tsmagazine విశ్వాస్‌

క్రిస్మస్‌.. క్రైస్తవులు అత్యంత భక్తిప్రపత్తులతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ. ఈ పర్వదినం వస్తుందంటే చాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చిలన్నీ వేడుకలకు ముస్తాబవుతాయి. మన భారత దేశ వ్యాప్తంగా చర్చిలకు కొదవలేదు. వివిధ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో చర్చిలు ఉన్నాయి. వాటిలో కొన్ని వందల ఏళ్లనాటి పురాతన చర్చిలు కాగా, మరికొన్ని బ్రిటీష్‌ పాలకుల హయాములో నిర్మితమై చారిత్రక ప్రాముఖ్యత కలిగి నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇంకొన్ని వాస్తు, శిల్పకళా, సృజనాత్మక నైపుణ్యంతో నిర్మించబడి సుందరమైన చర్చిలుగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందాయి. అలాంటి వాటిలో తెలంగాణ రాష్ట్రం మెదక్‌ జిల్లా కేంద్రంలోని కెథడ్రల్‌ చర్చికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఆసియాలో రెండో అతిపెద్ద సుందరమైన చర్చిగా గుర్తింపు పొందినది కావడం విశేషం. ఈనెల 25న క్రిస్టమస్‌ పర్వదినం సందర్భంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ మహాదేవాలయంగా పేరొంది దేశ, విదేశీయులను ఆకట్టుకుంటూ టూరిస్టు కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతున్న మెదక్‌ చర్చి విశేషాలు తెలుసుకుందాం…

ఇంగ్లాండు నుంచి వచ్చి..

విఖ్యాత మెదక్‌ చర్చి నిర్మాత చార్లెస్‌ వాకర్‌ ఫాస్నెట్‌ ఇంగ్లాండ్‌ దేశస్తుడు. ఇంగ్లాండ్‌లోని షఫిల్డు అనే నగరానికి చెందిన ఫాస్నెట్‌ మెథడిస్టు సంఘంలో పాస్టర్‌గా అభిషేకం పొంది క్రైస్తవ మత ప్రచారం కోసం 1895లో ఇండియాకు వచ్చాడు. సికింద్రాబాద్‌ తిరుమలగిరిలోని గ్యారిస్టర్‌ చర్చిలో పాస్టర్‌గా నియమితుడయ్యాడు. కొన్నాళ్ల తర్వాత గ్రామీణ ప్రాంతంలో సువార్త సేవలందించాలని నిర్ణయించు కోగా 1897లో హైద్రాబాద్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్‌ పట్టణంలోని చిన్న చర్చికి అతన్ని బదిలీ చేశారు. ఆ సమయంలో మిషన్‌ కాంపౌండ్‌లోని రెండంతస్థుల భవనంలో నివాసం ఉండే ఫాస్నెట్‌ తన నివాసం కంటే చర్చి చిన్నగా ఉండటంతో దేవుడైన ఏసుక్రీస్తు పెద్ద చర్చి నిర్మించాలని తలచి మహాదేవాలయం నిర్మాణానికి పూనుకున్నాడు. 1914లో ప్రారంభమైన చర్చి నిర్మాణం పదేళ్ల పాటు కొనసాగి 1924లో పూర్తయింది. ఈ చర్చి నిర్మించడం ద్వారా దేవుడికి గుడి నిర్మించాలన్న తన సంకల్పం నెరవేర్చుకోవడంతోపాటు తీవ్రమైన కరువు నెలకొన్న సమయంలో వేలాది మంది పేదలకు పనికల్పించి వారి కడుపునింపారు.
tsmagazine

విదేశీ నైపుణ్యం

173 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పు, 200 అడుగుల పొడవుతో నిర్మితమైన మెదక్‌ చర్చి కళాత్మక కట్టడంగా పేరొందింది. ఇంగ్లాండ్‌ ఇంజనీర్‌ బ్రాడ్‌షా మొత్తం 200 నమూనాలు రూపొందించి అందులో ప్రస్తుత చర్చి నమూనాను ఎంపిక చేయడం విశేషం. వాస్తు శిల్పి అయిన థామస్‌ ఎడ్వర్డు సూచనలకు అనుగుణంగా వాస్తు ప్రకారం నిర్మించారు. దేశ, విదేశీ నిర్మాణ రంగ నిపుణుల పర్యవేక్షణలో యూరప్‌ గోతిక్‌ శైలిలో చర్చి రూపుదిద్దుకుంది. ఈ చర్చి నిర్మాణానికి రాళ్లు, డంగు సున్నం వినియోగించారు. అందువల్ల వందేళ్లు కావస్తున్నా నేటికి నిర్మాణం చెక్కుచెదరలేదు. చర్చిలోపల విశాలమైన ప్రార్థనా మందిరంలో నేలపై ఇంగ్లాండు నుంచి తెప్పించిన రంగురంగుల టైల్సు వేశారు. అలాగే రీసౌండ్‌ రాకుండా ఉండేందుకు రసాయనాలు వినియోగించి చర్చి పైకప్పును 1927లో ఎకోప్రూఫ్‌ చేయించారు.

అత్యద్భుతం

చర్చి నమూనా ఒక అద్భుతమైతే… చర్చిలో క్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలియజేసేలా ఏర్పాటు చేసిన అద్దాల కిటికీలు అత్యద్భుతమని చెప్పొచ్చు. ఇంగ్లాండ్‌ చిత్రకారుడు ఓ.సాలిస్‌బరి ఎంతో సృజనాత్మకతతో చిన్నచిన్న స్టెయిన్‌ గ్లాస్‌ ముక్కలతో కిటికీ అద్దాలపై క్రీస్తు పుట్టుక, శిలువ వేయడం, పునరుథ్థాన ఘట్టాలను నిక్షిప్తం చేయడం ఆయన పనితనానికి నిదర్శనం. బయట నుంచి సూర్యకాంతి పడినపుడు మాత్రమే ఈ అద్దాల కిటికీలపై ఉన్న దృశ్యాలు అగుపించడం ప్రత్యేకం.

ప్యాలెస్‌ను తలపించే గోల్‌బంగ్లా

చర్చి నిర్మించిన సమయంలోనే పాస్టర్‌లకు శిక్షణ ఇచ్చేందుకోసమని చర్చి వెనక భాగంలో కొద్ది దూరంలో 1926లో ఓ భవనం నిర్మించారు. రాళ్లు, డంగు సున్నం వినియోగించి ఇంగ్లాండ్‌లోని ట్రినిటీ ప్లాలెస్‌ తరహాలో దీనిని అత్యంత సుందరంగా నిర్మించారు. ఈ భవనం మధ్య భాగం గుండ్రంగా ఉండటంతో దీనికి గోల్‌బంగ్లా అనే పేరు వచ్చింది. అప్పట్లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాక విదేశాల నుంచి కూడా పాస్టర్‌లు శిక్షణ కోసం ఇక్కడికి వచ్చేవారట. ప్రస్తుతం ఈ భవనంలో బీఈడీ కళాశాలతోపాటు, హైస్కూల్‌ కొనసాగుతోంది. జిల్లా స్థాయి సైన్సు ఫెయిర్‌లు, ఇన్‌స్పైర్‌ ఎగ్జిబిషన్‌లు ఇందులోనే జరుగుతాయి. కొన్నేళ్లుగా గోల్‌బంగ్లా సినిమా షూటింగ్‌లకు కేంద్రంగా మారింది.

వందేళ్లనాటి భవనాలు

చర్చి కొలువై ఉన్న మెదక్‌ మిషన్‌ కాంపౌండ్‌లో వందేళ్ల క్రితం నిర్మించిన భవనాలెన్నో ఉన్నాయి. ఇక్కడున్న బిషప్‌ బంగ్ల 1898లో నిర్మించగా, పాస్టర్‌ల ట్రైనింగ్‌ కోసం నిర్మించిన సత్యశాల భవనాన్ని 1899లో నిర్మించారు. సీఎస్‌ఐ ప్రాపర్టీ మేనేజర్‌ బంగ్లా 1906లో నిర్మితమైంది.

tsmagazine

ప్రముఖులెందరో మెచ్చారు

సుందరమైనదిగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన మెదక్‌ చర్చిని ఎందరో ప్రముఖులు సందర్శించారు. స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎన్‌.టి.రామారావు, చంద్రబాబు నాయుడు, వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌ కుమార్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు, పలువురు గవర్నర్‌లు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రస్థాయి ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, మంత్రులు, ఎంపీలు, వివిధ రాష్ట్రాల బిషప్‌లు, సినీ దర్శకులు, హీరోలు సందర్శించి చర్చి అందాలు తిలకించి మంత్రముగ్దులయ్యారు.
tsmagazine

అంగరంగ వైభవంగా

మెదక్‌ చర్చి సందర్శనకు ఏడాది పొడుగునా భక్తులు, సందర్శకులు వస్తుంటారు. కాగా ప్రతి ఏడాది డిసెంబరు 25న క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతాయి. ఆ ఒక్క రోజే తెలంగాణ రాష్ట్రంతోపాటు, వివిధ రాష్ట్రాల నుంచి 50 వేల నుంచి లక్ష మంది వరకు వేడుకలు తిలకించేందుకు ఇక్కడికి తరలివస్తారు. క్రిస్మస్‌ రోజు తెల్లవారు జాము 4.30 గంటల నుంచి రాత్రి వరకు ప్రత్యేక ఆరాధనలు ఉంటాయి. క్రిస్మస్‌కు నెలరోజుల ముందు నుంచే విఖ్యాత చర్చి కొలువై ఉన్న మెదక్‌లో కేరల్ గీతాలాపనలు, క్రిస్మస్‌ ట్రీలు, స్టార్‌లతో చర్చిలు, ఇళ్ల అలంకరణలతో పండగ వాతావరణం నెలకొంది.
tsmagazine
tsmagazine

కళాత్మకం

చర్చిలో అడుగడుగున కళానైపుణ్యం కనువిందు చేస్తుంది. ఈ మహాదేవాలయంలో తలుపులు, టేబుళ్లు, కుర్చీలు బర్మా రాజధాని రంగూన్‌ నుంచి తెప్పించిన కలపతో తయారు చేయించడం విశేషం. దేవదారు కర్రతో తయారుచేసిన బైబిల్‌ పఠన వేదిక ఈగల్‌ రూపంలో ఆకట్టుకుంటుంది. జెకొస్లవేకియా దేశానికి చెందిన కార్పెంటర్‌లు దీనిని రూపొందించారట. రంగూన్‌ టేకుతో తయారుచేసిన ప్రభు భోజనపు బల్ల ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. బిషప్‌, ఇతర గురువులు కూర్చునే కుర్చీలు, బల్లలు రోజ్‌వుడ్‌తో తయారుచేసిన కావడం విశేషం.

Other Updates