దక్షిణాధి రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో మంత్రి కెటిఆర్
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వినూత్న పద్దతుల్లో మరింత బలోపేతం చేయాలని, దీనిని కుదించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కేరళలోని కోవలంలో జనవరి 6న ఏర్పాటు చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ దక్షిణాధి రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దేశ చరిత్రలో తొలిసారి పేదలు, బలహీన వర్గాలకు నిజమైన గొంతుకగా మారిందన్నారు. ఈ పథకంపై కేంద్రం ఎలాంటి పరిమితులు విధించినా తాము వ్యతిరేకిస్తామన్నారు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపండం జరిగిందన్నారు. గత ఎనిమిదేళ్లలో ఈ పథకం గ్రామీణాభివృద్ధిలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చిందని మంత్రి తెలిపారు.
తమ రాష్ట్రంలో 443 మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తూ ఇప్పటి వరకు రూ. 9800 కోట్లతో సుమారు 25లక్షల కుటుంబాలకు ప్రతి ఏటా 100రోజులు పనికల్పిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు దీని వల్ల ఎంతో ప్రయోజనం ఉందన్నారు. రూ. 30 ఉన్న దినసరి కూలీ రూ. 150కి పెరిగిందన్నారు. 44 శాతం వలసలు తగ్గాయన్నారు.
దళిత వాడల్లో మరుగుదొడ్ల సౌకర్యాలు, 1276 కిలోమీటర్లమేర సిసి రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ పెరింగిందని తెలిపారు. రాష్ట్రంలో 1442 నూతన ఆవాసాలకు 1768 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. బయోమెట్రిక్ సిస్టమ్, సోషల్ ఆడిట్ వంటి విధానాలకు కూడా ఆయన సదస్సులో ప్రస్తావించారు.