జూన్ రెండు నుండి నాలుగువరకు జరిగిన కాల్పుల్లో సుమారు వందమందికిపైగా మరణించినట్లు పత్రికలు తెలిపాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు పరిస్థితి విషమిస్తున్న తీరును ప్రధాని దృష్టికితేగా, పొద్దున్నే ఆఫ్ఘనిస్తాన్‌కు పోవాల్సి వున్న ప్రధాని ఇందిరాగాంధీ అకస్మాత్తుగా 4వ తేదీ రాత్రి పదిగంటలకు ప్రత్యేక విమానంలో చొక్కారావుతో కలిసి హైదరాబాద్‌కు వచ్చినారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు పోయిన ప్రధాని తను ఎవరెవరితో మాట్లాడాలనుకున్నదీ పోలీసు ఉన్నతాధికారులకు తెలిపింది. ఆ రాత్రి ఉద్యమనేతల ఇళ్ళకు పోలీసులు వెళ్ళి చెప్పేవరకు ప్రధాని రాకసంగతి వీరికెవరికీ తెలియదు. ఆ సాయంత్రమే ఢల్లీినుండి హైదరాబాద్‌కు చేరిన ముఖ్యమంత్రి కాసుకు కూడా ప్రధాని రాక సంగతి ముందుగా తెలియదు.
రాత్రి 11 గంటలకు పలువురు రాష్ట్ర మంత్రులతో, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సంఘం అధ్యక్షులు కొండా లక్ష్మణ్ బాపూజీతో చర్చలు జరిపినారు. అర్థరాత్రివేళ డా॥ మర్రి చెన్నారెడ్డి, బద్రీ విశాల్‌పిట్టీతో మాట్లాడినారు. ప్రధాని తెలంగాణ సమస్యను పరిష్కరించడానికే వచ్చి ఉంటుందనుకున్న చెన్నారెడ్డి ఆమెను కలిసిన వెంటనే ‘‘ఒక్కరోజు ముందుగా వచ్చి ఉంటే ఎందరో బతికేవారు కదా!’’ అని అన్నారు. కానీ ఆ తర్వాత అర్థమైంది ఆమె ఎందుకు వచ్చిందో. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తప్ప మరేదైనా కోరితే పరిష్కరిస్తానని ఆమె అనడం నేతలను నిరుత్సాహపరిచింది.
ఆ రాత్రి ఆమెను కలిసి మాట్లాడిన వారిలో పోటీ ప్రజా సమితి అధ్యక్షులు శ్రీధర్‌రెడ్డి, విద్యార్థినేత మల్లికార్జున్, కె. అచ్యుతరెడ్డి, శ్రీమతి టి.ఎస్. సదాలక్ష్మి, టి. అంజయ్య. పి.నర్సింగరావు తదితరులు ఉన్నారు. తెలంగాణను వ్యతిరేకించేవారిలో కాసు బ్రహ్మానందరెడ్డి తోబాటు జె.వి. నర్సింగరావు, వి.బి.రాజు, బి.వి. గురుమూర్తి, తోట రామస్వామి, విజయభాస్కర్‌రెడ్డి, కాకాని వెంకటరత్నం, బి.వి. సుబ్బారెడ్డి (స్పీకర్) తదితర మంత్రులు, శాసనసభ్యులు ఉన్నారు.భారత కమ్యూనిస్టుపార్టీ, భారతీయ జనసంఘం, స్వతంత్రపార్టీ ప్రతినిధులను, ముగ్గురు ఎం.పిలను కూడా ప్రధాని పిలిపించుకొని వారి అభిప్రాయం తెలుసుకున్నారు.
ప్రస్తుత పరిస్థితి కొందరు స్వప్రయోజనపరులు సృష్టించిందేనని పి.సి.సి. అధ్యక్షులు కాకాని వెంకటరత్నం ప్రధానితో చెప్పగా, ఇది కేవలం శాంతి భద్రతల సమస్య మాత్రమేనని సి.ఎం. కాసు బ్రహ్మానందరెడ్డి ఆమెతో అన్నారు. ప్రస్తుత పరిస్థితికి బాధ్యత ప్రభుత్వానిదేనని వెంటనే పరిస్థితులను చక్కదిద్దడానికి రాష్ట్రపతిపాలన విధించాలని ప్రతిపక్ష నాయకులు, ప్రజా సమితి నాయకులు ఆమెను కోరినారు.
ఉద్యమనేతలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా ఉద్యమాన్ని విరమించలేమని స్పష్టం చేయడంతో చేసేదేమీ లేక ఇందిరాగాంధీ తెల్లవారు రaామున వచ్చిన విమానంలోనే చొక్కారావుతో కలిసి తిరిగి ఢల్లీికి వెళ్ళారు. ‘రాష్ట్రంలో మామూలు పరిస్థితులు పునరుద్ధరించేందుకు తోడ్పడవలసింద’ని ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ రాజకీయవర్గాల నాయకులకు విజ్ఞప్తి చేశారు. ‘తెలంగాణ సమస్య, తత్‌సంబంధమైన అన్ని విషయాలను ప్రశాంతపూరిత వాతావరణంలో చర్చించుకొనవచ్చున’ని ఆమె ఉద్యమనేతలకు సూచించారు.
విధ్వంసాన్ని, హింసను తక్షణం నిలిపివేయాలని ప్రధాని కోరగా హింసకు, విధ్వంసానికి పాల్పడుతున్నది ముఖ్యమంత్రేనని చెన్నారెడ్డి ఘాటైన జవాబిచ్చారు. ‘ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ను పరిశీలించ వీలులేనిద’ని ప్రధాని చేసిన వ్యాఖ్య అగ్నికి ఆజ్యం పోసేలా ఉందని చెన్నారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధానికి చేసిన విజ్ఞప్తిలో ‘‘ప్రజాస్వామిక వాదిగా తెలంగాణ కోరికపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాల’’ని కోరినారు. ప్రధాని ఇందిర ఆకస్మిక సందర్శన తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి సంతృప్తిని కలిగించకపోగా మరింత ఆగ్రహాన్ని రగిల్చింది. చెన్నారెడ్డి తన మాజీ మంత్రివర్గ సహచరుడే కదా, ఎలాగైనా ఉద్యమ విరమణకు ఒప్పించగలననే ఆశతో శ్రీమతి గాంధీ హైదరాబాదుకు వచ్చి ఉండవచ్చు. కానీ చెన్నారెడ్డి దృఢంగా వ్యవహరించారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరేదీ ఈ ప్రాంత ప్రజలను సంతృప్తి పరచజాలద’’ని ఇందిరకు చెన్నారెడ్డి స్పష్టం చేశారు.
జూన్ ఏడవ తేదీన హోంమంత్రి చవాన్ హైదరాబాద్ వస్తారని, అన్ని విషయాలు పరిశీలిస్తారని ప్రధాని మరునాడు ఢల్లీిలో ఆఫ్ఘనిస్తాన్ పోయేముందు పత్రికా విలేకరుల గోష్టిలో చెప్పారు. ‘‘ప్రత్యేక రాష్ట్ర కోర్కెను మీరు తిరస్కరించారా?’’ అన్న ప్రశ్నకు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సమస్యపై తన అభిప్రాయాలేమిటో రాష్ట్రంలోని అన్నివర్గాల వారికి సుపరిచి తమే’’నని జవాబిచ్చారు. ‘‘ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చెబుతున్నట్లు అది శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యేనా? లేక అక్కడి పరిస్థితికి రాజకీయ పరిష్కారం అవసరమా?’’ అన్న ప్రశ్నకు… ‘‘నేను ఈ విషయమై వ్యాఖ్యానిం చడం సబబుకాదు. దేశీయాంగ మంత్రి వై.బి.చవాన్ హైదరా బాద్‌కు వెళ్తున్నారు. ఆయన ప్రతి ఒక్కరు చెప్పేది విని సమస్యకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించడం మంచిది. అప్పు డు మనమంతా కలిసి చర్చించుకోవచ్చు’’ అని జవాబిచ్చారు.
‘‘తెలంగాణ ప్రజలను మీరు శాంతపర్చగలిగారా, ఆందోళన సద్దుమణిగిపోతుందా?’’ అన్న విలేకరి ప్రశ్నకు… ‘‘ఆ విషయం చెప్పడం చాలా కష్టం, వారిలోకూడా భిన్నాభిప్రాయాలున్నాయి. తాము చెప్పేది నేను వినాలని వారు కోరుతున్నారు. నేను చేసిన పని అదే. దేశీయాంగమంత్రి అక్కడికి వెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ చెప్పేది ఆయన సావధానంగా వింటారు. సమస్యకు సంబంధించిన అన్ని అంశాలను ఆయన పరిశీలిస్తారు. అయితే ఈ అంశాలన్నింటి గురించి శాంతియుతమైన పద్ధతిలో, వాతావరణంలో చర్చలు జరిగినట్లయితేనే దేశీయాంగమంత్రి తన బాధ్యతను సమర్థ వంతంగా నిర్వహించగలుగుతార’’ని ఆమె అన్నారు. ‘‘ఆకస్మిక పర్యటన అంతరార్థమేమిటి’’ అని విలేకరి ప్రశ్నకు… ‘‘నేను ప్రత్యేకంగా ఏ కార్యార్థమూ అక్కడకు వెళ్ళలేదు. అక్కడి పరిస్థితి నాకు చాలా ఆందోళన కలిగించింది. విదేశీయాత్రకు ఆఫ్ఘనిస్తాన్‌కు వెళుతున్నందువల్ల 5 రోజులపాటు దేశంలో వుండనుకాబట్టి హైదరాబాద్ వెళ్ళి స్వయంగా అక్కడి పరిస్థితిని పరిశీలించడానికేగాని, ఎలాంటి ప్రకటన చేయడానికి కాదని’’ ఆమె స్పష్టం చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న ఆందోళన పూర్తిగా కాంగ్రెస్‌పార్టీకి సంబంధించిన వ్యవహారమేనా’’ అన్న ప్రశ్నకు… ‘‘అది వాస్తవంకాదు. ఇతర పార్టీలకు కూడా సంబంధం ఉన్నది’’ అని ప్రధాని చెప్పారు.
అంతకుముందు తెల్లవారురaామున 3 గంటలకు హైదరా బాద్‌నుండి ఢల్లీికి బయలుదేరినప్పుడు రాజ్‌భవన్ బయట వేచివున్న విలేకరులతోకూడా దాదాపు ఇవే అభిప్రాయాలను ప్రధాని పంచుకున్నారు. ప్రధాని ఇందిర ఆకస్మిక పర్యటన తర్వాత కూడా జూన్ 5న తెలంగాణ అంతటా ఆందోళనలు చెలరేగినవి. ప్రభుత్వమే పరీక్షలను వాయిదా వేసుకున్నది. కర్ఫ్యూ జంటనగరాల్లో, వరంగల్‌లో కొన్ని ముఖ్య పట్టణాలలో కొనసాగింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూసివేసినారు. హైదరాబాద్‌కు వచ్చే, పోయే విమాన సర్వీసులన్నీ రద్దయినవి. కర్ఫ్యూ కారణంగా ఉదయం వీధులన్నీ నిర్మానుష్యమైనవి. మధ్యాహ్నం వరకు కర్ఫ్యూను ధిక్కరించి వందలాదిమంది యువకులు వీధుల్లోకి వచ్చి తమపై లాఠీలతో వస్తున్న పోలీసులు, మిలిటరీపై రాళ్ళతో, చేతికందిన వస్తువులతో ప్రతిదాడులు చేసినారు. అనేక ప్రాంతాల్లో పోలీసులు వరుసగా నాల్గవరోజు అయిన 5వ తేదీన కూడా పలుమార్లు కాల్పులు జరిపి ఉద్యమకారుల ప్రాణాలు తీశారు. ఎందరినో గాయపరిచినారు. నిరసనగా ప్రజలు హైదర్‌గూడాలో రెండు సైనిక ట్రక్కులకు నిప్పు పెట్టినారు. హైదరాబాద్ డి.ఇ.ఓ. కార్యాలయానికి గత మూడు రోజుల్లో ఎనిమిదిసార్లు నిప్పుపెట్టినారు. ప్రజలు వద్దన్నా వినకుండా పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని, అక్కడక్కడా విద్యాసంస్థలని టార్గెట్‌చేసి నిప్పుపెట్టినారు ఉద్యమకారులు. ఆంధ్రప్రాంతంనుండి నగరానికి తేబడిన రౌడీలు, ఉద్యమకారులు పరస్పర దాడులకు దిగినారు. ఎవరు కారణమో తెలియదుకానీ విద్యానగర్‌లో కొన్ని ఇళ్ళకు నిప్పుపెట్టినారు. ‘‘తెల్లవారే లోపు ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళకపోతే దాడులు చేస్తామ’’ని ఆంధ్ర కుటుంబాలవారి ఇళ్ళకుపోయి కొందరు బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. అమాయక తెలంగాణ పిల్లలపై పోలీసుల కాల్పులకు, రౌడీల దౌర్జన్యాలకు నిరసనగా తెలంగాణా ఉద్యమకారులు ఆవేశంతో, ఆగ్రహంతో ఉన్నారు. శాంతియుతంగా ఉద్యమం కొనసాగాలని నేతలు భావించినా ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి లేదు. జంటనగరాల వీధులన్నీ రాళ్ళు, చెప్పులు, చెత్తకుండీలు, తెగిపడిన టెలిఫోన్ తీగెలు, స్తంభాలు, రాతిబండలతో నిండినవి. వందలాదిమందిని పోలీసులు అరెస్టు చేసినారు.
తెలంగాణలో శాంతియుత పరిస్థితులుంటేనే కేంద్ర దేశీయాంగమంత్రి వై.బి. చవాన్ ఇక్కడకు రాగలరని, తెలంగాణ సమస్య పరిష్కారానికి ఆయన రాక అత్యవసరమని, శాంతి యుతంగా ఉండాలని తెలంగాణ ప్రాంతీయసంఘం అధ్యక్షులు జె.చొక్కారావు ప్రజలకు విజ్ఞప్తి చేసినారు. మరోవైపు ఆంధ్ర ప్రాంత వ్యక్తులపై, ఇళ్ళపై అక్కడక్కడ జరిగిన దాడులపై కొండా లక్ష్మణ్ బాపూజీ విచారాన్ని వ్యక్తం చేస్తూ ‘ఎట్టి పరిస్థితుల్లోనూ హింసను విడనాడాల’ని ప్రజలను కోరినారు. ‘హింస తెలంగాణ సాంప్రదాయంకాద’ని బాపూజీ విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేక తెలంగాణ సాధనకై జూన్ 10నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిస్తూ టి.ఎన్.జి.ఓ. అధ్యక్షులు కె.ఆర్. ఆమోస్ ప్రకటన చేసినారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఇప్పటికే సమ్మె చేస్తున్నారు. ఆంధ్ర ప్రాంత వ్యక్తులపై, ఆస్తులపై జరిగిన దాడులను కె.ఆర్. ఆమోస్‌తోసహా ఉద్యమనేతలెందరో ఖండిరచారు. ఆంధ్రప్రాంత ప్రజలపై ఎలాంటి ద్వేషం అక్కరలేదని స్పష్టం చేసినారు.
జూన్ 6న హైదరాబాద్‌లో పరిస్థితి కొద్దిగా మెరుగుపడిరది. 8 గంటలపాటు కర్ఫ్యూ సడలించారు. వీధుల్లో మాత్రం పోలీసుల గస్తీ కొనసాగింది. ఎక్కడా కాల్పులు జరుగలేదు. ఉద్యమ నాయకుల విజ్ఞప్తిని ఆందోళనకారులు గౌరవించారు. దేశీయాంగమంత్రి వై.బి.చవాన్ రాకకోసం ఉద్యమకారులు శాంతిని పాటించారు. గత నాలుగైదు రోజులుగా దుకాణాలు మూసి ఉండడంతో, కర్ఫ్యూ కొనసాగడంతో సాధారణ ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురైనారు. కర్ఫ్యూ సడలించడంతో ఒక్కసారిగా దుకాణాలన్నీ జనంతో కిక్కిరిసిపోయినవి. జనం బారులు తీరినారు. కూరగాయలకు బాగా కొరత ఏర్పడిరది. ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ స్తంభించడమే దీనికి కారణం. వ్యాపారస్తులు ధరలు పెంచేశారు. టమాట కిలో 4 రూపాయలు, బెండ, దొండకాయలు కిలో రెండు రూపాయలు, ఉల్లిపాయలు కిలో 60 పైసలు, అరలీటరు పాలు రూపాయిన్నరకు అమ్మినారు.
జూన్ 7న కేంద్రహోం మంత్రి వై.బి. చవాన్ తెలంగాణ సమస్యపై చర్చిండానికి ప్రధాని సూచనపై హైదరాబాద్‌కు చేరుకున్నారు.