central-ministerతెలంగాణాలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు మరింత సహకారం అందించాలని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. ఎంపీలు జితేందర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ నీతూప్రసాద్‌లతో కలిసి జనవరి 16న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌తో ఢిల్లీలో మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. తెలంగాణాలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించి, మరింత వేగంగా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు సహకరించాలని కోరారు. తెలంగాణాలోని 30 జిల్లాల్లోని 436 మండలాల పరిధిలో ఉన్న 8570 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనులను పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి తోమర్‌కు వివరించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణాకు రావాల్సిన 400 కోట్ల రూపాయల ఉపాధిహామీ మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే తెలంగాణాలో లక్ష్యాన్ని మించి ఉపాధి హామీ పనులు సాగుతున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన 10 కోట్ల పనిదినాల్లో ఇప్పటికే 8 కోట్ల 94 లక్షల పనిదినాలు ఉపయోగించుకున్నట్లు జూపల్లి కృష్ణారావు తెలిపారు. 24.3 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ పనులు కల్పించడం జరిగిందని…లక్షా 5 వేల 224 కుటుంబాలు వందరోజుల పని దినాలను పూర్తిగా ఉపయోగించుకున్నట్లు వివరించారు. తెలంగాణాలోని చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని…అలాగే హరితహారం, సోక్‌ పిట్స్‌ నిర్మాణం లాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్న నేపథ్యంలో అదనంగా మరో ఆరు కోట్ల పనిదినాలను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి తోమర్‌ను కోరారు.

‘దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్‌ యోజన’ పథకాన్ని తెలంగాణాలో పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. ఈ పథకం కింద 37311 మందికి ఉపాధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు కేంద్రం లక్ష్యం విధించగా…ఇప్పటికే 10 వేలమందికి శిక్షణ పూర్తి చేశామని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరో 6 వేల మందికి శిక్షణ పూర్తవుతుందని వివరించారు. మరో రెండేళ్ల కాలంలో కేవలం 20 వేల మందికి మాత్రమే శిక్షణా కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉంటుందని…కనీసం మరో 30 వేల మందికి అదనంగా శిక్షణ ఇచ్చేందుకు వీలుగా లక్ష్యాన్ని సవరించాలని కోరారు.

ఇప్పటివరకు 3 లక్షల రూపాయల వరకు మహిళా సంఘాలు తీసుకున్న రుణాలకు కేంద్రం 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం వడ్డీ రాయితీ ఇస్తోందని…ఇందులో కేవలం 81 కోట్ల రూపాయలనే తెలంగాణాకు కేంద్రం విడుదల చేసినట్లు మంత్రి తోమర్‌కు జూపల్లి కృష్ణారావు తెలిపారు. మిగిలిన వడ్డీ రాయితీ బకాయిలు రూ. 751 కోట్లను విడుదల చేయడంతో పాటు… జిల్లాల విభజన నేపథ్యంలో తెలంగాణాలోని 22 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి ఆర్థిక సాయం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే స్త్రీనిధి బ్యాంకు ద్వారా మహిళా సంఘాలకు అప్పులు ఇస్తున్నందున… ‘స్త్రీ నిధి’ బ్యాంకును కూడా వడ్డీ రాయితీ పథకంలో చేర్చి ఆర్థిక సాయం చేయాలని కోరారు.

‘ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన’ కింద గతంలో మొరం రోడ్లు వేసిన వాటిలో ఇంకా 2817.50 కిలో మీటర్ల పొడవైన రోడ్లను బీటీ రోడ్లుగా మార్చాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం రూ. 1745 కోట్లు మంజూరు చేయాలని మంత్రి జూపల్లి కోరారు. అలాగే రూర్బన్‌ పథకం కింద మొదటి విడతలో నాలుగు క్లస్టర్లను మంజూరు చేసిన కేంద్రం, రెండో విడతలో కేవలం మూడు క్లస్టర్లను మాత్రమే మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం తెలంగాణాలో జిల్లాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అదనపు క్లస్టర్లను మంజూరు చేయాలని కోరారు.

Other Updates