వేదాలకు పుట్టినిల్లయిన భారతదేశం అనేక సంస్కృతులకూ, సంప్రదాయాలకూ నిలయం. చరాచరాలను దైవ స్వరూపాలుగా భావించి ఆరాధించే జనవాహిని ఆసేతు శీతాచలం దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రాన్ని అనుసరించి సంవత్సరకాలం చైత్రమాసంతో ప్రారంభమై, ఫాల్గుణ మాసంతో ముగుస్తుంది. పన్నెండు మాసాలలోని ప్రతిమాసంలోనూ ప్రతిదినం పండుగలే కనబడుతాయి. అంటే ఏడాది పొడుగునా పండుగదినం కానిరోజు ఏదీ లేదనే పరమార్థం ఇలా వ్యక్తం అవుతోంది.
చైత్రమాసం వసంతరుతువు ఆవిర్భావానికి మూలం. వసంతం అనగానే ఏదో ఒక కొత్తదనం, ఏదో మార్పు ద్యోతకమవుతుంది. చైత్రమాసంలో ప్రకృతి అంతా వికసిస్తూ వినూత్న శోభను ఆవిష్కరిస్తుంది. చెట్లు చిగురిస్తాయి. ప్రకృతి ఆహ్లాదకరంగా రూపుదిద్దుకొంటుంది. కమ్మగా కోయిలలు కూస్తాయి. మలయగంధాలతోకూడిన పిల్లగాలులు వీస్తూ మనస్సులో మధురానుభూతులను ఉద్భవింపజేస్తాయి. చైత్రమాసావిర్భావ దినం శుక్లపాడ్యమి. ఈ దినాన్ని ఉగాది అనీ, సంవత్సరాది అనీ పిలుస్తారు. ఈ పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే కాకుండా, కర్ణాటక రాష్ట్రంలో కూడా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకొంటారు. సంవత్సరంలోని పండుగలన్నీ ఉగాదితోనే ప్రారంభమౌతాయి. ఈ యేడాది ఉగాది ‘విళంబి’ నామసంవత్సరంగా ప్రసిద్ధమైంది. బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన ఈ సంవత్సరనామాలు ప్రభవతో ప్రారంభమై అక్షయతో ముగుస్తాయి. అరవై సంవత్సరాల కాలచక్రం పునరావృతమౌతూ మానవ జీవితంలో ఎన్నో మార్పులకు మూలం అవుతుంది. అరవై సంవత్సరాల కాలగమనంలో మనిషి బాల్య, కౌమార, యౌవన, వార్థక్య దశలను చవిచూస్తాడు. ప్రతీ యేడాదీ తొలి రోజైన ఉగాదినాడు
ఉష:కాలంలోనే మేల్కొని, కాలకృత్యాల అనంతరం, తలంటుకొని మంగళస్నానాన్ని ఆచరిస్తాడు. కొత్తబట్టలు తొడుక్కుంటాడు. ఇష్టదేవతలను ఆరాధిస్తాడు. పూజ్యుల ఆశీస్సులను పొందుతాడు. మధుర పదార్థాలనూ, ఆరు రుచులతోకూడిన ఉగాది పచ్చడిని దేవతలకు నివేదించి, దానిని ప్రసాదంగా స్వీకరిస్తాడు. ఈ పచ్చడిలో వేపపూత, లేతమామిడి ముక్కలు, చింతపండు పులుసు, కొత్త బెల్లం రసం, గసగసాలు, పప్పులు మొదలైన రుచికర పదార్థాలను కలపడం పరిపాటి. తీపి, చేదు, వగరు, కారం, ఉప్పు, పులుపు అనే ఆరు రుచులు మనిషి జీవితంలోని కష్టసుఖాలకూ, భోగభాగ్యాలకూ ప్రతీకలై నిలుస్తాయి.
ఉగాది పండుగనాడు ఇంటికి మామిడి ఆకులతో మంగళ తోరణాలను కడుతారు. బ్రహ్మదేవుడు చైత్రశుక్ల పాడ్యమినాడే సృష్టిలోని మొదటి దినాన్ని ప్రారంభించాడని ‘హేమాద్రి’ అనే ధర్మశాస్త్ర గ్రంథం చెబుతోంది-
‘చైత్రేమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే హని
శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి’
ఉగాదినాడు సంవత్సరం ప్రారంభమౌతుంది కనుక కాలగణనలో ప్రధానమైన తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలను అనుదినం తెలిపే పంచాంగాలను ఈ దినాన పూజించడమేగాక, పంచాంగ పఠనం కూడా చేయడం సంప్రదాయం. ఈ పంచాంగ పఠనంలో రాబోయే సంవత్సరకాలంలో జ్యోతిశ్చక్రంలో జరిగే కీలక మార్పులైన సూర్యచంద్రగ్రహణాలు, గ్రహాల మౌఢ్యాలు, ఉత్తమ, మధ్య, నీచ ఫలాలకు సంబంధించిన వివరాలన్నీ తెలియజేయడం పరిపాటి. పంచాంగ శ్రవణం వలన సకల మంగళాలు కలుగుతాయనీ, సిరిసంపదలు లభిస్తాయనీ, గంగాది పుణ్యతీర్థాలలో స్నానం చేసినంత పవిత్రత లభిస్తుందనీ, గోదానాది విశేషదానాలవలన కలిగే పుణ్యం కలుగుతుందనీ, ఆయుష్యం వృద్ధి చెందుతుందనీ, ఆరోగ్య సంతానాది భాగ్యాలు కలుగుతాయనీ సంప్రదాయం చెబుతోంది. ‘విళంబి’ నామంతో ప్రారంభమయ్యే ఈ ఉగాది అవిలంబ ఫలాలను ప్రసాదిస్తుందనడంలో సందేహం లేదు.
శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి
దశావతారాలలో శ్రీరామావతారం ఒక్కటే సంపూర్ణ మానవావతారంగా జగత్ప్రసిద్ధిగాంచింది.చైత్ర శుక్ల నవమినాడు శ్రీరాముడు భూలోకంలో మానవశ్రేష్ఠుడుగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి-
‘చైత్రమాసే నవమ్యాంతు జాతోరామ: స్వయం హరి:
పునర్వస్వృక్షసంయుక్తా, సాతిథి స్సర్వకామదా’
అంటే చైత్రమాసంలోని శుక్లపక్షనవమి తిథినాడు మహావిష్ణువు తానే స్వయంగా రామునిగా అవతరించాడు. ఆయన పుట్టిన సమయంలో పునర్వసు నక్షత్రం విరాజిల్లింది. ఈ కారణంగా ప్రతి యేడాదీ చైత్రశుక్ల నవమినాడు రామజన్మదినం సర్వఫలదాయకం అవుతుంది-అని అర్థం. మహాకవి భోజరాజు తన చంపూరామాయణ కావ్యంలో శ్రీరామ జన్మదిన వివరాలను ఎంతో చక్కగా వర్ణించాడు-
‘ఉచ్ఛస్థేగ్రహపంచకే సురగురౌ సేందౌ నవమ్యాం తిథౌ
లగ్నే కర్కటకే పునర్వసుయుతే మేషంగతే పూషణి
నిర్దగ్ధుం నిఖిలా: పలాశ సమిధ: మేధ్యాదయోధ్యారణే:
ఆవిర్భూతమభూత పూర్వమఖిలం యత్కించిదేకం మహ:’
అంటే-రాముడు యజ్ఞ కుండంలో జ్వలించే పవిత్రమైన అగ్నితో సమానుడు. యజ్ఞ స్థలం అయోధ్య. అది నిప్పును పుట్టించే ‘అరణి’వంటిది. అందులోనుండి చైత్రమాసశుక్ల నవమీ తిథినాడు అయిదు గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా, దేవగురువైన బృహస్పతి చంద్రునితో కలిసి ఉండగా, కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో, సూర్యుడు మేషరాశిలో ఉండగా రాక్షసులనే సమిధలను దహించివేసే అగ్ని జ్వాలవలె శ్రీరాముడు జన్మించాడు’ అని అర్థం.
ఇంతటి విశిష్ట సమయంలో భూలోకంలో మానవునిగా అవతరించిన శ్రీరాముడు తన ఉత్తమ గుణగణాలతో జగత్తుకే ఆదర్శమూర్తి అయ్యాడు. మర్యాదాపురుషోత్తముడని కీర్తి గడించాడు. సకల మానవాళికి ఆదర్శప్రాయంగా నిలిచి, కృతార్థుడైనాడు. అతని జన్మదినాన్ని లోకమంతా ఆనందోత్సాహాలతో జరుపుకుంటుంది. నవమి మొదలుకొని, తొమ్మిది దినాలపాటు నవరాత్రోత్సవాలను నిర్వహించి, ధార్మిక సేవలనూ, సాంస్కృతిక కార్యక్రమాలనూ నిర్వహించి, తరిస్తుంది.
భూలోక వైకుంఠంగా పేరొందిన తెలంగాణ పుణ్యక్షేత్రం భద్రాద్రిలో శ్రీరామ కల్యాణోత్సవం అంగరంగవైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా ఏర్పాట్లు చేయడమేగాక, సాక్షాత్తూ ముఖ్యమంత్రిగారే స్వామివారి కల్యాణానికి తలంబ్రాలనూ, పట్టు వస్త్రాలనూ, ముత్యాలహారాలనూ సమర్పించి ధన్యులౌతారు. తెలంగాణ రాష్ట్రంలోని అనేక రామాలయాలలో వైభవంగా కల్యాణోత్సవాలూ, నవరాత్రోత్సవాలూ జరుగుతాయి.
రంగుల పండుగ హోలీ
వసంతోత్సవంగా, కామదహనోత్సవంగా ప్రసిద్ధి చెందిన ‘హోలీ’ పండుగ చైత్రమాసారంభంలో లోకమంతా జరుపుకొనే ఘనమైన వేడుక. పూర్వం లోకమంతా రాక్షసుల దుర్మార్గాలతో బాధింపబడిన సమయంలో, ఆ రాక్షసులను చంపాలంటే శివుని తేజస్సుతో జన్మించినవానికే సాధ్యమని దేవతలంతా నిర్ణయిస్తారు. అప్పటికే శివుని భార్య సతీదేవి తన భర్తకు దక్షయజ్ఞ సమయంలో జరిగిన అవమానాన్ని భరించలేక తనువు చాలించింది.
శివుడు తన భార్య సతీదేవి అగ్నికి ఆహుతికావడంతో వియోగ బాధతో హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకొంటున్నాడు. హిమాలయాలకు రాజైన హిమవంతుని పుత్రిక పార్వతి ప్రతినిత్యం శివుని తపోభూమికి వెళ్లి పరిచర్యలు చేస్తూ శివుణ్ణి ఆరాధించింది. పార్వతిపై శివుని మనస్సు లగ్నమయ్యేట్లు చేస్తే వారిరువురికీ పరిణయం జరుగుతుందనీ, క్షేమం కలిగిస్తాడనీ భావించిన దేవతలు ప్రతినిత్యం పార్వతి శివుని దగ్గరకు వెళ్లి పరిచర్యలు చేసే సమయాన్ని గుర్తించి, ఒకనాడు మన్మథుణ్ని అక్కడికి పంపుతారు. మన్మథుడు చెట్లపొదలమాటున దాగి ఉండి, పార్వతి వచ్చిన సమయంలో వాళ్లిద్దరి మధ్య అనురాగాన్ని పెంపొందించేలా పూలబాణాలను ప్రయోగిస్తాడు. ఆ బాణాలవల్ల తన మనో నిగ్రహానికి భంగం ఏర్పడగా, శివుడు కళ్లు తెరిచి, యోగ దృష్టితో చూస్తాడు. తన తపస్సుకు భంగం కలిగేలా, తనపైనే బాణాలను ప్రయోగించిన మన్మథుణ్ణి తన మూడవకన్ను తెరచి కోపంతో చూస్తాడు. శివుని ఫాలనేత్రాగ్నికి మన్మథుడు కాలి, బూడిదైపోతాడు.
తన భర్త అలా అగ్నికి ఆహుతై మరణించగా, మన్మథుని భార్య రతీదేవి అమితంగా దు:ఖిస్తూ శివుని పాదాలపై పడి, మన్నించమని వేడుకొంటుంది. తన భర్తను మరల బ్రతికించి, తన మాంగల్యాన్ని నిలబెట్టమని ప్రాధేయపడుతుంది. భర్త మరణించిన చోటనే తానూ అగ్నికి ఆహుతై మరణించడానికి పూనుకొంటుంది. అప్పుడు పరమేశ్వరుడు కరుణించి, కేవలం రతీదేవికి మాత్రమే కనబడే విధంగా అనంగరూపంలో మన్మథుడ్ని బ్రతికిస్తాడు. రతీదేవి సంతోషిస్తుంది.
ఆ తరువాత శివుడు దేవతల ప్రార్థనపై పార్వతీదేవిని పెండ్లాడి, కుమారస్వామిని పుత్రునిగా పొందుతాడు. అతడే దేవతల సేనానిగా రూపొంది, రాక్షసులను సంహరించి, లోకాలను కాపాడుతాడు.
మన్మథుడు దహింపబడిన దినమే ‘హోలి’. ఇది మానవులలోని కోరికలను దహించివేసే పవిత్రదినంగా రూపొందింది. ఈ దినాన వసంతోత్సవాన్ని అందరూ రంగురంగుల నీళ్లు చల్లుకొంటూ, వీధులవెంట తిరుగుతూ, ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దీనినే ‘కామునిపున్నమి’ అనే పేరుతో తెలంగాణ జనపదాలలో జనపదులు పాటలు పాడుకుంటూ, ఇల్లిల్లూ తిరుగుతూ గడుపుతారు. ఈ పండుగలకు ముందురోజు రాత్రి వీధుల కూడళ్లలో కర్రలను కాల్చి, కామదహనం జరిగినట్లు భావిస్తారు.
ఈ మూడు పండుగలూ తెలంగాణ రాష్ట్రంలో వైభవంగా ప్రజల హృదయాలలో నిలిచిపోయాయి. పండుగలు సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. సంప్రదా యాలను గుర్తుచేస్తాయి. నాగరికతను నిలుపుతాయి. మానవ జీవనం ఆనందమయం కావాలనే ఆకాంక్ష ప్రతి పండుగలోనూ పరమార్థంగా కనబడుతుంది. ఇదే జీవన పరమార్థం కూడా!!
డా|| అయాచితం నటేశ్వరశర్మ