దేశంలో నివాసయోగ్యమైన, ఉపాధి కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై 34 నగరాల్లో జరిపిన సర్వేలో హైదరాబాద్ అత్యుత్తమమైన నగరంగా సర్వప్రథమ స్థానంలో నిలిచింది. హాలిడిఫై.కామ్ అనే వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో ఈ మేరకు నిర్ధారణ అయింది.
ఈ సైట్ ప్రధానంగా పర్యాటకులు, తమ ప్రాధాన్యతపై గమ్యస్థానాలను ఎంపిక చేసుకోవడానికి ఇబ్బందులు లేకుండా చేయడంలో తోడ్పడుతుంది. దేశంలోని అత్యుత్తమ నివాసయోగ్య నగరంగా ఎంపిక చేయడంలో సాంస్కృతిక సమ్మేళనం ప్రాతిపదికన రూపుదిద్దుకున్న నగరాలపై సర్వే చేయడం జరిగింది.
ఆయా నగరాల్లో పటిష్టమైన అవకాశాలు, సదుపాయాలు, చక్కని రీతిలో ఆర్థిక ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాలు అమలు, తదితర అంశాలతో సదరు సర్వే కొనసాగింది. ఈ మేరకు సాగిన సర్వేలో అయిదింట నాలుగు స్థానాలను ముంబాయి, పుణే, చెన్నయ్, బెంగళూరు నగరాలను, నిజాంలు నిర్మించిన హైదరాబాద్ అధిగమించింది. ఈ సర్వేలో వెల్లడైన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. సెప్టెంబరు నెల నుంచి మార్చి నెల వరకు హైదరాబాద్ లో పర్యటించడానికి విశిష్టమైన కాలంగా రుజువైంది. ఇక్కడి పర్యాటక కేంద్రాల్లో చరిత్రాత్మక చార్మినార్, గోల్కొండకోట, స్వప్నం సాకారమైనట్టుగా రూపుదాల్చిన రామోజీ ఫిల్మ్ సిటీ మొదలైనవి పర్యాటకుల దృష్టిని ఆకర్షించి తీరుతాయి. ఈ సర్వే ఫలితాల ఆధారంగా పర్యాటకుల అత్యధిక సంఖ్యలో నగరాన్ని సందర్శించేందుకు మార్గం సుగమమైంది. హైదరాబాద్ నగరం శరవేగంగా దక్షిణ భారత న్యూయార్క్ నగరంగా అభివృద్ధి చెందుతోందని, తెలంగాణలో పర్యటించే వారికి విశిష్ట గమ్యస్థానంగా సర్వేలో వ్లెడైంది.
ఆయా అంశాల ప్రాతిపదిక పై ఇప్పటివరకు జరిగిన పలు సర్వేల్లో హైదరాబాద్ నగరం సర్వ ప్రథమ స్థానాన్ని పొందింది. వివిధ సంస్థలు పలు దశల్లో జరిపిన సర్వేల్లో ఈ వాస్తవం వెల్లడైంది. 2020 లో విశిష్ట నగరాల ఎంపిక పై జరిగిన సర్వేలో హైదరాబాద్ నగరం మొదటి స్థానం పొందడంతో పాటు ఖండాంతరాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులను ఆకర్షించే నగరంగా గుర్తింపు పొందింది.