ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన అధికార హోదాను, మంది మార్బలాన్ని ప్రక్కనపెట్టి మురికివాడల్లో ఇంటింటికీ తిరగడం, పేదల సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించడం ఎంతో అరుదైన విషయం.
ఇంతటి అరుదైన సంఘటనకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కావడం విశేషం.
కె.చంద్రశేఖరరావు ఉద్యమ నాయకుడిగా చాలామందికి తెలుసు. కానీ, సమస్యల పరిష్కారానికి ఆయన చూపే చొరవ, పట్టుదల, కార్యదక్షత, అనుకున్నది సాధించగల నేర్పు, ఓర్పుగల ఓ ఆదర్శ ప్రజా నాయకుడిగా కొందరికి మాత్రమే తెలుసు. ఆయనను దగ్గరనుంచి చూసిన ఎవరినైనా అడిగితే వారినుంచి వచ్చే సమాధానం`‘‘కె.సి.ఆర్.ది మొండిపట్టు.. ఉడుంపట్టు… అనుకున్నది సాధించే సత్తా ఉన్న ఒకే ఒక్కడు’’.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జనవరి నెలలో వరంగల్ నగరంలో జరిపిన పర్యటన ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అక్కడి మురికివాడల ప్రజల సమస్యలు తెలుసుకొని, చలించి పోయిన ముఖ్యమంత్రి ‘‘మీ సమస్యలు పరిష్కరించే వరకూ ఇక్కడే ఉంటా’’ అని మురికివాడల ప్రజలకు హామీ ఇచ్చారు. అన్నమాట ప్రకారం, ముందుగా నిర్ణయించకపోయినా ఏకబిగిన నాలుగురోజులపాటు వరంగల్ నగరంలోనే మకాం వేశారు.
జిల్లాస్థాయి అధికారులేకాదు, రాష్ట్ర సచివాలయంలోని ఉన్నతాధికారులను సయితం వరంగల్‌వైపు పరుగులు పెట్టించారు. అక్కడి ప్రజల అభ్యర్థన మేరకు అక్కడికక్కడే వందలాది మందికి పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయించారు. అర్హులెవరికీ అన్యాయం జరుగరాదని, అధికారులను మళ్ళీ ఇంటింటికీ పంపి సర్వే జరిపించారు.
మురికివాడల ప్రజలకు గృహాలు నిర్మించి ఇస్తామని ప్రకటించి, ఆ పర్యటనలోనే తొలిదశగా ఆరు మురికి వాడలలోని ప్రజలకోసం 400 కోట్ల రూపాయలతో గృహ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు.
హైదరాబాద్ తరువాత తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద నగరమైన వరంగల్‌కు పూర్వ వైభవం తెస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఈ సందర్భంగా కె. చంద్రశేఖరరావు మరో సంచలన ప్రకటన కూడా చేశారు. అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కార్యాలయంలోనే ఓ టోల్‌ఫ్రీ టెలిఫోన్‌ను ఏర్పాటు చేశానని, ఎవరైనా ‘లంచం’ అడిగితే వారి పేరుతో సహా ఆ నంబరుకు ఫోన్ చేసి చెప్పాలని ప్రజలకు సూచించారు. లంచం అడిగినా, ఇచ్చినా సహించేది లేదని హెచ్చరించారు. ఇది అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది.
పేదల సమస్యల పరిష్కారంలో అధికారులతోపాటు, ప్రజా ప్రతినిధులూ బాధ్యత వహించాలని, బాధ్యతారాహిత్యంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
సి.ఎం. నాలుగురోజులపాటు జరిపిన సుడిగాలి పర్యటన ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం చూపింది. ముఖ్యంగా మురికివాడల ప్రజల మోములో నిజమైన ‘సంక్రాంతి’। వెల్లివిరిసింది.
ప్రజా సమస్యల పరిష్కారంలో ఎవరికివారు ఇలా తక్షణం స్పందించగలిగితే అంతకుమించి కావలసింది ఇంకేముంటుంది!
హోం
»