చరిత్రలో
ఏ ఉద్యమానికైన తన అస్తిత్వమే ఆలంబనగా ఉంటుంది. అలాంటి ఉద్యమచైతన్యం తెలంగాణది. ఆ ఉద్యమానికి ఆలంబన సాహిత్యం. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో సాహిత్యం ప్రజల్ని చైతన్యపరిచింది. తన అస్తిత్వం కోసం గళమెత్తి గర్జించింది.తెలంగాణ ప్రజల ఆర్తిని, ఆకాంక్షలను కవులు ఆనాడే కథలు, కవిత్వంగా మలిచారు.తమ ఆవేదనను కవితలుగా మలిచి తొలిదశ తెలంగాణా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ సాయుధ పోరాటకాలం నుంచి తెలంగాణ ఉద్యమం సాగినంత కాలం కవులు వేగుచుక్కలై బాసటగా నిలిచారు.
ఏ ఉద్యమానికి లేని చరిత్ర ఒక్క తెలంగాణకున్నది.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ కవులు క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఎందరో కవులు గళమెత్తారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో తమ గళాల్ని గట్టిగా వినిపించిన వారిలో కాళోజి నారాయణరావు, దాశరథి, వేముగంటి నరసింహచార్యులు, కసిరెడ్డి వెంకటరెడ్డి, రుక్నుద్దీన్, జి.యాదగిరి,సుద్దాల హన్మంతు, పేర్వారం జగ న్నాధం, కోవెల సంపత్కుమారాచార్య, కోవెల సుప్రసన్నాచార్య, మగ్దూం, వానమామలై వరదాచార్యులు, మేర శ్రీశైలం,ఐనాల శ్రీహరి,భాసిరి సాంబశివరావు,డా||ముకురాల రామారెడ్డి, టంకశాల అశోక్, మాదిరాజు రంగారావు, పల్లాదుర్గయ్య, వి.ఆర్.విద్యార్ధి మొదలగువారు తెలంగాణ ఉద్యమాన్ని తమ తమ కవిత్వంతో నడిపించారు.
తెలంగాణ తొలిదశ ఉద్యమం ప్రధానంగా 1969 నుంచి ప్రారంభమైంది.1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండే ఆంధ్ర ప్రాంత పాలితులు పెద్దమనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కడంతో తెలంగాణ ఉద్యమం క్రమంగా మొదలైంది. తెలంగాణ అస్తిత్వం కోసం,స్వీయరక్షణ కోసం ఏర్పాటుచేసిన ఈ ఒప్పందాన్ని ఎలా ఉల్లంఘించారో చరిత్ర మనకు చెబుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొనే తెలంగాణ ఉద్యమం తెరపైకి వచ్చింది.ఈ ఉద్యమసందర్భంలో ఎంతోమంది కవులు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల్ని ఎదిరించారు.కవిత్వమై ప్రవహించారు.
ఇంకా తెలంగాణ తొలిదశ ఉద్యమంలో స్వయంగా పాల్గొన్నవారు, ఉద్యమస్ఫూర్తితో రచనలు చేసినవారు చాలామంది ఉన్నారు. ఈ తెలంగాణ ఉద్యమానికి కాళోజి నారాయణరావు వేగుచుక్క అనడంలో అతిశయోక్తిలేదు. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా అక్కడ కవితా జెండాయై, ధిక్కారపతాకమై వెలిశాడు. కాలంతో పయనిస్తూ నిత్యం ప్రజా సమస్యలే ఎజెండాగా స్వీకరిస్తూ రచనలు చేసినవాడు. ఇతర కవులతో నడుస్తూనే వైవిధ్యమైన రచనలు చేసిననాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి రాస్తూ
తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్తా
తెలంగాణ వేరైతే తెలుగు బాస మరుస్తారా
అని సూటిగా ప్రశ్నించినవాడు. అంతేకాదు
వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది
వేరై కూడా తెలంగాణ వీర తెలంగాణ ముమ్మాటికి
అనగల సమర్థుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిన కవియోధుడు కాళోజి నారాయణరావు.
కాళోజి తర్వాత పేర్కొనగలవాడు దాశరధి.తెలుగు సాహిత్యంలో తనదైన బాణిని, వాణిని బలంగా వినిపించిన కవి దాశరథి తెలంగాణ ఉద్యమంతో పోటీపడి నడిచినవాడు. ఉద్యమాన్ని కళ్ళారా చూసినవాడు ఉద్యమ చిత్రాన్ని కవిత్వంతో ముందుకు పూరించినవాడు దాశరధి. దాశరథి అనంగానే మనకు రుద్రవీణ,అగ్నిధార గుర్తుకువస్తాయి. తెలంగాణ సాహిత్యంలో కవిత్వాన్ని పరవళ్ళు తొక్కించిన మహాకవి దాశరధి.
నేనురా తెలంగాణ నిగళాలు తెగగొట్టి
ఆకాశమంత యెత్తార్చినాను
నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు
పాడి మానవుని కాపాడినాను
అంటూ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాడు.
1969 తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆచార్య కె.రుక్నుద్దీన్, జి.యాదగిరిలు అనేక కవిత్వాలు, పద్యాలు రాశారు. వాటిని జై తెలంగాణ విప్లవఢంకా పేరుతో వెలువరించారు. ఇందులో తెలంగాణాకు జరుగుతున్న అనేక అన్యాయాన్ని తమ కలాలచే దునుమాడారు.
అన్నదమ్ములము ఆప్తమిత్రుల మటంచు చేరినారు
పొట్టకూటికై వచ్చినవారలు గట్టిపడిరి మనలో
కపట నీతులను ద్రోహచర్యలను కడుపులోన నుంచి
దొంగల తీరును తెలంగాణములను దోపిడే చేశారు.
ఈ కవిత రుక్నుద్దీన్‌ది.ఆంధ్రపాలకులకు తెలంగాణాను ఎలా మోసం చేసిందీ రాశారు.
1969 తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన ఉద్యమవీరులను తలుస్తూ జి.యాదగిరి అమరుల సాక్షిగా తెలంగాణ పోరాటం సాగిస్తామన్నారు.
నీ రక్తంతో తడిసిన గుడ్డలె విప్లవజండగ
నీదుమాట కన్నీటితో క్రాంతిజ్యోతి వెలగించుచు
తెలుగునాట వీట విప్లవశంఖాలు
నోట పూరిస్తాం! తెలంగాణ నినాదాలు కావిస్తాం
అంటూ తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగిస్తామంటూ ప్రతిన బూనుతాడు.1969 తెలంగాణ ఉద్యమంలో అమరులైన విద్యార్థుల వీరమరణం గురించి రాసిన కవిత ఇది. అమరుల త్యాగాలను సంస్మరిస్తూ వారి స్ఫూర్తితో తెలంగాణ కోసం పాటుపడుతామన్న బలీయ మైన ఆశయాన్ని ఆవేదనగా చెబుతాడు.ఆనాటి ఆంధ్రపాలకుల వైఖరిని నిరంకుశ పాలనని యాదగిరి తన కవిత్వంలో ఎండగడతాడు.
అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డి తెలంగాణ ప్రజలకు చేసిన అన్యాయాన్ని బాసిరి సాంబశిబరావు ఘాటుగానే విమర్శించాడు.
తెలంగాణ కన్యాయం
చేతులార చేసినోడు
ఇల్లు తగలబడుతుంటే
ఢిల్లీ నగరాల వెళ్ళి
అల్లరి లేదంచు చెప్పు
కల్లలాడు కపటివాడు
అంటూ కాసు బ్రహ్మానందరెడ్డి తెలంగాణకు చేసిన అన్యాయాన్ని బాహాటంగానే ప్రతి ఘటించాడు.తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్నప్పటికీ కేంద్రానికి ఏం లేదని చెప్పడం తెలంగాణ పౌరుషమున్న కవులను తీవ్రంగా కలిచివేసింది. అందుకే కాసును ‘కాసుబ్రహ్మనందం కాదు మోసపు ప్రతి రూపువాడు’ అని తీవ్రంగా విమర్శించాడు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించిన మరో కవి మేర మల్లేశం.
వీర తెలంగాణ యిదిగో సలాం
నీకు తగదు ఆంధ్రతో గులాం
పన్నెండు వత్సరాలు పిచ్చిలో పడి ఉంటిమో
లుచ్చలైన ఆంధ్ర ప్రభువుల మత్తు తెలుసుకుంటిమి
చిత్తు చేసి తీరుతాంలే
పొత్తు మనకు పొసగదింకలే
అంటూ ఆంధ్ర ప్రాంతాల పైత్యాన్ని అనాడే గుర్తెరిగిన కవి మల్లేశం ఎప్పటికైనా తెలంగాణ తప్పదన్న భరోసా ఈ కవిత్వంలో క్రాంతదర్శిగా దర్శించాడు. ఎప్పటికైనా తెలంగాణ తెచ్చుకుంటామన్న కవివాక్కు నేడు నిజమైంది.
కవి ఆశాజీవి. క్రాంతదర్శి.తెలంగాణను ఆనాడే ఊహించి ఎంతోమంది కవులు కవిత్వం రాశారు. తెలంగాణ ఉద్యమకవి అనుముల శ్రీహరి తెలంగాణను పాలిస్తున్న ఆంధ్రపాలకుల మీద విప్లవశంఖం పూరించాడు.
తెలంగాణమే విడికాకుంటే
అంతా ఆంధ్రుల దాసులమే
తెలంగాణమే విడికాకుంటే
ఇతరుల దృష్టికి నీచులమే
అంటూ తెలంగాణ విడిపోకుంటే ఎప్పటికైన ఆంధ్రులకు దాసోహమేనన్న హెచ్చరికను చేశాడు. ఇదే కవితలో కవి తెలంగాణ ఆకాంక్షను బలీయంగా చాటాడు.
తెలంగాణ కోసం అందరు ఉవ్వెత్తున ఎగిసిపడితే తెలంగాణ రాక తప్పదన్న ఆర్తిని తనకవిత్వంలో వినిపించాడు.
అంబరాలు దద్దరిల్ల
పులిగర్జన చేయండి
పొలికేకలు పెట్టండీ
ఉరుములోన కొస ఊపిరి
ఉన్నదాక పోరండీ
విజయలక్ష్మి వరిస్తుంది
విజయలక్ష్మి వరిస్తుంది
అంటూ అనాడే తెలంగాణ తథ్యమన్న ఆకాంక్షను వెలిబుచ్చాడు. కవి వాక్కు నిజమైంది. తెలంగాణ స్వప్నం సాకారమైంది.
తెలంగాణ ఉద్యమానికి కాసు బ్రహ్మానందరెడ్డి ఎట్లా తూట్లు పొడిచాడో జి.వి. జగదీశ్వరస్వామి కళ్ళకు కట్టాడు.
దెబ్బతిన్న తెలంగాణ దీక్ష వదిలిపెట్టదురా
కాసూ నీ గుంట నక్క మోసమింక సాగదురా !
మానదురా తెలంగాణ మనసులోని గాయం
కాసూ! త్వరలోనే నీకు కాటి యాత్ర ఖాయం.
అన్న ఆక్రోశం కవిది. తెలంగాణ సమాజాన్ని కించపరిచిన ఆనాటి కాసు ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలను మానని గాయం చేసినవాడు. కాసుకు ఎప్పటికైన కాటియాత్ర తప్పదంటూ ధైర్యంగానే గాండ్రించినవాడు జగదీశ్వర్‌స్వామి.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అమరులైన విద్యార్థుల ఆర్తిని, ఆవేదనను ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి తన కళ్ళముందు జరిగిన కాల్పులను చూసి ఆవేదనతో రాసిన కవిత్వమిది
తెలుగు పేరిట తెలివిపరులై
పెత్తన మ్మొనరించు ధూర్తులు
తెలంగాణము నేలుచుండిరి – రక్తసిక్తము చేయచుండిరి
త్యాగ వీరులు లెండిలెండిక – మూగ వీణలు మీటరండిక
అంటూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసే ఉద్యమవీరులను అడుగువేయమంటున్నాడు.
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిన మరో కవి భార్గవ.
విడదీయరా తెలంగాణ చిక్కు
విడిచి వేయండి విశాలాంధ్ర వట్టి తుక్కు
ఇక ప్రత్యేక తెలంగాణయే మాకు దిక్కు
ప్రత్యేక తెలంగాణయే మా జన్మహక్కు
అంటూ ప్రత్యేక తెలంగాణయే శరణ్యమంటాడు. విశాలాంధ్ర పని అయిపోయిందని తెలంగాణే దిక్కని చాటుతాడు.
విశాలాంధ్ర పదమే తెలంగాణకు ముప్పు తెచ్చిపెట్టింది. దీని పేరుతో తెలుగు వాళ్ళంతా ఒక్కటేనన్న భావనను ఆనాటి పాలకులు కల్గించారు. అది కొద్ది రోజులలోనే తేటతెల్లమైపోయింది. అందుకే విశాలాంధ్ర వద్దు తెలంగాణనే ముద్దు అన్న బలీయమైన కాంక్ష బయలుదేరింది. కవులే ఈ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలవడం తెలంగాణ పోరాటాన్ని తెలియజేస్తుంది.
విశాలాంధ్ర పుట్టింది
విషాదం తెచ్చింది
మా పాలిట హక్కులను
మంట కలుపబట్టింది
అన్న ఎం.శేషభూషణ్ వాక్కులు అక్షరసత్యాలు. కళ్ళారా కనిపిస్తున్న పాలకుల నిరంకుశవైఖరిని ఈ కవిత ఎండగట్టింది. తెలంగాణ ప్రజల హక్కులను విశాలాంధ్ర రాజ్యం ఎలా కాలరాసిందో తేటతెల్లం చేసింది.
తెలుగు జాతి ఒక్కటని, తెలుగు వాళ్ళంతా అన్నదమ్ములని చాటింపు వేసిన ఆనాటి విశాలాంధ్ర రాజ్యం చివరికి ఎటువైపు నిలిచిందో తెలంగాణ ప్రజలు ఆనాడు బాగానే అర్థం చేసుకున్నారు.
తెలుగు వాళ్ళు ఒకటంటూ
విడిపోని సంస్క ృతియంటూ
నమ్మించి మోసగించే
నయవంచకులు మరీ
అంటూ నమ్మించి మోసగించే సంస్కృతి ఆంధ్రపాలకులదన్న నగ్నసత్యాన్ని ఎం.రాజేంద్రప్రసాద్ వెలుబుచ్చుతాడు.
ఆనాటి కాసు ప్రభుత్వంలో ఉన్న తెలంగాణా రాజకీయ నాయకులను కూడా కవులు వదిలిపెట్టలేదు.
కన్నతల్లి తెలంగాణ కేకనువ్వు వినలేదా
చీమునెత్తురు వుడిగిన చపలుడివలె చస్తావో
వీరత్వం పొంగిపొరలి వురుకులతో వస్తావో
వడివడిగా తేల్చుకో వళ్ళు తెలిసి మసలుకో
అంటూ ఆనాటి కవులు సింహగర్జన చేశారు. మౌనంగా ఉండి పోయిన తెలంగాణ రాజకీయ నాయకుల ద్రోహత్వాన్ని కె. ప్రభాకర్ ఆనాడే తూర్పారబట్టాడు. తెలంగాణతల్లికి చేస్తున్న ద్రోహాన్ని తెలుసుకొని ఉద్యమంలో అడుగేయమంటాడు. ఇంకా ఆనాటి తెలంగాణ ఉద్యమాన్ని తన కలంలో నింపి రచనలు చేసినవారు, తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచినవారు చాలా మంది ఉన్నారు. వారి స్పూర్తియే తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊతమిచ్చింది. మలిదశ ఉద్యమం తొలిదశ ఉద్యమ అడుగుజాడలో నడిచి తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణకు కారణమైంది.
డా|| బీంపల్లి శ్రీకాంత్