డా|| నలిమెల భాస్కర్
”పలుకుబడి”లో భాగంగా ఈ సారి ఎన్నికలకు సంబంధించిన పదజాలం తెలంగాణ తెలుగులో ఏ విధంగా వుటుందో చూడవలసి వుంది. అసలు ”ఎన్నికలు” సాధారణ ”ఓట్లు” అనే పేరుతో పిలవబడతాయి. గత మాసంలో (2018 డిసెంబర్) ఎన్నికలు ముగిసినై”. (ఓట్లు ఒడిశినై) ఎన్నికలప్పుడు (ఓట్లప్పుడు) రకరకాల (తీరొక్క) మాటలు చెబుతారు. ప్రజలు తమకు లాభం (ఫాయిదా) ఎవరి వల్ల కల్గిందో వాళ్ళ గుర్తు మీదనే ఓటింగ్ మిషన్లో నొక్కుతారు (ఒత్తుతరు). ప్రజల ఆశీర్వాదాలు (ఆశీర్వచనాలు) లేదా దీవెనలె (దీవెనార్తులు) పొందినవాళ్ళే నెగ్గుతారు (గెలుస్తరు). అన్ని రాజకీయ పక్షాల వాళ్ళు (పార్టీల వాళ్ళు) జనాల దగ్గరికి వెళ్ళి చేతులెత్తి నమస్కారాలు (దండాలు) చేస్తూ (పెడుతూ) తమకే ఓటు వేయవలసిందిగా అభ్యర్థిస్తారు (కోరుతారు). తెలంగాణలో ఆధునిక ప్రమాణ భాషలోని ”నమస్కారం” అన్న పదానికి దాదాపు సమానార్థకంగా ”శెనార్తి”ని సైతం ఉపయోగిస్తారు. పై వాక్యాల్లో బ్రాకెట్లలో యిచ్చిన పదాలన్నీ తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి వాడుతున్నవే !
ప్రజల అభిమానం చూరగొన్న వాళ్ళనే ”విజయ లక్ష్మి వరిస్తుంది”. ఈ ”విజయలక్ష్మి వరిస్తుంది”కి మారుగా తెలంగాణలో ”జయమైతది” అంటున్నారు. పోతే, ఎన్నికల ప్రచారం బ్రహ్మాండంగా (బొంబాట్‌గా) అందరూ చేశారు. సంచలనం (హల్ చల్) సృష్టించారు. ”సద్దితిన్న రేవును తలిచిన నాయకులే (లీడర్లే) గెలిచారు. ఉద్యోగాలు (కొలువులు) ఇస్తామన్న వాళ్ళు, ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచినవాళ్ళు (ఏజ్‌బార్ కాకుంట చేసినవాళ్ళు), ఆసరా పెన్షన్లు (పించన్లు) ఎక్కువ చేసినవాళ్ళు, రిటైర్మెంటు వయస్సును (వజీఫ వయస్సును) పెంచిన వాళ్ళు ఎన్నికల్లో గెలిచారు.
గెలిచిన ఎమ్మెల్యేలందరూ చేరి చివరికి తమ నాయకుణ్ణి ఎన్నుకున్నారు. ఆ నాయకుడే రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. కొత్త ప్రభుత్వం (సర్కారు) ఏర్పాటు అయ్యింది. ఇక మంత్రి వర్గం మొదలైనవన్నీ మామూలే !
నిజమైన నాయకులు ప్రజలకు కృతజ్ఞతగ (ఇమానంగ) ఉంటారు. ప్రజలంటే వాళ్ళకు గౌరవం (గురత్తం). పొగరు (ఫకరు) ఉన్నోళ్ళు గెలవరు. అసలు ఎన్నికల విషయం (ముచ్చట) విచిత్రమైన (చిత్రమైన) వ్యవహారం (ఎవారం). అసలైన నాయకుణ్ణి చూసి అశేష ప్రజానీకం (సబ్బండవర్ణాలు) ఏకత్రాటి మీద నడిచింది (ఒక్క కట్టుమీద ఉంది). కొన్ని పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి (గురూపులు కట్టినై). అయినా ప్రయోజనం లేదు (అంతా ఫుజూల్). మంచి ముహూర్తానికి (మూర్తానికి) ప్రమాణ స్వీకారం అనే కార్యక్రమం (పోరోగ్రాం) ముగిసింది.
మంచి చేసే నాయకుల పట్ల ప్రజలు సైతం కృతజ్ఞతగా
ఉంటారు. కృతజ్ఞత లేకపోవటం అంటే ”ఇమానం లేని పీనుగు మోసేటోనిమీద ఏమో చేసినట్లు” లెక్క. ఇదే ”కృతఘ్నత”. అంటే ”బేయిమాన్‌తనం”. ఇంకా బాగా చెప్పాలంటే ”గుర్రపు
బేయిమాన్‌తనం”.
ఎన్నికల వేళ (ఓట్లప్పుడు) కొన్ని సంస్థలు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో సర్వేలు చేస్తాయి. ఆ సంస్థలది ఒక అంచనా (అందాజ). ఎన్నికల్లో కొన్ని పార్టీలు స్వయంకృతాపరాధం వల్ల (చేజేతులార) ఓడిపోతాయి. ఈ సారి తెరాసకు వచ్చిన భారీ సంఖ్యాక ఓట్లు (బొచ్చెడు ఓట్లు) అబ్బుర పరుస్తున్నాయి (బీరిపోతున్నరు జనాలు). ప్రజలు యిచ్చిన తీర్పు చక్కగా (సక్కగ) తేటతెల్లం (తెల్లగోలు) అయింది. జనం నాడి (మర్మం) తెలిసి నొళ్ళే గెలిచారు. తెలంగాణ వేరుపడితే విద్యుత్తు (కరంటు) ఉండదని శాపనార్ధాలు (సాపెన్లు) పెట్టిన వాళ్ళు ఉత్తగ కొట్టుకొనిపోయారు. అభివృద్ధి (డెవలప్‌మెంటు) మీద శ్రద్ధ (శెద్ద) పెట్టిన ముఖ్యమంత్రి గెలిచారు. ప్రజల నిర్ణయాన్ని (ఫైస్‌లా) అందరూ స్వాగతించారు.
ఆధునిక ప్రమాణ భాషలోని ”ఎన్నికలు” తెలుగుపదం. తెలంగాణలోని ”ఓట్లు” ఆంగ్లం. అట్లాగే ”అభివృద్ధి” సంస్కృతం నుండి వచ్చి చేరిన పదం. తెలంగాణలో డెవలప్‌మెంటు ఇంగ్లీషు, అప్పుడప్పుడు ఉర్దూ ”తరక్కి” వాడుతారు. విద్యుత్తు తెలుగులోకి వచ్చిన సంస్కృతం మాట. కరంటు అంగ్రేజి మాట. ”స్వయంకృతాపరాధం” సంస్కృత సమాసం” చేజేతులార” అచ్చతెలుగు పదబంధం ”గౌరవం” తత్సమం. ”గురత్తం” గురుత్వంలోంచి మారిన రూపం. ”నమస్కారం” అయినా ”దండం” అయినా సంస్కృతాలే! ”శెనార్తి” శణార్థినుంచి వచ్చిన పరిణామం శాపనార్థాలు ”సాపెన్లు”గా మారి, దీవెనలు ”దీవెనార్తులు”గా పరిణమించాయి. తెలుగు ”నాయకుడు” తెలంగాణలో ”లీడర్” అయ్యాడు. ”ఉద్యోగ వయోపరిమితి మించిపోవటం” తెలంగాణలో ”ఏజ్‌బార్ అవుడు” అన్నమాట. ప్రమాణ భాషలోకి వచ్చి చేరిన ఆంగ్లం మాట ”పెన్షన్” తెలంగాణలో ”ఫించన్” అవుతుండగా మరో ఇంగ్లీష్ పదం రిటైర్మెంటు ”వజీఫా” అవుతున్నది. ”ఏకత్రాటి మీద నడవడం” అన్న జాతీయం తెలంగాణలో ”ఒక్క కట్టు మీద ఉండుడు”గా మారింది. ”ఏకత్రాడు” అన్నది దుష్టసమాసం. ”ఒక్కకట్టు” అచ్చతెలుగు సమాసం. కూటమిగా ఏర్పడటం” అనేది ”గురూపులు కట్టుడు”తో సమానార్ధాన్ని యిస్తున్నది. ”ప్రభుత్వం” అన్న పదం ”సర్కారు”గా మారుతుంది. తెలంగాణలో అబ్బురపడటం (బీరిపోవటం), పొగరు (ఫకరు), బ్రహ్మండం (బొంబాట్) సంచలనం (హల్‌హల్), అశేష ప్రజానీకం (సబ్బండవర్ణాలు)… ఇట్లా బ్రాకెట్ల పదాలు తెలంగాణవి, సహాయం సాయం అయి నట్లే ”ముహూర్తం” మూర్తం అవుతుంది (లగ్గాలు మూర్తాలు). ఇవన్నీ ఎన్నికలకు సంబంధించిన కొన్ని తెలంగాణ మాటలు.