ఎన్నీలకు అమాసకు ఆస్మాన్ జమీన్ అంత ఫరక్ ఉంటది. ఎన్నీల ఎలుగు సల్లగ గమ్మతిగ ఉంటది. పున్నంనాడు చంద్రున్ని సూస్తే ఎంత కోపగొండికైనా మొఖంమీద చిరునవ్వు మెరవాల్సిందే. ఎన్నీల ఎలుగుకు రాత్రి బాయికాన్నించి ఇంటికి నడిచి వస్తాంటే మంచిగ అన్పిస్తది. ఇప్పటికి యాదికస్తయి ఎనుకటి ముచ్చట్లు. పిల్లబాట ఎంబటి ముందు తాత వెనుక మనువడు నెత్తిల గడ్డిమోపు కిర్రుచెప్పులు చేతిల కట్టె పట్టుకోని ఎడ్లను దొడ్లె కట్టేసి ఇంటికాడి బర్రెకు పచ్చగడ్డి తెస్తుంటే ఎదురుంగ ఎన్నీల చంద్రుడు సుక్కలు టకటక నడక కొంత దూరం పోయినంక ఎడ్లమంద గొర్లమంద అవి నడుస్తాంటే లేసిన దుమ్ము వాసన అదొక గమ్మతి. ఇంటికి పోయినంక సుత ఇంత మిల్కు మిల్కుమనే ఎక్కబత్తి దీపాలు వాకిట్ల నైతె పెద్ద చంద్రుని వెలుగు. ఎన్నీలను సూస్తే మనసు నిమ్మలం అయితది. ఎన్నీల ఎలుగుకు ఎవలనైనా ఏర్పాటు చేయవచ్చు. ఊరంత ఎన్నీల ఎలుగు ఉండగ బాటలపొన్న నడిచిపోతాంటే కాళ్ళకు పోట్రవుతులు కూడా తాకయి.
ఇప్పటికాలం అయితె అసలు చంద్రుని తేజ్‌ను అనుభవిస్తలేరు. అసలు పట్నాలల్ల బతికేటోల్లకు ఎప్పుడు అమాస, ఎప్పుడు పున్నం తెల్వదు. ఒక్కటే తీర్గ లైట్లకిందనే ఉంటరు. ఊర్లల్ల ఎన్నలప్పుడు కాముడు ఆడుతారు. ఎన్నలప్పుడే పీరీల పండుగ వస్తది. ఊర్లు అంటేనే ఒక సామూహికత ఒక కల్సిమెల్సిన మన్సులలెక్క నడుస్తది. ప్రకృతితో జీవనం, ఆ సొగసు కొనసాగించుడు కన్పిస్తది.
ఇయ్యాలరేపు ఎన్నీలను ఆస్వాదించాలంటే ఒక్కసారి పున్నంనాడు ఏక్‌దమ్‌న రెండుగంటలపాటు కరెంట్‌లైట్లు పురాగబందు చేయాలె. అందరు ఇండ్లల్లకెల్లి వాకిట్లకు వస్తరు. వాకిల్లు లేనోల్లు బంగ్లలమీదికి పోతరు. మీది మొగులును సందమామను సుక్కలను సూసుకుంటె ఇంటివాల్లు అంతా కల్సి కూసోని ముచ్చట పెట్టుకోవచ్చు. ఇప్పుడు పూనాలో అట్ల చేస్తున్నరట.
ఆ రోజుల్ల సుత ఎన్నీల రోజుల్లో వంటింట్ల కాకుండ ఇంటి ముందటికే వచ్చి గడెంచల కూసోని అన్నం తినేది. లేదంటే గుడాలు బుక్కేది. నాయనమ్మలు, అమ్మమ్మలు కథలు చెప్పేటోళ్ళు. ఇప్పటి తరానికి కథలు, ఎన్నీల అన్ని పురాగబంద్ అయినయి కని సెల్‌ఫోన్‌ల ఆటలు సుత స్మార్ట్‌ఫోన్లన్ల పొల్లగాండ్లు వాల్లకువాల్లే ఆడుకుంటుండ్రు. అండ్ల ఉన్నదాన్ని సూత్తండ్రుగని మనసులోని సొంత ఆలోచన లేకుంటపోయింది. ఎన్నీల, అమాసల చీకటి ఎలుగులు మనిషి జీవునానికి ఒక లెక్కలుగా ఉన్నయి.
‘ఎన్నీల ముచ్చట్లు’ అని కరీంనగర్‌ల కవులు పున్నం రోజు రాత్రి ఒక కవి ఇంటి డాబా మీద కూకోని కవిత్వం చెప్పుకుంటుండ్రు. నెలనెలా వెన్నెలలవలె కవులంత కల్సుకొని లైట్లు లేకుండా ఎన్నీలను సూసుకుంట సంబురంగ నాలుగేండ్ల సంది చెప్పుకుంటుండ్రు. వెన్నెలను కవిత్వమయం చేయడం జానపదులకు ఆదినుంచి అలవాటే. ఇగ అమాస గురించి మాట్లాడుకుంటెనైతె చీకటి రాత్రి. పొద్దుకూకంగనే చీకటి అయితది. అమావాసనాడు చీకటి అంటె ఎవలు, ఎవ్వలకు కనపడరు. బాయిలకాడ
ఎవుసాలకాడికి కావలి పోయేటోల్లకు, గొంతుల ద్వారానే ఒగలకు, ఒగలు గుర్తు పట్టుకుంటరు. ఎదురుంగ ఎవరైనా వస్తున్న అలికిడయితె ఎంటనే ఎవరయా! అని అడుగుతరు. అప్పుడు నేను ఫలానా అని చీకట్ల అడవిల తోటల, చెట్లల్ల ఒగలకు ఒగలు చెప్పుకుంటరు. అమాస చీకటి రోజులల్ల తిరిగే వాల్లకు చేతిల కట్టె ఉంటది. ఆ కట్టె సప్పుడు చేసుకుంట ఊర్లల, బయట చేనులకాడ, చెలకలకాడ, తిరుగుతరు. తెల్సిన ప్రాంతం, తెల్సిన జాగ కాబట్టి చీకట్లనే బాటపట్టుకొని సక్కంగ పోయే శక్తి ఉంటది. బాయిలపక్కనుంచి, ఒరాల మీదినుంచి, బాయిగడ్డల మీంచి జారిపడకుంట మెల్లగ చీకట్లనే నడిచే గుణం ఎవసాయదారులకు ఉంటది.
ఎంతైనా ఊరోల్లు రైతులు, కూలీలు వానల, ఎండల, చీకట్ల, సలిల సుత నడుస్తనే ఉంటరు. వాల్ల పనులు వాల్లు చేసుకుంటరు. ప్రకృతితో చెట్లతో గుట్టలతో, పిట్టలతో, ఎడ్లతో, నీళ్ళతో మమేకమై జీవిస్తున్నరు వాళ్ళు. వాళ్ళు ఎన్నీల ఎలుగును సంబర పడుతరు.
అన్నవరం దేవేందర్