magaభారతదేశంలో రాజకీయాలను చాలా వరకు వారసత్వంగా వచ్చే వృత్తిగా పరిగణిస్తారు. ఒడిశాలో అందరికీ తలలోని నాయకుడుగా మెలిగిన రాజకీయ నాయకుడు బిజియానంది పట్నాయక్‌కు మాత్రం రాజకీయాలు ఏనాడూ అలా అనిపించలేదు. ఆయన భువనేశ్వర్‌లో తన నివాసానికి ‘నవీన్‌ నివాస్‌’ అని పేరు పెట్టారు. కానీ కుమారునికి మాత్రం రాష్ట్ర ఛాయలకు కూడా రానివ్వలేదు. సిరిసంపదలు, పేరు ప్రతిష్ఠలు బాగా ఉన్న వ్యక్తి కుమారునిగా పుట్టిన నవీన్‌ స్వయం కృషితోనే పైకి వచ్చారు. ఒడిశాలో వ్యక్తుల ప్రాముఖ్యమే. పరిస్థితుల ప్రాముఖ్యం ఉండదు.

విమానయానంపట్ల ఎంతో మక్కువ ఉన్న బిజూ పట్నాయక్‌ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటీష్‌ పాలనలో ఉన్న భారత వైమానిక దళంలో పైలెట్‌గా ఉండేవారు. డచ్‌ దిగ్భంధంలోని ఇండోనేషియా నాయ కులను సురక్షితంగా ఢిల్లీకి విమా నంలో తీసుకువచ్చిన ఘనత బిజూదే. నెహ్రూ ఆనతిపై పట్నాయక్‌ ఆ మహత్కా ర్యాన్ని చేబట్టారు. అలాగే ఆయన 1947లో పాకిస్థాన్‌ మొదట దాడి చేసిన రోజుల్లో కశ్మీర్‌కు మొదటి విమానం నడిపారు. ఆ తరువాత ఆయన రాజకీయ జీవితం ప్రారం భమైంది. 1952లో ఒడిశా శాసన సభకు ఎన్నికైన బిజూ పదేళ్ళలోనే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు. 1963లో కామ్‌రాజ్‌ ప్రణాళిక కబళించిన ముఖ్యమంత్రులలో ఆయన ఒకరు.

ఆయన వ్యాఖ్యానాలు కొన్ని అతి దారుణంగా ఉంటాయి. బిజూబాబు ఎక్కడ ఉంటే అక్కడ వినోదం ఉంటుంది. ఒడిశాలో గతంలో కల్తీసారా తాగి అనేకులు మృతి చెందినప్పుడు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కల్తీసారా తాగినవారు తమ మరణం తామే కొని తెచ్చుకున్నారని వారికి ఆ శాస్తి జరుగవలసిందేనని వ్యాఖ్యానించారు. ఇందిరాగాంధీపై ఆయన చేసిన విమర్శలు 1969 రాష్ట్రపతి ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌నుంచి బిజూ బహిష్కరణకు దారితీసింది. 1975లో ఎమర్జెన్సీ విధించినప్పుడు బిజూని జైల్లో పెట్టడమేకాకుండా ఆయనకు సిగరెట్లు దొరకకుండా చేశారు. దాంతో బిజూ కాల్చిపారేసిన సిగరెటు ముక్కల్ని ఆశ్రయించవలసి వచ్చింది.

1989 ఎన్నికల్లో ఒడిశాలో బిజూ పట్నాయక్‌ కాంగ్రెస్‌ (ఐ)ని కూకటివేళ్లతో తొలగించి 27 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చారు. అప్పుడు ఆయన వయస్సు 75 సంవత్సరాలు. ఆ అయిదేళ్ళ పరిపాలనలో నానా రకాలైన విన్యాసాలు చేసి చివరికి ఎన్నికలలో ఓటమి మూటగట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలతో సహా బలమైన వర్గాలకు ముఖ్యమంత్రి దూరం కావడం దీనికి కారణం. మండల్‌ వ్యతిరేక వైఖరి అవలంబించిన ఏకైక సీఎం బిజూయే.

ఉత్కళ వృషభం మామూలు వృషభం కాదు. కేవలం ఆయన ఆర్భాటాలవల్లనే భారతచరిత్రలో ఆయనకు స్థానం లభించిందనుకుంటే పొరబడినట్లే. ఆయనలో రంగులూ, హంగులతోపాటు అపరిమిత ఉత్సాహం, కార్య శూరత్వం దండిగా ఉండేవి. సంపన్నుడైన బిజూ కుదురుగా ఒక మూల కూర్చోవాలని అనుకోకుండా సవాళ్ళతో సయ్యాటలాడటానికి రాజకీయాలలో కాలుమోపారు.

బిజూ ఒడిశా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి శుభారంభం పలికారు. రూర్కెలా ఉక్కు కర్మాగారం, పారదీప్‌ రేవు, హెచ్‌ఏఎల్‌ విమాన కర్మాగారం ఆయన కృషి వల్లనే ఆవిర్భవించాయి. బిజూ చొరవవల్లనే యునెస్కో ప్రతి ఏటా కళింగ అవార్డును ప్రధానం చేస్తుంది.

నంబరు 1 & నంబరు 2

బీజేపీకి అటల్‌బిహారీ వాజ్‌పేయి తిరుగులేని నాయ కుడుగా ఉన్న రోజుల్లో ఎల్‌.కె. అద్వాని నంబరు టూగా ఉండేవారు. నంబర్‌ 1 స్థానానికి నంబరు టూ వచ్చేస్తున్నారంటూ తరచూ వదంతులు వ్యాపిస్తుంటాయి కానీ, వాజ్‌పేయి, అద్వానీల విషయం వేరు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్నో పరిపాలన, రాజకీయ సంబంధమైన అధికారాలను అద్వానీకి దత్తం చేశారు. కొత్త క్యాబినెట్‌ మంత్రుల నియామకం గురించి వారికి తెలియపరిచింది పీఎంవో కాదు అద్వానీయే. వాజ్‌పేయి క్యాబినెట్‌కు సంబంధించి డజనుకుపైగా కమిటీలకు అద్వానీనే అధ్యక్షుడుగా నియమించారు. అంతేకాదు, దేశ భద్రత, ఆర్థిక వ్యవహారాలపై చర్చించడానికి అమెరికా, బ్రిటన్‌, సింగపూర్‌ వంటి ముఖ్య దేశాలను సందర్శించాల్సిందిగా తన ఉప ప్రధాని అద్వానీకి సలహా ఇచ్చారు కూడా. అద్వానీకి ఇలా పరిపాలన, రాజకీయ సంబంధమైన అధికారాలను దత్తం చేయడంవల్ల స్వదేశంలో, విదేశాల్లో వాజ్‌పేయిస్థాయి పెరిగిపోయిందే తప్ప తరగిపోలేదు.

వాజ్‌పేయి విదేశీ పర్యటనలు దౌత్యపరంగానేమి, వ్యక్తిగతంగా కూడా ఘన విజయం సాధించాయి. అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు జాక్విన్‌ షిరాక్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌లతో కలిసి సంభాషణలు జరిపినప్పుడు వాజ్‌పేయి ప్రాచ్యదేశపు కురువృద్ధ రాజనీతిజ్ఞుడుగా వెలిగి పోయారు. శాంతి సాధకుడుగా, చరిత్ర కర్తవ్య నిర్వాహకుడుగా, ఆసియాలో జవజీవాలు ఉట్టిపడుతున్న ప్రజాస్వామ్య దేశ నాయకుడుగా మన్ననలు పొందారు. ఇలా అంతర్జాతీయ స్థాయిని అందుకున్నారు. సమర్థుడైన ఉప ప్రధాని స్వదేశంలో వ్యవహారాలను నడిపిస్తుంటే రాజర్షి ప్రపంచ వేదికపై శాంతి సుస్థిరత స్క్రిప్టు రచించేవారు. ఆయన దృష్టి అంతా చరిత్ర నిర్మాణంపైనే కేంద్రీకృతమై ఉండేది.

నీడలో ఉండటాన్ని ఎక్కువకాలం భరించలేనివారు తిరుగుబాటు చేస్తారు. తమ నాయకుణ్ణి కూలదోస్తారు కానీ తాము నాయకత్వం దరిదాపులకు చేరలేదు. కానీ, అద్వానీ అలాకాదు, ఆయన నెంబర్‌ టూగా గుర్తించబడిన వ్యక్తి.

నెహ్రూతోసహా పూర్వ ప్రధానులందరూ పార్టీలో తమకు ప్రత్య ర్థులుగా ఎదుగగలవారిని చూసి అభద్రతా భావనకు లోనయ్యేవారు. వీలైతే వారిని తొలగించేయడానికి రకరకాల ఎత్తులువేసేవారు. నెహ్రూకు సర్ధార్‌పటేల్‌ను చూస్తే భయం. ఇందిరాగాంధీకి మొరార్జీ దేశాయ్‌ ఇతర సిండికేట్ల భయం. రాజీవ్‌గాంధీ, వీపీ సింగ్‌ను చూసి, పీవీ శరద్‌పవార్‌ను చూసి బెదిరేవారు. వాజ్‌పేయిలో ఇటువంటి అభద్రతా భావం ఎన్నడూ కనిపించలేదు. ఎందుకంటే మిత్రపక్షాలు అటల్‌జీ వెనుక ఉన్నాయి. కానీ బీజేపీ వెనుకకాదు. అద్వానీని సమర్థించేవారున్నారు, విమర్శించేవారున్నారు. కానీ ఆయన నాయకత్వాన్ని కాదన్నవారు లేరు.

హిట్లర్‌ పతనం:

త శతాబ్దంలో హిట్లర్‌ గొప్ప నియంతగా పేరు పొందాడు. కొన్ని విషయాలలో హిట్లర్‌ నాయకత్వం చాలా సమర్థతతోకూడిన ప్రభుత్వమని అంగీకరించతప్పదు. ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు దివాళా స్థితిలోఉన్న జర్మన్‌ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించాడు. ప్రపంచం అంతవరకు కనీవినీ ఎరుగనటువంటి సైనిక సంస్థను సృష్టించాడు. ఆ స్థాయిలో ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా గట్టివి. అవి కొంతకాలం సరైనవిగానే కనిపించాయి. ఒక్క దెబ్బతో ఫ్రాన్స్‌ను కొట్టివేశాడు. యూరప్‌ నుంచి బ్రిటన్‌ శక్తిని తరిమివేశాడు. ఒక దశవరకు హిట్లర్‌ నిర్ణయం తప్పు అని ఎవరు అనడానికి వీలులేదు. కానీ హఠాత్తుగా ఎందుకో హిట్లర్‌ ప్రపంచంలోకెల్లా శక్తిమంతమైనటువంటి రెండు దేశాలు అంటే రష్యా, అమెరికాలతో యుద్ధానికి దిగాడు. ఆ క్షణంనుంచి జర్మనీ స్థితి మారిపోయింది. ఇంత పెద్ద తప్పు ఎప్పుడూ ఏ ప్రభుత్వం చేసి ఉండదు. దానితో జర్మనీ విధి నిర్ణయమైపోయింది. పారిశ్రామికంగా, సైనికంగా బలంగా ఉన్నప్పటికీ జర్మనీకి వినాశనం తెచ్చి పెట్టింది. ఈ తప్పు దిద్దుకోవడానికి అలవికానటువంటిది. ఇలాంటి నిర్ణయాలు చేయడం నియంతల స్వభావంలో ఉంటుంది.

జి. వెంకటరామారావు

Other Updates