అన్నవరం దేవేందర్
ఎద్దూ ఎవుసం పచ్చగుంటేనే ఎవసాయదారునికి నవ్వు మొఖం. ఎవుసం సక్కగ నడవాల్నంటే నీళ్ళ రేవు మంచిగ ఉండాలె. భూమిలనన్న నీళ్ళు ఉండాలె లేకుంటే కాలువల్ల నీళ్ళన్న రావాలె. అన్నిటికన్నా ఎక్కువ వానలు ఇరుగదంచాలె. వానలు పడితే చెర్లు నిండితే వాగులు పొంగితె అలుగులు దునికెతె అప్పుడు పల్లెటూల్ల ఎవుసం చేస్క బతిటోళ్ళకు సంబురం. ‘మంట్లె మానెడు పోస్తే ఇంట్లకు పుట్టెడు ఇత్తులు అత్తయి’ అన్న మాట నిజం గావాలె. అంటే ఇయ్యాల రేపు
నీళ్ళున్నా పెట్టుబడులు కావాలె అవ్వి కూడా మస్తు పైసలు అయితన్నయి. పెట్టుబడులు తెచ్చి, పిండిబత్తాలు కొనుక్కొచ్చి దున్నిపిచ్చి, దున్ని నాట్లేసినంక కోతకు వచ్చేటాల్లకు ఆయింత రాళ్ళ వాన పడుతదనే భయం. అట్లనో ఇట్లనో బయటపడ్డంక అమ్ముకోని అప్పులు కడుదామంటే అంతకుముందున్న దినుసుల రేటు ఏక్‌దమ్‌న పడిపోవుడు.
ఇట్ల నడుస్తున్నది ఎవుసం చేసికునేటోల్ల జీవనసిత్రం. అసలు పల్లెలు సల్లగుంటేనే పట్నం నడుస్తది. పల్లెలనుంచే అన్నం మెతుకులు, పల్లెలనుంచే కూరగాయలు, పల్లెలనుంచే పాలు, పెరుగు, పల్లెలనుంచే పప్పులు, మిరపకాయలు అసలు పల్లె మనుషులు దయ తలిస్తేనే లోకం నడుస్తది. లోకం మీద పైస ఉండవచ్చు, బంగారం ఉండవచ్చు, బంగుళాలు కార్లు మస్తు ఉండవచ్చు ఇవేవీ అన్నం పెట్టయి. బువ్వకూరా కావాల్నంటే మల్లా రైతు నవ్వాలె. రైతు నవ్వుమొఖంతోని ఉంటే ప్రపంచం అడుగు ముందుకు ఏస్తది. ఎన్ని మిషిన్లన్నా పంట పొలంల దించు, వరికోసే మిషన్, నాగలి, దున్నే మిషన్, నాట్లేసే మిషన్ ఎన్ని వచ్చినా ఎవసాయదారుని చెయ్యి పడనిది గింజ కూడా బయటికిరాదు. గింజలేనిదే మనిషికి జీవగంజి లేదు.
గింత పెద్ద పేరు గొప్పదనం ఉన్న ఎవసాయదార్లకు ఎప్పుడు సూడవోయిన లుక్సానే కనిపిస్తది. ఎందుకంటే ఎవుసం చేసేటోల్లు డాలు బోలు చెయ్యరు. కిందిది మీద చెయ్యరాదు. నమ్మితే ప్రాణం ఇస్తరు, నలుగురుకి అన్నం పెట్టే చేతులుగదా, దాన్నే అమాయకత్వం అంటరు. ఇగో అసోంటోల్లు ఏండ్లకు ఏండ్లనుంచి ఆవులు, ఎద్దులోలె కష్డపడుతండ్రు, బతుకుతండ్రు. ఈ సందుల ఎవసాయం చేసేటోళ్లకు కారుకిన్ని పైసలు ఇస్తం అనంగనే మస్తు మురిసి పోతండ్రు. ఎందుకంటే పెట్టుబడులే మస్తు
అయితన్నయి. లెక్కకు లెక్క, హల్లికిహల్లి, సున్నకు సున్న లెక్క రైతు రోజు కూలి ఏసుకుంటే, ఎవుసం లాభనష్టాలు తీస్తే ఉత్తదే అందుకే కారు కారుకు ఎకరానికి ఇంత అని నికరం చేసుడు మంచి ముచ్చటే గని, దాని అమలు చేసుట్ల మనుషుల దగ్గర ఉన్నది గౌరాంతం. భూముల లెక్కలు నాగలి దున్నేటోల్ల లెక్కలు తీసి ఎవలపైకం వాళ్ళకు పంపుతేనే తినే అన్నంను గౌరవించినట్లు అయితది.
అయితె సక్కగ పంట పండి సక్కగ వానలు పడితే ఎవలసాయం అక్కరలేదు. రైతే రాజు లెక్కన ఉంటడు గని ఎక్కడన్నా బిస తప్పింది. వానలు పడాల్సిన యాల్లకు పడుతలేవు. కాలం కిందిమీద అయితంది. ఎండా కాలంల వానలు, వానాకాలంల ఎండలు ఇట్ల తీరు తప్పుతున్నయి. ఇంకోటి పండిన పంటకు దినుసులకు పైకం సరిగ్గా రావాలె. ఆరుగాలం పని చేసి మట్టిల, ఎండల, వానల, సలిలో మనిషి పనిచేస్తే తాను పండిచ్చిన పంటకు అవుతలోడు రేటు కట్టుడు ఇదో గమ్మతి. కంపెనీలు తయారు చేసిన వస్తువకు కంపెనీలు మాత్రమే రేటు నిర్ణయిస్తయి. కానీ ఇక్కడ వడ్లు పండిచ్చేటోని, మిరపకాయలు పండిచ్చేటోనికి బదులుగా బ్యారగాల్లు రేట్లు నిర్ణయిస్తరు. ఇదే గమ్మతి. దేశం అంతా ఉన్న ఎవుసం చేసేటోల్లు ఒక్కటైతె ఎవలలెక్క వాల్లే నిర్ణయించుకోవచ్చు. గదే కావాలె. ఎంతైనా ఎక్కడైనా పంటలు పండా ల్నంటే కార్తెలు తీరు తప్పద్దు. పర్యావరణం కూడా సత్తెనాశనం చేస్తున్న కాలం ఇది. ప్లాసిక్ ఉద్గారాలు విపరీ తంగా వెదజల్లుతున్న పాడు కాలం. లోపల ఏసీలు పెట్టు కొని సల్లగుండె, బయటికి విపరీతమైన వేడి గాలిని యిడుస్తున్న కాలంల, ఇగ వానలు సక్కగ పడాల్నంటే ఎట్ల పడుతయి. గొడ్డు, గోదా, మ్యాక బతకాలంటే ఎట్ల బతుకుతయి అట్లనే అయితంది.
పల్లెటూరి వాల్లు సల్లగుంటేనే ప్రపంచం సల్లగుంటది. కరువు కాటకాలు పుట్టేది కూడా పల్లెల్లనే నీళ్ళను, నదులను సుత కలుషితం చేసేది పట్నాలల్ల ఉండేటోల్లే. నది సుట్టూ నాగరికత అల్లుకున్నది. ఆదిమకాలంనుంచి పంటలు పండించే ఎవసాయదార్లున్నరు. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన కాలంల పంట రైతుల మొఖంలో పచ్చని చిరునవ్వు ఎప్పటికీ కనిపించాలె.