విద్యుత్తు ఉత్పత్తి కోసం చేసే బొగ్గు కేటాయింపు విధానంలో సమూల మార్పులు తెచ్చి, ఉత్పత్తి వ్యయం తగ్గించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో త్వరలో కొత్త ప్రభుత్వం దగ్గర తానే చొరవ తీసుకుంటానని స్పష్టం చేశారు. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నందువల్ల ఎన్.టి.పి.సి. నుంచి వెంటనే 2వేల మెగావాట్లు సరఫరా చేయాలని కోరారు. తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లపై సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఎన్.టి.పి.సి.కి అనుమతి ఇస్తామని సిఎం హామీ ఇచ్చారు.
రామగుండంలో ఎన్.టి.పి.సి. నిర్మిస్తున్న 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఎన్.టి.పి.సి.లోనే విద్యుత్ ఉత్పత్తిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
రామగుండంలో నిర్మిస్తున్న 1600 మెగావాట్ల ప్లాంటులో 800 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన రెండు యూనిట్లు వచ్చే ఏడాది అక్టోబర్ లో, మరో రెండు యూనిట్లు 2021 ఫిబ్రవరిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తాయని ఎన్.టి.పి.సి. అధికారులు చెప్పారు. నిర్ణీత గడువుకన్నా ముందే ప్లాంటు నిర్మాణం పూర్తి చేయాలని సిఎం వారిని కోరారు.
”విభజన బిల్లులో తెలంగాణ రాష్ట్రానికి 4వేల మెగావాట్ల విద్యుత్ అందించడానికి కేంద్రం అంగీకరించింది. ఇందులో 1600 మెగావాట్ల
సామర్ధ్యం కలిగిన ప్లాంటు నిర్మాణం జరుగుతోంది. ఈ కరెంటు రావడానికే మరో ఏడాదికి పైగా పడుతుంది. మిగతా కరెంటు రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. తెలంగాణలో వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఈ ఏడాది జూలై నుంచే ప్రారంభమవుతుంది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే 6వేలకు పైగా మెగావాట్ల అవసరం ఉంది. మొత్తంగా తెలంగాణలో విద్యుత్ వినియోగం బాగా పెరుగుతుంది. విద్యుత్ వినియోగం వద్ధిరేటులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా ఉంది. తెలంగాణ అవసరాలను దష్టిలో పెట్టుకుని ఎన్.టి.పి.సి. ప్లాంట్ల ద్వారా కనీసం 2వేల మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేయాలి” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ముఖ్యమంత్రి డిమాండ్ పై ఎన్.టి.పి.సి. సిఎండి సానుకూలంగా స్పందించారు. 2వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం నడుస్తున్న ఎన్.టి.పి.సి. ప్లాంట్ల ద్వారానే విద్యుత్ తీసుకుంటే వెంటనే మన అవసరాలు తీరుతాయని, ధర కూడా కలిసొస్తుందని సిఎం అన్నారు.
”విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కేటాయింపులు చేసే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం సరిగా లేదు. రామగుండం ఎన్.టి.పి.సి. ప్లాంటుకు పక్కనే ఉన్న సింగరేణి నుంచి కాకుండా 950 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒరిస్సా రాష్ట్రంలోని మందాకిని నుంచి బొగ్గు తెచ్చి వాడుతున్నారు. దీనివల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. విద్యుత్ ధర పెరుగుతుంది. అంతి మంగా ప్రజలపై భారం పడుతుంది. దేశ వ్యాప్తంగా ఎక్కడ విద్యుత్ కేంద్రం ఉంటే, దానికి దగ్గరలోని గనుల బొగ్గును వాడాలి. పిట్ హెడ్ ప్లాంట్ల స్థాపన లక్ష్యం కూడా అదే. దూర ప్రాంతాల నుంచి బొగ్గు తేవడం వల్ల రవాణా చార్జీలు పెరుగుతాయి. తెలంగాణ జెన్ కో వందకు వంద శాతం సింగరేణి బొగ్గునే వాడు తున్నది. రామగుండం ఎన్.టి.పి.సి. కూడా సింగరేణి బొగ్గునే వాడాలి. విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కేటాయించే విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తానే లేఖ రాస్తానని, విధానంలో మార్పు తీసుకురావడానికి చొరవ చూపుతా” అని సిఎం స్పష్టం చేశారు.
విద్యుత్తు ఉత్పత్తి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్.టి.పి.సితో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంభిస్తుందని సిఎం చెప్పారు. తెలంగాణలో నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లపైన సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఎన్.టి.పి.సి.కి అనుమతి ఇవ్వనున్నట్లు సిఎం చెప్పారు. మొదట పైలట్ ప్రాజెక్టు కింద చిన్న రిజర్వాయర్ కేటాయిస్తామని, తర్వాత పెద్ద రిజర్వాయర్లను కేటాయిస్తామని వెల్లడించారు.
విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరుగుతున్నదని, అనుమతులు ఇవ్వడంలో జరిగే జాప్యం నిర్మాణ సమయంపై ప్రభావం చూపుతున్నదని సిఎం చెప్పారు. పిజిసిఎల్ లైన్ల నిర్మాణం, నిర్వహణ విషయంలో కూడా మెరుగైన విధానం రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ఎన్.టి.పి.సి సంస్థ 13.5లక్షల మొక్కలు నాటినందుకు ముఖ్యమంత్రి అభినందించారు.
ఈ ఏడాది నుంచే ఎరువుల ఉత్పత్తి
రామగుండంలో ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పునరుద్ధరణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మూతపడ్డ ఎఫ్.సి.ఐ.ని తిరిగి తెరిపించడానికి తాను కేంద్ర ప్రభుత్వంతో పోరాడాల్సి వచ్చిందని సిఎం చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచే ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎఫ్.సి.ఐ.ఎల్. సిఇవో రాజన్ థాపర్ చెప్పారు. రామగుండలో ఎరువుల
ఉత్పత్తి ప్రారంభం అయితే, తెలంగాణ రైతులకు కావాల్సిన ఎరువులు ఇక్కడ నుంచే తీసుకోవచ్చని సిఎం అన్నారు.
జెన్ కో, సింగరేణి సిఎండిలకు ముఖ్యమంత్రి ప్రశంస
తెలంగాణ ఏర్పడినప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగం నేడు దేశంలోనే అత్యుత్తమంగా మారిందని సిఎం కేసీఆర్ అన్నారు. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ,సరఫరా వ్యవస్థలు ఎంతో మెరుగుపడ్డాయని, జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు నాయకత్వంలోని విద్యుత్ సంస్థలు మెరుగైన ఫలితాలు సాధించాయని అభినందించారు. సింగరేణి సిఎండి శ్రీధర్ నాయకత్వంలో సింగరేణి సంస్థలో బొగ్గు
ఉత్పత్తి ప్రతి ఏటా పెరుగుతున్నదని సిఎం ప్రశంసించారు. తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.