magaఉపాయం ఉంటే ఉపాధి హామీలో అద్భుతాలు సృష్టించవచ్చని సిద్ధిపేట నియోజక వర్గం నిరూపిస్తున్నది. ప్రత్యేకించి ఇవాళ పశువుల పాకలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు, సీసీ రోడ్ల నిర్మాణాలలో రాష్ట్రంలోనే సిద్ధిపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ప్రధానంగా రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు కారణంగా ఇప్పటికే ఈ యేడు సిద్ధిపేట జిల్లాకు 5 జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. ఇదే స్ఫూర్తితో ఉపాధి హామీ పనులను మరింత ముందంజలో నిలుస్తున్నది.

ఒకప్పుడు ఉపాధి హామీ అంటే మట్టి పని.., ఇటు ఉన్న మట్టి కుప్పలను అటు పక్కకు పడేసేవారు. అప్పుడు చేసే పనిలో ఓ పారదర్శకత లేదు..! శాశ్వత ఆస్తుల రూపకల్పన లేదు.! కానీ ఇప్పుడా ఆ పరిస్థితి మారింది. ఉపాధి హామీ పథకం కింద సగటు మానవ అభివృద్ధికి ఊతమిచ్చేలా నిజమైన ఉపాధి లభిస్తున్నది. గత పదేళ్ల కాలం నుంచి లేనటువంటి ఎన్నో ఉపాధి హామీ సంస్కరణలకు సిద్ధిపేట వేదికగా ప్రారంభమయ్యాని చెప్పవచ్చు. అన్ని సామాజిక వర్గాలకు సమ న్యాయం చేకూరేలా సిద్ధిపేట నియోజక వర్గం వడి వడిగా అడుగులేస్తోంది.

అట్టడుగు నుంచి పైకి..

ఉపాధి హామీ పథకం 2006లో ప్రారంభించినప్పుడు కూలీలకు పని కల్పన లక్ష్యంగా పని చేసేవారు. అప్పటి సందర్భంలో మెటీరియల్‌ కంపోనేంట్‌ రాష్ట్రం సద్వినియోగ పర్చుకోలేక పోయింది. దీంతో రాష్ట్రం కోట్లాది రూపాయలు నష్టపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఉపాధి హామీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ప్రతి రూపాయిని సద్వినియోగ పర్చుకోవాలనే సదుద్దేశంతో ప్రభుత్వం కూలీలకు పనులు కల్పిస్తూనే.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున్న చర్యలు చేపట్టింది. అయితే ఇదంతా మంత్రి హరీశ్‌రావు ప్రోత్సాహంతోనే సిద్ధిపేట నియోజక వర్గంలో ఉపాధి హామీ అభివృద్ధి పనుల వేగవంతానికి మూలమని చెప్పాలి. ప్రతి పథకాన్ని దగ్గరుండి సమీక్షించి పకడ్బందీగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజా సహకారంతో ప్రజా ప్రతినిధులు, గ్రామ, మండల స్థాయి అధికారులు సమన్వయంతో వ్యవహరించి ప్రణాళికా బద్ధంగా పని చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. గత సంవత్సరం వంద శాతం నిధులు సద్వినియోగం చేసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. స్వ రాష్ట్రం ఏర్పడ్డాక గతేడాది 3 అవార్డులు వచ్చాయి. ఈ యేడాది ఐదు జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నది. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన సిద్ధిపేట నియోజక వర్గంలోని గ్రామాల్లో కూలీలకు ఉపాధి కల్పనతో పాటు గ్రామాల్లో పలు అభివ ద్ధి పనులైన సీసీ రోడ్లు, అంగన్‌ వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, స్మశాన వాటికలు, డంప్‌ యార్డులు, ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు, కిచెన్‌ షెడ్లు, అలాగే ఇతర పలు కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు, ప్రతిపాదిత ప్రాంతాల్లో మార్కెట్ల నిర్మాణాలు చేపడుతున్నది.

నియోజక వర్గంలో 276 పశువుల పాకల నిర్మాణాలు

సిద్ధిపేట జిల్లాలో 353 పశువుల పాకల నిర్మాణాలు చేపట్టగా.. ఒక సిద్ధిపేట నియోజక వర్గంలోని సిద్ధిపేట మండలంలో 141, చిన్నకోడూరు మండలంలో 75, నంగునూరు మండలంలో 60 పశువుల పాకలు నిర్మించగా నియోజక వర్గం మొత్తంలో 276 పశువుల పాకల నిర్మాణాలు జరిగాయి. వీటిలో మంత్రి హరీశ్‌రావు దత్తత్త గ్రామమైన ఇబ్రహీంపూర్‌ లో 52, కొదండరావుపల్లి మధిర గ్రామమైన బంజరుపల్లిలో 36 పశువుల పాకలు నిర్మించి ఈ గ్రామాలు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 209 గొర్రెల షెడ్లు నిర్మాణంలో ఉండగా, సిద్ధిపేట నియోజక వర్గంలో 9 గొర్రెల షెడ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలోనే నియోజక వర్గ కేంద్రమైన సిద్ధిపేట మండలం ఇర్కోడ్‌ గ్రామ శివారులోని నాయిని చెరువు సమీపంలో కమ్యునిటీ గొర్రెల షెడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

సీసీ రోడ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌

ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టడంలోనూ సిద్ధిపేట జిల్లా రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌ గా నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 2016-17 సంవత్సరానికి గానూ రూ.24 కోట్ల వ్యయంతో జిల్లాలోని 17 మండలాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. వీటిలో నియోజక వర్గంలోని సిద్ధిపేట మండలంలో సీసీ రోడ్ల నిర్మాణాలకు 33 అనుమతులు వస్తే 33 చోట్ల నిర్మాణ పనులు చక చక సాగుతున్నాయి. అలాగే నంగునూరు మండలంలో 24, చిన్నకోడూరు మండలంలో 33 చోట్ల సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే సీసీ రోడ్ల నిర్మాణాలలో సిద్ధిపేట జిల్లా మొదటి స్థానంలో నిలువగా రెండవ స్థానంలో మహబూబ్‌ నగర్‌, మూడవ స్థానంలో వికారాబాద్‌ జిల్లాలు నిలిచాయి.

ఇంకుడు గుంతల నిర్మాణంలో రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌..!

నీటి సంరక్షణ, పారిశుద్ధ్య నివారణ లక్ష్యంగా హరీశ్‌ రావు దత్తత్త గ్రామమైన ఇబ్రహీంపూర్‌ స్ఫూర్తితో సిద్ధిపేట జిల్లాలోని మండలం, గ్రామాల వారీగా ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టడంలో సఫలీకృతమయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా చురుకుగా పాల్గొని ఇంటింటా ఇంకుడు గుంటలు నిర్మాణాలు చేపట్టడం మొదలు పెట్టారు. విడతల వారీగా సాగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకూ సిద్ధిపేట జిల్లాలో 37 వేల 280 ఇంకుడు గుంతలు ఇంటింటా నిర్మించడం విశేషం. మ్యాజిక్‌ సోక్‌ పిట్ల నిర్మాణాలు పూర్తి చేసి రాష్ట్రంలోనే సిద్ధిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 24 వేల 718 ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టిన కామారెడ్డి జిల్లా రెండవ స్థానంలో నిలువగా, 22 వేల 450 ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మాణాలు చేపట్టి మెదక్‌ జిల్లా రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచింది.

పాఠశాలల్లో ఊపందుకున్న కిచెన్‌ షెడ్ల నిర్మాణాలు

ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్‌ షెడ్ల నిర్మాణాలు జిల్లాలో ఊపందుకున్నాయి. నియోజక వర్గ కేంద్రమైన గజ్వేల్‌ 17, ములుగు మండలంలో 18, జగదేవ్‌ పూర్‌ 13, కొండపాక 12, వర్గల్‌ 7 పాఠశాలల్లో కిచెన్‌ షెడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇదే బాటలో సిద్ధిపేట నియోజక వర్గంలోని సిద్ధిపేట మండలంలో 10, నంగనూరులో 4, చిన్నకోడూరు 6 పాఠశాలల్లో కిచెన్‌ షెడ్ల నిర్మాణాలు దాదాపు పూర్తి కావొచ్చాయి. జిల్లాలోని దౌల్తాబాద్‌ 10, చేర్యాల 5, దుబ్బాక 2, హుస్నాబాద్‌ 4, కోహెడ 5, మిరుదొడ్డి 10, మద్దూరు 1 చొప్పున్న మొత్తం 125 పాఠశాలల్లో కిచెన్‌ షెడ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. అదే విధంగా ప్రభుత్వ మోడ్రన్‌ టాయిలెట్ల నిర్మాణాల్లో జిల్లాలో సిద్ధిపేట నియోజక వర్గం టాప్‌ గా ముందంజలో ఉంది. సిద్ధిపేట మండలంలో 15, నంగునూరులో 5, చిన్నకోడూరులో 1 చొప్పునన ప్రభుత్వ పాఠశాలల్లో మోడ్రన్‌ టాయిలెట్ల నిర్మాణాలు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఇదే బాటలో నియోజక వర్గ కేంద్రమైన దుబ్బాకలో 8, మిరుదొడ్డిలో 4, అదే విధంగా గజ్వేల్‌ నియోజక వర్గంలోని కొండపాక మండలంలో 9 చొప్పున్న జిల్లాలో 46 మోడ్రన్‌ టాయిలెట్ల నిర్మాణాలు చురుకుగా కొనసాగుతున్నాయి.

magaఅటు.. ఇటు కట్టేసుడు తప్పింది..!

మాకు రెండు బర్లు, ఒక దూడ ఉన్నాయి. ఇంతకు ముందు వానల తడుస్తుండే.. ఎండకు గోస పడేటివి. ఇయ్యాల అటు.. కట్టేసుడు తప్పింది. మనుషులకు ఉన్నట్లే పశువులకు కొట్టాలు కట్టించిన్రు. చాన సంబురం అయితంది.

– యాద వెంకటవ్వ, మల్లేశం, బంజరుపల్లి

magaమనిషికి ఇళ్ళు.. పశువులకు పాక అని మంచిగ కట్టించిండ్రు..!

మనుషులకు ఇళ్ళు.. పశువులకు పాక అని కేసీఆర్‌, హరీశ్‌ రావు సార్ల సర్కారు మంచిగా చేస్తంది. ఇంతకు ముందు ఎండ అనక వాన అనక మస్తు తిప్పలు అయ్యేటిది. ఇప్పుడు మంచిగా చేసిండ్రు. మాకొక రెండు బర్లు, ఒక ఎద్దు, వంద గొర్రెలు ఉన్నయ్‌. ఇంతకు ముందు మా బాయి కాడ కట్టేసి అవి ఎట్లా ఉన్నాయో.. ఏమో అని ఊకే రంది పడేది. ఇయ్యాల అవిటికి పశువుల కొట్టమని సర్కారోల్లు మంచిగ కట్టించి ఇచ్చిండ్రు.

ఆకుల లక్ష్మి, రాజయ్య, కోదండరావుపల్లి

magaఇప్పుడు మంచిగుంటయ్‌..! :

హరీశ్‌ రావు సారు చెప్పిండని.. మా ఊర్ల సార్లూ వచ్చి నన్ను పశువులకు కొట్టం కట్టుకోమని మేమే పైసలు ఇస్తమని చెప్పిండ్రు. మాకు రెండు బర్రెలు, ఒక ఆవు ఉన్నాయ్‌. ఇంతకు ముందు వానొస్తే ఏడ కట్టేయాలో తెల్వక మస్తు తిప్పలు అయితుండే. ఇంతకు మునుపు అవీ ఎట్లా ఉన్నాయని రంది పడేది. ఇయ్యాల మాకు నిమ్మలం అయ్యింది.

– రోమాల లక్ష్మి నర్సయ్య

Other Updates