తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకునే బోనాల పండుగలో సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి కి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సమర్పించిన బంగారు బోనం ఈ సారి ప్రధాన ఆకర్షణ అయ్యింది. బోనాల పండుగ ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల రూపాయలను కేటాయించింది.దాంతో గత ఏడాది కంటే కూడా బోనాల ఉత్సవాలు వాడ వాడలా అట్టహాసంగా జరిగాయి.
tsmagazine

ఆషాడ మాసం వచ్చిందటే తెలంగాణ అంతటా బోనాల సందడి మొదలవుతుంది. మన రాష్ట్ర పండుగగా మరింత జోరుగా,హుషారుగా అత్యంత ఆనందోత్సాహాలతో దాదాపు శ్రావణమాసాంతం వరకు ఈ హడావిడి కొనసాగుతుంది. బోనాల జాతర హైదరాబాద్‌ నగరంలో మతాలకు, కులాలకూ అతీతంగా జరుపుకోవడం తెలంగాణ సంస్కృతిలోని గొప్పదనం.ఆషాడ అమావాస్య అయిన తరువాత వచ్చే తొలి ఆదివారం గోల్కొండ జగదాంబికా అమ్మవారికి భక్తితో సమర్పించే తొలి బోనంతో పండుగ మొదలయ్యింది. రెండో ఆదివారం రెండో బోనం సమర్పించడంతో ముందుకు సాగుతూ, సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళికి సమర్పించే తొలి బోనంతో మరింత ఉదృతమవుతూ కొనసాగుతుంది. ఆ తరువాత లాల్‌ దర్వాజా, బల్కంపేట బోనాల ఉత్సవాలతో ఆనందం అంబరానికి చేరుతుంది.
tsmagazine

ఈ సారి గోల్కొం డ కోటలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన బోనాల జాతర తొట్టెల ఊరేగింపులో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పద్మారావు అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు,ఫల, పుష్పాలను సమర్పించారు. భక్తి పారవశ్యంతో బైలెల్లిన జాతర కోటలోకి ప్రవేశించే సందర్భంలో, ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు సాధారణ క్యూలైన్లలో కాకుండా పూర్తిగా గేట్లను తెరిచి కోటలోకి అనుమతించారు. గతంలో పలు ఆంక్షలతో బోనాల జాతరకు అనుమతించే అధికారులు ఈ ఏడాది భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అనుమతించారు. తొట్టెల ఊరేగింపులో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీవత్స, ఆర్డీవో చంద్రకళ, దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ బాలాజీ, గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయ కార్యనిర్వాహక అధికారి మహేందర్‌, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఊరేగింపులో 500 మంది కళాకారులు పాల్గొన్నారు. బోనాల జాతరకు ప్రసిద్ధి గాంచిన లష్కర్‌ బోనాలకు శ్రీకారం చుడుతూ ఎదుర్కోలు ఘటోత్సవాన్ని కర్బలా మైదానంలో నల్లపోచమ్మ గుడిలో మంత్రి తలసాని ప్రారంభించారు.. ఉజ్జయినీ మహంకాళీ ఆలయం వరకు ఘటాలను ఊరేగించారు. ఈ ఘటోత్సవాన్ని, 15 రోజులపాటు సికింద్రాబాద్‌లో రోజుకో వీధిలో నిర్వహించారు. ఉజ్జయినీ మహంకాళికి ఈ సారి సమర్పించిన బంగారు బోనంతో. బోనాల జాతర అట్టహాసం, పదింతలుగా అలరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టువస్త్రాలు సమర్పించారు.ఈ సారి బంగారు బోనాన్ని గతంలో అమ్మవారికి భక్తులు వివిధ రూపాల్లో సమర్పించుకున్న మొక్కుల బాపతు 3కిలోల 80 గ్రాముల బంగారంతో చేయించడం జరిగింది. ఈ బంగారు బోనానికి మోండా మార్కెట్‌ ఆదయ్యనగర్‌ వద్ద రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖా మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి పార్లమెంట్‌ సభ్యురాలు కల్వకుంట్ల కవితకు అప్పగించారు. బంగారు బోనాన్ని నెత్తికెత్తుకుని ఊరేగింపుగా కవిత ముందు నడువగా, 1008 మంది మహిళలు బోనాలను తలకెత్తుకుని ఆమె వెన్నంటి నడిచారు.
tsmagazine
ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి కల్వకుంట్ల కవిత బంగారు బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. ఆ మరుసటి రోజు ‘రంగం’ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.భవిష్యవాణిని చెప్పే ఈ రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత, బంగారు బోనం సమర్పించినందుకు సంతృప్తి పడినట్లు, ప్రజలందరినీ మంచిగా కాపాడుకుంటానని, అమ్మవారి వాక్కుల రూపంలో అందరికీ వినిపించారు. ఆ తరువాత అంబారి పై అమ్మవారిని సికింద్రాబాద్‌ పురవీధులలో ఊరేగించారు.. వైభవంగా జరిగిన ఉత్సవాల ముగింపు అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ మాట్లాడుతూ, సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర వైభవంగా జరిగింది. ఇందుకు సహకరించిన జి.ఎచ్‌.ఎం.సి, పోలిస్‌, దేవాదాయ శాఖలతో పాటు ఇతర శాఖల అధికారులు ఎంతగానో కషి చేశారని అభినందించారు.
tsmagazine
tsmagazine

Other Updates