రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు గౌరవం లభించి, అందరికీ అభివృద్ధి ఫలాలు అందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో డిసెంబర్ 20న క్రిస్మస్ డిన్నర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన ముఖ్యమంత్రి క్రిస్మస్ కేక్‌ను కట్‌చేసి క్రైస్తవ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ సర్వమతస్థులూ సుఖంగా జీవించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం… అందుకు శాయశక్తులా కృషి చేస్తాం అని తెలిపారు.
గతంలో క్రైస్తవభవన్‌కు కేటాయించిన స్థలం విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని నిబంధనలు అంగీకరించలేదు. కొందరు అనేక అవాంతరాలు సృష్టించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈసారి నాగోలు చౌరస్తాలో రెండెకరాల స్థలాన్ని ఇవ్వాలని నిర్ణయించాం అని ప్రకటించారు. ఏడాదిలోపల క్రిస్టియన్ భవన్ నిర్మించి ఇస్తాం. నేనే స్వయంగా పర్యవేక్షణ జరిపి నిర్మాణం పూర్తయ్యేలా చేస్తాం అని అన్నారు. ఈ లోకానికి ప్రేమను పంచడానికే జీసస్ వచ్చారు. ఏసుక్రీస్తు త్యాగం అందరికీ మార్గదర్శకం అని అన్నారు.
బంగారు తెలంగాణ సాధనలో క్రైస్తవ సోదరులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ కె. స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జి. జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని 2 లక్షల క్రైస్తవ కుటుంబాలకు ప్రభుత్వందుస్తులను పంపిణీ చేసింది