తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకై శ్రీకారం చుట్టిన నేపధ్యంలో..ఖమ్మం జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఖమ్మం నగరంలోని తమ కార్యాలయం మొదటి అంతస్తులో ఉద్యోగార్థుల సౌలభ్యం,సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పోటీ పరీక్షలు అధ్యయన కేంద్రం నిరుద్యోగుల ఆశలు, ఆకాంక్షలు, సాకారమయ్యేందుకు వారి లక్ష్యసాధనకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది.
జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులకు అండగా ఉండాలని భావించిన జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు పాకాల భాస్కర్ తన మదిలో మెరిసిన ఆలోచనను జిల్లా కలెక్టర్‌తో పంచుకోగా కలెక్టర్ అనుమతి, ఆర్థిక సహయంతో పోటీ పరీక్షలు కేంద్రం ఏర్పాటు చేశారు. కేంద్రానికి అవసరమైన పుస్తకాలు కొనుగోలు నిమిత్తం జిల్లా కలెక్టరు డి.ఎస్.లోకేష్‌కుమార్ రూ.38 వేల రూపాయలు మంజూరు చేశారు. భాస్కర్ వాటికి అదనంగా కొంత సొంత నిధులు జమచేసి 90 వేల రూపాయల విలువైన పుస్తకాలను వివిధ ప్రచురణ సంస్థల నుండి కొనుగోలు చేసి కేంద్రంలో అందుబాటులో పెట్టారు.
18 నవంబరు 2015న ఈ అధ్యయన కేంద్రాన్ని శిక్షణ కలెక్టర్ మహ్మద్ ముషర్రఫ్ అలీఫారూక్ ప్రారంభించారు. ఉద్యోగార్థులకు పోటీ పరీక్షల సన్నద్ధత, మెళకువలకై శిక్షణపై ఆయన అవగాహన కల్పించారు. అభ్యర్ధుల సందేహాలను నివృత్తి చేశారు. పోటీ పరీక్షల కేంద్రం ప్రారంభం గురించి దిన పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితం కావడంతో పేదకుటుంబాలకు చెందిన ఉద్యోగార్ధులు పెద్ద సంఖ్యలో ఈ కేంద్రానికి రావడం మొదలు పెట్టారు. ప్రశాంత వాతావరణంలో కేంద్రం ఉండడం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించే గ్రూప్-1,2,3 డి.ఎస్సీ. ఇతర పోటీ పరీక్షల సంనద్ధతకు అవసరమైన తాజా ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో ఉండడంతో అభ్యర్థుల సంఖ్య పెరిగింది.
దీంతో జిల్లా కలెక్టర్ స్పందించి కేంద్రంలో మౌలికవసతుల కల్పన, ర్యాక్ ఏర్పాటుకు మరో రూ.18 వేలు, పుస్తకాల కొనుగోలుకు లక్ష రూపాయలు మంజూరు చేశారు. ప్రిపరేషన్‌కు మరింత అనుకూలంగా ఉండేందుకు అధికారులు ఈ కేంద్రం తెరిచే వ్యవధిని 2 గంటలు పొడిగించి ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిర్వహిస్తున్నారు.
పోటీ పరీక్షల కేంద్రం నిర్వహణ కోసం ఇద్దరు ఉద్యోగులను విడతల వారిగా నియమించారు. ప్రతి రోజు 100 నుంచి 150 మంది ఉద్యోగార్థులు ఈ కేంద్రానికి వస్తున్నారు. ఈ కేంద్రంలో జిల్లాలో ఏ గ్రంథాలయంలో లేని అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి ప్రత్యేక పుస్తకాలు ఉండటం విధ్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా వుంది. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఈ కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులకు తగు సూచనలు చేశారు. కేంద్ర నిర్వాహకులను అభినందించారు.