డాక్టర్ శ్రీరంగాచార్య
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన ధర్మాపురం గ్రామంలో నెమిలికొండ యింటి పేరున్న శ్రీవైష్ణవ కుటుంబం ప్రసిద్ధిగాంచింది. వీరు భూస్వాములు. గ్రామ పటేల్, పట్వారి దొరతనం కూడా వీరిదే. దీనికి తోడు మంచి పాండిత్యం కలిగి వుండటం విశేషం. ఆయనే వెంకటరామానుజా చార్యులు. వెంకటరామానుజాచార్యుల కాలం వరకు ఆ గ్రామానికి దొరలు. పండితులు అనే ఖ్యాతివుండేది. వీరికుమారుని వరకు ఆ పేరులుప్తమై ఒక
ఉద్యమ జీవియనే ప్రచారం ఏర్పడటం వల్ల ధర్మాపురం అంటేనే రంగాచారి ధార్మాపురం అయింది. ఆచార్య వారు అప్పటిరోజుల్లో స్వగ్రామ పాఠశాలలో కొంత చదువుకొని సమీప సూర్యాపేటలో కొంత నేర్చుకున్నా సహజంగా తండ్రిగారి వల్ల ప్రాప్తించిన సంస్కృతాంధ్ర సారస్వత విశేషాలతో ఈయన బాల్యంలోనే కవిగా మారినారు. శ్రీమాన్ రంగాచార్యులు (1920-1965) పూర్వపూర్వ పద్ధతులన్నిటికీ స్వస్తి చెప్పిమిక్కిలి చిన్న వయస్సులోనే
ఉద్యమ జీవిగా మారి అప్పటి రాజకీయాలు ఉద్యమాల ప్రభావంతో ఈయనే స్వయంగా ‘రంగాచారి దళం’ ఏర్పాటు చేసుకొని నల్ల గొండజిల్లాలో జరిగిన రజాకార్ వ్యతిరేక
ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ వ్యక్తుల్లో ఒకడుగా రాణించినాడు.
హైదరాబాదుపై పోలీసు చర్యకు పూర్వమే ఆచార్లగారు కమ్యూనిస్టు పార్టీలో వుండి నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా పోరాడి అనేక కష్టాలనుభవించడమే గాక 1948లో మునగాల కాంగ్రెసు శిక్షణ శిబిరంపై వేసిన బాంబు ప్రేలుడు కేసులో కె.యల్.యన్. చారితో పాటు ఆయన కూడా ఒక ముద్దాయిగా అరెస్టయి విజయవాడలో నిర్బంధ జీవితం గడుపుతూ – బాంబు కేసులో ఈయనపై దోష నిరూపణ కానందున విడుదలయిన రంగాచారి – పార్టీ ప్రచార నిమిత్తం బుర్రకథకుడై – బుర్రకథల రచయిత యై విచిత్ర వేషధారణ యందు ప్రఖ్యాతుడై – అంతచిన్న వయస్సులోనే గొప్పనాయకుల ప్రశంసలను పొందినాడంటే ఈయన ప్రతిభ మనకు తెలుస్తుంది. ఆనాడు అంటే 1963 వరకూ ‘రంగాచారి బుర్రకథ’ అని తెలిస్తే బండ్లు కట్టుకుని జనం వచ్చేవారు. అందమైన రూపు, చక్కని ఆహార్యం, గొప్ప వాక్‌శక్తి. ఆశుకవితా ప్రతిభ – ఇట్లా ఆయన కథలు ఎంతగానో రాణించినయి. దీనికి తోడు వయోజన విద్య ప్రచారం. గ్రంథాలయోద్యమం, అస్పృశ్యతా నివారణ మొదలైన ఉద్యమాల్లోను వివిధ కళా రూపాల్లో తనవంతు సేవచేసినా – అప్పటికే కమ్యూనిష్టు పార్టీలో వస్తున్న చీలికలు అభిప్రాయ భేదాలు స్వార్ధ పరత్వం ఈయన వ్యక్తిత్వాన్ని గాయపరుస్తున్నా సహించి పని చేస్తూ బాధలనుభవించి మీరు కమ్యూనిస్టులా లేక దోపిడిస్టులా’ అనే శీర్షికతో కవితలల్లి తన ‘ప్రతిబింబాలు’ (1957) అనే గేయ కృతిని వెల్వరించి ప్రచారం చేసి తన స్వతంత్రతాభావం స్వేచ్ఛకు విఘాతంగా మారిన కమ్యూనిస్టు పార్టీనివదిలి పోలీసు చర్య తర్వాత అప్పటి పెద్దల సలహాలతో కాంగ్రెసు పార్టీలో చేరినా బుర్ర కథను మాత్రం వదలలేదు.
భారతదేశంపై చైనా దండయాత్ర చేసినప్పుడు (1962) ‘మిత్రద్రోహులు’ పేర ఒక పెద్ద కవితల సంకలనం (తనవే) ప్రింటు చేయించి దాని విక్రయం ద్వారా వచ్చిన ధనాన్ని తన సువర్ణాభరణాలను దేశ రక్షణ నిధికిచ్చిన వదాన్యుడు, మన భారత దేశ వైభవాన్ని, భరత మాత ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ‘పూజాపుష్పాలు’ అనే పద్యకృతిని వెలయించి (1963) సమకాలీనులైన కవుల ప్రశంసల పొందినాడు. ఆచార్లగారు ఉద్యమ జీవిగామారి కష్టాలనుభవిస్తూ రహస్యజీవితం గడిపినప్పుడు ‘అనేకమైన వేషాలు’ వేసి పల్నాడు ప్రాంతంలో బ్రతుకీడ్చి మాచర్లలో నివసిస్తున్నప్పుడు కుమారుడు జన్మిస్తే ఆయనకు చెన్నకేశవాచారి అని మాచర్ల స్వామి పేరు పెట్టుకున్న దేశ – దైవభక్తుడు. తన రహస్య జీవితకాలంలోనే ‘వీరాభిమన్య’ స్వాతంత్య్ర భారతి’ విప్లవ జ్యోతులు’ ‘రుద్రమదేవి’ – మొదలైన బుర్రకథలను రచించి రహస్య జీవనం తర్వాత కాంగ్రెసు వేదికలపైన ఈ బుర్రకథలను వినిపిస్తుంటే నీలం సంజీవరెడ్డి, నూకల రామచంద్రారెడ్డి, హయగ్రీవాచారి, కోదాటి నారాయణరావు వంటి పెద్దలు విని ఆనందించి అభినందించినారంటే ఆచార్ల వారి శక్తి ఎంతటిదో మనం గమనించవచ్చు. రంగాచారి ఉద్యమజీవిగా వున్నరోజుల్లోనే తన కుటుంబం చాలా బాధలనుభవించింది. ఒకనాటి భూస్వాములు సామాన్య ‘స్వాము’లైనారు. వీరికి చిన్న వయస్సులోనే ఈనాటి చెరుకుపల్లి గ్రామానికి చెందిన (కేతేపల్లి మండలం) కందాళ లక్ష్మీనరసింహాచార్య బిడ్డతో వివాహం జరిగింది. అప్పుడు ఈయన వయస్సు 13 సం. భార్యవయస్సు 8 సం. ఇది ఆనాటి వివాహాల పద్ధతి. ఆచార్యుల వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమారుణ్ణి తన విద్యావారసునిగా చేయవలెననే వీరికోరిక కొంత మేర ఫలించినా చిన్న వయస్సులోనే చెన్న కృష్ణమాచార్యులస్తమించినాడు. రంగాచారి బుర్రకథలను 50దాకా రచించినా, కుటుంబం వారి వద్ద మిగిలింది అసమగ్రంగావున్న ‘రుద్రమదేవి’ మాత్రమే. బాల్యం నుండీ స్వతంత్ర భావాలున్న ఆచార్ల ఆస్తి అంతా గాలికి బెట్టిన కర్పూరమయింది. మామిడి తోటలో నిర్మించ తలపెట్టిన గృహం మధ్యలో ఆగిపోయి, నేటికీ దర్శనమిస్తుంది. రాజకీయాల్లో రాజీలేని జీవితానికలవాటుపడిన రంగాచార్య చెప్పలేని బాధలనుభవించి, కుటుంబాన్ని కూడా చూచుకోలేని దుర్భర స్థితిలో 20-9-1965 తేదీన ఒక అనామక స్థితిలో అస్తమించినాడు.
రంగాచార్య కాంగ్రెసు పార్టీకి చేసిన సేవ అమూల్యమైనందున సంజీవరెడ్డి, నూకల రామచంద్రారెడ్డి ప్రభృతులు ఆయనకు హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో ఉద్యోగమిప్పిస్తే ఆక్కడి వాతావరణం ఈయన కనుకూలించనందున కొద్ది నెలల్లోనే ఉద్యోగానికి స్వస్తి చెప్పి మరలా సూర్యాపేట చేరి కష్టజీవిగా కాలయాపన చేస్తున్న సమయంలో స్థానికులైన పెద్దలు డా|| శర్మ ఆచారి తిరునగరి స్వామి, ఇంకా ఎందరో ఈయన్ను ఆదుకున్నారు. పుస్తకాలను ప్రింటు చేయించి వ్యాప్తి చేసినారు. ఐనా రంగాచార్య ‘విధి’ మారలేదు. చిన్నప్పటి నుంచి సంక్రమించిన సంస్కృతాధ్ర భాషల పరిచయం అప్పటి ఉర్దూ, ఇంగ్లీషుల అలవాటు వల్ల చక్కని కవిత్వం వ్రాసినారు. ఆచార్ల వారి ‘ప్రతిబింబాలు’ వచ్చి వ్యాప్తి చెందిన సమయంలో కమ్యూనిస్టులు బాధపడి ఆచార్లవారిని గూడా బాధించటం వారి కమ్యూనిజంలో నైతికత వ్యక్తమయింది. ఆచార్లగారు రచించిన బాల పద్యాలు గేయాలకు ”మయూర” అని కలంపేరు పెట్టుకున్నారు. ఇంటిపేరు ‘నెమలికొండ’ కాబట్టి (నెమిలి-మయూర) మయూర నామం సార్థకమయింది. ఇదేపేరు అనంతరకాలంలో తన దౌహిత్రికి ‘మయూరీ’ నామమయింది. ఒకనాడు బుర్రకథ పేరు చెబితే ‘నాజర్’ గుర్తుకువస్తాడు. ఆయన రంగాచార్లవారు కలిసి కాలం గడిపి కథలు చెప్పినారు. నైజాంలో ‘రంగాచారి బుర్రకథ’ ఎంతగానో రాణించింది. ఎందరో శిష్యులు తయారైనారు. వీరి ‘ప్రతిబింబాలు’ పాటల పుస్తకాన్ని డా|| శర్మగారు ప్రచురింపజేసి వ్యాప్తిలోనికి తెచ్చినారు. ప్రాస్తావికంగా వారు చెప్పిన పద్యాల్లో కొన్ని మాత్రమే లభించినాయి. తనను గూర్చిన ఈ పద్యం 1993లో కోదాటి నారాయణరావు చదివితే నేను బదిలపరుచున్నాను – అది
అంగీకారముగల్గ బుర్రకథలన్ హాస్యంబులైనాటికల్
హంగామా విధిలేని వేషముల నాయాప్రాంతరీతుల్ మహా
సంగ్రామంబుల రీతి దెల్పిజనులన్ సయ్యాటలాడించునే
రంగాచార్యుడ సత్కవేశుడ మయూర క్షోణి భృత్ గేహుడన్
(మయూర=నెమిలి, క్షోణిభృత్=పర్వతం, కొండ,
వీరింటిపేరు నెమిలికిండగదా)
తన కవితారచన కాలం నాటికే మన తెలుగు భాషకు సంక్రమించిన పరభాషా దుఃస్థితికి వగచి ‘తెలుగు తల్లి’ పేర చెప్పిన పద్యాల్లో ఒకటి –
ఆ కవులల్లినట్టి సుమహారములందలివేమొ! వారుతా
టాకులలోన వ్రాయుసయమంబున గాఢతనొప్పెనేడు – నీ
వాకిటనున్నకుక్క తనబాసను బౌభౌలు నేర్పుచుండ మా
ఛేకము గ్రామ్యమయ్యెనిది చిన్నతనంబోకు భారతీ!
చిత్రణ గల ‘కష్టజీవి’ పద్యాల్లో లభించినది –
తూర్పుకొండ పసిడి తుంపురులేమైదాల్చి
రిక్కరాయడు నెక్కిరించువేళ
తిమిరాల హరియింప దినరాజు తనకోటి
కిరణాల ధరణి ప్రాకించువేళ
కరడు గట్టిన గుండెకరిగింపమ హినాద్రి
కొన లెత్తి కొన బాపుకొన్నవేళ
ధనిక వర్గమురీతి ధరణిపై కూలిగా
చేసెడినట్టి విశేష శ్రమగ
అలసి సొలసియు నిదురనావలకు త్రోసి
మురికి నీటనె కాసింత ముఖముకడిగి
అటికెలో నున్న జొన్న సంకటిని మెక్కి
భూమిదున్నగబోవు ఆసామి నేను –
రంగాచారి ‘రహస్యజీవనం’ 1947-48 సంవత్సరాల్లో జైలు శిక్ష విచ్ఛిన్నమైన స్వగ్రామ జీవనం తీరు కుటుంబ స్థితి గతులు వీరిని ఎంతోక్రుంగదీసినాయి. ఐనా నాటకాలు – బుర్రకథలను మానలేదు. సినిమాల్లో ప్రవేశానికి కాంతారావుతో ప్రయత్నించి విఫలుడై దెబ్బతిన్నాడు.
సుప్రసిద్ధ సినిమా నటుడు ఎన్.టి.రామారావు 1958లో సూర్యాపేటకు వచ్చినప్పుడు ఆచార్లగారి ‘స్వాగత కవిత’ ఎంతో మెప్పుపొంది ఎన్‌టిఆర్ బహుమతి పాత్రమైంది.
ఆచార్లగారి అందమైన విగ్రహం అమ్మాయిల పాత్రకు బాగా సరిపడేది. ఎన్నో వేషాలు వేసి, అనేక బుర్రకథలను చెప్పి తన ఆస్తినంతా కర్పూరం వలె హరింపచేసి చిన్న పిల్లలున్న సంసారాన్ని తన భార్య ‘అమృత’ హస్తాలకందించి 20-9-1965తేదీన యశఃకాయుడైన ఆచార్లవారు స్వాతంత్య్ర సమర యోధులకిచ్చే భృతిని పొందలేదు. ఇప్పటికీ సూర్యాపేటలోని గాంధీ పార్కు, త్యాగరాజ ఉత్సవాలు నెమిలి కొండ బుర్రకథను గుర్తుకు తెస్తాయి. ఎప్పుడో ముద్రణమైన వీరి వీరాభిమన్య బుర్రకథ ‘ప్రతిబింబాలు’ మొదలైన లఘుకృతులు మళ్లీ వెలుగులోకి వచ్చి ప్రచారం కావలెనని ఆశింతాం.