magaరాష్ట్రంలో కొత్తగా 84వేలకుపైగా ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి వున్నందున శాఖలవారీగా కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి నేతృత్వంలోని అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కనీసం వారానికొకసారి సమావేశమై ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనూ, గురుకుల విద్యా సంస్థల్లోనూ వేలాదిమంది ఉపాధ్యాయుల నియామకం జరపాల్సి వున్నందున దానికి సంబంధించి వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని ముఖ్యమంత్రి ఆదేశించారు. పంద్రాగస్టు వేడుకల్లో ముఖ్యమంత్రి ఉద్యోగ నియామకాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఆ మరునాడే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ తదితరులతో సీఎం మాట్లాడారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఖాళీలను భర్తీ చేయడం కోసం కొత్త ఉద్యోగాల నియామకం ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఏ పని చేపట్టినా వాటిని అడ్డుకోవడానికి కొన్ని ప్రతీపశక్తులు కాచుకుని కూచున్నాయని, ఉద్యోగ నియామక ప్రక్రియను కూడా కోర్టు కేసుల ద్వారా అడ్డుకుంటున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా వుండాలని, న్యాయపరమైన చిక్కులకు అవకాశం లేకుండా నోటిఫికేషన్లు జారీ చేసి నియామక ప్రక్రియ చేపట్టాలని సీఎం సూచించారు. నోటిఫికేషన్లకు ముందే న్యాయశాఖ అధికారులతో చర్చించాలని సూచించారు. ఎవరైనా కోర్టులో కేసులు వేస్తే కూడా వాటిని సమర్ధంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా వుండాలని సీఎం చెప్పారు. అధికారులంతా పూర్తి సమన్వయంతో పనిచేయాలని కోరారు.

శాఖలవారీగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియను వేగంగా చేపట్టడానికి తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ఏర్పాటు చేశామని, దీనిద్వారా ఇప్పటికే 58 నోటిఫికేషన్లు జారీ చేసి నియామక ప్రక్రియను ముందుకు తీసుకుపోతున్న ట్లు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి ముఖ్యమంత్రికి వివరించారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఇప్పటికే 5000 మందికి పైగా నియామకం అయ్యారని, మరో నెల రోజుల వ్యవధిలో 12వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముగుస్తుందని సీఎంకు చెప్పారు. న్యాయపరమైన వివాదాలు కూడా కొలిక్కి వచ్చినందున త్వరలోనే గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఫలితాలను ప్రకటిస్తామని తెలిపారు.

ఇదే స్ఫూర్తితో పనిచేసి భవిష్యత్తులో 84వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేయాల్సి వున్నందున పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ గురుతర బాధ్యత పోషించాలని సీఎం కోరారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు పని భారం పెరిగినందున అందులో కొత్తగా 90మంది ఉద్యోగులను నియమించడా నికి కూడా సీఎం అంగీకరించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి వాణీ ప్రసాద్‌, జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్‌ సిన్హా తదితరులు సమావేశమయ్యారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియకు అవలంభించాల్సిన వ్యూహంపై చర్చించారు. శాఖలవారీగా ఉద్యోగాల భర్తీకి వెంటవెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది ఏర్పడే ఖాళీల వివరాలను కూడా ముందుగానే తీసుకుని నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు.

ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా లక్షా 12వేలకుపైగా ఉద్యోగాల నియామకాల లక్ష్యాన్ని అధిగమించేందుకు నిరంతరం కృషి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్లపై కొందరు కోర్టుకు వెళ్లినందున ఆ కేసులకు సంబంధించి కూడా న్యాయస్థానంలో సమర్ధవంతంగా వాదనలు వినిపించాలని నిర్ణయించారు. నియామకాలను వివాదాస్పదం చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వుండి తెలంగాణ యువతకు న్యాయం చేయడం లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు.

Other Updates