exhibitionనగరంలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌పై సొసైటీకే సర్వ హక్కులు కల్పిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ప్రకటించారు. జనవరి 1వ తేదీన ప్రతిష్టాత్మకమైన నుమాయిష్‌ (75వ పారిశ్రామిక ప్రదర్శన) ను ఆయన ప్రారంభించారు. నుమాయిష్‌ సావనీర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కు లీజుదారుగా మాత్రమే ఉన్న సొసైటీకి ఈ భూమిని పట్టా చేసి ఇస్తున్నట్లు తెలిపారు. నిస్వార్ధంగా పనిచేస్తున్న ఎగ్జిబిషన్‌ సొసైటీకి నిజాం రాజు స్థలాన్ని అప్పగిస్తే దానిని ప్రభుత్వాలు లీజుకు ఇవ్వడం సిగ్గుచేటుగా ఉందన్నారు. అందుకే సొసైటీకే ఆ భూమిపై సర్వహక్కులు కల్పించామన్నారు. ఒకప్పుడు ఢల్లీి కంటే హైదరాబాద్‌ నగరమే పెద్దదిగా ఉండేదని, ఇది చరిత్ర చెబుతున్న సత్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఐదు పెద్ద నగరాల్లో హైదరాబాద్‌ ఒకటిగా ఉందన్నారు. ఇలాంటి నగరంలో ప్రదర్శింపబడుతున్న ఈ పారిశ్రామిక ప్రదర్శనను ఢల్లీిలోని ప్రగతి మైదాన్‌లా తీర్చిదిద్దాలన్నారు. ఇప్పుడున్న స్థలంలో ఇకపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దన్నారు. మొత్తం స్థలాన్ని ఎగ్జిబిషన్‌కు వినియోగించాలని ఏదైనా అవసరమైతే సొసైటీకి ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడు, రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ సొసైటీకి ఎగ్జిబిషన్‌ ద్వారా వచ్చే ఆదాయంలో 85శాతం నిధులు విద్యావ్యాప్తికే ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. సొసైటీ 18 కాలేజీలలో ఉచిత విద్యనందిస్తుందని తెలిపారు. సొసైటీ తరపున కరీంనగర్‌లో 4కోట్ల నిధులతో అనాద పిల్లలకోసం స్కూల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఈటల తెలిపారు. సిరిసిల్లలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ చరిత్రను చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈటల వివరించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, హోం మంత్రి నాయిని రాజ్యసభ సభ్యుడు కెకె, ఎంపి బూర నర్సయ్య గౌడ్‌, సొసైటీ కార్యదర్శి నరోత్తం రెడ్డి, ఎమ్మెల్సీ సలీం తదితరులు పాల్గొన్నారు.

Other Updates