‘మండుటెండ, ఎండలు మండిపోతున్నాయి. ఎండ చండ్ర నిప్పులు చెరుగుతోంది’ మొదలైన అభివ్యక్తుల్ని మనం తెలుగు కాల్పనిక సాహిత్యంలోని కథలు, నవలలకు సంబంధించిన వర్ణనల్లో గమనిస్తూ ఉంటాం. తెలంగాణ ప్రాంతంలో ఏ ఒక్కరూ ‘మండుంటెండ’ అని వ్యవహరించరు. తెలంగాణ తెలుగులో ‘ఎర్రటి ఎండ’ అంటారు. ‘ఎండ చండ్ర నిప్పులు చెరుగుతోంది’కి బదులుగా ‘ఎండ కొర్రాయోలె కొడుతున్నది’ అని ప్రకటిస్తారు. కొర్రాయి అంటే కొరివి. ఇంకా పొయ్యిలో మండుతున్న కట్టె. తెలంగాణలోనే మరికొన్ని ప్రాంతాల్లో ‘ఎండ కొర్కాసోలె కొడుతున్నది’ అనే వాక్య వినియోగం వుంది. కొర్కాసు అంటే కొరకంచు. ‘ఎండల పడి’ వచ్చిన చుట్టానికి వెనుకటి రోజుల్లాగ అంబలి పోసేవారు. ఇప్పుడు చల్ల పోస్తున్నారు. ఇంకా కొందరు శర్బత్ ఇస్తారు (నిమ్మకాయ రసం). ‘ఎండలు మండి పోతున్నాయి’కి సమానార్థకంగా తెలంగాణ భాషలో ‘ఎండ సుర్రుమంటుంది’ అని అంటున్నారు. ‘మిట్ట మధ్యాహ్నం’వంటి పదబంధం తెలంగాణలో ‘ఎండపొద్దు, ఎండపూట’లుగా మారింది. ‘పట్టపగలు’ అనే మాట రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వాడుకలో వుంది.
తెలంగాణలో ప్రత్యేకంగా ఒక పదబంధం వుంది. అది ‘ఎండపండు’. ఈ ‘ఎండపండు’ అనేది రూపకం. ‘ఏందిరా! ఎండ పండు తినుకుంట గింత ఎండల పడి వచ్చినవ్? ఏం మునిగి పోయిందిరా?’వంటి మాటలు తెలంగాణ పల్లె ప్రజల్లో వున్నాయి. ఎండ పండు తినటం అనేది ఎండలు మండిపోవడానికి కవితాత్మక వ్యక్తీకరణ. ‘ఎండకు కాల్లు కాలుతయి. బైటికి పోవద్దు’ అనే వాక్యాలూ వున్నాయి. ఎండ బాగా కొడుతున్నప్పుడు ‘ఎండతాపం’ అనే సమాసం వుంది తెలంగాణలో. దీన్నే తెలుగు ‘ఎండ తీవ్రత’ అంటారు.
ఎండ బాగా కొడుతున్న సందర్భంలోనే ‘ఎండ ఉమ్మిరి మీద వుంది’ అంటారు. బహుశ: ఈ ‘ఉమ్మిరి ముమ్మరంలోంచి వచ్చిందేమో! లేక హిందీ ‘ఉమర్’ అంటే వయస్సు. దీన్నే పల్లె జనులు ‘నీ ఉమ్మర్ ఎంత?’అని.. ‘నీకు ఎన్ని ఏండ్ల వయస్సు’ అనే అర్థంలో వాడుతారు. ఈ ‘ఉమ్మరే’ ‘ఎండ ఉమ్మిరి’లోని ‘ఉమ్మిరి’ కావడానికి అవకాశం వుంది. ‘ఎండ ఉమ్మిరి మీద ఉంది’ అంటే మాంఛి కోడెకారు లాంటి వయస్సులో ఉంది అని అర్థం. అందుకే ఎండ తగ్గిపోగానే మరలా ‘ఎండ ఉమ్మిరి తగ్గింది’ అంటారు.
దాదాపుగా ఫిబ్రవరి మాసాంతంనుండి ఎండలు క్రమంగా పెరుగుతూ మే మాసంలో వాటి ప్రతాపాన్ని చూపిస్తాయి. ఆ సందర్భాల్లో తెలంగాణలో ‘ఎండలు ముదిరినయి’ అంటారు. పొద్దుటిపూట ఎండను ‘ఎండపొడ’ అని వ్యవహరిస్తారు. తెలంగాణేతర ప్రాంతాల్లో ఈ ఎండపొడతోపాటు లేయెండ, నీరెండవంటి మాటలు కూడా వ్యవహారంలో ఉన్నాయి.
పట్టపగలు ఎండ తీక్షణంగా కొడుతున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో ‘ఎండ నిలవడి కొడుతున్నది’ అంటారు. అంటే ఆకాశంలో సూర్యుడు మన నెత్తిమీద కాసేపు ఆగి అక్కడే నిలబడి తన ఎండవేడిమిని వెళ్ళగక్కడం అన్నమాట. వేసవికాలంలో ఎండ తీవ్రతవల్ల, వేడిగాలుల వల్లా, ఎక్కువగా నీళ్ళు తాగకపోవడం వల్ల వడదెబ్బకు గురవుతారు. ఈ వడదెబ్బ తెలంగాణలో ‘ఎండదెబ్బ’గా వ్యవహరమవుతుంది. నిజానికి వడదెబ్బ అనేమాట వేడి దెబ్బనుండి వచ్చింది.ఎండకు సంబంధించి ‘ఎదురెండ’ అనేమాట ఒకటి వుంది. తెలంగాణలో ‘మొకమెండ’ అంటారు. అంటే మా ముఖానికి ఎదురుగా, అభిముఖంగా సూర్యుడు వుండడం. అటువంటి ఎండను భరించడం కష్టం. ఎండ బాగా కొడుతున్న సందర్భంలో ‘ఎండ ఎక్కివచ్చింది’ అనే అభివ్యక్తి కూడా ఉంది. బట్టలు ఉతికిన తర్వాత వాటిని తెలంగాణలో దండెమ్మీదనో, మరోచోటో ‘ఎండేస్తరు’. దీన్ని… అంటే ఈ ‘ఎండేయడాన్ని’ ఆధునిక ప్రమాణభాషలో ‘ఎండగట్టడం’ అంటున్నారు. చలికాలంలో ‘ఎండ పొడుపు’కు నిలబడి ఎండకాగడం ఆనవాయితీ. ఎండ తీవ్రతను చెప్పడానికి తెలంగాణ గ్రామీణులు ‘ఎండ ఎటో కొడుతున్నదేమిరో’ అంటారు. ఆ ‘ఎటో అన్న పదంతోనే ఎండ తీక్షణత, తీవ్రతలు దాగి ఉన్నాయి. ఎండ బాగా కొడుతుంటే ‘కాళ్ళు సురసుర కాలుతయి’. ఎండాకాలంలో పొద్దుటి ఎండ తీక్షణంగా వెళ్ళుతది, అందుకే పల్లె ప్రజలు ‘ఎండ ఎల్లక ముందే బైలెల్లాలె’ అంటుంటారు.
‘రోణీల రోకండ్లు పగులుతయి’ అనేది సామెత. రోహిణీ కార్తె సుమారుగా మే మాసాంతంలో వస్తది. అప్పుడు ఆ ఎండకు రోకళ్ళు సైతం పగిలిపోతాయట! అంత తీవ్ర ఎండకు!! ఎండ గురించి మాట్లాడుకుంటుంటే ‘మాఘమాసంల మాడ ఎత్తు పొద్దు నిలుస్తది’ అనే సామెత స్ఫురిస్తున్నది. వేసవిలో పగలు ఎక్కువ. రాత్రి తక్కువ. చలికాలంలో దీనికి భిన్నంగా పగటిపూట కన్నా రాత్రి ఎక్కువగా ఉంటుంది.
మాఘమాసం అంటే దాదాపు చలి తగ్గిపోయి చిన్నగా ఎండలు మొదలవుతున్న కాలం, అందుకని మా ఎత్తు అంటే ‘అరవరహా’ అంత పొద్దు (దినం) ఇస్తుందని అర్థం. మరి అంతకన్నా ముందు అంటే ‘పుష్యమాసంలో పూస గుచ్చేంత పొద్దుండది’. అప్పుడు పగటిపూట మాఘం కన్నా స్వల్పం. ఇంకా అంతకుముందు ‘కార్తికమాసంల కలిగినోల్లింట్ల కడువలు కడిగే పొద్దుండది’. కలిగినవాళ్ళు రకరకాల కూరలు చేసుకుంటారు. అన్నాలు వండుకుంటారు. వాటికి ఎన్నో కుండలు అవసరం వండడానికి ఆ కుండలన్నీ కడగటానికి అవసరమైన ‘పొద్దు కూడా ఉండదనిసామెత అర్థం. ఇక ఎండలు ముదిరినకొద్దీ పొద్దు ఎక్కువై రాత్రి తగ్గుతుంది.
డాక్టర్ నలిమెల భాస్కర్