్చారు. ‘ఆ త్వరలో ఎప్పుడు కార్యరూపం ధరిస్తుందని కుంజ్రూ ఎద్దేవా చేశాడు.
‘మీ సహనం నశించకముందే’ అని సర్దార్ సమాధాన మివ్వగానే హైదరాబాద్‌పై చర్యలు తీసుకునే రోజులు దగ్గర పడ్డట్టున్నాయని సభ్యులకు తెలిసిపోయింది దానితో వారు సంతృప్తిపడ్డారు.
మరో సభ్యుడులేచి, ‘సిక్కులు ధరించే కృపాణాల పొడవు ఎక్కువైపోతుందనీ, సిక్కుల మాదిరిగానే ఇతర మతాలవారికి కూడా కృపాణాలు ధరించే హక్కు ఉండాలని వాదించడం మొదలు పెట్టాడు. ‘ఇంత రభస ఎందుకు? మీరు సిక్కు మతం మార్చుకుంటే కృపాణం ధరించే హక్కు లభిస్తుంది కదా’ అని సర్దార్ అనగానే సభ ఘొల్లుమంది. మరల ఆ ప్రశ్న తలెత్తలేదు. ‘ఐక్యరాజ్య సమితికి వెళ్ళడానికి హైదరాబాద్ ప్రతినిధి వర్గానికి ఎలాంటి సౌకర్యాలు కలిగించార’ని సభ్యులు తెలుసుకోగోరారు.
‘ఉత్తరప్రదేశ్ రైతు ప్రతినిధి వర్గానికి ఇచ్చిన సౌకర్యాలే వారికి కలిగించాము’ అని సర్దార్ సమాధానమివ్వగానే సభ్యులు ఒకరి మొఖమొకరు చూసుకొని నవ్వుకోసాగారు.
‘హైదరాబాద్ విమానాలు బీదర్ గగనతలంపై ఎగురుతున్నాయనే సంగతి హోంమంత్రిగారి దృష్టికి రానట్లుందని’అని ఒక సభ్యుడు సర్దార్‌ని ఎత్తి పొడిచాడు.
‘ఎందుకు రాలేదు’ అవి విమానాలు కావు గాలిపటాలు. గాలి పటాలని చూసి గౌరవనీయుడైన సభ్యుడు యుద్ధ విమానాలని భ్రమ పడుతున్నాడ’ని సర్దార్ అనగానే సభలో కరతాళ ధ్వనులు మారుమోగాయి.
విదేశీ వ్యవహారాల కేబినెట్ ఉపసంఘంలో ఒకసారి చర్చ జరుగుతున్నది. నెహ్రూ, రాజాజీ, పటేల్ మొదలైన ప్రముఖులు సభలో పాల్గొంటున్నారు. కొరియాపై జరుగుతున్న బాంబు దాడులపై భారత రాయబారి పంపిన సుదీర్ఘ నివేదికను ఎంతో ఆవేదనతో నెహ్రూ చదువుతున్నారు. అది చదవడం పూర్తికాగానే సర్దార్‌పటేల్ – ‘ఆ రాయబారి ఎవరు? కొంపతీసి జైన మతస్థుడైతే కాదుకదా’ అని అనగానే సభ్యులు ఉలిక్కిపడ్డారు.
ఇదే ఉపసంఘం సమావేశంలో మరొకసారి గోవాపై చర్చ జరుగుతున్నది. కొందరు సభ్యులు గోవాపై ఆర్థిక దిగ్భంధనం విధించాలని వాదించారు. కానీ రాజాజీ దీనికి తీవ్ర అభ్యంతరం తెలిపారు. గోవా ప్రజలు భారత ప్రజలేనని వారిపై విధించే ఆంక్షలు మన ప్రజలమీద విధించినట్లే అవుతుందని, ఈ చర్య సమర్థనీయమైనదికాదని రాజాజీ వాదించారు.చర్చ జరుగుతున్నంతసేపూ ఈ విషయంపై సర్దార్ ఏలాంటి శ్రద్ధ చూపలేదు. అది తనకు యిష్టం లేనట్లు కొంతసేపు కునికిపాట్లు పడ్డారు. చర్చ సమాప్తమవుతున్నప్పుడు సర్దార్ లేచి ‘ఇక మనం లోనికి పోదామా’ ఇది రెండు గంటల పని మాత్రమే’ అని అన్నారు. కానీ పండిట్‌జీ దానికి అంగీకరించలేదు. గోవాపై భారత ప్రభుత్వం సైనిక చర్య జరిపితే అంతర్జాతీయమైన, కొన్ని క్లిష్ట సమస్యలు తలెత్తుతాయని, భారతదేశం అనుసరిస్తున్న అహింసా విధానానికి తీవ్ర విఘాతం కలుగుతుందని వాదించారు. దీనిపై సర్దార్ ఎటువంటి వాదోపవాదాలకు దిగలేదు. ప్రక్కన ఉన్న తన మిత్రునితో ‘జవహర్‌లాల్ మహాత్మాగాంధీ శిష్యుడే. కాబట్టి గౌతమబుద్ధుని వారసుడుగా కూడా తయారవుతున్నాడ’ని చమత్కరించారు.
కౌన్సిల్ సమస్యను ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టడం సర్దార్‌పటేల్‌కు ఏమాత్రం యిష్టంలేదు. ఒకసారి ఆచార్య రంగా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆ సంగతి చర్చకు వచ్చింది. ‘రంగా! ఏ క్రిమినల్ లాయర్నైనా అడిగి తెలుసుకో. కోర్టులో కేసు పెట్టడం సులభమో, వాదించడం సులభమో అతడు చెబుతాడు’ అని బాధతో అన్నారు.
ఒకసారి వి.పి. మీనన్ (సంస్థానాల విలీన శాఖ కార్యదర్శి) సర్దార్ పటేల్‌ని చూడటానికి ఆయన యింటికి వచ్చాడు. అప్పటికే అస్వస్థులుగా వున్న సర్దార్‌ని ఆక్సిజన్ టెంట్‌లో ఉంచారు. సిగరేటు కాల్చుకుంటూ వరండాలో నిలబడ్డ మీనన్ సర్దార్ దృష్టిలో పడనే పడ్డారు. ఆక్సిజన్ టెంట్‌ని తొలగించుకుని మీనన్‌ని పిలిపించుకున్నాడు సర్దార్. ‘ఏం మీనన్! అలా బైటనే వుండి పోయావు. లోనికి రావడానికి నీకు కూడా అనుమతి అవసరమైందా?’ అని ఆప్యాయంగా ప్రశ్నించారు.
‘సిగరేటు కాల్చుకుంటున్నానని దాని పొగతో మీ గదిని మలినం చేయడం ఇష్టంలేక’.’ఎంత పిచ్చి వాడవు మీనన్’ ఢిల్లీ వాతావరణం ఇంకా పరిశుభ్రంగా ఉందని అనుకుంటున్నావా?’ అని దేశ విభజన రోజుల్లో మత కలహాల కంపును దృష్టిలో పెట్టుకుని బాధతో అన్నారు.
సర్దార్ పటేల్-జై ప్రకాష్‌నారాయణ్‌ల మధ్య రాజకీయ విబేధాలు ఉన్నా-ఇద్దరు కలుసుకున్నప్పుడు హృదయాలు విప్పుకుని మాట్లాడుకునేవారు. సర్దార్ చివరి రోజుల్లో ఆయనను పరామర్షించడానికి జేపీ దంపతులు వచ్చారు. ఆ రోజుల్లో జేపీ ఎర్రని గాంధీ టోపీ, తెల్లని ఖద్దరు లాల్చీ ధరించేవారు. ఆ వేషంలో జేపీని చూడగానే సర్దార్‌కు నవ్వు వచ్చింది. ‘ఏం? జై ప్రకాశ్ ఇంకా రంగు దుస్తులు మానలేదా? మొత్తం ఎర్రని దుస్తులే ధరించరాదు?’ అని ఎత్తి పొడిచారు. మృత్యుముఖంలో ఉంటూ కూడా సర్దార్ చిరునవ్వులు చిందించారు.
అంతటి గొప్ప వ్యక్తికి మరణించిన 40 సంవత్సరాల తరువాత – అదీ చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్న రోజుల్లో ‘భారత రత్న’ అవార్డు లభించింది. కశ్మీర్ విషయంలో సర్దార్‌పటేల్ అయినట్లయితే హైదరాబాద్ జనసంఘ్‌లతో వ్యవహరించినట్లే కశ్మీర్‌పట్లకూడా వ్యవహరించేవారు. షేక్ అబ్దుల్లాను పటేల్ ఎన్నడూ, ఎప్పుడూ యిష్టపడలేదు.
జి. వెంకటరామారావు