శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే
tsmagazine

ప్రభుత్వాలు భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరపాలనుకున్నప్పుడు వాటికి వ్యతిరేకంగా దేశంలో ఉద్యమాలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. భారీ ప్రాజెక్టులకు ప్రత్యామ్నాయంగా వారు వాటర్‌ షెడ్‌ పథకాలని, చిన్ననీటి వనరుల అభివృద్ధిని సూచించడం జరిగేది. దేశంలో నదులన్నీ రుతుపవనాలు చురుకుగా కదిలే నాలుగు నెలల కాలంలోనే అంటే జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మాసాల్లోనే ప్రవహిస్తాయి. ఆ తర్వాత నదులన్నీ ఎండిపోతాయి. హిమాలయ నదుల్లో మాత్రం మంచు కరిగి కొద్దిపాటి ప్రవాహాలు ఉంటాయి. ఉత్తర భారత దేశంలో ఉన్న నదులు హిమాని నదులు కాబట్టి సెప్టెంబరు తర్వాత నదుల్లో లభ్యమయ్యే కొద్దిపాటి నీటిని వాడుకునే అవకాశం సంవత్సరం పొడుగూతా ఉంటుంది. రుతుపవనాల మీదనే ఆధారపడి మన వ్యవసాయం కొనసాగు తుంది. కాబట్టి వర్షాకాలం అనంతరం వ్యవసాయం సాగాలన్నా, తాగునీటి అవసరాలు తీరాలన్నా నాలుగు నెలల కాలంలో నదుల్లో ప్రవహించే నీటిని ఒడిసి పట్టుకొని నిల్వ ఉంచుకోవలసిన అవసరం ఉన్నది. పెద్ద నదుల్లోని ప్రవాహాలని ఒడిసి పట్టడానికి పెద్ద డ్యాంల నిర్మాణం చెయ్యాలి.

17వ శతాబ్దం చివరి దశకాల దాకా పెద్ద నదులని ఒడిసిపట్టడానికి పెద్ద డ్యాంల నిర్మాణ సాంకేతికత దేశంలో లేదు. ఈ సాంకేతికతను బ్రిటిష్‌ వారు దేశంలోకి తీసుకువచ్చే వరకు మన ప్రజలు చిన్ననీటివనరుల అభివృద్ది పైననే ఆధారపడినారు. దక్షిణ భారత దేశంలో చిన్న నీటి వనరుల అభివృద్ధి ప్రాచీన కాలం నుంచి ఉన్నదే. తెలంగాణలో చెరువులు, ఆనకట్టలు, కత్వల నిర్మాణం అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో సాగిందని మనందరికి తెలిసిందే. అయితే నిజాంల కాలంలో హైదరాబాద్‌ రాష్ట్రంలో నిజాంసాగర్‌, కడెం లాంటి పెద్ద డ్యాంలు, సదర్‌మాట్‌, ఘణపూర్‌ ఆనకట్ట, పోచారం, పాలేరు, వైరా, సరళాసాగర్‌, డిండీ తదితర మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణం కూడా జరిగింది. ఆ తర్వాత నాగార్జునసాగర్‌, శ్రీరాంసాగర్‌, శ్రీశైలం, జూరాల, ఎల్లంపల్లి తదితర భారీ డ్యాం నిర్మాణం రాష్ట్రంలో జరిగింది. వీటి నిర్మాణం జరుగుతున్నప్పుడు పెద్దగా నిర్వాసితుల ఉద్యమాలు రాలేదు. కాని వీటి తర్వాత ఎనభై, తొంబై దశకాల్లో దేశంలో నిర్మాణం అయిన భారీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిర్వాసితుల ఉద్యమాలు, పర్యావరణ పరిరక్షకుల నుంచి వ్యతిరేకతలు వెల్లువెత్తినాయి. వీటిలో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో నిర్మించిన తెహ్రీ జలవిద్యుత్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుందర్‌ లాల్‌ బహుగుణ నడిపిన ఉద్యమం, నర్మాదా నదిపై మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్రా ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించిన సర్ధార్‌ సరోవర్‌, ఇందిరాసాగర్‌, ఓంకారేశ్వర్‌ డ్యాంలకు వ్యతిరేకంగా మేధా పాట్కర్‌ నడిపిన ఉద్యమాలు అంతర్జాతీయ స్థాయిలో బహుళ ప్రచారం పొందినాయి. వీరి ఉద్యమాల వలన ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోలేదు. ప్రాజెక్టులు కోర్టుల్లో నలిగిపోయి వాటి అంచనా వ్యయం పెరిగిపోయి ప్రజల మీద భారం పెరిగింది. అంతిమంగా ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేసుకొని వాటి నిర్దేశిత లక్ష్యాలను నెరవేరుస్తునాయి. ఉద్యమకారులకు మాత్రం అంతర్జాతీయ బహుమతులని సంపాదించి పెట్టినాయి. వారిని సెలెబ్రిటీలుగా నిలబెట్టినాయి.

భారతదేశం లాంటి రుతుపవనాల మీద ఆధారపడిన వ్యవసాయిక దేశానికి పెద్ద జలాశయాల అవసరాన్ని కాదనడానికి వీల్లేదు. భూగర్భ జలాలను కలుపుకొని చిన్నతరహా నీటి వనరులు స్థానిక అవసరాలను తీర్చగలవు కాని విద్యుత్‌ ఉత్పత్తికి ,పెరుగుతున్న దేశ జనాభాఆహార భద్రతకి హామీ పడలేవు. గత రెండు సంవత్సారాలు మనం చూసినప్పుడు కరువు పరిస్థితులను ఎదుర్కొనడానికి చిన్ననీటివనరులు సరిపోవు అని అర్థం అవుతుంది. స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలో సాగు భూమి9.7 మిలియన్‌ హెక్టార్లు..అది 1997 జూన్‌ నాటికి 80.76 మిలియన్‌ హెక్టార్లకు పెరిగింది. ఇందులో పెద్ద డ్యాంల కింద సాగవుతున్న భూమి 28.44 మిలియన్‌ హెక్టార్లు. చిన్ననీటి వనరుల కింద 10.82 మిలియన్‌ హెక్టార్లు మాత్రమే. ఇక భూగర్భ జలాలపై 41.50 మిలియన్‌ హెక్టార్లు నమోదు అయ్యింది. 1947 నాటికి మన దేశ జల విద్యుత్‌ ఉత్పత్తి కేవలం 508 మె.వా మాత్రమే. 1999 నాటికి అది 22,438 మె.వా స్థాయికి పెరిగింది. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా భాక్రానంగల్‌, నాగార్జునసా గర్‌, శ్రీరాంసాగర్‌, హీరాకుడ్‌, దామోదర్‌ వ్యాలీ ప్రాజెక్టులు మనం నిర్మించి ఉండకపోతే ఈనాడు మనం ఇటు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో గానీ, అటు జల విద్యుత్‌ ఉత్పత్తిలో గానీ స్వయం సమద్ధి సాధించేవాళ్ళం కాదు. పెద్ద డ్యాంల వలన నమ్మకమైన నీటి సరఫరా, విద్యుత్‌ ఉత్పత్తి, వరద నియంత్రణ, అంతర్గత నౌకాయానం, చేపల పెంపకం, టూరిజం తదితర బహుళ ప్రయోజనాలు వుంటాయి.

వీటితో పాటు కొన్ని సమస్యలు కూడా వుంటాయి. ముంపు, నిర్వాసితత్వం, పర్యావరణ సంబంధిత సమస్యలు పెద్ద డ్యాంల వలన వుంటాయి. పెద్ద డ్యాంలలో నిర్వాసితులుగా వున్న ప్రజలకు పునరావాసం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కావడంతో నిర్వాసితుల ఉద్యమాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆ ఉద్యమాలకు లెజిటమసీ వచ్చింది. బహుశా దేశవ్యాప్తంగా వెల్లు వెత్తిన ఈ ఉద్యమాల ఫలితంగానే 2013 పునరావాస చట్టం వచ్చిందని చెప్పవచ్చు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా పెద్ద ప్రాజెక్టులు ప్రజలకు ఉరితాళ్ళుగా మారిన పరిస్థితి ఏర్పడింది. అయితే దేశంలో పెద్ద డ్యాంల నిర్మాణం ఆగలేదు. ఈ రోజు తెహ్రీ, నర్మదా నదిపై నిర్మించిన ఇందిరాసాగర్‌, సర్ధార్‌ సరోవర్‌ డ్యాంలు పూర్తి అయిన తర్వాత వాటి నిర్ధేశిత లక్ష్యాలను నెరవేరుస్తూనే ఉన్నాయి. నర్మదా నది పై నిర్మించిన ఇందిరా సాగర్‌ , సర్ధార్‌ సరోవర్‌ డ్యాంలపై పర్యావరణ పరమైన ఆందోళనలు, కేసుల వలన డ్యాంల నిర్మాణం ఎన్నో సంవత్సరాలు వాయిదాపడ్డాయి. ముంపు సమస్యను, పర్యావరణ సమస్యను చూపిస్తూ ప్రాజెక్ట్‌ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేసినా నేడు చాలా వరకు పూర్తయింది. అంతిమ లక్ష్యం 206 టి.ఎం.సి.ల లైవ్‌ స్టోరేజి, 321 టి.ఎం.సి.ల వినియోగంతో 44 లక్షల ఎకరాలకు సాగునీరు, 11,000 గ్రామాలు 180 పట్టణాలకు తాగు నీరు ఇవ్వాలన్న లక్ష్యంతో గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును దశల వారిగా పూర్తి చేసింది. ప్రాజెక్టు వలన 244 గ్రామాలు 86,088 ఎకరాల భూమి ముంపుకు గురైంది. 50,000 మంది నిర్వాసితులైనారు. అయితే ప్రాజెక్టు నిర్మాణం దశల వారిగా కొనసాగుతుండటం వలన 2014-15 సంవత్సరం నాటికి గుజరాత్‌ లో 5 లక్షల ఎకరాలకు, రాజస్థాన్‌ లో 3.8 లక్షల ఎకరాలకు సాగు నీరు, 8000 గ్రామాలకు, 160 పట్టణాలకు తాగు నీరు సరఫరా చేయడం జరిగింది. అక్టోబర్‌ 2016 నాటికి 33 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి మైనర్లు, ఫీల్డ్‌ ఛానల్స్‌ సిద్ధం అవుతాయని గుజరాత్‌ ప్రభుత్వ రికార్డులు తెలుపుతున్నాయి.

విదేశాలలో కూడా…

ఇతర దేశాల అనుభవాలను పరిశీలిస్తే ఇటువంటి పర్యావరణవాదుల నుంచి వ్యతిరేకతలు ఎదుర్కొన్న సందర్భాలు కనిపిస్తాయి. ఈజిప్ట్‌లో నిర్మించిన హై ఆస్వాన్‌ డ్యాం నిర్మాణం పట్ల పర్యావరణవేత్తలు ఈ డ్యాం కడితే నైలు నది పర్యావరణం సర్వనాశనం అవుతుందని గుండెలు బాదుకున్నారు. 1960-69 మధ్య నిర్మించిన ఈ డ్యాం 2100 మె.వా. విద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్నది. ఈజిప్ట్‌ దేశం మొత్తం ఆహార భద్రతకు పూచీ పడుతున్నది. ఒకసారి డ్యాం నిండితే నాలుగేండ్లు వరద రాకపోయినా ఈజిప్ట్‌ వ్యవసాయాన్ని కాపాడుతుంది. 1980- 87 నుంచి ఆఫ్రికా ఖండాన్ని అతలాకుతలం చేసిన తీవ్ర కరువు పరిస్థితుల్లో ఆస్వాన్‌ డ్యాం ఈజిప్ట్‌ని కరువు బారిన పడకుండా కాపాడింది. ఆస్వాన్‌ డ్యాం లేనట్లయితే ఈజిప్ట్‌ని కూడా కరువు కబళించి ఉండేది. అన్ని అడ్డంకులను, వ్యతిరేకతలని ఎదుర్కొని ఆనాటి ఈజిప్ట్‌ అధ్యక్షుడు నాజర్‌ డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేసినాడు. అది ఈనాడు ఆఫ్రికా ఖండంలో ఈజిప్ట్‌ని సంపద్వంతమైన దేశంగా మార్చింది. దేశ ఆహార భద్రతకు పూచీ పడింది. ఆస్వాన్‌ డ్యాం నిర్మాణానికి 625 మిలియన్‌ డాలర్లు వెచ్చించినారు. ఆస్వాన్‌ డ్యాం తనపై పెట్టిన ఈ భారీ ఖర్చుని ఆణా పైసలతో తన సేవల ద్వారా ఒకే సంవత్సరంలో తిరిగి చెల్లించిందని విశ్లేషకులు ఇప్పటికీ భావిస్తారు.

ఇక పెద్ద డ్యాంల నిర్మాణంలో చర్చనీయాంశం అయ్యింది చైనాలో నిర్మించిన త్రీ గార్జెస్‌ డ్యాం. పర్యావరణవేత్తలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత గగ్గోలు పెట్టినా వాటిని బేఖాతరు చేసి చైనా ప్రభుత్వం ప్రపంచంలోనే 22,500 మె.వా. సామర్ధ్యం కలిగిన అత్యంత భారీ జల విద్యుత్‌ ప్రాజెక్టును నిర్మించింది. 2008 నాటి లెక్కల ప్రకారం త్రీ గార్జెస్‌ డ్యాంలో 12 లక్షల 40 వేల మంది నిర్వాసితులైనారు. వారందరికీ కొత్తగా నిర్మించిన నగరాల్లో, లేదా ఇతర నగరాల్లో పునరావాసం కల్పించినారు. ముంపులోకి వచ్చిన 13 నగరాలు, 140 పట్టణాలు, 1350 గ్రామాలు, 1300 చారిత్రిక స్థలాలని వేరే చోటికి తరలించినారు. 24500 హెక్టార్ల పంట భూమి ముంపు బారినపడింది. జలాశయం పొడవు 660 కి.మీ, వెడల్పు 1.12 కి.మీ, జలాశయం విస్తీర్ణం 1350 చదరపు కి మీ, నీటి నిల్వ 39.9 ఘనపు కి మీ. (1388టి ఎం సి). ప్రాజెక్టు నిర్మాణానికి 22.50 బిలియన్‌ అమెరికా డాలర్లు ఖర్చు చేసింది. ఈ ఖర్చంతా రానున్న 10 సంవత్సరాల్లో విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా డ్యాం తిరిగి చెల్లింస్తుందని చైనా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత భారీ జల విద్యుత్‌ ప్రాజెక్ట్‌ వలన ఏటా 31 మిలియన్‌ టన్నుల బొగ్గు వినియోగం తగ్గనున్నది. ఫలితంగా 100 మిలియన్‌ టన్నుల గ్రీన్‌ హౌజ్‌ గ్యాస్‌ ఉద్ఘారాలు,కొన్ని మిలియన్‌ టన్నుల పొడి రేణువులు, ఒక మిలియన్‌ టన్నుల సల్ఫర్‌ డై ఆక్సైడ్‌, 3,70,000 టన్నుల నైట్రిక్‌ ఆసిడ్‌, 10,000 టన్నుల కార్బన్‌ మోనాక్సైడ్‌, తగినంత పరిమాణంలో పాదరసం వాతావరణంలోనికి పోకుండా నిరోధించగలుగుతుంది.

660 కి.మీ పరిధిలో అంతర్గత నౌకాయానం అభివృద్ధి అయ్యింది. చవకైన రవాణా మార్గాలు ఏర్పడినాయి. టూరిజం గణనీయంగా పెరిగి ప్రజలకు ఉపాధి కలుగజేస్తున్నది. జలాశయం నిర్మాణం వలన ముంపు బారినపడిన ప్రాంతంలో 1990వ దశకంలో 13000 చదరపు కి.మీ. గ్రీన్‌ కవర్‌ని కోల్పోయింది. అయితే చైనా ప్రభుత్వం చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం వలన గ్రీన్‌ కవర్‌ 2008 నాటికల్లా 6000 చదరపు కి.మీ. పెరిగినట్లు ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ ప్రకటించింది.

ఇవ్వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టి.ఎం.సి. ల సామర్థ్యంతో మల్లన్నసాగర్‌ డ్యాంను నిర్మిస్తుంటే ఎన్ని అడ్డంకులు, కోర్టు కేసులు, ఎన్ని కుట్ర సిద్దాంతాలు తయారు అవుతున్నాయో మనం గమనిస్తూనే ఉన్నాము. నది లేని చోట ఇటువంటి కత్రిమ డ్యాంల నిర్మాణం ఎక్కడా జరగలేదు అని సూత్రీకరిస్తున్నారు. ఎక్కడో ఎందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రాయలసీమలో నదులు లేని చోట, చిన్న వాగులపై అవి తీసుకొచ్చే నీటి కంటే అనేక రెట్లు ఎక్కువ సామర్ధ్యంతో కృత్రిమ డ్యాంల నిర్మాణం జరిగింది.కండలేరు – 68టి.ఎం.సి.,గోరకల్లు – 10 టి.ఎం.సి., వెలిగొండ – 41 టి.ఎం.సి., వెలుగోడు -17టి.ఎం.సి., బ్రహ్మంగారి మఠం – 17టి.ఎం.సి., అవుకు – 7టి.ఎం.సి., అలుగునూరు – 3 టి.ఎం.సి.. ఇవన్నీ నదులు లేని చోట నిర్మించినవి కావా? అవసరమైతే కృత్రిమ జలాశయాలు నిర్మించుకోవాలంటూ సిడబ్ల్యుసి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది. ఎత్తిపోతల పథకాలలో పెద్ద జలాశయాల నిర్మాణం అత్యంత అవసరం. సిడబ్ల్యుసి సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో ఆన్‌లైన్‌ జలాశయాల నిల్వ సామర్ధ్యాన్ని పెంచడం జరిగింది. మల్లన్న సాగర్‌ కింద కాళేశ్వరం ప్రాజెక్టు 62% ఆయకట్టు ఉండడం, హైదరాబాద్‌ తాగునీటి సరఫరా, నిజాంసాగర్‌, సింగూరుడ్యాంలకు నీటి సరఫరా ఆధారపడి ఉన్నందున 50 టిఎంసిలతో రీ డిజైను చేయడం తప్పనిసరైందినది, లేని చోట డ్యాం నిర్మిస్తున్నారని విమర్శిస్తున్న ఇంజనీర్లు, ఇంజనీర్లు కాని వారు పైన పేర్కొన్న జలాశయాలు నిర్మిస్తున్నప్పుడు కిక్కురుమనలేదెందుకు? ఇప్పుడు అటువంటిదే మల్లన్నసాగర్‌ జలాశయం నిర్మిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఏదో నేరం చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు.

ఇదంతా ఎందుకు చెప్పవలసివస్తున్నదంటే ప్రాజెక్టుల వ్యతిరేకుల ఉద్యమాల వలన ప్రపంచంలో ఎక్కడా ప్రాజె క్టులు ఆగలేదు. అయితే ఆ ఉద్యమాల వలన నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వాల దష్టికి తీసుకువచ్చి మరింత మెరుగైన పరిహారం, పునరావాసం పొందడానికి, మరింత మెరుగైన పునరావాస చట్టాలని తీసుకురావడానికి దోహదం చేసినాయని చెప్పవచ్చు. ఈ ఉద్యమాల వలన ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యం అయినాయి. వాటి అంచనా వ్యయాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రజల మీద ఆ మేరకు ఆర్థిక భారం పడింది. అయితే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి అయినాక అవి అధ్భుతంగా వాటి నిర్దేశిత లక్ష్యాలను నెరవేరుస్తున్నాయి. రేపు కాళేశ్వరం, పాలమూరు, డిండీ ఎత్తిపోతల పథకాలు కూడా అదే పని చేయబోతున్నాయి. తెలంగాణ ప్రజల కడగండ్లను తీర్చబోతున్నాయి. తెలంగాణలో ఆర్థిక వికాసానికి దోహదం చేయ బోతున్నాయి.
tsmagazine

Other Updates