ఈ నెలలో ప్రారంభమవుతున్న విలంబినామ సంవత్సర ఉగాది పర్వదినం రాష్ట్రానికి, ముఖ్యంగా రైతాంగానికి ఎన్నో అపురూప వరాలను మోసుకొస్తోంది. దేశానికే అన్నంపెట్టే అన్నదాతలకు మరచిపోలేని, మరపురాని అపూర్వ ఉగాదిగా ఇది నిలచిపోనుంది.
ఉమ్మడి రాష్ట్రంలో దగాపడి, చితికిపోయి, బతుకు భారమై ఆత్మహత్యలే శరణ్యమని మృత్యువు ముంగిట నిలచిన రైతాంగానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొత్త ఊపిరిలూదింది. వ్యవసాయం దండగ కారాదు, పండుగగా మారాలన్న ఏకైక లక్ష్యంతో రాష్ట్ర అవతరణ నాటి నుంచి స్వయంగా రైతుబిడ్డ అయిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని చర్యలు లేవు. అధికారంలోకి కాలు మోపీమోపక ముందే అధికారికంగా సమగ్ర సర్వే నిర్వహించి, ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులు, ఆయా వర్గాల సమస్యలను అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏయే వర్గాలను ఏమేరకు ఆదుకోవాలో ఒక సంపూర్ణ అవగాహనతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర రైతాంగం మోములో చిరునవ్వులు చూడాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు, పథకాలు, కార్యక్రమాలు చేపట్టింది. అంతటితో సంతృప్తి చెందని రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శప్రాయమైన పలు పథకాలు అమలుచేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 17,000 కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీచేసి లక్షలాది మంది రైతాంగానికి రుణవిముక్తి కలిగించింది. అధికారంలోకి వచ్చిన ఆరుమాసాల్లోనే కోతలు లేని విద్యుత్ సరఫరాను సమకూర్చిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ నాడు మరే రాష్ట్రంలో లేని విధంగా దేశానికే ఆదర్శంగా, రైతాంగానికి 24 గంటలూ నిరంతర విద్యుత్ ను సరఫరాచేస్తూ రికార్డు సృష్టించింది. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ధ్యేయంగా అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి, ఎన్నడూలేనంతగా నిధులు సమకూర్చి, త్వరితగతిన పూర్తి చేస్తోంది. ఈ ఏడాది నుంచి రైతాంగం ప్రయోజనార్థం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ కు రూపకల్పన చేస్తోంది.
గందరగోళంగా తయారైన భూ రికార్డులను ప్రక్షాళనచేసి, రైతాంగానికి సౌకర్యంగా వుండే విధంగా రూపొందించిన కొత్త పాస్ పుస్తకాలను ఈనెలలోనే రైతులకు అందజేస్తున్నారు. మరో అద్భుతం, పంట పెట్టుబడికోసం పెళ్ళాం మెడలో పుస్తెలు సయితం తాకట్టు పెట్టాల్సిన దుస్థితిలో వున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వమే ఉచితంగా, నేరుగా రైతుచేతికే ఎకరానికి 4,000 రూపాయల వంతున రెండు పంటలకు ఏడాదికి 8,000 రూపాయలు అందించే అద్భుత పథకం ఏప్రిల్ నెలనుంచి ప్రారంభం కానుంది.
వీటితో పాటుగా, తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి పేరుతో రాష్ట్రంలో రైతాంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ పాలక మండలిలో 15 మంది ప్రతినిధులు ఉంటారు. ఛైర్మన్ తోపాటు ఐదుగురు అధికారులు, సంచాలకులు, 10 మంది రైతులు ప్రతినిధులుగా ఉంటారు. వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమమే లక్ష్యంగా, లాభాపేక్ష లేని సంస్థగా ఇది పనిచేస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలను ఈ కార్పొరేషన్ క్షేత్రస్థాయికి తీసుకెళ్తుంది. దీనితోపాటుగా రైతులు పరస్పరం చర్చించుకొనేందుకు వీలుగా రాష్ట్రంలోని 30 జిల్లాలలో 2,530 రైతువేదికలు నిర్మించాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక వేదిక చొప్పున , వీలైనంత త్వరగా వీటిని నిర్మించాలని నిర్ణయించారు. అలాగే, గ్రామ, మండల రైతు సమాఖ్యల మాదిరిగానే త్వరలోనే జిల్లా, రాష్ట్ర స్థాయిలో రైతు సమన్వయ సమితులు ఏర్పాటవుతాయి.
ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలన్నీ అన్నదాత ఇంట నూతన ఉషస్సులు నింపగలవనడంలో సందేహం ఏముంది.
ఈ శుభ సమయంలో అందరికీ విలంబినామ సంవత్సర శుభాకాంక్షలు.