తిగుళ్ల అరుణ కుమారి
ప్రతి ఏడాదీ చైత్రమాసంలోని శుక్ల పక్ష నవమికి ఒక ప్రత్యేకత ఉంది. అదే శ్రీరాముడు పుట్టిన రోజు. అంతేకాదు శ్రీరాముడు సీతాదేవిని పరిణయమాడిన రోజు. ఇన్ని ప్రత్యేకతలు గల ఈ దినం సకల జగతికీ పండుగ దినం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
శ్రీ రాముడు అవతారపురుషుడు. త్రేతాయుగంలో రావణాసురుడి బాధతో ముల్లోకాలూ తల్లడిల్లిపోయాయి. రావణుని ఆగడాలతో దేవతలు ఎన్నో అగచాట్లకు గురయ్యారు. లోకాలన్నీ సంక్షోభానికి గురైనాయి. ఈ దశలో దేవేంద్రుడు దేవతా సమూహంతో వెళ్లి మహావిష్ణువును ప్రార్థించాడు. ముల్లోకాలకూ రావణుని పీడను లేకుండా చేయుమని వేడుకున్నారు. అప్పుడు మహావిష్ణువు వారిని అనుగ్రహించి, తాను భూలోకంలోని అయోధ్యానగరంలో దశరథ పుత్రునిగా పరిపూర్ణమానవునిగా అవతరిస్తాననీ, రావణుని సంహరిస్తాననీ, అంతదాకా వేచి ఉండుమనీ మహావిష్ణువు దేవతలకు అభయం ఇచ్చాడు. దేవతలు పరమ సంతోషంతో తమ నివాసాలకు వెళ్లి పోయారు. ఆ తరువాత మహావిష్ణువు దశరథుని పుత్రకామేష్ఠి యాగఫలంగా కౌసల్యాదేవి గర్భంలో చైత్ర శుద్ధ నవమినాడు జన్మించాడు. రాముడు జన్మించిన పుణ్యదినం కనుక ఈ దినాన్ని ‘శ్రీరామనవమి’ అని లోకం ప్రస్తుతించింది.
శ్రీరాముడు జన్మించిన సమయంలో జ్యోతిర్మండలం ఎలా ఉండిందో భోజమహారాజు తన చంపూరామాయణ కావ్యంలో ఇలా అద్భుతంగా వర్ణించాడు –
‘ఉచ్చస్థే గ్రహ పంచకే సురగురౌ సేందౌ నవమ్యాం తిధౌ
లగ్నే కర్కటకే పునర్వసుయుతే మేషం గతే పూషణి
నిర్దగ్ధుం నిఖిలాః పలాశసమిధః మేధ్యాదయోధ్యారణేః
ఆవిర్భూతమభూత పూర్వమఖిలం యత్కించిదేకం మహః |
శ్రీరామ జననం లోకకల్యాణం కోసం నిర్వహించే మహాయాగం వంటిది. ఆ యాగానికి అరణి (అగ్నిని మథించే స్థానం) అయోధ్యానగరం. ఆ నగరంలో ఒక ఉజ్జ్వల తేజస్సు (అగ్ని) ఆవిర్భవించింది. ఆ అగ్ని పేరే శ్రీరాముడు. ఆ తేజస్సు రాక్షసులు అనే మోదుగపుల్లలను యజ్ఞంలో దహించినట్లు కాల్చివేస్తుంది. ఆ తేజస్సు (శ్రీరాముడు) ప్రభవించిన పుణ్యవేళలో ఐదు గ్రహాలు జ్యోతిర్మండలంలో ఉన్నత స్థానంలో ఉన్నాయి. గురువు చంద్రునితో కలిసి ఉన్నాడు. కర్కాటక లగ్నంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తుండగా పునర్వసు నక్షత్రంలో శ్రీరామచంద్రుడు సకలలోక రక్షకునిగా అవతరించాడు.
శ్రీరామచంద్రుని గుణగణాలను గూర్చి కొనియాడని సాహిత్యం లేదు. సకల మానవాళికి శ్రీరాముడు ఆదర్శ పురుషుడు. మర్యాదా పురుషోత్తముడు. ఆకాశంలోని నక్షత్రాలవలె శ్రీరాముని లోని ఉత్తమ గుణాలు అసంఖ్యాకాలు. అవన్నీ జగతికి ఆరాధ్యాలు.
తల్లిదండ్రుల మాట జవదాటని పుత్రునిగా, స్నేహ సౌజన్యాలను సోదరులకు పంచిన అన్నగా, ఏకపత్నీవ్రతంతో భార్యకు సమున్నత స్థానాన్ని నిలిపిన భర్తగా, ప్రజల మాట వేదవాక్యంగా పాటించే పాలకునిగా, స్నేహానికి ప్రాణం ఇచ్చే మిత్రునిగా ఇలా అనేక రూపాలలో శ్రీరామచంద్రుడు అందరికీ ఉదాహరణీయుడైనాడు. లోకంలోని కవులందరూ తమ జీవిత కాలంలో రామగాథను రాసి తరించాలని కోరుకుంటారు. పరమ తపోమూర్తి వాల్మీకి నోట అప్రయత్నంగా వెలువడిన ‘మా నిషాద’ శ్లోకం రామాయణ మహాకావ్యం ఆవిర్భవించడానికి కారణం అయింది. వాల్మీకి నోట తాండవించిన సరస్వతీ మూర్తిని చూచి బ్రహ్మదేవుడే ప్రసన్నుడైనాడు. నారదుని ద్వారా రామగాథను తెలసుకొని మహాకావ్యాన్ని వ్రాయుమని వాల్మీకిని ఆశీర్వదించాడు. బ్రహ్మ అనుగ్రహంతో, నారదుని ఆశీస్సులతో వాల్మీకి, లోకోత్తర రీతిలో రామాయణాన్ని రచించి లోకానికి అందించి, కృతార్థుడైనాడు.
మహావిష్ణువు దశావతారాలలో ఏడవ అవతారం అయిన రామావతారం మానవజాతికి ఆదర్శ పాత్రం. మానవుడు ఎలా జీవించాలో ఆచరించి చూపిన మహనీయుడు శ్రీరాముడు. అందుకే అతని జన్మతిథిని మొదలుకొని తొమ్మిది దినాలపాటు వసంత నవరాత్రోత్సవాలను లోకమంతా ఆనందోత్సాహాలతో జరుపుకొంటుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వారకు, నవమి నుండి మొదలుకొని తొమ్మిది రోజుల వరకు రెండు విధాలుగా ఈ నవరాత్రోత్సవాలను జరిపే సంప్రదాయాలు లోకంలో వ్యాప్తి చెందాయి.
సీతారాముల కల్యాణం జగత్కల్యాణమే. శ్రీరామనవమి పర్వదినాన ప్రతి ఇంటిలోనూ, ప్రతి వైష్ణవ, శైవాలయాలలోనూ, ఇతర దేవాలయాలలోనూ, ధార్మిక మండళ్ల ప్రాంగణాలలోనూ నేత్ర పర్వాలుగా శ్రీరామకల్యాణోత్సవాలు జరుగుతాయి. రామాయణ ప్రవచనాలతో బాటు, హరికథలు, నృత్య సంగీత ప్రదర్శనలు, నాటకాలు ప్రదర్శిస్తూ రంగస్థల వేదికలు కన్నుల పండుగ చేస్తాయి.
శ్రీరామ నవమినాడు పూజలో వడపప్పు, బెల్లం పానకం నైవేద్యాలుగా పెడతారు. పండ్లూ, విసనకర్రలూ దానం చేస్తారు. చలువ పందిళ్లు వేస్తారు. చలివేంద్రాలను ఏర్పాటు చేసి, అందరి దాహం తీరుస్తారు. సీతారాముల కల్యాణం తమ ఇంటి పెళ్లి అన్నంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అందరూ.
శ్రీ సీతారాముల కల్యాణమహోత్సవంలో ముత్యాల తలంబ్రాలు పోసే ఘట్టం ఎంతో రమణీయంగా ఉంటుంది. దీనిని ప్రాచీనకవులు ఎంతో అద్భుతంగా వర్ణించారు.
‘జానక్యాః కమలామలాంజలిపుటే యాః పద్మరాగాయితాః
న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుందప్రసూనాయితాః
స్రస్తాః శ్యామలకాయకాంతికలితాః యా ఇంద్రనీలాయితాః
ముక్తాస్తాశ్శుభదా భవన్తు భవతాం శ్రీరామవైవాహికాః |
వధూవరులైన సీతారాములు పెళ్లిలో ఒకరి తలపై మరొకరు ముత్యాల తలంబ్రాలను చల్లుకొంటున్నారు. సీతాదేవి తన దోసిటితో తెల్లని ముత్యాలను పట్టుకొన్నది. ఆమె అరచేతులు కమలాలవలె ఎర్రగా ఉన్నందువల్ల తెల్లని తలంబ్రాలు ఎర్రగా కనబడినాయట. ఎర్రని తలంబ్రాలు పద్మరాగమణులవలె మెరుస్తున్నాయట. అవి రాముని తలపై పడగానే రాముని శరీరంలోని నీలమేఘకాంతితో తాదాత్మ్యం చెంది కుందపుష్పాల వలె రూపొందాయట. క్రమంగా రాముని నీలమేఘశ్యామ శరీరం నుండి క్రిందకు జారుతూ, ఇంద్రనీలమణులవలె వెలుగొందాయట. అలాంటి తలంబ్రాలు లోకానికి సుఖశాంతులను అందిస్తాయని తెలిపే ఈ వర్ణన మనోహరమై రామకల్యాణ పరమార్థాన్ని తెలియజేస్తున్నది.
వివాహంలో పెళ్ళికూతురు తండ్రిని కన్యాదాత అంటారు. పెళ్లి కొడుకును ప్రతి గ్రహీత అంటారు. వరునికి తన కుమార్తెను దానం చేసి గృహస్థాశ్రమాన్ని నిలుపుతున్న కన్యాదాత ఎంతో పుణ్యాత్ముడు. అలాగే కన్యను చేపట్టి, గృహస్థాశ్రమ ధర్మంకోసం పెండ్లి చేసుకొంటున్న వరుడు ఎంతో ధన్యజీవి. రెండు కుటుంబాలూ లోకానికి ఒక ఆదర్శవంతమైన జీవన విధానాన్ని అందిస్తున్నాయి. వివాహ ప్రక్రియ లోకంలో ధర్మాన్ని నిలిపేదే కాకుండా సంతాన వృద్ధినీ, వంశాభ్యుదయాన్నీ సాధించే పవిత్ర ప్రధాన కర్మ.
వివాహానంతరం సీతారాములు అన్యోన్య దాంపత్యంతో లోకానికి ఆదర్శపాత్రులైనారు. పతి యోగక్షేమాలను నిరంతరం కాంక్షించిన పరమ సాధ్వి సీతాదేవి. పత్నిని తన జీవిత సర్వస్వంగా భావించిన పవిత్రాత్ముడు శ్రీరాముడు.సూర్య చంద్రనక్షత్రాలు వెలుగుతూ ఉన్నతకాలం నిలిచిపోయే పుణ్యచరితులు సీతారాములు. రామునిలా బ్రతకాలని ప్రతి మనిషీ కోరుకుంటాడు. ఇదీ రాముని విశిష్టత! రాముణ్ణి ఆదర్శంగా తీసుకొని పరిపాలకులు తమ పాలనను కొనసాగిస్తే ఈ పవిత్ర భూమండలం అంతా రామరాజ్యమే అవుతుంది!
వివాహానంతరం సీతారాములు అన్యోన్య దాంపత్యంతో లోకానికి ఆదర్శపాత్రులైనారు. పతి యోగక్షేమాలను నిరంతరం కాంక్షించిన పరమ సాధ్వి సీతాదేవి. పత్నిని తన జీవిత సర్వస్వంగా భావించిన పవిత్రాత్ముడు శ్రీరాముడు.సూర్య చంద్రనక్షత్రాలు వెలుగుతూ ఉన్నతకాలం నిలిచిపోయే పుణ్యచరితులు సీతారాములు. రామునిలా బ్రతకాలని ప్రతి మనిషీ కోరుకుంటాడు.
ఇదీ రాముని విశిష్టత!