mangoసాధారణంగా మామిడి పండ్లు ఆకుపచ్చ, పసుపు పచ్చ లేదా కొన్ని పండ్లలో అక్కడక్కడ ఎరుపు వర్ణం రకాలను చూస్తుంటాం. కాని ఎరుపు వర్ణంలో ఉండే విదేశీ మామిడి రకాన్ని తొలిసారిగా పండించారు మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండల కేంద్రంలోని రైతు జలాలుద్ధీన్‌.

ట్టభద్రుడైన జలాలుద్ధీన్‌ వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని నమ్ముకుని జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. వ్యవసాయాన్ని కొనసాగిస్తూ వచ్చిన ఈ రైతు క్రమంగా ఉద్యానపంటల వైపు మొగ్గుచూపుతూ వచ్చాడు. జలాలుద్దీన్‌ ఆసక్తిని గమనించిన ఉద్యానశాఖ అధికారులు 2011-12 సంవత్సరం నుండి ప్రభుత్వ సహకారం అందించి ప్రోత్సహిస్తూవచ్చారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు యూనివర్సిటీ అధికారులు అందించిన సాంకేతిక సహకారంతో తాను నెలకొల్పిన నర్సరీలో ప్రస్తుతం లక్ష నుండి లక్షన్నర మొక్కలను ఉత్పత్తి చేసే స్థితికి జలాలుద్దీన్‌ చేరుకున్నాడు. సపోటా, జామ, రేగు, అల్లనేరేడు మొక్కలతో పాటు 25 రకాల మామిడి మొక్కలను తన నర్సరీలో అందుబాటులో ఉండేటట్టుగా చూస్తున్నాడు. ఇవేగాక కొన్ని విదేశీ మామిడి రకాల చెట్లను కూడా పెంచుతున్నాడు. ఈ మొక్కలన్నింటిని ప్రతియేటా ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలను నాటించడానికి ప్రభుత్వరంగ సంస్థలకు జలాలుద్ధీన్‌ సరఫరా చేస్తుంటాడు.

ఈ నర్సరీ ద్వారా జలాలుద్దీన్‌ మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు. తాను తీర్చిదిద్దిన ఎరుపురంగా మామిడి రకానికి ఇంకా పేరు నిర్ణయించలేదు. అయితే ఈ రకం మామిడి మార్కెటింగ్‌ శాఖకు, ఉద్యానవనశాఖకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని జలాలుద్ధీన్‌ అన్నారు. ఈ కొత్త రకం మామిడి ఉత్పత్తిచేయడంలో ప్రభుత్వ సహకారం బాగా అందిందని జలాలుద్ధీన్‌ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

నర్సరీ అభివృద్ధిలో ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు అందజేస్తూ సహకరిస్తున్న హార్టికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులకు, ప్రభుత్వానికి అతను కృతజ్ఞతలు తెలిపాడు.

కొత్త రకం మామిడిని పరిచయం చేసిన కలెక్టర్‌

సాధారణ మామిడి రకాలకు భిన్నంగా కొత్త రకం మామిడిని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ ద్వారా ప్రజలకు, రైతులకు

జలాలుద్ధీన్‌ పరిచయం చేశాడు. మెదక్‌ జిల్లా కేంద్రం అయిన సంగారెడ్డిలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో జలాలుద్ధీన్‌ కలెక్టర్‌ను కలిసి తాను పండించిన విదేశీ మామిడి రకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కొత్త రకం మామిడి పండ్లు ప్రజలకు పరిచయం అయ్యేలా విడుదల చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మామూలుగా మామిడి పచ్చరంగు, పసుపు రంగు రకాలలో ఉండటం చూశామని కానీ ఈ రకం ఎరుపు రంగులో ఉండటం ప్రత్యేకత అని అన్నారు. కొత్త రకం మామిడిని అందించినందుకు జలాలుద్ధీన్‌ను కలెక్టర్‌ అభినందించారు. కొత్త రకం మామిడిని పెంచి పరిచయం చేసిన జలాలుద్ధీన్‌ మాట్లాడుతూ తనకు ఈరకం మామిడిని కొందరు ఆప్తులు అందజేశారని, 2011లో నర్సాపూర్‌కు సమీపంలో పెంచటం ప్రారంభించానని అన్నారు. ఎకరానికి 120 మామిడి మొక్కలను నాటానని ఆ విధంగా మొత్తం ఆరు ఎకరాలలో 720 మొక్కలు నాటగా నేడు అవి మామిడి చెట్లుగా ఎదిగాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 3500 నుండి 5000 రూపాయల వరకు నిర్వహణ ఖర్చులు అవసరమవుతాయని తెలిపారు. మరో 20 రోజులలో టేబుల్‌ వెరైటీకీ చెందిన ఈ రకం మామిడి కాయలు పండ్లుగా మారనున్నాయని తెలిపారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ మామిడి మార్కెటింగ్‌కు హార్టికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ సహకరించనుందని, ఈ రకం పెంపకంలో ప్రభుత్వ సహాయం ఉపయోగపడిందని జలాలుద్ధీన్‌ హర్షం వ్యక్తం చేశాడు.

Other Updates