గోదావరి జన సంద్రమైంది. పులకించింది. భక్తజన సందోహంతో ఉప్పొంగిపోయింది. గోదావరి మహా పుష్కరాలు స్వరాష్ట్రంలో దిగ్విజయంగా ముగిశాయి. తెలంగాణ ప్రజలు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పుష్కరాలలో పాల్గొన్నారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర జనాభాను మించి, ఆరున్నర కోట్లమంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించడం మహాద్భుతం.
గత పాలకులు చూపిన వివక్ష, అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వచ్చిన తొలి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని సంకల్పించారు. ఈ గోదావరి మహా పుష్కరాలను అనుకున్నదానికన్నా మిన్నగా, కుంభమేళాను తలపించేలా నిర్వహించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది.
2003లో వచ్చిన గోదావరి పుష్కరాలకు, ఇప్పుడు జరిగిన గోదావరి పుష్కరాల నిర్వహణకి అసలు పొంతనే లేదు. ఆనాటి పాలకులు అప్పుడు పుష్కరాలను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశారు. గోదావరినది ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ దూరం ప్రవహిస్తున్నప్పటికీ గత పుష్కరాలలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 27 పుష్కరఘాట్లు మాత్రమే ఏర్పాటు చేశారు. వాటి సంఖ్యను మన ప్రభుత్వం ఇప్పుడు 106 ఘాట్లకు పెంచి, పుష్కర యాత్రికుల కోసం సకల సౌకర్యాలు కల్పించింది. ప్రధాన కేంద్రాల నుంచి ఘాట్ల వద్దకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించింది. అవసరాన్ని బట్టి మంత్రులు సయితం ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాలలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఒక్కమాటలో చెప్పాంటే ప్రభుత్వం అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించి పుష్కరాలను విజయవంతం చేసింది.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్వయంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ ఇచ్చిన ఆదేశాలు, చేసిన సూచనలు, వాటిని తూ.చా. తప్పక పాటించిన రాష్ట్ర మంత్రులు, అధికార యంత్రాంగం కృషివల్లే 12 రోజులపాటు ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, విజయవంతంగా పుష్కరాల నిర్వహణ సాధ్యపడింది. ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఈ విజయానికి కృషిచేసిన ప్రతి ఒక్కరూ అభినందనీయులే.
గోదావరి మహా పుష్కరాల నిర్వహణ తీరు ముందు ముందు జరిగే ఉత్సవాల నిర్వహణకు మార్గదర్శకంగా నిలిచిందనడంలో సందేహం లేదు.