ప్రాణము పోయినన్ సరియె పల్కుమురా గళమెత్తి యీ తెలం
గాణము జన్మహక్కని సగర్వముగా యెద పొంగజేసి నీ
వాణియె దేశమంతట ప్రవాహముతీరున వ్యాప్తి జెంది పా
షాణపు నాయకుల్ మునిగి చత్తురు రా! తెలగాణ సోదరా!
(విప్లవఢంకా ` జి. యాదగిరి)
అంటూ తొలితరం ఉద్యమంనాడు గర్జించిన కవుల మాటవెంట ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినప్పుడు పాలకవర్గాలు కక్షబూని రాక్షసంగా అణచివేసే యత్నాన్ని మొదలుపెట్టాయి. నాటినుండి తెలంగాణ జనుల గుండెల్లో గూడుకట్టుకొని, అణువణువునా అవమానాగ్ని దహిస్తూ ఉండగా రెండవసారి ఉద్యమించడానికి సిద్ధపడ్డారు.
విశాలాంధ్రము ఏర్పడిననాటినుండే ఇక్కడ స్థానికులకు ‘నీళ్ళు, నిధులు’ విషయంలో తీరని అన్యాయం జరుగుతూనే వచ్చింది. నిరుద్యోగ రక్కసి యువతరం మూలుగులు పీల్చిపిప్పి చేస్తూ వచ్చింది. దుర్మార్గమైన ఆధిపత్యం క్రింద నలిగి తమ అస్తిత్వానికీ, ఆత్మగౌరవానికి దూరమై ఇక్కడి ప్రజ నలిగిపోయింది. అనేక కమిటీలు విలీనాన్ని వ్యతిరేకించినా, పలువురు మేధావులు యీ చర్యకు తిరస్కరణ తెలిపినా స్వార్థంతో, కుటిలనీతితో, ఒక దుర్మార్గమైన వంచనా శిల్పంతో ‘విశాలాంధ్ర’ ఏర్పరిచే యత్నం సఫలమైంది. తెలంగాణా అస్తిత్వానికి, తెలంగాణ ప్రజానీకానికి తీరని అన్యాయం జరగడానికి అదే మొదటి రోజై నిలిచింది.
ఆనాటినుంచి అసంతృప్తులై అన్ని విషయాల్లోనూ తమదైన ఉనికిని పోగొట్టుకున్న తెలంగాణా ప్రజలు పలురకాల పోరాటాలకు శ్రీకారం చుట్టారు. మొదట్లో హక్కుల కొరకు పోరాటం మొదలుపెట్టారు. ఆ పోరాటమే తెలంగాణా అంతటా విస్తృతమై ప్రత్యేక తెలంగాణా పోరాటంగా పరిణమించి, ఇక్కడి ప్రజలకు ఒక కొత్త చైతన్యాన్ని ఇచ్చింది. 1969 నాటికి అదొక మహా ప్రభంజనమై ఉవ్వెత్తున ఎగిసింది. విద్యార్థుల చైతన్యాగ్ని సమాజంలోని దుర్మార్గాల్ని, తెలంగాణ ప్రజలపట్ల వివక్ష ప్రదర్శిస్తున్న అధికారాన్ని కాల్చేయత్నం చేసింది. కాని పాలకపక్షపు పాశవిక ప్రవృత్తి అమాయకుల ప్రాణాలను బలితీసుకుని నిర్ధాక్షిణ్యంగా ఉద్యమాన్ని తన ఇనుపపాదాలక్రింద తొక్కి పట్టింది.
ఇక్కడి భాషపైన, ఇక్కడి యాసపైన, ఇక్కడి సంస్కృతిపైన, ఇక్కడి జీవనశైలిపైన పథకం ప్రకారం దాడిచేస్తూ తెలంగాణా ప్రజల్లో ఒకానొక ఆత్మన్యూనతాభావాన్ని కలిగించే కుట్ర జరిగింది. అన్నిరంగాల్లోనూ తమ ఆధిపత్యాన్నే నిలుపుకునే యత్నంలో మునిగిన ఆంధ్ర పాలకవర్గాలకు 2001లో ‘జై తెలంగాణ’ నినాదాన్ని దిక్కులు పిక్కటిల్లేవిధంగా నినదిస్తూ ఆవిర్భవించిన ‘‘తెలంగాణ రాష్ట్ర సమితి’’ కొరుకుడుపడని కొయ్యగా తెరపైకి వచ్చింది.
ఆవిర్భవించిన తొలి రోజుల్లోనే వచ్చిపడ్డ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గొప్ప విజయాలను నమోదు చేసుకొని తెలంగాణా ప్రజల ఆకాంక్షను స్పష్టపరచింది. సమర్థ మైన నాయకత్వంవల్ల, సమయానుగుణమైన వ్యూహ రచనలవల్ల, తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్షలవల్ల టీఆర్‌ఎస్ పురోగతిలో దూసుకుపోవడం ఉద్యమ విజయాల్లో తొలిఘట్టం.
ఈ ఉద్యమ పురోగతికి నాయకుని వ్యూహరచన ప్రధానమైంది. గత ఉద్యమాల్లో ఆలోచించనిరీతిలో తమ ఆలోచనలు సాగించి విజయం సాధించే దిశగా అడుగులు వేశారు. తొలి దశ పోరాటాల్లో లేని సైద్ధాంతిక నేపథ్యాన్ని దీనికి సమకూర్చారు. ఏ ఉద్యమమైనా హింసాత్మక ధోరణుల్లోకి వెళితే పాలకవర్గాలకు అణచివేయడం సులభం. ముఖ్యంగా ఒక ప్రత్యేక లక్ష్యసాధనలో ఇదే ప్రధానమైన ఆటంకం. అందుకే గాంధీజీ కూడా స్వరాజ్య ఉద్యమంలో ‘అహింస’కు పెద్దపీటవేశారు. దీన్ని గుర్తించిన చంద్రశేఖరరావు ఎంత సుదీర్ఘంగా ఉద్యమం కొనసాగినా, అది హింసవైపు మళ్ళకుండా జాగ్రత్తలు వహించారు. పలు పార్టీలు, పాలకవర్గాలూ పలువిధాలుగా వారిని రెచ్చగొట్టినా చలించలేదు. అవమానకరమైన ఎన్నెన్నో వ్యాఖ్యలను వారు లెక్కపెట్టకపోవడమే గమ్యాన్ని ముద్దాడేదిశగా నడిపించింది. దాదాపు 14 సంవత్సరాలు కొనసాగిన ఈ మహోద్యమంలో ఒక్కటంటే ఒక్కటి హింసాయుత సంఘటన జరుగకపోవడమే దీని ప్రత్యేకత. ఇటువంటి ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే అరుదు.
తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. మళ్ళీ అంతటి ప్రత్యేకత సంతరించుకున్న మరో గొప్ప పోరాటం యీ 14 ఏళ్ళూ నడిచిన తెలంగాణ ఉద్యమ పోరాటమేనని చెప్పవచ్చు. ఈ ఉద్యమానికి ఇంతటి విశిష్టత రావడానికి, ఇంతటి ఘన విజయం సాధించి లక్ష్యం అందుకోగలగడానికి మరొక ముఖ్య కారణం ఉద్యమ నేతకున్న దూరదర్శిత్వం, సమన్వయ ధోరణి. అవి తక్కువైతే ఏ ఉద్యమమైనా, అది ఎంతటి విశిష్టమైనదైనా ఫలితం ఇవ్వదు. నిర్దేశిత లక్ష్యాన్ని అందుకునేవరకూ నేత పట్టువిడుపుల్ని గురించి లోతుగా ఆలోచించాలి. ఈ ఆలోచనల పునాదిపైనే ఈ ఉద్యమం నిలబడి ఘనవిజయాన్ని పొందింది.
ఉద్యమాన్ని ఒంటిచేత్తో నడపడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణాలోని అన్నిరంగాలకు చెందిన వారిని సమన్వయం చెయ్యడం, అన్ని సామాజికవర్గాలను కార్యోన్ముఖుల్ని చెయ్యడం, సమాజంలోని మేధావుల సహకారాన్ని తీసుకోవడం వంటి ఆలోచనలవల్లే ‘సకలజనుల సమ్మె’, ‘సాగరహారం’వంటి బృహత్తర సంఘటనలు సాధ్యమయ్యాయి. మొత్తం తెలంగాణ సమాజాన్ని ఉద్యమో న్ముఖుల్ని చేసి నడిపించి లక్ష్య సాధనకు బంగారు బాటవేసిన ఘనత నిస్సంశయంగా ఉద్యమ రథసారధి చంద్రశేఖరరావుదే. ఇది ఘంటాపథంగా చెప్పేమాట.
మరో ముఖ్యమైన విషయం. ఉద్యమాల ఎత్తుగడలు, సందర్భాన్ని అనుసరించి వ్యూహం మార్చుకోగలగడం ఉద్యమనేతకు భవిష్యత్తుపై ఒక స్పష్టమైన అవగాహన ఉండటం ముఖ్యం. ఈ దిశగా ఆలోచిస్తే చంద్రశేఖరరావు నూటికి నూరుపాళ్ళు విజయం సాధించినారనే చెప్పాలి. ఉద్యమ పథం వదలకుండానే ఉద్యమ తీవ్రతను పై వాళ్ళకు అర్థం చేయించడం ఒక మెట్టు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములైనా ఉద్యమానికి అవసరమైనప్పుడు పదవులను తృణప్రాయంగా భావించి రాజీనామాలు చెయ్యగలగడానికి చాలా గుండెబలం ఉండాలి. ఎప్పటికైనా విజయపథంలో సాగగలమన్న ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆ మార్గంలో అనుయాయులను సిద్ధపరిచారు గనుకనే ఉద్యమం విజయవంతమైంది. ప్రజలు వీరి కర్తవ్యదీక్షను, త్యాగశీలతను గుర్తించి పట్టం కట్టారు.
మరో విషయం రాజకీయరంగంలోని ప్రతి వ్యక్తికీ, ప్రతిపార్టీకీ ప్రత్యేక తెలంగాణ విషయంలో ఒక నిర్ధిష్టమైన ఆలోచన కలిగే విధంగా ఉద్యమాన్ని మలుపుతిప్పడం. దానివల్లనే విభజనను తీవ్రంగా వ్యతిరేకించే అనేక పార్టీలు విభజనదిశగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు అందించాల్సిన అనివార్యత వచ్చింది. ఇది ఉద్యమ విజయంలోని బలమైన అంశం. చివరకు అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యూహానికి తలవంచవలసి వచ్చింది. అత్యవసరం అన్నప్పుడు ఉద్యమనేత తన ప్రాణాలను పణంగా పెట్టి, ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధపడటమే 2009 డిసెంబరు 9న వచ్చిన తెలంగాణ ప్రకటన. దీనితో ఉద్యమ విజయం ఒక ప్రధాన ఘట్టాన్ని చేరింది.
తెలంగాణ ప్రకటించిన మరుక్షణంనుంచే వచ్చిన ఒత్తిళ్ళకులోనైన కేంద్రం వెనక్కి తగ్గి మళ్ళీ ఒక కమిటీని నియమించి దీన్ని తాత్సారం చేసే దురాలోచన చేసింది. కాని తెలంగాణ ప్రజానీకం, తెలంగాణపై మరింత పట్టుదలతో ద్విగుణీకృత ఉత్సాహంతో ఉద్యమాన్ని ఉధృతం చేయడం వెనుక ఉద్యమనాయకుని వ్యూహం ఫలించి చరిత్ర మలుపు తిరిగింది. తెలంగాణ నేలపై చరిత్రను మలుపులు తిప్పే ఎన్నో సంఘటనలు కాకతీయులకాలంనాటినుండే మొదలయ్యాయని విజ్ఞుల విశ్వాసం. పితృస్వామ్య వ్యవస్థ వేళ్ళూనుకున్న కాలంలోనే ఒక మహిళ మహారాణి శాసించిన నేల ఇది. అన్యాయం జరిగితే రాజ్యాన్నైనాసరే ధిక్కరించే తెగువ చూపిన ఆదివాసీ గిరిజన మహిళల వారసత్వం ఉన్న ప్రజలు ఇక్కడివాళ్ళు. తమ సాహిత్య సృష్టి అనేకానేక విషయాల్లో ముందడుగువేసిన మహాకవులు పుట్టిన నేల ఇది. అనేక మలుపులకు నిలయమైన తెలంగాణ నేలమీది ప్రజల తీవ్రమైన ఆకాంక్ష, దానికితోడు సమర్థ నాయకత్వం చేసిన దిశానిర్దేశం, కేంద్ర ప్రభుత్వపు పట్టుదలను సడలించి తెలంగాణా రాష్ట్రం 2014 జూన్ 2వ తేదీన ఆవిర్భవించింది.
తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారమైన ఆనందోద్వేగ క్షణం. యావత్తు జాతి సాధించిన విజయం. ఇది అజరామరం. ఇది అద్భుత విజయం. బంగారు తెలంగాణ దిశగా అడుగులు బలంగా వేసే దిశగా మనం ప్రస్థావించాల్సిన శుభతరుణం. సమర్థ నాయకత్వపు మార్గదర్శనంలో ప్రతి అడుగూ ఫలవంతం చేసుకొని మనందరం కలలుగన్న గొప్ప రాష్ట్రంగా మలచుకుందాం! పదండి ముందుకు.