tsఅనేకమంది చిత్రకారులు శిల్పాలు చెక్కడం, ఎందరో శిల్పులు చిత్రాలు గీయడం సాధారణమైన విషయం. కానీ ఎక్కా యాదగిరిరావు శిల్పిగా సుమారు అర్థ శతాబ్దంపాటు ఒక వెలుగు వెలిగి, ఆ తర్వాత చిత్రకళ మాధ్యమం ఎంచుకుని కృషి చేయడం అసాధారణ విషయం.

ఇవ్వాళ ఆయన ఎన్ని చిత్రాలకు ఆకృతులు అద్దినా, ఎక్కా యాదగిరిరావు అనగానే అందరికీ అపురూపమైన శిల్పే మదిలో మెదులుతాడు. మరీ ముఖ్యంగా నలభై ఐదేండ్ల క్రితం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు బలి ఇచ్చి, తెలంగాణ రాష్ట్ర సాధనకై బతుకునంతా దీపమెత్తిన అమరవీరుల స్మారకార్థం ఆయన రూపకల్పనచేసిన స్థూపం కళ్ళల్లో తిరుగుతుంది. ఇరవైఐదు అడుగుల ఎత్తున, నున్నటి రంగుగల కఠినమైన గ్రానైట్‌ పైన ఆధునిక శైలిలో మొగ్గ తొడిగిన పద్మాకారాన్ని చలువరాతితో రూపొందించారు. నున్నటి నలుపురాయిలో క్రింద తుపాకి గుండ్లు తాకిన తీరును స్ఫురింజేశారు. ఈ స్థూపం పైభాగంలో నాలుగువైపులా ధర్మచక్రానికి చోటిచ్చారు. రాష్ట్ర శాసనసభ ముందుగల ‘గన్‌పార్క్‌’లో ప్రతిష్ఠించిన ఈ స్థూపం నమూనానే ఇవ్వాళ కొత్త రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, ముఖ్యమైన కార్యక్రమాల్లోను చోటుచేసుకుంటున్న దంటే, ఆ స్థూపం తెలంగాణ ప్రజల గుండెలలో ఎంతబలంగా స్థిరపడిపోయిందో వేరుగా చెప్పనవసరం లేదు.

1938లో హైదరాబాద్‌ పాతనగరంలోని అలియాబాద్‌లో నాగమ్మ`నారాయణస్వామి దంపతులకు కలిగిన యాదగిరిరావు తన తల్లి, చిన్నాన్న ప్రభావంతో బొమ్మలు రూపొందించడం ప్రారంభించారు. ఈ కళలో నగరంలోని ప్రముఖ శిల్పి పాటిల్‌ వద్ద తొలి పాఠాలు నేర్చుకున్నారు. మరోవంక బి.ఏ. వరకు చదువు సాగించారు. అనంతరం హైదరాబాద్‌లోని లలితకళల కళాశాలలో చేరి శిల్పకళలో డిప్లొమా పూర్తి చేశారు. సుప్రసిద్ధ శిల్పాచార్యుడు ఉస్మాన్‌ సిద్ధిఖీ ఈయనకు శిల్పకళలోని మూలసూత్రాలు బోధించి ఆధునిక శిల్పిగా రూపుదిద్దారు. ఆ తర్వాత యాదగిరిరావు తాను చదువుకున్న కళాశాలలోనే శిల్పశాస్త్ర అధ్యాపకుడుగా చేరి, ఆచార్యుడై అక్కడే పదవీ విరమణ చేశారు.

telanganaశిల్పం మనకు ప్రాచీన కళ అయినప్పటికీ అత్యాధునిక పద్ధతిలో యాదగిరిరావు శిల్పాలు చెక్కి తన ప్రత్యేకతను చాటాడు. ఆయన రూపుదిద్దిన శిల్పాలు హైదరాబాద్‌-సికిందరాబాద్‌ జంటనగరాల్లోని అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. హైదరాబాద్‌ పాతనగరం శాలిబండ చౌరస్తాలో ఈయన ఆకృతి దిద్దిన భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ విగ్రహం ఉంది. జంట నగరాలను కలిపే టాంక్‌బండ్‌ పైగల తెలుగువెలుగుల మూర్తి నిక్షిప్త కళా విగ్రహం వీరి ఉలి ఉల్లేఖించిందే.

‘‘దుష్ట శిక్షణ శిష్ట రక్షణ’’ అనే అంశంపై శివరాంపల్లి లోని పోలీసు అకాడమీలో ‘అశ్వమేధయాగం’, విక్రం సారాభాయ్‌, బ్రహ్మ ప్రకాశ్‌ల విగ్రహాలు వీరు తయారు చేసినవే. పాటిగడ్డలో దామోదరం సంజీవయ్య స్మారక చిహ్నం, అన్నపూర్ణ సినీ స్టూడియోలో ‘మీనం’ శీర్షిక రూపొందించిన రెండు శిల్పాలు ఉన్నాయి. అమెరికన్‌ పరిశోదన, అధ్యయన సంస్థలో తామ్రంతో తయారుచేసిన ‘‘వాణి’’  ఉంది.

ఇంకా ఢల్లీిలోని గాంధీదర్శన్‌లో గాంధీ విగ్రహం, రష్యాలోని భారత రాయబార కార్యాలయంలో, అమెరికాలో ఈయన చెక్కిన శిల్పాలు ఉన్నాయి. ఎందరో కళాహృదయులు వీరి శిల్పాలు సేకరించారు. యాదగిరిరావు 1975లో రూపొందించిన ‘‘మానవుడు’’ శిల్పం భారతదేశంలో నిర్వహించిన మూడవ ‘‘ట్రినాలే’’ అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికైంది. అయితే వీరికి ‘‘మిధునం’’ శిల్పం బాగా పేరు తెచ్చింది.

ప్రపంచ శిల్ప రంగానికి ‘‘శివలింగం’’ భారతీయ శిల్పి అందించిన మహోన్నత శిల్పాకృతిగా యాదగిరిరావు అభివర్ణిస్తారు. ఏ మహాశిల్పి రూపొందించాడోగానీ, పూర్ణానంద స్వరూపాన్ని ఇంత స్పష్టంగా, సంక్షిప్తంగా మరెవ్వరూ రూపుకట్టలేరు. ‘‘శివలింగం’’ వాస్తవిక ధోరణిలోని అత్యాధునిక శిల్పం. ఇందులో ఎంతమాత్రం అసభ్యత లేకపోగా, దాన్ని చూడగానే భక్తి పొంగిపొర్లేలాగా రూపొందించడం అపూర్వ సంఘటనగా యాదగిరిరావు పేర్కొంటారు.

ఇది ఇలా ఉండగా ఇటీవలే యాదగిరిరావు ప్రకృతి అందాలను, లైంగికపరమైన కోరికలను ఛాయాచిత్రాల్లో మాదిరిగా కాకుండా భావోద్వేగం గల వర్ణచిత్రాలుగా తీర్చిదిద్దడం ప్రారంభించారు. ఆయనలోని సృజన వాటిలో తొంగిచూస్తుంది. అయితే ప్రదర్శన నిమిత్తమై చిత్రాలు వేస్తున్న తరుణంలో సంభవించిన ప్రకృతి వైపరిత్యాల ప్రభావానికి ఆయనలోనై ‘‘కొలాజ్‌’’ బాణికి మారారు. కొత్తగా ఆశ్రయించిన చిత్రకళను విడవకుండా సాధన చేయాలనే లక్ష్యం ఉన్నప్పటికీ, చేయి తిరిగిన ఆధునిక శిల్పకళారంగానికి ఆయన దూరం కాలేకపోతున్నారు.
యాదగిరిరావు ఏకబిగిన పధ్నాలుగు దారు శిల్పాలు రూపొందించడం ఆయనకే చెల్లింది. వాటిలోను ప్రకృతి, స్త్రీ ఇత్యాది అనేక వస్తువుల ప్రభావం కనిపిస్తుంది.

శిల, దారు, లోహ, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ మాధ్యమాలు అన్నింటిలోనూ యాదగిరిరావు యాభై అరవైదాకా ఆధునిక శిల్పాలు ఇంతవరకు తయారుచేశారు. జాతీయస్థాయిలో ఆధునిక శిల్పిగా గుర్తింపు పొందారు.

శిల్పకళా వికాసానికి కృషి చేయడంతోపాటుగా శిల్పకళలో అభిరుచిగల యువకులను సృజనాత్మక శిల్పులుగా తయారు చేయాలని తనకెంతగానో అభిలాష ఉందంటారు ఎక్కా యాదగిరిరావు.

Other Updates