పట్నం మమ్ముల పరేశాన్‌ జేసింది.
పట్నం కొచ్చేటి మా సోపత్గాల్లు గూడ పరేశానైతున్నరు. పట్నంల ఏది యాడుందో మాకెర్కలేదాయె.
ఏ బస్సు యాడ్కి వోతదో తెల్వదాయె.
పట్నంల ఉన్న మాకె ఎర్కలేకుంటె పట్నమొచ్చేటి
మా సోపత్గాల్లకు యాడెర్కుంటది. గంతేగాకుంట పట్నమోల్ల లెక్క ఊరోల్లు చాలుగాల్లు గాదు.
గాల్లు అంబ్యాదోల్లు. అంబ్యాదోల్లకు అన్ని తిప్పలే. గిదంత ఎందుకు గని అసల్‌ ముచ్చట కొస్త.

నాకు శంకర్‌ అనే దోస్తున్నడు. బోన్గిరిల తొమ్మిదో తరగతికెల్లి పన్నెండో తరగతి దాంక గాడు నేను కల్సి సద్వుకున్నం. శంకర్‌ కంకర్‌ నీమూతి వొంకర్‌ అన్కుంట మా బల్లె కొంతమంది శంకర్‌గాన్ని బనాయించెటోల్లు. ఎవ్వరెంతగనం బనాయించినా గాడు కోపానికొచ్చెటోడుగాదు. నవ్వి ఊకునేటోడు. మా ఊర్లె శంకర్‌ను అందరు బొమ్మల శంకర్‌ అని పిల్చెటోల్లు. గాడు బొమ్మలు మంచిగ దించెటోడు. మా బోన్గిరి ఖిల్లÑ హన్మంతుని గుడిÑ మా పెద్ద పంతుల బొమ్మలనే గాకుంట శాన బొమ్మలను గాడు బెహత్రీన్గ దించిండు.

ఒకసారి ఏమైందంటె. మా లెక్కల పంతులు ఒక లెక్క ఎట్లజెయ్యాలో మాకు జెప్పిండు. గా లెక్కను బోర్డుమీద జేసి సూపెట్టిండు. అటెంకల గసుంటి లెక్కనే మాకు చెయ్యమని ఇచ్చిండు. మేమందరం గాలెక్క జేసినం. గంతేగాకుంట మా కాపిలను లెక్కలసార్‌కు సూపెట్టినం. గని శంకర్‌ ఒక్కడే గాని కాపిని సూపెట్టలేదు.

‘‘అరె శంకర్‌ నీ కాపి సూపెట్టురా’’ అని లెక్కల సార్‌ అన్నాడు. లెక్క జెయ్యనందుకు యాడగొడ్తడోనని బుగులుబడుకుంటనే గాడు సార్‌కు కాపి సూపెట్టిండు. గది సూడంగనే సార్‌ శంకర్‌ను కొడ్తడని మేమనుకున్నం. కని గాయిన గాన్ని గొట్టలేదు.

‘‘బొమ్మలు బువ్వబెట్టయిరా. ముందుగాల్ల మంచిగా సదువురా. అటెంకల బొమ్మలు దించు’’ అని లెక్కలసార్‌ శంకర్‌కు జెప్పిండు.ఎంత-పనాయ-4‘‘తప్పయింది. ఇంకోసారి తరగతిల బొమ్మలు దించను సార్‌’’ అని శంకర్‌ గాడన్నడు.
అందరం మా కాపిలల్ల లెక్కను జేస్తె గాడు గాని కాపిల లెక్కల సార్‌ బొమ్మను దించిండు. గా బొమ్మ అచ్చం సార్‌ లెక్కనే ఉన్నది. గాదాన్ని సూసెతల్కె లెక్కలసార్‌ కోపం పోయుంటది.
లేకుంటె లెక్కజెయ్యనందుకు గాన్ని గాయిన కొట్టెటోడే. ఒక దిక్కు సద్వుకుంటనే ఇంకోదిక్కు గాడు బెహత్రీన్గ బొమ్మలను దించెటోడు.
పన్నెండో కిలాస్‌ కాంగనే డిగ్రీ సద్వెతందుకు మేము పట్నమొచ్చినం. గని శంకర్‌ బోన్గిరిల ఉన్న ఐటిఐల షరీకైండు. ఐటిఐ జేస్తున్నా గాడు బొమ్మల దించుడునైతే బంద్‌ జెయ్యలేదు. గంతేగాకుంట బొమ్మలు దించుట్ల పేరున్నోల్ల తాన్కిబోయి బొమ్మలు దించుట్ల తీరుతీరు తరీకలను గాడు నేర్సుకో వట్టిండు. ఇగ దాంతోని గాన్కి కొత్త బుర్సులతోని పని వడ్డది. గాని గవ్వి బోన్గిరిల దొర్కయి.
బొమ్మలు దించెతంద్కు అక్కరకొచ్చేటి బుర్సులకోసం శంకర్‌ పట్న మొచ్చిండు. గాడు ఇంతకుముందు రొండుపార్లే పట్నమచ్చినిండె. గాన్కి చిక్కడ్‌పల్లి దాంకనే తొవ్వెర్క. గదిగూడ సుట్టాలతోని వొచ్చె వట్కె ఎర్కైంది. పట్నంల నారాయణగూడ, వైఎంసిఎల నడ్మ పద్మజ స్టేషనరి దుక్నమున్నది. గాదాంట్ల బొమ్మలు దించెతందుకు అక్కరకొచ్చే బుర్సులు దొర్కుతయని ఒకపారి డ్రాయింగ్‌సార్‌ శంకర్‌కు చెప్పినిండె. లష్కర్‌ టేషన్ల రేల్‌ గాడి దిగంగనే గాన్కి సార్‌ జెప్పింది యాది కొచ్చింది. గాల్లను గీల్లను అర్సుకుంటె ఏక్‌నంబర్‌ బస్సు వైఎంసిఎ మీదికెల్లే బోతదని గాన్కి ఎర్కైంది.

శంకర్‌ ఏక్‌ నంబర్‌ బస్సు ఎక్కిండు. వైఎంసిఎ దాంక టికిట్‌ దీస్కుండు. మల్ల నాల్గుగొట్టంగ బోన్గిరి బొయ్యెతందుకు రేల్‌గాడి ఉన్నది. బుర్సులు గొన్నంక మస్తు టైముంటది. గప్పుడు ఏంజెయ్యాలె. మా ఊరోల్లు పట్నమొస్తె తప్పకుంట ఏదన్న ఒక సైన్మ జూసి వొస్తరు. నేను గూడ ఏదన్నొక సైన్మ జూస్తె బాగుంటది అని గాడు అనుకున్నడు. అనుకునుడు గాకుంట చార్మినార్‌ చౌరస్తకాడ బస్సు దిగిండు. సంగం టాకీస్ల మార్నింగ్‌ షో జూసిండు.

సైన్మ జూసినంక శంకర్‌ హోటల్లకు బోయి గింత దిన్నడు. బస్టాప్‌ కొచ్చి మల్ల ఏక్‌నంబర్‌ బస్సు ఎక్కిండు. బస్సు నారాయనగూడ దాటింది. వైఎంసిఎ వొస్తదనంగ బస్సుల ఉన్న శంకర్‌కు పద్మజ స్టేషనరి దుక్నం గండ్ల బడ్డది. గీ బస్సు యాడాగుతదో, ఎందాంక బోతదో. మల్ల గీ దుక్నంను లెంకుకుంట రావాలంటె తిప్పలైతదనుకోని గాడు బస్సులకెల్లి దుంకిండు. గాడు గిట్ల దుంకంగనే గట్ల బస్సు ఆగింది. గా దుక్నం పక్కపంటే స్టేజి ఉన్నది. గా సంగతి శంకర్‌ గాన్కి ఎర్కలేదాయె. బస్సులకెల్లి దుంకంగనే గాడు దూది పర్పుల పడ్లే. డాంబర్‌ రోడ్డుమీద బడ్డడు. మోకాల్లకు దెబ్బలు దాకినయి. అదృష్టం బాగుండబట్కె నెత్తికి దెబ్బ తాకలేదు. పండ్లూసి పోలేదు. బుర్సుల కోసం పోతె బుజాలు జారినట్టైంది అని గాడు మొత్తుకుండు.

Other Updates