ఉద్యమ-సారధిగా-డాక్టర్‌-చెన్నారెడ్డి1తెలంగాణ ప్రజా సమితి స్థాపించిన కొద్ది రోజులకే హైదరాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో సమితి ప్రధాన కార్యదర్శి ఎస్‌. వెంకట్రామారెడ్డి అఖండ విజయం సాధించారు. ఎలాగైనా సమితి అభ్యర్థిని ఓడిరచాలని బ్రహ్మానందరెడ్డి ముఠా విఫలయత్నం చేసింది. వెంకట్రామారెడ్డి అనుయాయులను, తెలంగాణ ఉద్యమ కార్యకర్తలను జైళ్ళలో పెట్టి కాంగ్రెస్‌ అభ్యర్థి కోహెడ ప్రభాకరరెడ్డి గెలుపుకోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినారు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నేతలు, ప్రభుత్వ యంత్రాంగం రాత్రింబగళ్ళు నిర్విరామంగా పనిచేసినా తెలంగాణా ప్రజలు సమితి అభ్యర్థిని గెలిపించడం ప్రత్యేక రాష్ట్ర వాంఛ ఎంత బలంగా ఉన్నదో తేటతెల్లమైనది. ఎన్నికల్లో తెలంగాణా వాదానికి సమకూరిన తొలి విజయం ఇదే.. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఇదే ఒరవడి కొనసాగింది. తెలంగాణవాదులను ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తూనే వచ్చారు.

హైదరాబాద్‌ నగరంలో నిషేధాజ్ఞలను ధిక్కరించి వెంకట్రామారెడ్డిని గంటల తరబడి వీధుల్లో ఊరేగించారు ప్రజలు.
సరిగ్గా ఆ సమయంలోనే ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ క్రింద నిర్భంధంలో ఉన్న సమితి నేతలు మదన్‌మోహన్‌, డా॥ మల్లికార్జున్‌, ఆదిరాజు వెంకటేశ్వరరావులను హైకోర్టు విడుదల చేసింది. విడుదలైన నేతలను, వెంకట్రామారెడ్డిని అభినందించడానికి డా॥ మర్రి చెన్నారెడ్డి తొలిసారి బర్కత్‌పురలోని తెలంగాణ ప్రజా సమితి కార్యాలయానికి వచ్చారు. 1968 సెప్టెంబర్‌ నుంచి ఉద్యమ సన్నాహాలు ప్రారంభించిన శ్రీధర్‌రెడ్డి, పుల్లారెడ్డి వంటి ఉస్మానియా విద్యార్థి నాయకులు ఉద్యమ నాయకత్వం బాధ్యతల్లో రాజకీయ నాయకులు వుండకూడదని, వెనుక ఉండి విద్యార్థులను నడిపించాలని కోరుతున్నారు.
డా॥ మర్రి చెన్నారెడ్డి 1967 ఎన్నికల్లో తాండూరు శాసనసభా నియోజకవర్గంనుండి గెలుపొందారు. కానీ మసీదులో ఎన్నికల సభ జరిపారనే అభియోగంతో ప్రత్యర్థి వందేమాతరం రామచంద్రరావు కోర్టుకు వెళ్ళడం జరిగింది. బ్రహ్మానందరెడ్డి ప్రోద్బలంతో అప్పటి ఎస్‌.పి. పవిత్రన్‌ చెన్నారెడ్డిపై అభియోగానికి అనుకూలంగా కోర్టులో సాక్ష్యం ఇవ్వడంతో కోర్టు చెన్నారెడ్డిని ఆరు సంవత్సరాలదాకా ఎలాంటి ఎన్నికల్లో పాల్గొనరాదని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది.
1967లో శాసనసభకు ఎన్నికైన చెన్నారెడ్డిని తన మంత్రివర్గంలోకి రాకుండా చేయడానికి బ్రహ్మానందరెడ్డి తెలివిగా ‘మనిద్దరిలో ఒకరం ఢల్లీిలోవుంటే కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి నిధులెక్కువగా తేవచ్చున’’ని చెప్పి ఢల్లీికి పంపించారు. రాజ్యసభకు తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉక్కుశాఖను చెన్నారెడ్డికి అప్పగించింది శ్రీమతి గాంధీ. కానీ తాండురు ఎన్నికపై కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ చెన్నారెడ్డి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినారు.
నవంబరు 1968నుండి తెలంగాణలో రగులుకుంటున్న ఉద్యమాన్ని చెన్నారెడ్డి జాగ్రత్తగా గమనిస్తూ వచ్చారు. పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకాలు చేసిన నలుగురు తెలంగాణ నేతలలో కె.వి. రంగారెడ్డితోబాటు చెన్నారెడ్డి కూడా ఒకరు. తన కళ్ళముందే ఒప్పందపు షరతులను ఉల్లంఘిస్తుంటే, తెలంగాణ నిధులను ఆంధ్రకు తరలిస్తూ ఈ ప్రాంతం యెడ వివక్ష చూపుతుంటే, తెలంగాణ నిరుద్యోగులకు దక్కాల్సిన ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతీయులతో భర్తీ చేస్తుంటే చెన్నారెడ్డి సహించలేకపోయారు. కానీ కోర్టు తీర్పుతో రాజీనామాచేసిన తాను తెలంగాణ ఉద్యమంలోకివస్తే దాని పవిత్రత దెబ్బతింటుందని భావించి ప్రారంభంలో కొన్ని నెలలు దూరంగా వుండిపోయారు. ఉద్యమంలోకి తనను ఆహ్వానించిన ఎస్‌. వెంకట్రామారెడ్డి, వరకాంతపు రామక్రిష్ణారెడ్డి తదితరులకు నచ్చచెప్పి రాజకీయాలకతీతంగా ఉద్యమాన్ని నడిపించాలని వారిని ప్రోత్సహించారు. ఆ కాలమంతా పరోక్షంగా ఉద్యమ విస్తృతికి చెన్నారెడ్డి సహకరించారు.
మే ఒకటవ తేదీన రాజ్‌భవన్‌ ఎదుట జరిగిన కాల్పుల్లో విద్యార్థి నాయకుడు ఉమేందర్‌రావుతో సహా మరో ఇద్దరు మరణించడం, మే మూడవ తేదీన అప్పటి రాష్ట్రపతి డా॥ జాకీర్‌హుస్సేన్‌ మరణించడంతో సంతాప దినాలు పూర్తయ్యేదాకా ప్రజాసమితి ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసినా ప్రభుత్వం అరెస్టులు కొనసాగించడం, మరోవైపు ముఖ్యమంత్రి బాధ్యతారహితమైన ప్రకటనలు, ఉద్యమకారులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఉద్యమానికి సరైన దిశానిర్దేశం లేకపోవడం వంటి కారణాలు డా॥ మర్రి చెన్నారెడ్డిని పునరాలోచింప చేసినవని ఆనాటి పెద్దల విశ్లేషణ.
1969 మే7న తెలంగాణ ఉద్యోగులు నిర్వహించిన భారీ ర్యాలీ సందర్భంగా గాంధీభవన్‌లో చెన్నారెడ్డి ప్రసంగించారు. తొలిసారి బహిరంగంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచినారు.
తెలంగాణ ప్రజాసమితిలోని ప్రముఖులు, కొందరు శాసనసభ్యులు డా॥ మర్రి చెన్నారెడ్డి వద్దకుపోయి సమితి నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని ఒత్తిడి తెచ్చారు. అంతకుముందే సమితి అడ్‌హాక్‌ కమిటీలోని సభ్యులు చెన్నారెడ్డికి ఉద్యమ నాయకత్వం అప్పగించే విషయమై వారం రోజులపాటు చర్చించారు. ముగ్గురు నలుగురు సభ్యులు ఈ ప్రతిపాదనను తొలుత వ్యతిరేకించారు. రాజకీయ నాయకుల మద్దతు పరోక్షంగా ఉండాలని వీరి వాదన. డా॥ శ్రీధర్‌రెడ్డి, పుల్లారెడ్డివంటి విద్యార్థి నాయకులు కూడా చెన్నారెడ్డి మద్దతు పరోక్షంగానే తీసుకోవాలని సూచించారు. అధ్యక్షునిగా తానే కొనసాగాలని గుర్తు తెలియని అనేకులనుండి టెలిగ్రాంలు, ఉత్తరాలు వస్తున్నాయని సమితి అధ్యక్షులు మదన్‌మోహన్‌ తెలిపారు.
ఈ దశలో ఎస్‌. వెంకట్రామారెడ్డి జోక్యం చేసుకొని చెన్నారెడ్డివంటి సమర్థుడైన నాయకుని సారధ్యంలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపితేనే లక్ష్యాన్ని సాధించగలమని వ్యతిరేకించినవారికి నచ్చ చెప్పినారు. అధ్యక్ష బాధ్యతలు చెన్నారెడ్డికి అప్పగించడం ఇష్టం లేకున్నా సభ్యుల ఒత్తిడితో మదన్‌మోహన్‌ వెనక్కి తగ్గినారు. ఈ విషయంలో డా॥ గోపాలక్రిష్ణ ముఖ్య పాత్ర వహించారు. 1969 మే 22న డా॥ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితి అధ్యక్ష బాధ్యతలను చేపట్టినారు. నూతన కార్యవర్గాన్ని (కాంగ్రెస్‌ పార్టీ తరహా) ఏర్పాటు చేశారు. తెలంగాణ రీజినల్‌ కమిటీ మొదటి ఛైర్మన్‌ అయిన అచ్యుతరెడ్డి, సదాలక్ష్మి, ఈశ్వరీబాయిలను, ఉపాధ్యక్షులుగా ఎస్‌. వెంకట్రామారెడ్డి, పోల్సాని నర్సింగరావు, బి. సత్యనారాయణరెడ్డి, కె.ఎస్‌. నారాయణ, ఎం.ఎం. హషీం, సి. మాణిక్‌రావు మరియు జి. వెంకటస్వామిను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. ప్రముఖ న్యాయవాది జి. నారాయణరావు, ఆదిరాజు వెంకటేశ్వరరావు, నాగం క్రిష్ణ, టి. గోవింద్‌సింగ్‌, శాంతాబాయి, సి. మాణిక్‌రావు మరియు వరకాంతపు రామక్రిష్ణారెడ్డిలను ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా చెన్నారెడ్డి నియమించారు. తనకు అత్యంత సన్నిహితుడైన ప్రముఖ వ్యాపారి రామకృష్ణధూత్‌ను ట్రెజరర్‌గా నియమించారు చెన్నారెడ్డి. మరో 13మంది పెద్దలను వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా నియమించారు. అప్పటికే మంత్రి పదవికి రాజీనామాచేసి పరోక్షంగా ఉద్యమానికి మద్దతునిస్తున్న కొండా లక్ష్మణ్‌ బాపూజీని ప్రముఖ సోషలిస్టు నేత బద్రీ విశాల్‌పిట్టీని శాశ్వత అహ్వానితులుగా నియమించారు. చెన్నారెడ్డి నాయకత్వాన్ని తిరస్కరించిన శ్రీధర్‌రెడ్డి అదేరోజు పోటీ తెలంగాణా ప్రజాసమితిని ఏర్పాటు చేశారు.
చెన్నారెడ్డి ఉద్యమ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రజాసమితి కార్యకలాపాల నిర్వహణలో గుణాత్మకమైన మార్పు వచ్చింది. బర్కత్‌పురాలో చిన్న గదిలో ఉండే సమితి కార్యాలయాన్ని గౌలిగూడాలోని వాసుదేవ్‌ కృష్ణాజీ నాయక్‌కు చెందిన విశాలమైన బంగ్లాలోకి మార్చడం జరిగింది. కార్యకర్తలకు జీబులు, మోటారు సైకిళ్ళను, పెట్రోల్‌ను వరకాంతం రామకృష్ణారెడ్డి, ఎస్‌. వెంకట్రామారెడ్డి సమకూర్చేవారు. కాచిగూడ వైశ్య హాస్టల్‌ ప్రక్కనే ఉన్న పెట్రోల్‌బంక్‌లో ఖాతా ఉండేది.
ఎస్‌. వెంకట్రామారెడ్డి హైద్రాబాద్‌జిల్లా సహకార సంఘం అధ్యక్షులుగా ఉండేవారు. ఉద్యమ అవసరాలకయ్యే డబ్బును సొసైటీ నిధులనుండి (వాణిజ్య లావాదేవీల పేరుతో) తీసుకునేవారు. సొసైటీకి ధాన్యం సేకరణ చేసే వారిగా వరకాంతపు రామకృష్ణారెడ్డి, ఇతర నాయకుల పేర్లను సొసైటీ రిజిష్టర్లలో రాసి వారికి అడ్వాన్సుల చెల్లింపు చేసేవారు. ఉద్యమకాలంలో ఇలా ఉద్యమ అవసరాలకు సొసైటీ నిధులనుండి మళ్ళించిన డబ్బు సుమారు లక్షకుపైనే. ఉద్యమానంతరం సొసైటీ రిజిష్టర్లలో పేర్లున్న ఉద్యమకారులు ఆ అప్పు తిరిగి చెల్లించడానికి నానా ఇబ్బందులు పడ్డారు. చివరికి ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌గా వున్న చెన్నారెడ్డివద్దకు వెళ్ళినా ఫలితం లేకపోయింది.
ఉద్యమకాలంలో ఆంధ్రుల ఆస్తులు తగలపెట్టారని, డబ్బు దోచుకునాన్రి, బలవంతపు చందాలు వసూతు చేశారని ఆంధ్రనేతలు, వారి మీడియాచేసిన విపరీత ప్రచారమంతా శుద్ధ అబద్దం. ఎక్కడో జరిగిన ఒకటి, రెండు సంఘటలను ‘గోరంతలు కొండంతలు’గా చూపి ఉద్యమంపై విషం చిమ్మినారు. పోలీసు కాల్పులు, లాఠీ ఛార్జీలను నిరసనగా ఉద్యమకారులు బస్సులు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా జామై ఉస్మానియా రైల్వే స్టేషన్‌ తగలబెట్టింది మాత్రమే నిజం.

Other Updates