తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు రంగం సిద్ధ మయింది. 2019లో భారత పార్లమెంటుకు, మరికొన్ని రాష్ట్రాలకు సాధారణ ఎన్నికలు జరగడానికి కొన్ని నెలలు ముందుగా జరగబోతున్న ఈ ఎన్నికలకు విశేష ప్రాధాన్యం ఉంది.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో శాసనసభకు జరుగనున్న రెండవ ఎన్నికలు ఇవి. అంతకుమించి రాజకీయరంగంలో సెమీ ఫైనల్స్‌గా పరిగణించే ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబరు6, 2018న నిర్వహణ తేదీలు ప్రకటించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలలో ఒకేదశలో ఎన్నికలు జరగనుండగా, ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు దశల్లో నిర్వహించనున్నారు.
తెలంగాణ లోని మొత్తం 119 స్థానాలకు డిసెంబరు 7, 2018న ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను నవంబరు 12న ప్రకటిస్తారు. నవంబరు 19వతేదీ వరకు నామినేషన్లు సమర్పించడానికి అవకాశముంటుంది. వాటిని ఆ పక్కరోజు పరిశీలిస్తారు. వాటి ఉపసంహరణ గడువు 22వతేదీ వరకు ఉంటుంది. ఓట్ల లెక్కింపును డిసెంబరు 11న చేపట్టి ఫలితాలు ఆ వెనువెంటనే ప్రకటిస్తారు.
న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికల ప్రకటన చేసిన తరువాత హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. దీనితో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అన్ని పోస్టర్లు, కటౌట్లవంటి ప్రచార సామాగ్రిని తొలగించాలని, వచ్చే 24 గంటల్లో రైల్వే, బస్ స్టేషన్లల్లో, విమానాశ్రయాల్లో బ్యానర్లు తొలగిం చాలని, ప్రభుత్వ స్థలాల్లో ప్రకటనలు ఉండకూడదని, ప్రైవేటు ఆస్తులకు సంబంధించి వాటి యజమానుల అనుమతి లేకుండా బ్యానర్లు, వాల్‌పోస్టర్లవంటివి ప్రదర్శించ కూడదని, రాత్రి 10గంటల తరువాత, ఉదయం 6గంటలలోపు ఎన్నికల ప్రచారం చేయకూడదని, కొత్త అభివద్ధి కార్యక్రమాలు 72 గంటల్లో ఆపేయాలని, రాజకీయ పదవుల్లో ఉన్నవారికి అధికారిక వాహనాల వినియోగ సౌకర్యం వెంటనే రద్దయిపోతుందని, ప్రతి జిల్లా కార్యాలయాల్లో ఫిర్యాదుదారుల కోసం ఫిర్యాదు విభాగాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న ఆపద్ధర్మ ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని, రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ వర్తించే ఎలాంటి కొత్త పథకాలు ప్రకటించకూడదని రజత్ కుమార్ వివరించారు.
ఎన్నికల ప్రకటనకు ముందు….
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ శాసనసభకు ఎన్నికలు ప్రకటించడానికి కచ్చితంగా ఒక నెలరోజుల ముందు…అంటే సెప్టెంబరు 6, 2018న ……
తెలంగాణ తొలి శాసనసభను రద్దుచేస్తూ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వం లోని రాష్ట్ర తొలి మంత్రివర్గం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఆ రోజు మధ్యాహ్నం మంత్రివర్గం సమావేశమై ఏకవాక్య తీర్మానాన్ని చేసింది. ఈ సమావేశం చేసిన తీర్మాన ప్రతిపై ముఖ్యమంత్రి సంతకం చేసి, నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్ నరసింహన్‌కు అందచేసారు. శాసనసభ రద్దుకు దారితీసిన అంశాలను ఆయనకు వివరించారు.
వెనువెంటనే తీర్మానం ప్రతిపై గవర్నర్ ఆమోదముద్ర వేసారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరగా ముఖ్యమంత్రి అందుకు అంగీకరించారు. ఆయన మంత్రివర్గ సభ్యులందరూ ఆపద్ధర్మ ప్రభుత్వంలో కూడా కొనసాగుతారు. ఈ మేరకు గవర్నర్ ఆదేశానుసారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక నోటిఫికేషన్ జారీ చేసారు.
ఆంధ్రప్రదేశ్ నుండి వేరుపడి, దేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ 2014లో అవతరించింది. అప్పుడు జరిగిన ఎన్నికల ద్వారా ఏర్పడిన తొలి శాసనసభ గడువు ముగియడానికి ఇంకా ఏడు నెలల వ్యవధి ఉండగానే సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నారు.