తెలంగాణ శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యుల కోసం నగరంలోని హైదర్‌గూడాలో నిర్మించిన నూతన నివాస సముదాయాలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాలు, రోడ్లు,భవనాలశాఖా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.క్వార్టర్లలో వసతి సౌకర్యాలు, ఇతర నిర్మాణ నాణ్యత తదితర విషయాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్వార్టర్లలను ఆయన కలియతిరిగారు. అనంతరం నిర్మాణంలో నాణ్యత గానీ, వసతి సౌకర్యాలు కానీ బాగున్నాయని మంత్రి ప్రశాంత్‌రెడ్డిని అభినందించారు. క్వార్టర్లను వెంటనే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. 120 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివసించేలా రూ. 166 కోట్ల ఖర్చుతో ఈ భవన సముదాయాన్ని నిర్మించారు. ఒక్కొ క్వార్టర్‌ను 2,500 చదరపు అడుగుల విస్త్తీర్ణంలో అధునాతన వసతి సౌకర్యాలతో నిర్మించారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ తిగుళ్ళ పద్మారావు, రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, ఈటెల రాజేందర్‌, నిరంజన్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబల్లి దయాకర్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహ్మాచార్యులు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Other Updates