స్థలనామ పరిశోధనారంగంలో
పాశ్చాత్యులు ప్రశంసార్హమైన కృషిని జరిపారు. పాశ్చాత్య దేశాలలో వ్యక్తి నామాలు, ఇంటిపేర్లు ప్రకృతి సంబంధమైన చెట్లు, గుట్టలు, నదీనదాలు మొదలైన వాటిపేర్లమీద కూడా ఎన్నో పరిశోధనలు జరిగాయి. వీటిలో చేరిందే స్థల నామ పరిశోధన.

సామాన్యంగా జన వ్యవహారంలో పేరులో ఏముంది? అనే ఒక ఉపేక్షాభావం చోటు చేసుకుంది. పేర్లలో ఇదమిద్ధమైన ఒక సమాజ చరిత్ర ఉంటుందనీ, దానితో పేర్లకు సంబంధం ఉంటుందనీ చాలామంది గుర్తించారు. ఈ గ్రామనామాల అవగాహన భాషాశాస్త్రజ్ఞుల్లోనూ, జానపదుల్లోనూ, సంప్రదాయజ్ఞుల్లోనూ ఉంది. సుప్రసిద్ధ స్థలనామ పరిశోధనా శాస్త్రవేత్త ఎ.ఎస్‌. త్యాగరాజు ఃఃూ ర్‌బసవ శీట ువశ్రీబస్త్రబ జూశ్రీaషవ చీaఎవరఃఃలో ఇలా అన్నారు.- ఃఃఔష్ట్రవతీవ నఱర్‌శీతీవ ఱర రఱశ్రీవఅ్‌ ్‌ష్ట్రవతీవ జూశ్రీaషవ చీaఎవర ూజూవaస శ్రీశీబసఃః (ఎక్కడ చరిత్ర మూగబోయిందో అక్కడ స్థలనామాలే గుర్తు చేస్తాయి). దీనికి ఉదాహరణగా అప్పకవీయములోని ఈ పద్యాన్ని పేర్కొనవచ్చు.

గీ|| ”రామకథలోన కపులు వారాశిగట్టి
రనుచు వాల్మీకి జెప్పంగ నఖిల జనులు
సేతువనుచు నెఱింగిరి, జెప్పకున్న
నదియునొక సోగదీవి యటండ్రుగాదె!

మెదక్‌ జిల్లా గ్రామనామాలు అనే విషయాన్ని నేను 1981లో పీహెచ్‌డీ కోసం పరిశోధనాంశంగా ఎన్నుకున్నాను. అప్పటికి ఈ జిల్లాలో 11 తాలూకాలు ఉండేవి. ఈ సిద్ధాంత గ్రంథాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించేనాటికి మండల వ్యవస్థ ఏర్పడలేదు. నా పరిశోధనంతా తాలూకాల వారిగానే కొనసాగడానికి ఒక ముఖ్య కారణమైంది.

ప్రస్తుత కాలంలో మెదక్‌ జిల్లా స్వరూపం మరింతగా మారింది. 9 జిల్లాలుగా వుండే తెలంగాణ రాష్ట్రం 31 జిల్లాలుగా విస్తరించినట్లు, మెదక్‌ జిల్లాకూడా సంగారెడ్డి, మెదక్‌, సిద్ధిపేట జిల్లాలుగా విస్తరించింది. ఈ విభాగంతో జిల్లా స్వరూపం పరిపాలనా సౌలభ్యంకోసం విస్తరించిన ప్పటికీ ఊర్లపేర్లలోగానీ, వాటి చరిత్రలోగాని, భాషా సంవిధానంలోగాని, పూర్వపరావయాల్లోగాని, నామమాత్రమైన మార్పులు కూడా జరుగవు.

మెదక్‌ జిల్లాలో మొత్తం 1620 గ్రామాలున్నాయి. అందులో 1265 రెవిన్యూ గ్రామాలు. 334 మజరా గ్రామాలు. ఇవికాక 30 బేచిరాకు గ్రామాలున్నాయి. స్థూలంగా ఇది మెదక్‌ జిల్లా స్వరూపం. ఈ ”మెదక్‌ జిల్లా గ్రామనామాలకు” ఒక ప్రాముఖ్యం ఉంది. ఇది తెలంగాణా గ్రామనామాల మీద వెలువడిన మొట్టమొదటి గ్రంథం. తెలంగాణా జిల్లాలకున్న ప్రత్యేక భౌగోళిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర మెదక్‌జిల్లా గ్రామనామాల్లో వ్యక్తం కావడం మనం గమనించవచ్చు. మెదక్‌ జిల్లా ఏర్పాటును 1901 నుండి మనం పరిశీలించినప్పుడు ఈ జిల్లామీద భాషా, సామాజిక గతమైన భావాలు భిన్నంగా కనిపిస్తాయి. సంకీర్ణంగా కూడా కన్పిస్తాయి. ఈ భిన్నత్వాన్ని, సంకీర్ణతను ఇప్పటికే స్థిరపడిన ఒక విధాన వ్యవస్థను ఇందులో మనం గమనించవచ్చు.

తరువాత 2005లో టి. శ్రీనివాస్‌ అనే ఒక విద్యార్థి నా పర్యవేక్షణలో ”కరీంనగర్‌ జిల్లా గ్రామనామాలు” అనే అంశంలో డాక్టరేట్‌ పొందినాడు. తెలంగాణాలో ప్రస్తుతం వున్న 31 జిల్లాలకుగాను పై రెండు జిల్లాల పరిశోధన మాత్రమే పూర్తయింది. ఈ నా పరిశోధక గ్రంథం మిగతా తెలంగాణా జిల్లాల గ్రామనామ పరిశోధనకు ప్రేరకమౌతుందనే విశ్వాసం నాకు దృఢంగా ఉంది.

స్థలనామాలు ఒక భాషా ప్రాంతం చరిత్రను నిక్షిప్తం చేసుకున్న మూలకందాలని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ స్థలనామ పరిశోధనలవల్ల సాంస్కృతిక-చారిత్రక విశేషాలేకాకుండా మానవజాతి శాస్త్రం, జంతు – వృక్షశాస్త్రాలు వాటి మధ్యగల సంబంధాలుకూడా తెలుస్తాయి. ఈ విషయంపట్ల ప్రాచీన భారతీయులు కూడా కొంత శ్రద్ధ కనబరచినట్లు పాణిని సూత్రాలు, అధర్వణకారికావళి మొదలైన వాటివల్ల తెలుస్తుంది.

మెదక్‌ జిల్లాలోని గ్రామనామాల్లో 790 వ్యక్తి నిర్దేశకాలు ఉన్నాయి. లోక నిరుక్తులవల్ల కైఫీయత్తులు శాసనాధారాలు మున్నగువాటి సహాయంతో చరిత్రను నిర్ణయించే వీలుంటుంది.

రాజులు-రాణులు పేర్లతో ఏర్పడిన గ్రామనామాలు
1. నర్సింహారెడ్డి – నర్సాఖేడ్‌ – నర్సాపూర్‌- నార్సింగి
2. అల్లమ చౌదరి – అల్లాదుర్గం
3. సదాశివరెడ్డి – సదాశివపేట
4. శంకరమ్మ – శంకరంపేట
5. రంగమ్మ – రంగంపేట
6. రామాయమ్మ – రామాయంపేట

మహమ్మదీయ పాలకుల ప్రభావంతో ఏర్పడిన గ్రామాలు 303 ఉన్నాయి. ఔరంగానగర్‌, ఔరంగాబాద్‌, హైదరాబాద్‌, నిజాంపేట, నవాబ్‌పేట, బీబీపేట, ఇబ్రహీంనగర్‌ మొదలైనవి.

ఆధారాలు లభ్యమైనంతవరకు కొన్ని గ్రామనామాల చరిత్రను ఇక్కడ ఇవ్వడం జరిగింది.

మెదక్‌ లేక మెతుకు-దీనికి ‘పులాక’ రాష్ట్రమని పేరు. ఇక్కడ సన్నని వరిధాన్యాన్ని పెద్దఎత్తున పండించడంవల్ల అన్న సమృద్ధినిబట్టి దీనికి ”మెతుకు సీమ” అని పేరు కలిగింది. ‘క’ కారం ఉచ్ఛారణలో సారళ్యాన్ని పొంది ‘మెదుకు’, ‘మెదక్‌’గా మారింది. గోల్కొండరాజుల కాలంలో ఇది ‘గుల్షాణాబాదు’గా పునర్నామ్నీ కరణాన్ని పొందింది. తరువాత నిజాంలు దీన్ని ‘మెతుకు దుర్గం’గా మలచుకొన్నారు. ఇది అత్యంత ప్రాచీనమైన నగరం. క్రీస్తు శకారంభంలో శాతవాహన రాజుల కాలంనుంచీ ఇది చాలా రాజకీయ ఒత్తిళ్ళకు లోనయింది. ఇక్కడి చర్చి ఆసియాలోనే ద్వితీయ స్థానాన్ని ఆక్రమించుకుంది. దీనితోపాటు మరికొన్ని స్థలాలను నిజాం నవాబు మూసారైమండ్‌ అనే ఫ్రెంచి నాయకునకు సైనిక స్థావరంకోసం ఇచ్చాడు. ఆ కాలంలోనే ఇక్కడ చర్చి నిర్మించబడింది. హైదరాబాదులో ఈయన సమాధి ఉన్న ప్రాంతానికి ”మూసారైమండీబాగ్‌’ అనే పేరు వచ్చింది. ఇది ప్రజల నోళ్ళలో నలిగి ”మూసారంబాగ్‌” అయింది.

నార్సింగి-ధర్మ ప్రభువుగా పేరొంది, ”అపరశిబి” బిరుదాంచితుడైన నర్సింహారెడ్డి పేరుతో 8 గ్రామాలున్నాయి. నార్సింగిగా పిలువబడుతున్న నార్సింపేట అనే గ్రామాన్ని ఇతని భార్య నిర్మించింది. ఇతడు పాపన్నపేట సంస్థానాధీశ్వరుడు. మెదక్‌ జిల్లాలో నార్సింగి పేరుతో ఉన్న రెండు గ్రామాలు కాకుండా నార్సింగి పేరుతో మరొక గ్రామం రంగారెడ్డి జిల్లాలో హైదరాబాదుకు సమీపంలో ఉంది.

లింగంపల్లి-నర్సింహారెడ్డి పట్టమహిషియైన రాణీ లింగాంబ (1680-1692) తన పేరు మీద ఈ గ్రామాన్ని బిలాల్‌పురం, నార్సింపేట మొదలైన గ్రామాలను నిర్మించిందట. ఈమె కాలంలోనే సిద్ధబిలాలుడు 300 గ్రామాలకు కోటలు నిర్మించాడట. (ఇవి 7 ఆరోపాలున్నాయి)

ఈ సిద్ధిబలాలుడే సిద్ధిపేటకు కోటను నిర్మించాడట. లింగాంబ దత్తపుత్రుడు మంచిరెడ్డి వంశస్థుడైన కృష్ణారెడ్డి తన పేర కృష్ణాపురమనే అగ్రహారాన్ని నిర్మించి, బ్రాహ్మణులకు దానమిచ్చాడు. మెదక్‌ సమీపంలోని పసుపేరు తీరంలో ఈ గ్రామముంది. ఇతడు తన వివాహ సందర్భంలో భువనగిరికి దగ్గరలోవున్న ‘అమ్మనబోలు’ మొదలైన గ్రామాలు అరణంగా పొందాడు.

రామాయంపేట-కృష్ణారెడ్డి పట్టమహిషియైన రామాయమ్మ క్రీ.శ. 1700-1705 తన పేరుతో రామాయంపేట అనే గ్రామాన్ని నిర్మించింది. తన పరిపాలనాకాలం లో సిరిపురం మొదలైన గ్రామాలు నూతనంగా ఆర్జించింది. ఈమె తన చెల్లెలి కుమారుడైన బెల్లమరెడ్డిని దత్తు తీసుకుంది. ఈ బెల్లమరెడ్డికే మరోపేరు లింగారెడ్డి. ఇతడు తన పేరుమీద ‘లింగాపురం, లింగారెడ్డిపేట’, తన పూర్వ నామమైన బెల్లమరెడ్డి పేరుతో ‘బెల్లాపూర్‌’ అనే గ్రామాన్ని కూడా నిర్మించాడు.

శివ్వంపేట-లింగారెడ్డి తన పట్ట మహిషియైన శివ్వాయమ్మ పేరుమీద ‘శివ్వాయమ్మపేట’ అను గ్రామాన్ని నిర్మించాడు. ఈ పేరు ప్రజల నాల్కలపై నలిగి ‘శివ్వంపేట’గా మారింది. ఇవి 8 ఆరోపాలున్నాయి. ఈమెకు సంతానం లేనందువల్ల దైవానుగ్రహంతో లభించిన బాలుని పెంచుకుని ”రాజా వెంకటనర్సింహారెడ్డి” అనే పేరు పెట్టింది.

శంకరంపేట-లింగారెడ్డి, శివ్వాయమ్మల దత్తపుత్రుడైన వెంకటనర్సింహారెడ్డి కల్పగూర్‌ ప్రాంతంలో పర్యటిస్తూ ‘శంకరాంబ’ అనే కాపు పడుచును చూసి, ప్రేమించి వివాహమాడారు. ఈమె మిక్కిలి ధీరురాలు. స్వయంగా రాజ్యపాలన చేసింది. నిజాం కాలంలో తిరుగుబాటు చేసిన పీష్వాలను ఓడించి, నిజాంనుండి ”రాయెబాగిన్‌’ (రాజ్ఞిశార్దుల) అనే బిరుదును పొందింది. ఈమె తన పేరుతో ‘శంకరంపేట’ అనే రెండు గ్రామాలను నిర్మించింది.

సీ|| ధరణిలోపల శాశ్వతంబుగ తన తండ్రి పేర
సంగారెడ్డిపేట గట్టె
రాజమ్మపేటయు, రాయెబాగిని రెండు
తల్లి పేరొప్ప భూస్థలిని నిలిపె
తొంటెడు లక్ష్మిల తోపురంపు బిల్మక్త
లిర్వది పరగణావెలమినేలె
రాయెబాగిని శంకరాంబకు తమ్ములౌ
జగతి పుల్లారెడ్డి శంభురెడ్డి
యనెడివారలు శేరీల కధిపులగుచు
పరగ శంకరంపేట, పాపన్నపేట
సావుకార్లు వసింపంగ సకల భోగ
భాగ్యమ్ముల పేటలనుకట్టి ప్రజలనేలె

కిచ్చన్నపల్లెలో వేంకటేశ్వరస్వామిని ప్రతిష్ఠించి, దివ్యమైన పుష్కరిణిని నిర్మించి, బ్రాహ్మణులకు అనేక అగ్రహారములనిచ్చింది. అందొక గ్రామంలో రంగనాథస్వామి దేవాలయాన్ని ఈమె నిర్మించింది. ఈమె సమాధి ”శంకరమ్మగుడి” అనే పేరుతో మంజీరానది తీరంలో వుంది.

సంగారెడ్డి-దీన్ని పూర్వం ‘సంగారెడ్డిపేట’ అని పిలిచేవారు. రానురాను ‘పేట’లోపించి ‘సంగారెడ్డి’గానే పిలువబడుతున్నది. రాణిశంక రాంబ తన తండ్రి పేరిట ఈ గ్రామానికి ముగ్గుపోయించింది. దీనికి సమీపంలోనే తన తల్లి పేరిట ‘రాజంపేట’ గ్రామాన్ని నిర్మించింది. సంగారెడ్డి, మెదక్‌ జిల్లాకు ముఖ్య పట్టణంగా ఉండేది. ఈ గ్రామం మెదక్‌ కన్నా రాష్ట్ర రాజధానియైన హైదరాబాద్‌ నగరానికి సమీపంలో ఉండడంవల్ల జిల్లా ముఖ్య పట్టణం అయింది.

ప్రస్తుతం ఈ గ్రామం మెదక్‌జిల్లానుండి విడివడి స్వతంత్రమైన జిల్లాగా రూపొందింది. ఈ గ్రామంచుట్టూ కోటగోడలు, కందకము, పెద్ద చెరువు మొదలైనవి ఉన్నాయి. ఈ నగర ప్రాచీన వైభవానికి ఇవి మూగసాక్ష్యాలుగా నిలిచాయి. పాపన్నపేట రాజులు ఈ గ్రామాన్ని పాలించారు. రామినేడు రాజధానియైన ‘కల్పగూరు’ ఈగ్రామానికి సమీపంలో ఉంది. ఒకప్పుడిది ముఖ్య పట్టణం.

సదాశివపేట-సుమారు 500 సంవత్సరాల క్రితం పాపన్నపేట సంస్థానాధీశ్వరుడైన సదాశివరెడ్డి తన పేరుతో ఈ గ్రామాన్ని నిర్మించాడు.

సిద్ధిపేట-రామిరెడ్డి కుమారుడు సదాశివరెడ్డి. ఇతనికి పురుష సంతానం లేనందువల్ల కూతురు లింగమ్మకు సింగూరుకు చెందిన నర్సింహారెడ్డిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. ఇతడు ధర్మప్రభువు. ఔరంజేబుకు విశ్వాసపాత్రుడు. ఇతని కాలంలోనే 700 గ్రామాలున్న విశాలరాజ్యం ఏర్పడింది. మెదక్‌ కేంద్రమైంది. తన నమ్మినబంటైన సిద్ధి బిలాలుని చేరదీసి, సైన్యాధిపతి పదవి ఇచ్చాడు. సిద్ధిబలాలుడు తన పేరు మీద సిద్ధిపేట అనే గ్రామాన్ని నిర్మించాడు.

ఈ గ్రామాన్ని ఒక సిద్ధుడు నిర్మించినట్లు అతడు ‘భోగేశ్వరస్వామి’ ఆలయాన్ని నిర్మించినట్లు మరొక ఐతిహ్యం కూడా వుంది.

గుఱ్ఱాలగొంది-సిద్ధి బిలాలుడనే సైన్యాధిపతి ‘సిద్ధిపేట’ను నిర్మించి, అక్కడేవుండి పరిపాలన చేస్తూ, తన ఆశ్విక సైన్య స్థావరంగా ఒక గ్రామాన్ని నిర్మించి, అక్కడ అశ్వశాలను ఏర్పాటుచేసినందువలన దీనికి ‘గుఱ్ఱాలగొంది’ అనే పేరు వచ్చిందని వ్యవహర్తల కథనం.

మెదక్‌ జిల్లాలో చరిత్ర పూర్వయుగానికి సంబంధించిన చారిత్రక ఆధారాలున్నాయి. పురాతన కాలంలోని సమాధులు, స్తూపాలు, ముత్తంగి, ఇస్నాపురం, రాజిపల్లె, అసన్‌పల్లె, పొన్నాల, మర్పడిగె గ్రామాల్లో ఉన్నాయి.

ఈ విధంగా మెదక్‌ జిల్లా క్రీ.పూ. శాతవాహనుల కాలంనుంచీ నిన్నమొన్నటి స్వాతంత్య్రోద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో కూడా ఎంతో చరిత్రను తనలో ఇముడ్చుకొని ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. మెదక్‌, కరీంనగర్‌ జిల్లాలతోపాటు మిగిలిన 29 జిల్లాల్లో గ్రామనామ పరిశోధన పూర్తైతే వాటిని తులనాత్మక అధ్యయనం చేయడంద్వారామొత్తం తెలంగాణా భాషా సామాజిక చరిత్ర కూడా సమగ్రంగా తెలియడానికి వీలుంది.

డా. పైడిమఱ్ఱి మాణిక్‌ప్రభు
tsmagazine
tsmagazine

Other Updates