హైదరాబాద్ నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు నగరంలో నైట్ స్వీపింగ్‌ను ప్రవేశపెట్టడం, సాయంత్రం వేళలోనూ గార్బేజ్‌ను ఎత్తివేయడానికి అదనపు వాహనాలను సర్కిళ్లకు కేటాయించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ నిర్ణయించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై మెడికల్, ఎంటమాలజి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అడిషనల్ కమిషనర్ శృతి ఓజా, చీఫ్ ఎంటమాలజిస్ట్ వెంకటేష్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఖాద్రీలు కూడా హాజరైన ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ప్రతి సర్కిల్‌లో ప్రధాన రహదారులు, జంక్షన్లలో స్వీపింగ్ కార్యక్రమాలు నిరంతరం చేపట్టాలని, ఓపెన్ గార్బేజ్ పాయింట్లను గుర్తించి వాటిని పూర్తిస్థాయిలో తొలగించాలని ఆదేశించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో 120 టిప్పర్లు, 43 ట్రాక్టర్ల ద్వారా చెత్తను తరలించడం జరుగుతోందని, ఈ వాహనాలను సాయంత్రం వేళలో కూడా ఉపయోగించి చెత్తను తొలగించాలని, ఇందుకు తగు ఏర్పాట్లు చేయాలని ట్రాన్స్‌పోర్ట్ విభాగం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో అనేక కాలనీలు, ప్రధాన జంక్షన్ల వద్ద వీక్లీ కూరగాయల మార్కెట్లు నిర్వహిస్తున్నారని, వీక్లీ మార్కెట్ అనంతరం పెద్ద ఎత్తున వదిలివెళ్లే కూరగాయల వ్యర్థాలను అదే రోజు రాత్రి తొలగించే విధంగా తగు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
పరిశుభ్రతపై ర్యాంకింగ్‌లు
పారిశుధ్య కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించే సర్కిళ్లకు ర్యాంకింగ్‌లను అందజేయనున్నట్టు కమిషనర్ ప్రకటించారు. కేవలం పారిశుధ్య నిర్వహణనే కాకుండా భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపు, నాలాలలో వ్యర్థాల తొలగింపు, క్రిటికల్ గార్బేజ్ పాయింట్ల ఎత్తివేత తదితర అంశాలను ప్రామాణికంగా చేపట్టి ఈ ర్యాంకింగ్‌ను జారీచేయనున్నట్టు దానకిషోర్ తెలిపారు. నగరంలో తడి, పొడి చెత్తను వేరుచేయడం, ప్రతి ఇంటి నుండి స్వచ్ఛ ఆటోలకు గార్బేజ్‌ను అందించడం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై చైతన్యపర్చడానికి 2,500 సి.ఆర్.పిలను నియమించామని, వీరి సేవలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని తెలిపారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యే ప్రతికూల వార్తలపై వెంటనే స్పందించాలని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి ప్రతిష్ఠాత్మకంగా ఉన్న హైదరాబాద్ మెట్రో కారిడార్ మార్గంలో పరిశుభ్రతను నిర్వహించాలని అన్నారు. హైదరాబాద్ నగరంలో 62 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ ఉందని, ఈ మార్గంలో సంబంధిత మెడికల్ అధికారులు ప్రయాణించి మెట్రో కారిడార్ ఇరువైపులా గార్బేజ్ పాయింట్లు, నిర్మాణ వ్యర్థాలు గుర్తించి వాటిని తొలగించాలని అన్నారు.
నగరంలో 17,535 మంది పారిశుధ్య కార్మికులు, 937 ఎస్.ఎఫ్.ఏలు ఉన్నారని, వీరందరు గైర్హాజరు కాకుండా విధులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని మెడికల్ అధికారులను సూచించారు.