పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం.
సింగూరు గుండా ప్రవహిస్తున్న సాగునీటి శకం.
సింగూరు అంటే ప్రాజెక్టు కాదు. ధాన్య బంగారం.సిరుల గని.బంగారు తెలంగాణ నమూనా. మెతుకు సీమ సింగారం. పూర్వపు మెదక్ సిగలో మెరిసిన ‘గులాబీ’పువ్వు.మెదక్ నుదుట కేసీఆర్ దిద్దిన తిలకం. పొలాల గట్టు మీద ఉదయించిన ‘సింగూర’ సూర్యుడు.
తెలంగాణ వస్తే ఏమొస్తుంది?
అని అడిగే వాళ్ళందరూ సింగూరు కు వెళ్ళవలసిందే.సింగూరు ఇంతవరకు ఎలా ఉండెనో, 2014 తర్వాత సింగూరు ఎట్లా ఉన్నదో, అక్కడ నిజంగా ఏం జరుగుతున్నదో స్వయంగా చూడాలి.పొలాల్లో తిరగాలి. పంటల్లో తిరగాలి. వరి చేల గాలిని తాకాలి.ఆ గాలి సవ్వడి వినాలి. తెలంగాణ స్వయం పాలనలో సగర్వంగా తల ఎత్తుకున్న వరి పొత్తులు తెలంగాణ భవిష్యత్ చిత్రపటానికి తప్పనిసరిగా పతాక శీర్షిక. సూపర్ లీడ్. వ్యాన్ గార్డ్. బ్యానర్ ఐటెం. తెలంగాణ దీపశిఖ. సింగూరు ప్రాజెక్టు తెలంగాణ సాకార మార్చింగ్ సాంగ్ పాడుతున్నది.
తొలిసారిగా పూర్వపు మెదక్ జిల్లాలో వ్యవసాయానికి సింగూరు ప్రాజెక్టు నుంచి నీళ్ల గల గల. పట్నం నుంచి వలసలు వాపసు వస్తున్న ఘట్టాలు.
యాసంగిలో అందోల్ నియోజకవర్గానికి ధాన్యపు రాశుల వడ్డాణం. ఆకు పచ్చని చీరలో అందోలు.
తలాపున పారుతున్న మంజీర. తుమ్మలు మొలిచిన నేల నిన్నటి దశ్యం. ఇప్పుడు స్వరాష్ట్రంలో ‘పచ్చ’ల హారం ధరించిన పుడమితల్లి. దశాబ్దాలుగా నెర్రెలుబారిన పొలాల దాహం తీరింది.సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో సింగూరు ప్రాజెక్టు కట్టిన తర్వాత తొలిసారి సాగుకు ప్రభుత్వం నీళ్లిచ్చింది. ఉపాధి కోసం పట్నాలకు తరలి పోయిన కుటుంబాలు వాపస్ వస్తున్నవి. ఇంతకన్నా తెలంగాణ స్వరాష్ట్ర సాధనకు సార్ధకతకు అర్ధమేముంటుంది అని ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు అనే మాటల్లో ఆనందం కన్పిస్తుంది.వలస పోయిన రైతులు తిరిగొచ్చి పండుగలా వ్యవసాయం చేయడం కన్నా స్వతంత్ర తెలంగాణ కు కావాలిసినదేమున్నది. తొలిసారి ఈ యాసంగిలో ధాన్యం చేతికొచ్చింది.
అందోల్, పుల్కల్‌లో సింగూరు ఆయకట్టు ప్రాంతంలో కేసీఆర్ కనికట్టు చేశారనే చెప్పుకోవాలి.కేసీఆర్ డైరెక్షన్లో హరీశ్‌రావు నిరంతర ట్రాకింగ్ కూడా శక్తిమంతంగా పని చేసింది.
సమైక్యరాష్ట్రంలో మంజీరనదిపై 29.91 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు హైదరాబాదుకు తాగునీరు ఇచ్చేందుకే పరిమితమైనది. సీఎం కేసీఆర్ 2005లో కేంద్రమంత్రిగా ఉన్నపుడు పట్టుబట్టి సింగూరు కాల్వల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినా ఫలితం లేకపోయింది. 2006-07లో రూ.88.99 కోట్లు మంజూరైనా తెలంగాణ ఏర్పడేనాటికి కూడా ఒక్క ఎకరాకు నీరందలేదు.అందోల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో ఉన్న 44 గ్రామాల ప్రజలు పొట్ట చేత బట్టుకొని పట్టణాలకు వెళ్ళారు. సింగూరు ఎడమ కాల్వ కింద 37,500 ఎకరాలు, కుడి కాల్వ కింద 2,500 ఎకరాలు మొత్తం 40 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నది. సీఎం కేసీఆర్, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు రెండేండ్లలో రూ.60 కోట్లతో సింగూరు కాల్వలను ఆధునీకరించారు. మొత్తం రూ.74.79 కోట్లు ఖర్చు కాగా 84 శాతం పనులు పూర్తయ్యాయి. సింగూరు కాల్వల నుంచి గ్రావిటీ ద్వారా నీరందకపోతే ప్రత్యామ్నాయంగా 520 మీటర్ల నుంచి లిఫ్టు ద్వారా నీరందించేందుకు రూ.32.6 కోట్లతో లిఫ్టు నిర్మించారు.
1988 లో చెరువు దాదాపు ముప్ఫై సంవత్సరాల కిందట ఆందోలు పెద్ద చెరువు అలుగు పోసింది. మళ్ళీ ఇన్నాళ్ళకు సింగూరు కాల్వల ద్వారా ఈ చెరువును నింపడంతో రెండునెలల పాటు అలుగు పోసింది. పటాన్‌చెరు, హైదరాబాద్, సంగారెడ్డికి వెళ్లిన వాళ్లంతా చెరువు అలుగుపోయడం చూసి తిరిగొచ్చారు. దాదాపు వెయ్యి మంది రైతులు గతంలో స్వగ్రామాల్లో రేషన్ కార్డులను రద్దు చేసుకున్నారు. సొంత ఊర్లలోనే కార్డులను ఇవ్వాలని తాజాగా దరఖాస్తు పెట్టుకున్నారు. రేషన్ కార్డులను రెవెన్యూ అధికారులు పంపిణీ చేశారు. మంత్రి హరీశ్‌రావు చేసే ప్రతి రెండు ఫోన్‌లలో కచ్చితంగా ఒక్కటి సింగూరు కాల్వల భూసేకరణ గురించే ఉంటుందని కలెక్టర్ కన్నన్ చెబుతున్నారు.
సింగూరు కాల్వల ద్వారా సాగునీరు అందించే పనులు పూర్తవడంతో 2016 డిసెంబర్‌లో మంత్రి హరీశ్‌రావు నీటిని విడుదల చేశారు. తొలిసారి కాల్వల ద్వారా అందోల్ నియోజకవర్గంలోని చెరువులన్నీ మంజీర నీటితో కళకళలాడాయి. కాల్వల నీటితోపాటు 72 చెరువులను కూడా నింపడంతో అదనంగా 9,076 ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు అవకాశం లభించింది. నీళ్లు పొలంబాట పట్టడమూ, వలస వెళ్లిన జనం ఇంటి బాట పట్టడమూ ఏక కాలంలో జరిగినవి.దశాబ్దాల తర్వాత ఈ ప్రాంతంలో దుక్కిదున్ని విత్తనాలు వేశారు.సుమారు 30 వేల ఎకరాల్లో వరిపంట సాగైనది.అందోలు నియోజకవర్గంలో ‘నెక్లెస్ రోడ్డు’ వలె ధాన్యపు రాశులు కన్పిస్తున్నవి.అర ఎకరం మొదలుకొని పదెకరాల రైతు వరకు పంట పండించి ఆత్మగౌరవంతో తలెత్తుకొని నిలబడడం గుణాత్మక మార్పు. సాగునీటి సరఫరా ఇలాగే ఉంటే ఏటా రెండు పంటలు పండిస్తామంటూ రైతులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. కాల్వల ద్వారా మరో పదివేల ఎకరాలకు నీరిచ్చే పనులను ఈ ఏడాది జూలైనాటికి పూర్తి చేసేందుకు అధికారులు కషి చేస్తున్నారు. అదనంగా 1,692 ఎకరాల ఆయకట్టు ఉన్న 49 చెరువులకు నీటిని అందించేందుకు అవసరమైన రూ.14 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.
ఈ యాసంగిలో ప్రాజెక్టుల నీళ్లతో పంటలు సాగుచేసుకున్న రైతుల ముఖాల్లో సంతోషం చూస్తుంటే కడుపునిండుతున్నదని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు సంతోషం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో తొలిసారి సింగూరు ప్రాజెక్టు కింద 30 వేల ఎకరాలకు సాగునీరందించామన్నారు. సింగూరు ఆయకట్టుకు పూర్వవైభవం వచ్చిందన్నారు.సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని కొటాల, పోతిరెడ్డిపల్లి, పుల్కల్ మండలం లక్ష్మీసాగర్, హనుమానాయక్ తండా, లాల్‌సింగ్‌నాయక్‌తండా, ముదిమాణిక్యం, ఇసోజీపేటల్లో ఆయన విస్త తంగా పర్యటించారు. రైతులతో ముచ్చటించారు.సాగు, దిగుబడి వివరాలు తెలుసుకొన్నారు. రైతులతో కలిసి కుప్పకొట్టారు. తన జన్మ ధన్యమైందన్నారు. ప్రతి రైతును పలుకరించి ఎంత భూమి ఉంది? ఎంత పంట పండించావని అడిగారు. మండువేసవిలోనూ జలకళతో ఉట్టిపడుతున్న చెరువులను చూసి ఆయన మురిసిపోయారు. తొలిసారి ప్రాజెక్టు నీళ్లతో పంటలు పండించుకున్నామని రైతులు సంతోషం వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన హమీఇచ్చారు. తాలులేకుండా తీసుకొచ్చే ధాన్యానికి క్వింటాల్ రూ.1,510 మద్దతు ధర చెల్లిస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి కులం, మతం.. చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతి ఎకరాకు పెట్టుబడిగా రూ.4 వేల చొప్పున ఏడాదికి రెండుసార్లు రైతుల ఖాతాల్లో జమచేస్తామన్నారు. వ్యవసాయానికి కూడా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని హరీశ్ భరోసా ఇచ్చారు
పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి చెరువు నీళ్లతో పంట పండించలేదని గ్యాదరి పెంటయ్య అనే రైతు చెప్పాడు.
”ఇగ మొగులు దిక్కెందుకు చూస్తం.. నిన్నే చూస్తం!”అని మరో రైతు అన్నాడు.” జిందగీల ఇంత యాసంగి పంటను ఎప్పుడూ చూడలేదు. గ్రామంలో కూలీకి ఎవరూ వస్తలేరు. రైతులంతా బిజీగా ఉన్నరు.” అని ముది మాణిక్యం గ్రామ రైతు బాలరెడ్డి అన్నాడు.
”మాది ముదిమాణిక్యం గ్రామం. రెండెకరాల్లో 70 బస్తాలు పండించిన. సీఎం కేసీఆర్ నీళ్లిస్తే ఇంత పంట పండించిన. గతంలో కరెంటు కోసం మస్తు తిప్పల పడేటోళ్లం. ఇప్పుడా సమస్యే లేదు” అని రైతులు మంత్రి హరీశ్‌రావుకు తెలిపారు.