హైదరాబాదు సంస్థానపు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జారీ చేసిన ఫర్మానాతో ఉస్మానియా విశ్వవిద్యాలయం నూరు సంవత్సరాల కిందట స్థాపించబడింది. ఈ శతాబ్ది పండుగను 26 ఏప్రిల్ 2017 నుంచి 25 ఏప్రిల్ 2018 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఓయూ అధికారులు సర్వసన్నద్ధమౌతున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే శతాబ్ది ప్రారంభోత్సవ కార్యక్రమాలను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించనున్నారు. సంవత్సరం పొడుగునా సాగే ఈ శతాబ్ది సంబురాలలో విద్యా, పరిశోధన, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను తెలంగాణా సంస్కృతిని, వారసత్వాన్ని ప్రతిబింబించేట్లుగా రూపకల్పన చేశారు. ఈ సంబురాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ”తెలంగాణా, దేశ నిర్మాణంలో ఓయూ పాత్ర” పై సదస్సు, ఏప్రిల్ 27న పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో పాటు నోబెల్ గ్రహీతల ఉపన్యాసాలు చోటు చేసుకోనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే అఖిల భారత విశ్వవిద్యాలయాల ఉప కులపతుల సమావేశానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తుండగా, యూజీసీ అధ్యక్షుడు వేద ప్రకాశ్ కీలకోపన్యాసం చేయనున్నారు.
”రాబోయే యాభై సంవత్సరాలపై ఓయూ దృష్టి” అనే అంశంపై జరిగే చర్చా గోష్ఠిలో ప్రముఖ విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు, విధాన నిర్ణేతలు పాల్గొంటున్నారు. 2018 సంవత్సరం జనవరి 3 నుంచి 7 వ తేదీ వరకు జరగబోయే 105 వ భారతీయ సైన్స్ కాంగ్రెస్‌ను ఓయూలో నిర్వహించనున్నారు. 2017 భారత అంతర్జాతీయ శాస్త్రీయ ఉత్సవాన్ని నిర్వహించేందుకు గాను ఓయూ అధికారులు కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది. శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఓయూ అధికారులకు సూచించారు. తెలంగాణా రాష్ట్రమంతటా ఈ శతాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరగాలని సీఎం ఆకాంక్షించారు. అంతేకాకుండా ఉత్సవాల నిర్వహణకై ప్రత్యేకంగా 200 కోట్ల రూపాయలను రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించారు. ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యులు కేశవరావు, విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ ఆచార్య కార్యక్రమాల రూపకల్పనలో ఓయూ అధికారులకు సలహా లిచ్చారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఓయూ శతాబ్ది ఉత్సవాలను చిరస్మరణీయ సందర్భంగా అభివర్ణిం చడమే కాకుండా, ప్రపంచానికి గొప్ప వ్యక్తులను, నిష్ణాతులను అందించిన ఘనత ఓయూదని తమ వీడియో సందేశంలో శ్లాఘించారు. ఓయూ ఉపకులపతి ఎస్. రామ చంద్రం మార్గదర్శకత్వంలో ఉత్సవాల కార్యక్రమ పరంపర రూపుదిద్దుకుంది. ప్రత్యేక అధికారిని నియమించి 28 కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ శతాబ్ది లోగోను రూపొందించగా, ”ఉత్సవాలలో మాతో పాలు పంచుకోండి” అనే శీర్షికతో బ్రోచరును సైతం సిద్ధం చేశారు. రాష్ట్ర గవర్నర్ వీటిని అధికారికంగా విడుదల చేశారు. శతాబ్ది వెబ్‌సైట్ www.oucentenary.org పలువురి మన్ననలందుకుంది.