రానున్న ఎన్నికలను పారదర్శకంగా, వివాద రహితంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేపడుతున్నట్టు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, ఎం.దానకిషోర్‌ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లపై రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు ఏర్పాటుచేసిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాద్‌ జిల్లాలోని 15మంది రిటర్నింగ్‌ అధికారులు, వివిధ విభాగాల నోడల్‌ అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో దానకిషోర్‌ మాట్లాడుతూ, ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకుగాను ప్రతి నియోజకవర్గంలో ఐదు రకాల నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

దీనిలో భాగంగా ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు, స్టాటిక్‌ సర్వెలెన్స్‌ టీమ్‌లు, వీడియో సర్వెలెన్స్‌ టీమ్‌లు, వీడియో వ్యూయింగ్‌ టీమ్‌లు, అకౌంటింగ్‌ టీమ్‌లను ఏర్పాటు చేయాలని ఆర్‌.ఓలకు సూచించారు. ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడు లేదా అంతకంటే ఎక్కువగా ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు, స్టాటిక్‌ సర్వెలెన్స్‌ టీమ్‌లు, వీడియో సర్వెలెన్స్‌ టీమ్‌లను నియమిస్తున్నట్టు తెలిపారు. ఒక సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ ఆధ్వర్యంలో పనిచేసే ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లో సంబంధిత పోలిస్‌ స్టేషన్‌కు చెందిన సీనియర్‌ పోలీస్‌ అధికారి, ఒక వీడియో గ్రాఫర్‌, ముగ్గురు లేదా నలుగురు సాయుధ పోలీసులు ఉంటారని పేర్కొన్నారు. ప్రతి స్టాటిక్‌ సర్వెలెన్స్‌ టీమ్‌లో ఒక మెజిస్ట్రేట్‌, ముగ్గురు లేదా నలుగురు పోలీసులు ఉంటారని, వీడియో సర్వెలెన్స్‌ టీమ్‌లో ఒక అధికారి, ఒక వీడియో గ్రాఫర్‌ ఉంటారని దానకిషోర్‌ తెలిపారు.

ఈ మూడు బందాలను వెంటనే ఏర్పాటుచేసి వాటి వివరాలను ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు నోడల్‌ అధికారిగా ఉన్న హైదరాబాద్‌ జాయింట్‌ కలెక్టర్‌కు వెంటనే సమర్పించాలని రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఒక అధికారి, ఇద్దరు క్లర్క్‌లతో కూడిన వీడియో వ్యూయింగ్‌ టీమ్‌లను, ఒక అధికారి, ఒక క్లర్క్‌ సభ్యులుగా ఉన్న అకౌంటింగ్‌ టీమ్‌లను వెంటనే నియమించి వాటి వివరాలను ఎన్నికల వ్యయ పర్యవేక్షణ నోడల్‌ అధికారిగా ఉన్న జీహెచ్‌ఎంసీ ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌కు సమర్పించాలని పేర్కొన్నారు. ఈ బందాలన్నింటికి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ముఖ్యంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిర్వహించే ఎన్నికల ర్యాలీల అవసరాలు, రేట్లకు సంబంధించిన నోటిఫికేషన్‌, డబ్బు చెలామణిపై నియంత్రణ, ఎన్నికల సందర్భంగా మీడియా, వివిధ పార్టీలు వ్యవహరించాల్సిన పాత్ర తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణను ఇప్పించాలని దానకిషోర్‌ వివరించారు.

Other Updates